“ప్రపంచ దేశాలకు పెద్దన్న అయిన భారతదేశం ప్రోది చేసుకున్న జ్ఞానం సర్వమానవాళికీ చెందే వారసత్వం” అని తన ఒక యోగి ఆత్మకథ లో పరమహంస యోగానందగారు తెలిపారు.
ప్రవక్త మరియు అవతార పురుషుడైన భగవాన్ కృష్ణుడు, ఆ జ్ఞాన-వారసత్వానికి ప్రధానమూర్తిగా ఉన్నాడు, యోగ శాస్త్రం మరియు ఆత్మ-విముక్తిపై ఆయన చేసిన అమర బోధనలు ఉత్కృష్టమైన భగవద్గీత ద్వారా అన్ని యుగాల కోసం సంగ్రహించబడ్డాయి.
“కృష్ణుడు ప్రవక్త మాత్రమే కాదు, ఆయనకున్న రాచరిక బాధ్యతలు ఆయన సాధుత్వానికి పరీక్షగా నిలిచాయి. ఆయన రాజుగా ఉన్నప్పటికీ, బంధ విముక్తుడైన వ్యక్తిగా గొప్ప విజయాన్ని సాధించాడు” అని పరమహంసగారు సూచించారు.
శ్రీకృష్ణుడి జన్మదిన వార్షికోత్సవాన్ని (హిందూ చాంద్రమాన పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం ఆగష్టు 26న వస్తుంది) పురస్కరించుకొని, శ్రీకృష్ణుడు మానవాళికి అందించిన ప్రోత్సాహకరమైన సందేశం మరియు సంతులిత జీవితానికి సంబంధించిన శాశ్వత నిదర్శనంతో మీరు అనుసంధానం పొందుతారని మేము ఆశిస్తున్నాం.
పరమహంస యోగానందగారి ప్రసంగాలు మరియు రచనల నుండి:
అనేక చింతలతో కూడిన తీరికలేని మన ఆధునిక జీవితానికి ఎంతో ఉపయుక్తమైన సిద్ధాంతంగా భగవద్గీతలోని కృష్ణుని సందేశం నిలుస్తుంది.
భగవద్గీతలో శ్రీకృష్ణుడు సూచించిన మార్గం, ప్రపంచంలో తీరికలేని వ్యక్తికి మరియు అత్యున్నత ఆధ్యాత్మిక ఆశావహులకు మితమైన, మధ్యస్థ, సువర్ణ మార్గమవుతుంది.
పిడివాదుల వినోదం కోసం శుష్క మేధావులు గీత యొక్క సూక్తులతో మానసిక కసరత్తులు చేయడం గీతా జ్ఞానం కాదు; కాని ప్రపంచంలో నివసిస్తున్న ఒక పురుషుడు లేదా స్త్రీ, గృహస్థుడు లేదా పరిత్యాగి, యోగా యొక్క దశల వారీ పద్ధతులను అనుసరించడం ద్వారా, భగవంతునితో వాస్తవ సంబంధాన్ని కలిగి ఉన్న సంతులిత జీవితాన్ని ఎలా గడపాలో గీత సూచిస్తుంది.
కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించినది, మరియు గీత అధ్యాయాలు IV:29 మరియు V:27–28లో సూచించబడిన క్రియాయోగ ప్రక్రియ, యోగా ధ్యానం యొక్క అత్యున్నత ఆధ్యాత్మిక శాస్త్రం. అంధయుగాల్లో మరుగునపడిపోయిన తరువాత, నాశనంలేని ఈ యోగా, మహావతార్ బాబాజీ ద్వారా ఆధునిక మానవుల కోసం పునరుద్ధరించబడినది, మరియు యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ గురువులచే బోధించబడుతోంది.
భగవద్గీతలో మన దృష్టి అంతా అర్జునుడికి గురువుగా మరియు సలహాదారునిగా ఉన్న శ్రీకృష్ణుడి పాత్రపై మరియు ప్రపంచానికి ఆయన బోధించిన అత్యున్నత యోగ సందేశంపై కేంద్రీకృతమై ఉంటుంది — ధర్మబద్ధమైన కార్యాచరణ, ధ్యానం ద్వారా దేవునితో అనుసంధానం మరియు విముక్తి — ఆ జ్ఞానం వల్లనే భక్తుల హృదయాలు మరియు మనస్సులలో ఆయన స్థానం యుగయుగాలుగా పదిలమై ఉన్నది.
భౌతిక జీవితంలోని బాధ్యతల నుండి పారిపోవాల్సిన అవసరం లేదన్న ఆయన తత్వాన్ని కృష్ణుడి జీవితం నిరూపిస్తుంది. ఆయన మనలను ఎక్కడ ఉంచారో భగవంతుణ్ణి అక్కడకు తీసుకురావడం ద్వారా సమస్య పరిష్కరించబడుతుంది. మనం ఎలాంటి వాతావరణంలో ఉన్నా, భగవంతునితో అనుసంధానం పొందిన మనస్సులోకి, స్వర్గం రావలసి ఉంటుంది.
ప్రపంచాన్ని త్యజించడం లేదా భౌతిక జీవితంలో మునిగిపోవడం అనే రెండు విపరీత ధోరణులను నివారించడానికి, మానవుడు నిరంతరం ధ్యానం ద్వారా తన మనస్సుకు శిక్షణ ఇవ్వాలి. తద్ద్వారా అతను తన దైనందిన జీవితంలో అవసరమైన విధి నిర్వహణ కార్యక్రమాలను నిర్వహిస్తూనే అంతర్గతంగా భగవంతుని చైతన్యాన్ని కొనసాగించగలడు. దానికి కృష్ణుని జీవితమే ఉదాహరణగా నిలుస్తుంది.
భగవద్గీతలోని శ్రీకృష్ణుడి సందేశం ఆధునిక యుగానికి మరియు ఏ యుగానికైనా సరియైన సమాధానమవుతుంది: కర్తవ్య నిర్వహణ, నిర్వ్యామోహం మరియు దైవసాక్షాత్కారం కోసం ధ్యానంతో కూడిన యోగా. దేవుని అంతర్గత శాంతి లేకుండా పనిచేయడమంటే నరకంతో సమానం; మరియు ఆయన ఆనందం ఎల్లప్పుడూ ఆత్మలో ఉప్పొంగుతూ పని చేయడమంటే, ఎక్కడికి వెళ్ళినా లోపల చిన్నపాటి స్వర్గాన్ని తీసుకువెళ్ళడమే.
భగవద్గీతపై పరమహంస యోగానందగారి సంచలనాత్మక అనువాదం మరియు వ్యాఖ్యాన గ్రంథమైన, గాడ్ టాక్స్ విత్ అర్జున, నుండి సారాంశాలను చదవడానికి మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. పరమహంసగారు చెప్పినట్లుగా, “విశ్వం యొక్క జ్ఞానమంతా గీతలో నిక్షిప్తమై ఉంది. అత్యంత గాఢమైనప్పటికీ, అర్ధవంతమైన భాషలోనే ఉంది…గీత, మానవ ప్రయత్నం మరియు ఆధ్యాత్మిక ప్రయత్నాల యొక్క అన్ని స్థాయిలలో అర్థం చేసుకోబడింది మరియు అన్వయించబడింది.”



















