మాటలలో చెప్పలేని దివ్య సాహచర్యం: యువ సాధక సంగమం సెప్టెంబర్ 2025

22 నవంబర్ 2025

మొట్టమొదటి యువ సాధక సంగమాన్ని యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.) సెప్టెంబర్ 10 నుండి 14 వరకు రాంచీ ఆశ్రమంలో నిర్వహించింది. 23 నుండి 35 సంవత్సరాల వయస్సులో ఉన్న 200 మందికిపైగా యువ సాధకులు, ధ్యానం, వర్క్-షాపులు, సేవ మరియు సాహచర్యం కోసం ఐదు రోజుల పాటు సమావేశమై, భగవంతుడు మరియు గురుదేవులతో తమ అనుసంధానాన్ని మరింత ప్రగాఢం చేసుకున్నారు.

ఈ సంగమం చాలా సంతృప్తికరమైన, జ్ఞానదాయకమైన కార్యక్రమం. భగవంతుడు మరియు మహాగురువుల అమూల్యమైన సన్నిధిలో ఉండే అదృష్టం మాకు కలిగింది... గురుదేవుల దివ్యకుటుంబంలో భాగం కావడం మమ్మల్ని పరస్పరం దగ్గర చేసి, మా మధ్య ఒక శాశ్వతమైన బంధాన్ని శీఘ్రంగా ఏర్పరిచింది.

— ఎస్. ఎం., పశ్చిమ బెంగాల్

వై.ఎస్.ఎస్. రాంచీ ఆశ్రమంలో ఒకటిగా చేరిన యువ సాధకులు — గురుదేవుల ప్రేమలో ఉన్న ఒక దివ్యమైన కుటుంబం.

సంగమానికి సిద్ధమవడం

యువ సాధకులు ఆశ్రమం చేరిన తరువాత, వారి హృదయాలను తెరచి, మనస్సులను ఏకాగ్రం చేయమని ప్రోత్సహిస్తూ, వ్యక్తిగత దిశానిర్దేశం మరియు సత్సంగాలతో సంగమం ప్రారంభమయ్యింది. పరమహంస యోగానందగారి సాన్నిధ్య ప్రకంపనలతో, జ్ఞాపకాలతో నిండిన రాంచీ ఆశ్రమం యొక్క నిర్దేశిత పర్యటన, పూజ్యభావం మరియు సత్సాంగత్యాల వాతావరణాన్ని నెలకొల్పి, యువ సాధకులను తక్షణమే గురుదేవుల దివ్యకుటుంబంలోకి ఆకర్షించింది.

రాంచీలో జరిగిన యువ సాధక సంగమం మాటలలో చెప్పలేనటువంటిది — నా జీవితంలోని అత్యంత పావనమైన అనుభవాలలో ఇది ఒకటి. ఇతర సంగమాలలో, గురుదేవుల బోధనలను సాధన చేయాలన్న ప్రేరణ కలుగుతుంది, కాని, ఈసారి వాటిలో ప్రత్యక్షంగా జీవించాము. నేను గురుదేవుల సాన్నిధ్యాన్ని చాలా స్పష్టంగా అనుభూతి చెందాను; చివరకు ప్రగాఢమైనదేదో అందరిలోనూ మార్పు కలిగించింది...

— ఏ. ఏ., ఉత్తర్ ప్రదేశ్

పరధ్యానాన్ని ప్రక్కన పెట్టి, హృదయపూర్వకంగా సంగమంలోకి ప్రవేశించాలని భాగస్వాములందరినీ ప్రారంభ సత్సంగం ఆహ్వానించింది.
సంగమం ప్రారంభమవగానే ఒక భక్తిభరితమైన స్ఫూర్తి అ మందిరాన్ని ఆవహించింది.

ఒక సమతుల్యమైన దైనందిన కార్యక్రమం

జాగ్రత్తగా రూపొందించబడిన సమతుల్య కార్యక్రమం ఈ సంగమానికి ఆధారం. ఆంతరంగిక నిశ్శబ్దాన్ని బాహ్య కార్యక్రమాలతో సమ్మిళితం చేసే లయతో ఈ సంగమం ప్రవహించింది. శక్తిపూరణ వ్యాయామాలు, ధ్యానం, అధ్యయనం, సత్సాంగత్యం మరియు వినోదాలతో ప్రతిరోజూ కార్యక్రమాలు ఒక ఆలోచనాపూర్వకమైన సమతుల్యతతో కూడి ఉండేవి. రాత్రి 10 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు నిశ్శబ్దాన్ని పాటిస్తూ, అందరూ మరొక్కసారి తమ అంతరంగంలోకి ప్రవేశించేవారు.

