అక్టోబర్ 5, 2011న మరణించిన దివంగత వ్యాపార దార్శనికుడు మరియు యాపిల్ కుంప్యూటర్ వ్యవస్థాపకుడైన స్టీవ్ జాబ్స్ స్మారకార్థం 2011లో నిర్వహించిన కార్యక్రమంలో, ఆయన కోరిక మేరకు వ్యాపార, రాజకీయ మరియు సాంస్కృతిక రంగాలకు చెందిన వందలమంది ప్రభావవంతమైన ప్రముఖ నాయకులకు పరమహంస యోగానందగారి ఒక యోగి ఆత్మకథ పరిచయం చేయబడింది.
2013 సెప్టెంబర్ లో పోస్ట్ చేయబడిన ఒక ఆన్‌లైన్ వీడియో ఇంటర్వ్యూలో Salesforce.com CEO మార్క్ బెనియోఫ్, స్టీవ్ జాబ్స్ లో గాఢంగాను, కొన్నిసార్లు నిగూఢంగాను ఉన్న ఆధ్యాత్మిక విషయాలను మరియు ఇతర కథనాలను పంచుకొన్నారు. CNET న్యూస్ లో నివేదించబడిన ఇంటర్వ్యూ నుండి ఈ క్రింది సారాంశం సంగ్రహించబడినది:
“జాబ్స్ మరణించిన తరువాత జరిగిన స్మారక కార్యక్రమానికి హాజరైనప్పటి తన వృత్తాంతాన్ని బెనియోఫ్ ఇలా తెలిపారు. అక్కడ హాజరైన వారందరికీ బయటకు వెళ్ళేటప్పుడు గోధుమ రంగులో ఉన్న ఒక చిన్నపెట్టె అందజేయబడింది. ‘ఇది బాగుంటుంది’ అనిపించింది. ‘ఇది జాబ్స్ తీసుకున్న నిర్ణయం అని నాకు తెలుసు, అది ఏదయినా, దాని గురించి మనమందరం ఆలోచించాలని ఆయన కోరుకున్న చివరి విషయం.’
“ఆ పెట్టెలో పరమహంస యోగానందగారి ఒక యోగి ఆత్మకథ కాపీ ఉంది. స్టీవ్ జాబ్స్ జీవిత పర్యంతం, ఆయన్ని ప్రభావితం చేసిన ఆధ్యాత్మిక పుస్తకం అది. మొదటిసారి 1946లో ప్రచురితమయిన ఈ పుస్తకం, ఆత్మ-సాక్షాత్కారం మరియు క్రియాయోగ ధ్యానం యొక్క అభ్యాసాన్ని సూచిస్తుంది.
“[వాల్టర్] ఐజాక్సన్ జీవిత చరిత్ర ప్రకారం, ‘స్టీవ్ జాబ్స్ యుక్తవయసులో ఉన్నప్పుడు మొదటిసారి దాన్ని చదివాడు, తరువాత భారతదేశంలో మళ్ళీ దాన్ని చదివాడు, ఇక అప్పటి నుండి ప్రతి సంవత్సరం దాన్ని చదివేవాడు.’ ఆధ్యాత్మిక జ్ఞానం కోసం 1974లో ఆయన భారతదేశానికి యాత్ర చేశాడు. ‘తనకు గల సహజావబోధమే తనకున్న గొప్ప బహుమతి అనే ఒక అపురూపమైన అవగాహనను ఆయన కలిగి ఉన్నాడు, మరియు ప్రపంచాన్ని అంతరంగం నుండి చూడాల్సిన అవసరం ఉందనేవాడు,’ అని బెనియోఫ్ చెప్పారు.”