ఆగష్టు 24, 2024 న ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో ఒక నూతన యోగదా సత్సంగ సాధనాలయానికి ప్రారంభోత్సవం జరిగింది 1.35 ఎకరాల విస్తీర్ణంలో, ఒకవైపు పవిత్ర గోదావరి నది, మరొకవైపు దాని సాగునీటి కాలువతో ఒక పచ్చటి ద్వీపంలో ఈ సాధనాలయం నెలకొని ఉంది. (క్రింద: రెండు వైపులా నదితో, నీలివర్ణపు గుర్తుతో ఉన్న ఆశ్రమ ప్రాంగణం యొక్క డ్రోన్ చిత్రం)
ప్రారంభోత్సవం రోజైన ఆగష్టు 24, 2024న భక్తులతో కలిసి ఊరేగింపుగా “జై గురు” గానం చేస్తూ పూలమాలతో అలంకరించబడిన గురుదేవులు శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి చిత్రపటంతో స్వామి స్మరణానంద, స్వామి ప్రజ్ఞానంద మరియు స్వామి శంకరానంద ఈ పవిత్ర స్థలంలోకి ప్రవేశించారు.


స్ఫూర్తిదాయక సత్సంగాలు, శక్తిపూరణ వ్యాయామాల సామూహిక రోజువారీ అభ్యాసం మరియు ధ్యానం, వై.ఎస్.ఎస్. ధ్యాన ప్రక్రియల సమీక్షా తరగతులు, భక్తులకు వ్యక్తిగత సలహాలు, మరియు ఆదివారంనాడు సంకీర్తనతో కలిపి నిర్వహించిన ఆరు-గంటల దీర్ఘ ధ్యానంతో కూడిన మూడు-రోజుల కార్యక్రమానికి ఈ ప్రారంభోత్సవం నాంది పలికింది. ఆగష్టు 26, 2024 సోమవారంనాడు జన్మాష్టమి సందర్భంగా ఒక స్మారకోత్సవ కార్యక్రమాన్ని ఆనందోత్సవ వేడుకగా నిర్వహించడంతో ఈ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమానికి సుమారు 450 మంది భక్తులు నమోదు చేసుకొన్నారు. మొత్తంగా, 550 మంది వరకు ఈ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.


సాధకుల బృందం
రాజమండ్రి సాధనాలయంలో ఒక సాధకుల బృందం ఏర్పడబోతోంది. సాధకులందరూ కలిసి ధ్యానం, సేవ చేయడం జరుగుతుంది, మరియు నిర్ణీత సమయంలో సందర్శించే వై.ఎస్.ఎస్. సన్యాసుల మార్గదర్శకత్వంలో సాధారణ నిర్వహణను వారు చూసుకుంటారు. దైనందిన దినచర్య – ప్రతిరోజు రెండుసార్లు నిర్వహించబడే శక్తిపూరణ వ్యాయామాల అభ్యాసం, ధ్యానం, మధ్యాహ్న ధ్యానానికి ముందు వై.ఎస్.ఎస్. పాఠాల అధ్యయనం మరియు ప్రతిరోజు మూడుసార్లు మౌనంగా చేసే భోజనం, ఏకాంత ధ్యాన వాసంలోని నివాసితులను ఏకం చేస్తుంది.
వ్యాయామం కోసం సమీపంలో నడక మార్గాలు ఉన్నాయి. భక్తులకు వసతి కల్పించేందుకు స్నానపు గదులతో కూడిన 32 గదులు సిద్ధంగా ఉన్నాయి. సాధకులు స్వయంగా మరియు జంటగా ఉండేందుకు నివాస గదులను ఇది కలిగి ఉంది. ఈ భవనం ఇటీవల పునర్నిర్మించబడి క్రొత్త మంచాలు, పరుపులు, తలుపులు, కిటికీలు మరియు స్నానపు గదుల అమరికలతో కూడి ఉన్నది. కొళాయిలు మరియు విద్యుత్ సంబంధిత మరమ్మతులు పూర్తిస్థాయిలో చేయడం జరిగింది. ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా కోసం ఆవరణలో ఒక జనరేటర్ ఏర్పాటు చేయబడినది. ఏకాంత ధ్యాన వాస ప్రాంగణంలో మామిడి, కొబ్బరి వంటి అనేక వృక్షాలు ఉన్నాయి, వాటిలో కొన్ని 40 ఏళ్ళకు పైబడినవి.
ఒక వై.ఎస్.ఎస్. భక్త బృందముచే నిర్వహించబడే పరమహంస యోగానంద నేత్రాలయం (కంటి ఆసుపత్రి) సాధనాలయముకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. గ్రామీణ పేదలకు సాధారణ కంటి శిబిరాలను, శస్త్ర చికిత్సలను, మరియు ఇతర ఇబ్బందులను తొలగించే సామాన్య సేవలను ఇది క్రమబద్ధంగా నిర్వహిస్తోంది. కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న ఈ సేవలతో వేలాది మంది లబ్ది పొందడం జరిగింది.

గదులను ముందుగా రిజర్వ్ చేసుకోవడం
సారూప్యతగల సాధకులతో కలిసి ఆశ్రమ వాతావరణంలో నివసించాలనుకొనేవారు సాధనాలయంలోని గదులను రిజర్వు చేసుకోవడానికి ఆహ్వానించబడతారు. ఒక వారాంతం లేక ఒక వారం లేక సుదీర్ఘ కాలంపాటు, ఒక నెల లేక ఏకబిగువున అనేక నెలలపాటు ఉండడానికి రావచ్చు.
రిజర్వేషన్ చేయడానికి, దయచేసి సంప్రదించండి:
ఫోన్: 93922 85867
ఈ-మెయిల్: [email protected]
చిరునామా
యోగదా సత్సంగ సాధనాలయం — రాజమండ్రి
పూలపెంపక పరిశోధనా సంచాలక కార్యాలయం ప్రక్కన
కాటన్ గెస్ట్ హౌస్ దగ్గర, ధవళేశ్వరం
వేమగిరిగట్టు, వేమగిరి
రాజమండ్రి 533125
తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
రాజమండ్రి రైల్వే స్టేషన్ 4 కి.మీ. దూరంలోను మరియు విమానాశ్రయం 15 కి.మీ. దూరంలోను ఉన్నాయి. ఆటో రిక్షాలు మరియు ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి.
విరాళాలు
సాధనాలయం ప్రారంభ దశలలో ఉండడం వలన కాలక్రమంలో అనేక విధాలుగా దీనిని మెరుగుపరచవలసి ఉంది. మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరియు ఆశ్రమ నిర్వహణ ఖర్చులకు మీరందించే ఆర్థిక సహాయాన్ని మేము గాఢంగా అభినందిస్తాము. విరాళాలను ఆన్‌లైన్ ద్వారా (ముందుగా ‘Kendra Fund’ అని, ఆ తరువాత ‘Rajahmundry Retreat’ అని ఎన్నుకోవాలి) చేయవచ్చు లేదా “For Rajahmundry Retreat” అని పేర్కొంటూ వై.ఎస్.ఎస్. రాంచీకి చెక్కును పంపించవచ్చు.