ఆధ్యాత్మిక ప్రగాఢతను ఆచరణయోగ్యమైన వివేకంతోను మరియు ఆనందమయమైన సాహచర్యంతోనూ సమ్మిళితం చేస్తూ, ఈ కార్యక్రమం చక్కగా రూపొందించబడింది. ప్రతి సమావేశం, ధ్యానం, సంభాషణ, ఆంతరంగిక స్పష్టత మరియు శాంతుల వైపు దారితీసే ఒక సోపానంలా అనిపించింది. ఇది పరివర్తనను, ఉన్నతిని రెండింటినీ కలిగించింది...

— డి. ఆర్., ఉత్తర్ ప్రదేశ్

శరీరాన్ని, మనస్సును ధ్యానం కోసం మేల్కొలిపే శక్తిపూరణ వ్యాయామాలతో ప్రతి రోజునూ సాధకులు మొదలు పెట్టారు.
సామూహిక ధ్యానాలు పాల్గొన్న వారందరిలోనూ ఆంతరంగిక నిశ్చలత యొక్క లయను కలిగించాయి.
నిశ్శబ్దంలో మరియు నిశ్చలత్వంలో యువ సాధకులు భగవంతుడు మరియు గురుదేవులతో అనుసంధానాన్ని పొందారు.
వై.ఎస్.ఎస్. పాఠాలపై, వాటి దైనందిన ఆచరణపై చిన్న అధ్యయన బృందాలు ఆలోచనను పెంపొందించాయి.
అందరూ కలసి అనుభవించిన నిశ్శబ్దంలో, యువ సాధకులు గురుదేవుల బోధనల గురించి శ్రద్ధతో ఆలోచించి, వాటిని మరింత గాఢంగా వంటబట్టించుకున్నారు.

దేశం నలుమూలల నుండీ సాధకులు ఒకే రకమైన భావాలు, ఒకే దివ్య సంకల్పంతో కలిసి వచ్చారు. ఇది హృదయపూర్వకమైన, స్ఫూర్తిదాయకమైన సాహచర్యం. సాయంత్రాలలో ఆడిన క్రీడలు మమ్మల్ని త్వరగా స్నేహితులను చేసి, మామూలుగా కన్నా చాలా తొందరగా మా మధ్య బంధాలను కలుగచేశాయి. బృందాలు మరియు బృందనాయకులనే పద్ధతి మరింత అర్థవంతంగా ఉంది, ఈ పవిత్ర మార్గంలో మాకు ఇతరులు చెప్పింది విని, వారితో అభిప్రాయాలు పంచుకొని, వారి నుంచి నేర్చుకునే అవకాశాన్ని ఇది కలుగజేసింది.

— ఎస్. ఆర్., ఆంధ్ర ప్రదేశ్

సాయంకాల వినోద కార్యక్రమాలు ఆత్మీయతను, సాహచర్యంతో కూడిన స్ఫూర్తిని కలుగజేశాయి.
కొంతమంది క్రీడలలో పాల్గొనగా, మరికొంతమంది యోగంలో అంతర్ముఖులై శరీరానికి, మనస్సుకు మధ్య సామరస్యం కలిగించారు.

జీవించడం ఎలా వర్క్-షాప్ లు

సంభాషణలతో కూడిన వర్క్-షాప్ లు ఆధునిక జీవితంలో ఉండే నిజమైన సవాళ్లను ఉద్దేశించి, గురుదేవుల వివేకాన్ని ఆచరణాత్మకంగా ఉపయోగించడంపై యువ సాధకులకు మార్గనిర్దేశాన్ని అందించాయి. జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవడం మరియు సమతుల్యమైన జీవితాన్ని గడపడం పై జరిగిన వర్క్-షాప్ సమావేశాలు భగవంతుడిలో సుస్థిరంగా ఉంటూనే జీవితంలోని ముఖ్యాంశాలను, సమస్యలను, మలుపులను దాటడంపై స్పష్టతను, ఆత్మవిశ్వాసాన్ని అందించాయి.

