ఉపోద్ఘాతం:
ప్రియతమ జగద్గురువు మరియు యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ యొక్క గురువు-వ్యవస్థాపకులు అయిన పరమహంస యోగానందగారు, తన ఒక యోగి ఆత్మకథ లో దైవ సాధనకు సంబంధించిన ఆధునిక ఉదాహరణలను పేర్కొన్నారు. అందులోని సాధువుల గురించి, ముఖ్యంగా పరిపూర్ణ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన ఆయన స్వీయ జ్ఞానోదయ గురు పరంపర గురించిన వివరణలతో — లక్షలాది మంది పాఠకులు పులకించిపోయారు.
మహాత్ముల జీవితాల్లో సమృద్ధిగా వ్యక్తమై, ప్రతి మానవుడిలో ఉన్న అనంత వనరులైన శాంతి, ప్రేమ మరియు ఆనందాన్ని అనుభవించడంలో సాధకులకు సహాయం చేయడానికి పరమహంసగారి జీవితం అంకితం చేయబడింది. ఆయన స్వయంగా అనుభవించిన మరియు మూర్తీభవించుకున్నవాటిని మనం అర్థం చేసుకునేలా ప్రోత్సహించాలని, ఆనందకరమైన “దేవుని క్షణమాత్ర దర్శనం” ఇవ్వాలనేది ఆయన అభిలాష.
వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. మూడవ అధ్యక్షులు మరియు సంఘమాత అయిన శ్రీ దయామాత పరమహంసగారి గురించి ఇలా అన్నారు: “మానవాళి యొక్క మార్గాలను ప్రకాశవంతం చేసేందుకు భువిపై సత్యం యొక్క కాంతి అవతారాలుగా నివసించిన దివ్యాత్మల సరసన ఆయన చేరారు.”
దైవానికి సంబంధించిన మేధో జ్ఞానాన్ని వ్యక్తిగత మరియు సర్వసంతృప్తికరమైన అనుభవంగా మార్చడం యొక్క ప్రాముఖ్యత గురించి ఈ పోస్ట్ లో మేము పరమహంస యోగానందగారి స్వీయ పలుకులను మరియు వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షుల పరిజ్ఞానాన్ని పంచుకుంటున్నాము (లింక్ క్రింద ఇవ్వబడింది).
పరమహంస యోగానందగారి ప్రసంగాలు మరియు రచనల నుండి:
ఈ ఉద్యమం వెనక ఉన్న గొప్ప ప్రయోజనం ఏమిటంటే ప్రజలకు వాళ్ళ ఆత్మసాక్షాత్కారం కలిగించడం. భగవంతుణ్ణి తెలుసుకోవడం తమ బాధ్యత, విశేష హక్కు అని ప్రజలు తెలుసుకొన్నప్పుడు భూమ్మీద ఒక కొత్తశకం ఏర్పడుతుంది.
నేను మీకు మతోపన్యాసాలు ఇవ్వడానికి కాదు, నా అనుభవాలనే ఉద్యానవనం నుండి సేకరించిన సత్యాలను చెప్పడానికే వచ్చాను…నేను మీకు ఇచ్చినవి, దైవంతో మీ స్వీయ సంపర్కం ద్వారా మీ అంతట మీరు సాక్షాత్కరింపజేసుకోవాలని నా అభిలాష. ఆ అవగాహనకు ఇంకేదీ సాటిరాదు.
మీరెంతగా దేవుణ్ణి కోల్పోతున్నారో మీరు గ్రహించడం లేదు; మీరేన్నడూ ఆయన్ని గురించి తెలుసుకోలేదు కాబట్టి. ఒక్కసారి మీరు ఆయనతో సంపర్కం ఏర్పరుచుకొంటే ప్రపంచంలోని ఏ శక్తీ ఆయన్నుంచి మిమ్మల్ని మళ్లించజాలదు. ఎందుకంటే ఆయన్ని పొందితే, మీరిక పొందవలసిన మరే గొప్పవిషయం లేదు.
నేను కనుక్కొన్న ఒక అద్భుతమైన పండు గురించి విస్పష్టంగా ప్రతి రోజూ ఒక సంవత్సరంపాటు వర్ణించి చెప్పినా, దాని రుచి మీకు చూపించకపోతే మీరు తృప్తిపడరు. సత్యాన్ని గురించి వినడం ఆత్మకున్న ఆకలిని తీర్చజాలదు…మీరు దేవుణ్ణి గురించి ఎంత గాఢంగా ఆతురపడాలంటే మీరు ఆయన్ని నిండు మనస్సుతో అన్వేషించాలి.
రాజయోగ ధ్యానమనే శాస్త్రంలో దేవుణ్ణి ఎలా కనుగొనాలనే దానికి భారతదేశం సమాధానమిచ్చింది. నేను భారతావని అంతా తిరిగాను. ఒక సద్గురువు పాదాల వద్ద శిష్యరికం చేశాను. భగవంతుడు ఉన్నాడని నాకు నమ్మకం కుదరడమే కాదు, నేను ఆయన ఉనికి గురించి నా ప్రమాణపూర్వక సాక్ష్యం ఇస్తున్నాను. మీరు నా మాటలపై శ్రద్ధ వహిస్తే, మీరు కూడా ఏదో ఒక రోజు భగవంతుడున్నాడని మీ స్వీయ అనుభవంలో నుండి చెప్పగలరు. నేను సత్యం చెబుతున్నానని తెలుసుకుంటారు.
ధ్యానం ద్వారా మీ జీవితం యొక్క అత్యున్నత ఉద్దేశ్యం మరియు అర్థాన్ని కనుగొనడానికి, దైవంతో మీ సంబంధాన్ని కనుగొనడానికి — మీ కోరికలన్నిటినీ స్వచ్ఛమైన ఆనందంతో నింపి ఒక సఫలతను తీసుకువచ్చే పరమహంస యోగానందగారి మరింత జ్ఞానాన్ని గ్రహించేందుకు మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.
“ప్రపంచానికి పరమహంస యోగానందగారు అందించిన ఆధ్యాత్మిక 6 విప్లవాత్మక ఆలోచనలు” అనే బ్లాగ్ పోస్టులో పరమహంస యోగానందగారు ప్రపంచానికి అందించిన కీలక విషయాలపై స్వామి చిదానందగారు దృష్టి సారిస్తారు — ఆధునిక నాగరికత యొక్క గమనాన్ని మరియు దైనందిన జీవితంలో యోగ శాస్త్రాన్ని ఆచరణలో పెట్టే వారి జీవితాలను మార్చే ఒక ఆధ్యాత్మిక భాండాగారము.



















