ప్రియతములారా,
భగవాన్ శ్రీకృష్ణ జన్మదినమైన జన్మాష్టమిని మనము పర్వదినముగా జరుపుకొనుట ద్వారా, మనము ఆయన దివ్య ప్రేమ వలన ఉద్దరించబడిన వారితో, ఆయన జీవిత ఉదాహరణ మరియు ఆయన తన శిష్యుడైన అర్జునుడికి అందించిన శాశ్వత జ్ఞానము మరియు అది భగవద్గీత పవిత్ర గ్రంథం ద్వారా యుగయుగాలుగా ఉద్ధరించబడిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆత్మలతో ఐక్యమయ్యాము. ధర్మ పునరుద్ధరణ మరియు సన్మార్గుల పరిరక్షకుని పాత్రలో కృష్ణుడు, భగవంతుని మాయ-భాధిత పిల్లలకు ఇలా అభయమిచ్చాడు, సదా వారు తన సంరక్షణలో ఉంటారని మరియు దేవుని సహాయం మరి స్వయం సహకారంతో మనలో ప్రతి ఒక్కరూ ఆత్మ స్వేచ్ఛను పొందగలరని.
కురుక్షేత్ర సంగ్రామంలో కృష్ణుడు అర్జునుడికి మార్గనిర్దేశం చేసినట్లే, భగవంతుడు తన మహాపురుషుల ద్వారా మనకు దారి చూపుతాడు. కాని మనలోని దివ్యశక్తిని ఆవిష్కరించుకొని, విజయం సాధించాలంటే, ఇంద్రియ ఆకర్షణల నుంచి, మనల్ని బంధించే ఐహిక అలవాట్ల నుంచి, ధోరణుల నుంచి మనల్ని మనం విముక్తం చేసుకోవడానికి మన స్వంత చొరవను కూడా వినియోగించాలి. ఆ అడ్డంకులను గుర్తించడమే మొదటి అడుగు. గురుదేవులు తరచూ సాధారణ పరిస్థితులను ఉపయోగించి తన చుట్టూ ఉన్న మాకందరికీ మా పురోగతిని అడ్డుకుంటున్న గుణాలను చూపించేవారు. మన ముందుంచిన అద్దంలో మనం నిర్భయంగా చూస్తే మనకోసం కూడా గురుదేవుల అదే చేస్తారు. మన లోపాలను అ౦గీకరి౦చడ౦ కించపరచుకోవడ౦ కాదు. వాస్తవానికి, మనం విశ్వ భ్రాంతి స్థితిలో జీవిస్తున్నామని గ్రహించడమే మనకు “సత్యం యొక్క మొట్టమొదటి అమూల్యమైన సంగ్రహావలోకనం” అని గురుదేవులు మనకు చెప్పారు. మనం మార్చుకోవలసిన వాటిని గుర్తించడం ఆత్మ విముక్తికి ఆరంభం. ఎందుకంటే, మన అంతర్గత వనరులను ఒక నిర్దిష్ట లక్ష్యం మీద కేంద్రీకరించడానికి, ఆ మార్పులను చేయడానికి ఆలోచనా శక్తిని, సంకల్పశక్తిని క్రియాశీల౦గా ఉపయోగించడానికి ఇది మనకు వీలు కల్పిస్తుంది.
మన ఆత్మ యొక్క ఉత్కృష్ట లక్షణాలను వెలికితీయడంలో యోగ శాస్త్రం తోడ్పాటు అమూల్యమైనది. గురుదేవులు చెప్పినట్లు, “యోగాన్ని నేర్చుకొని, అభ్యసించడం—భ్రాంతి నుండి విముక్తి పొందే పద్ధతి—ఇది సాటిలేని నిధిని కలిగి ఉండటమే.” గురుదేవుని బోధనల్లోని సరైన ప్రవర్తనా నియమావళిని, సద్భక్తితో పాటించినపుడు, మనము మన మరియు ఇతరుల యొక్క అత్యున్నత శ్రేయస్సు కోసం ఏమి చేయాలో అది చేసే విధముగా మార్గనిర్దేశం పొందుతాము. మరియు గురుదేవులు మనకు అనుగ్రహించిన ధ్యాన పద్ధతుల అంకిత అభ్యాసంతో సకల సత్యాలకు మూలంతో (భగవంతునితో) అనుసంధానం పొంది మన చైతన్యం లోతైన స్థాయిలో పరివర్తన చెందుతుంది.
స్వీయ-క్రమశిక్షణ మరియు మాయతో పోరు సల్పడానికి సుముఖత యోగ పథములో భాగము, కానీ మరియొక ఆవశ్యకమైనది ప్రేమ. బృందావనంలోని గోపికలు, గోపబాలురతో కృష్ణుని గురించి మనం తలచినప్పుడు, ఆయన సన్నిధిలో వారు అనుభవించిన ఆనందం తలచుకున్నప్పుడు, భగవంతుని సౌందర్యాన్ని, ఆకర్షణీయమైన తత్వాని ఇంత పరిపూర్ణంగా మూర్తీభవించిన శ్రీకృష్ణుని చూసి మన హృదయాలు పునరుత్తేజితమవుతాయి. దైవం యొక్క అయస్కాంతపు ఆకర్షణ మనల్ని ఆయనను అన్వేషించడానికి ప్రేరేపిస్తుంది మరియు మన ఆధ్యాత్మిక అభ్యాసాలకు జీవాన్ని ఇస్తుంది, అలాగే పట్టువిడువకుండ ఉండే శక్తిని ఇస్తుంది. కృష్ణుని యువ సహచరులు ఏ ఆతృతతో ఆతని వేణువు యొక్క పిలుపును అనుసరించడానికి తక్కిన వాటిని విడిచిపెట్టారో అదే ఆతృతతో మీరు మీ దైనందిన ధ్యానాలకు చేరువైతే, మనలో ప్రతి ఒక్కరూ, వారి హృదయం మరియు మనస్సు దేవునితో కలిగి ఉండగల మధురమైన వ్యక్తిగత సంబంధం అనుభూతిచెందడానికి తెరుచుకుంటాయి.
తనను తెలుసుకొని, ప్రేమించాలని, అనుక్షణం పెరిగే ఇచ్ఛతో భగవంతుడు మిమ్మల్నిఆశీర్వదించుగాక,
శ్రీ శ్రీ మృణాళినీమాత
కాపీరైట్ © 2016 సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్. అన్ని హక్కులు ఆరక్షితం.

