సంగమం నిజంగా మంత్రముగ్ధులను చేసింది. బృంద సభ్యుల వయస్సును, చేర్చిన పాఠ్యాంశాలను, స్పష్టమైన ఉపమానాలు మరియు ఆచారణయోగ్యమైన సలహాల ద్వారా వాటిని నేర్పే ప్రక్రియలను జాగ్రత్తగా పరిగణించి రూపొందించిన వర్క్-షాప్ వల్ల ఈ అనుభవం ఆకర్షణీయంగాను, యుక్తంగాను అనిపించింది.

— ఎస్.ఎం., మహారాష్ట్ర

గురుదేవుల జ్ఞానాన్ని అన్వయించుకోవడంలో బహిరంగ సంభాషణను, తోటివారు ఒకరి నుంచి మరొకరు నేర్చుకోవడాన్ని వర్క్-షాప్ లు ప్రోత్సహించాయి.

చిన్న బృందాలలో జరిగిన సంభాషణలు, గురుదేవుల బోధనలను ఆచరణాత్మకంగా అన్వయించడంపై ఆలోచనలను పంచుకోవడానికి అవకాశాన్ని కల్పించాయి.

ఒక వై.ఎస్.ఎస్. సన్యాసి నిర్వహించిన జీవించడం ఎలా వర్క్-షాప్ సమతుల్యమైన జీవితాన్ని గడపడంపై స్పష్టతను అందించింది.
ఎంపికలు మరియు సమతుల్య జీవనంపై ఆలోచించడానికి క్రియాశీలకమైన అభ్యాసాలు, వర్క్-షీట్లు సహాయపడ్డాయి.

సాధనను మరింత ప్రగాఢం చేసుకోవడం

శక్తిపూరణ వ్యాయామాలు, హాంగ్-సా మరియు ఓం ప్రక్రియలపై జరిగిన సమీక్షా తరగతులు ఆధ్యాత్మిక సాధన యొక్క మూలసిద్ధాంతాలను పునఃసందర్శించే అవకాశాన్ని ఈ సంగమం కల్పించింది. క్రియాబాన్లకు క్రియాయోగ ప్రక్రియపై సమీక్షాపాఠం, మరియు ఇంకా క్రియాబాన్లు కానివారి కోసం ఒక ప్రత్యేక సత్సంగం కూడా నిర్వహించబడ్డాయి. యువ సాధకులకు వారి ఏకాగ్రతను బలోపేతం చేసుకోవడం మరియు వారి ధ్యానాలను మరింత గాఢతరం చేసుకోవడం ద్వారా వారి సాధనను మెరుగుపరుచుకోవడంలో ఈ సమావేశాలు సహాయపడ్డాయి. అంతేకాక, వై.ఎస్.ఎస్. సన్యాసులతో వ్యక్తిగత సలహా సమావేశాలు యువ సాధకులకు వ్యక్తిగత మార్గనిర్దేశాన్ని, ప్రోత్సాహాన్ని మరియు సాధనాపథంలో భరోసాను అందించాయి.

నేను ప్రతి సమావేశాన్ని నిజంగా ఆస్వాదించాను. స్వామీజీలను, బ్రహ్మచారులను వ్యక్తిగతంగా కలవడం నాకు ఒక ముఖ్యవిషయం. వారు ఎంతో ప్రేమతో, దయతో ఆలకిస్తారు, ఇంకెక్కడా దొరకని జ్ఞానాన్ని అందిస్తారు. కేవలం వారి సమక్షంలో ఉండడమే నన్ను భగవంతుడి పట్ల ప్రేమతో నింపింది...

— పి. కె., మహారాష్ట్ర

శక్తిపూరణ వ్యాయామాలను సరియైన పద్ధతిలో సాధన చేయడానికి మార్గనిర్దేశక సమీక్షా పాఠాలు పాల్గొన్న వారందరికీ సహాయం చేశాయి.
వై.ఎస్.ఎస్. సన్యాసులతో వ్యక్తిగత సలహా సమావేశాలు వ్యక్తిగత ప్రోత్సాహాన్ని, స్పష్టతను కలుగజేశాయి.

ధ్యాన ప్రక్రియల సమీక్షా తరగతులు రోజువారీ సాధనలో చిత్తశుద్ధిని, స్థిరత్వాన్ని ప్రోత్సహించాయి.

