ఆశ్రమానికి దగ్గరలో పేరంబాక్కం హైవే వద్ద ఉన్న మన్నూర్ గ్రామంలో జూన్ 8, 2025న వై.ఎస్.ఎస్. చెన్నై ఆశ్రమంవారు “యోగదా సత్సంగ ధార్మిక వైద్యశాల”ను ప్రారంభించారు. మన్నూర్ మరియు పొరుగు ప్రాంతాల నివాసితులకు ఉచిత వైద్య భద్రతను అందించే ఈ వైద్యశాల, సమాజానికి సేవ చేయాలనే ఆశ్రమం యొక్క నిరంతర ఆశయాన్ని కొనసాగిస్తున్నది.


వై.ఎస్.ఎస్. సన్యాసుల ఆధ్వర్యంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక అధికారులు, గ్రామస్తులు, భక్తులు, వైద్యులతో సహా దాదాపు 70 మంది పాల్గొన్నారు. వైద్యులు, అధికారులతో కలిసి సన్యాసులు జ్యోతి ప్రజ్వలన చేశారు. మానవాళికి సేవ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పి వై.ఎస్.ఎస్. ఆశయాలు మరియు ఆదర్శాలను ప్రధానాంశాలుగా చేసుకొని స్వామి శుద్ధానంద క్లుప్తంగా, స్ఫూర్తిదాయకంగా ప్రసంగించారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారందరు ప్రసాదం స్వీకరించారు.
ప్రారంభోత్సవం అనంతరం సుమారు 50 మంది స్థానిక నివాసితులు ఉచిత రక్తపోటు మరియు షుగర్ పరీక్షలు, అలాగే సాధారణ ఆరోగ్య సంప్రదింపుల ద్వారా ప్రయోజనాన్ని పొందడం జరిగింది.


సులువుగా అందుబాటులో ఉండే ప్రధాన రహదారిపై ఉన్న ఈ వైద్యశాల, రోగులకు సౌకర్యవంతమైన నిరీక్షణ ప్రదేశం, డాక్టర్ గది మరియు ఔషధ విభాగాన్ని కలిగి ఉన్నది. ప్రస్తుతానికి వారంలో ఐదు రోజులలో, రోజుకు రెండు గంటల పాటు, సాధారణ వైద్యుడు సంప్రదింపుల కోసం అందుబాటులో ఉంటారు, చెవి-ముక్కు-గొంతు వైద్యులు, దంతవైద్యులు వంటి నిపుణులు నెలకు ఒకసారి ఉచిత సంప్రదింపులు అందజేస్తారు.