సాహచర్యము మరియు సేవ

సంగమం, సహవాసం మరియు సేవలపై సమతుల్యమైన ప్రాధాన్యతను అందించగా, యువ అన్వేషకులు ఒకరికొకరు మరియు ఆశ్రమానికి, గురుదేవుల పేరున సేవ చేయడం కోసం కలసి పని చేయడంలోని ఆనందాన్ని కనుగొన్నారు. తోటి అన్వేషకులకు స్వాగతం పలకడం మరియు వసతి నిర్వహణ నుంచి, వంటశాలలోను, పుస్తక విభాగంలోను సహాయం చేయడం మరియు ఆశ్రమ ప్రాంగణాన్ని చూసుకోవడం వరకు, సేవ అనేది కృతజ్ఞత యొక్క సహజ వ్యక్తీకరణ అయ్యింది. సాయంత్రాల సమయంలో ఇషాగోష్టులు ఆత్మీయ స్నేహాలను పెంపొందించాయి. ప్రత్యేక సమావేశాలలో, వై.ఎస్.ఎస్. లో స్వచ్ఛంద సేవను అందించడం గురించి మరియు సన్యాస జీవితం గురించి యువ సాధకులకు మార్గనిదేశం జరిగింది. సేవకు, ఆధ్యాత్మిక జీవనానికి మరింత గాఢంగా తమను తాము అంకితం చేసుకోవాలనుకునే వారికి సన్యాస జీవితం గురించి, పూర్తి-సమయపు సేవా అవకాశాల గురించి తెలియజేయడం జరిగింది.

ఈ సంగమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆశ్రమంలో ఉండడం, నిశ్శబ్దంగా భోజనం చేయడం, ఆధ్యాత్మిక ప్రవృత్తి గల స్నేహితులతో సాహచర్యం – ఇది నిజంగా పరివర్తనకారకమైన అనుభవం. ప్రతి నిముషము – మౌనంలో ఉన్నా, సత్సంగంలో ఉన్నా లేక సేవ చేస్తున్నా – నాలో లోతైనది ఏదో స్పృశించింది. ఈ సంగమం కేవలం ఒక సమావేశమే కాదు; ఇది ఒక ఆవశ్యకమైన మరియు కాలాతీతమైన దానిలోకి తిరిగి రావడం.

— ఎ. డి., జార్ఖండ్

సంగమంలోని నిర్దిష్టమైన సమయంలో, గురుసేవ చేసే అవకాశాన్ని కూడా యువ సాధకులు బాగా ఉపయోగించుకున్నారు.

ఆశ్రమ ప్రాంగణంలో సేవ చేయడం కృతజ్ఞత యొక్క ఆనందమయమైన వ్యక్తీకరణ అయ్యింది.

భాగస్వాములందరు కలసి సేవ చేస్తూ, సరళమైన సేవా కార్యక్రమాలలో సంతృప్తిని పొందారు.
వై.ఎస్.ఎస్. వాలంటీర్ అవకాశాలు అనే అంశంపై జరిగిన కార్యక్రమం, మరింతగా సేవ చేసే ఆసక్తిని పెంపొందించింది.

పత్రాతు సరస్సు వద్దకు విహారయాత్ర

పత్రాతు వద్దకు చేసిన విహారయాత్ర, సంగమంలోని ఒక ముఖ్యాంశం. దారిలో కీర్తనలను పాడుతూ వెళ్లడం ఒక భక్తిమయమైన వాతావరణాన్ని కలుగజేసింది. సరస్సు వద్ద యువ సాధకులు ప్రకృతిలో నడకను, నౌకా విహారాన్ని, ఆత్మను ఉత్తేజపరిచే సామూహిక భక్తి గీతాలాపనను, ధ్యానాన్ని ఆనందించారు.

ఈ సంగమంలో భాగం కావడం నా అదృష్టమని భావిస్తున్నాను. ఆశ్రమాన్ని, తోటి భక్తుల సమక్షాన్ని వదలి వెళ్లాలని అనిపించలేదు. అన్ని ఏర్పాట్లను చక్కగా నిర్వహించారు. గురుదేవులకు, స్వామీజీలకు, వాలంటీర్లందరికీ ప్రేమతో గాఢమైన ప్రణామాలు.

— ఎస్. ఎస్., కర్ణాటక

సరస్సు ఒడ్డున ప్రకృతిలో నడకను ఆనందిస్తున్న సాధకులు.
గురుదేవుల స్ఫూర్తిలో సాధకులు విహారయాత్ర చేస్తుండగా, వారి పడవలు చిరునవ్వులతో, ఆనందంతో నిండాయి.
పత్రాతు సరస్సులోని నిశ్చలమైన జలాలు సంగమం యొక్క శాంతిని ప్రతిబింబించాయి.
ఆత్మను ఉత్తేజపరిచే కీర్తనలు సరస్సు వద్ద హృదయాలను కదిలించాయి. కలసి భక్తిగీతాలాపన చేసిన సాధకులు ప్రకృతితోనూ, గురుదేవులతోనూ ఒక ప్రశాంతమైన ఐక్యతను అనుభూతి చెందారు.
భోజనం ముందు ఆశీస్సులను ఆర్థించడం ద్వారా, భగవంతుడికి సమర్పించిన ఆహారం పవిత్రమవుతుందని అందరూ గుర్తు చేసుకున్నారు.
భక్తితోనూ, శ్రద్ధతోనూ భోజనాన్ని వడ్డిస్తున్న సేవా బృందం

సాహచర్యంలో ఒక చిరస్మరణీయమైన సాయంత్రం

ఆఖరి రోజుకు ముందరి సాయంత్రం, సంగమానికి ముఖ్యాంశంగా ఒక ప్రత్యేక కీర్తన-ధ్యానం నిర్వహించబడింది. యువ సాధకులు ధ్యాన మందిరం వెలుపలకు వచ్చే సమయానికి ఆశ్రమ ప్రాంగణం వేలాది దీపాలతో వెలిగిపోయింది. తరువాత జరిగిన బహిరంగ సమావేశంలో, దేదీప్యమానంగా ఉన్న ఆశ్రమ వాతావరణంలో, యువ సాధకులకు సన్యాసులతో కలసి సంభాషించే అవకాశం లభించింది.

ఈ అనుభవం ఒక ప్రత్యేకమైనది.... నాకు కీర్తన సమావేశాలు ముఖ్యాంశాలుగా నిలిచాయి... అవి నన్ను భగవంతుడు మరియు గురువుల పట్ల సరిక్రొత్త భక్తితో నింపాయి. నాకు కాలాన్ని ఆపివేసి, ఇటువంటి సంగమాలలోనే ఎల్లప్పటికీ ఉండిపోవాలని కోరికగా ఉంది.

— ఎస్. ఎస్., ఉత్తర్ ప్రదేశ్

వై.ఎస్.ఎస్. సన్యాసులు నిర్వహించిన ప్రత్యేకమైన కీర్తన గానం, ఆ సాయంత్రాన్ని శాంతితోనూ, దివ్యమైన ఆత్మీయతతోనూ నింపివేసింది.
కీర్తనగానం యువ సాధకులను భక్తి మరియు ప్రేమల బృందగానంలో పరస్పరం దగ్గర చేసింది.

కృతజ్ఞతతో నిండిన హృదయంతో, ఈ కార్యక్రమాన్ని సాధ్యం చేసిన ప్రతి ఒక్కరికీ – సన్యాసులకు, వాలంటీర్లకు, ఆశ్రమ సిబ్బందికి, చివరికి ఆశ్రమ ప్రాంగణంలో నిలిచియున్న చెట్లకు కూడా – ఎంత ధన్యవాదాలను తెలిపినా అది తక్కువే!... ఈ సంగమం ఆనందమయం, శాంతిమయం, ఆత్మకు ఉత్తేజకరం.

— జే. జే., హర్యాణా

కాంతిమయ మరియు ఆనందమయ రాత్రి – సంగమంలోని బహిరంగ సభ సమయంలో భక్తితో ప్రకాశిస్తున్న ఆశ్రమం.

కాంతితో అలంకరించబడిన స్మృతి మందిరం, భక్తి మరియు సాహచర్యాల దీపమయ్యింది.
గురుదేవుల నిత్యసజీవ సన్నిధికి ప్రతీక అయిన పవిత్ర లిచీ వేది దీపాల కాంతిలో నిండిపోయింది.

బహిరంగ సభ (ఓపెన్ హౌస్) సాధకులకు దీపాల ప్రకాశవంతమైన వెలుగులో సన్యాసులతో ఇష్టాగోష్టిగా సంభాషణ జరిపే అవకాశాన్ని ఇచ్చింది. వ్యక్తిగతమైన క్షణాలు, మార్గనిర్దేశం మరియు సాహచర్యాల సంబంధాలను మరింత పెంచాయి.

కార్యక్రమ ముగింపు ఆలోచనలు — అలవాటు యొక్క శక్తి

సంగమం చివరి రోజున యువ సాధకులు తాము నేర్చుకున్న విషయాలను, సంకల్పాలను, కృతజ్ఞతను పంచుకున్నారు. “అలవాటు యొక్క శక్తి” అన్న సత్సంగంతో, సంగమం ముగిసింది.

సమగ్ర ఇతివృత్తం (థీమ్) మరియు వేర్వేరు అంశాలు నన్ను ప్రత్యక్షంగా ఉద్దేశించినట్లు అనిపించింది. కేవలం గురుదేవులు, స్వామీజీ, నేను మాత్రమే సంభాషిస్తున్నట్లు అనిపించింది. నాకున్న చాలా ప్రశ్నలకు అడగకుండానే సమాధానాలు లభించాయి. ఈ వారంలో నేను మరింత మర్యాదగల వ్యక్తి నయ్యాను, నా లోపాలను గురించి మరింతగా తెలుసుకున్నాను, నా పట్ల మరింత దయాళువునయ్యను.

— ఎం. డి., మహారాష్ట్ర

“అలవాటు యొక్క శక్తి” పై ముగింపు సత్సంగం గురుదేవుల బోధనలను ప్రతిరోజూ సాధన చేయాలన్న సంకల్పానికి సరిక్రొత్త స్ఫూర్తినిచ్చింది.
చివరి రోజున సాధకులు తాము నేర్చుకున్న వాటితోపాటు తమ కృతజ్ఞతలను వెల్లడించారు.
ఒక గాఢమైన ఆశీర్వాద క్షణం — గురుదేవుల పాడపద్మాలకు సమర్పించిన పుష్పాంజలితో సంగమం ముగిసింది.
వై.ఎస్.ఎస్. సన్యాసుల నుంచి ప్రసాదాన్ని స్వీకరించడంతో కార్యక్రమం యొక్క ముగింపును ఆనందంతోనూ, ఆశీస్సులతోను నింపింది.
ప్రసాదంతోను మరియు ఇంటి వద్ద సాధనను కొనసాగించాలన్న నూతన సంకల్పంతోను సాధకులందరు తిరిగి వెళ్లారు.

లిచీ వృక్షం క్రింద: గురుదేవుల దివ్యదర్శనం

పరమహంస యోగానంద గారు ఇలా వ్రాశారు: “యువకులకు విద్యా సామర్థ్యంలోనే కాక, నైతిక మరియు ఆధ్యాత్మిక విలువలలో కూడా శిక్షణ ఇవ్వగల ఒక సంస్థను స్థాపించడమే నా ధ్యేయంగా ఉండేది. ఈనాటి యువతను రేపటి ప్రయోజనకరమైన, సంతులితమైన స్త్రీ పురుషులుగా తీర్చిదిద్దడమే సరియైన విద్య యొక్క ఆదర్శం.” (ఒక యోగి ఆత్మకథ, అధ్యాయం 27)

రాంచీ ఆశ్రమంలోని ఈ పవిత్ర లిచీ వృక్షం క్రిందనే, గురుదేవులు పరమహంస యోగానంద గారు, యువతకు ఆధ్యాత్మిక క్రమశిక్షణ మరియు ఆచరణీయమైన విద్యాభ్యాసాన్ని సమ్మిళితం చేసే ఆధునిక గురుకులం యొక్క దివ్యమైన దర్శనానికి బీజాలను నాటారు.

ఒక నూతన సంకల్పం

... నా మోక్షానికి అవసరమైనవన్నీ వై.ఎస్.ఎస్. వద్ద ఉన్నాయని ఇప్పుడు నేను పూర్తిగా నమ్ముతున్నాను... ఇక నా ప్రయత్నాలనే తప్పు పడతాను కాని, ఈ బోధనలను కాదు.

— పి. కె., మహారాష్ట్ర

యువ సాధకులు – 18 నుండి 39 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు – సమతుల్యమైన ఆధ్యాత్మిక జీవనాన్ని అన్వేషించి, అనుసరించాలని కోరుకునేవారు, భవిషత్తులో జరిగే సంగమాలు, ఏకాంత ధ్యాన వాసాలు మరియు ఆన్‌లైన్ సత్సంగాల గురించి సమాచారం తెలుసుకోవడం కోసం యువ సాధకుల వాట్సప్ (WhatsApp) బృందంలో చేరాలనుకునేవారు, దయచేసి ఈ ఆసక్తి పత్రంను పూర్తి చేయండి. యువ సాధకుల కోసం కార్యక్రమాలు రూపొందించినప్పుడు మరియు అవకాశాలు ఉనప్పుడు, యువ సాధక సత్సంగ బృందం మిమ్మల్ని సంప్రదిస్తుంది.

ఇతరులతో పంచుకోండి