“జాతి, వర్ణం లేదా మతం కన్నా మరింత గాఢమైన ఐక్యతను కనుగొనడం” గురించి స్వామి చిదానంద గిరి

3 జూన్, 2020

శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి గారి సందేశం
యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ అధ్యక్షులు

అమెరికాలోను మరియు ప్రపంచవ్యాప్తంగాను ప్రస్తుత పరిస్థితులలో మానవాళి ఎదుర్కొంటున్న జాతివివక్ష మరియు విభజనవాదం యొక్క తీవ్రమైన సమస్య గురించి స్వామి చిదానందగారు మాట్లాడుతూ, ఈ రుగ్మత యొక్క లక్షణాలను గురించి మాత్రమే కాకుండా, దాని కారణాన్ని పరిష్కరించే విధానం గురించి కూడా చర్చిస్తున్నారు. ధ్యానం ద్వారా ముందుగా తమలోనే శాంతిని ఉత్పన్నం చేసే ధ్యానులు నిజమైన శాంతిసంధాతలని, ఇతరులకు ఆ శాంతిని ఆధ్యాత్మిక చర్యలతో ప్రసరింపజేయడం ద్వారా మన సమాజంలో లోతుగా పాతుకుపోయిన జాతివివక్షతలను పరిష్కరించడం సాధ్యమవుతుందని వారిని ప్రోత్సహిస్తున్నారు.

Swami Chidananda Giri thanking for love, support and prayers

స్వామి చిదానందగారి సందేశం ఈ క్రింద ఇవ్వబడింది:

ఆధ్యాత్మిక మార్గంలోని దివ్యమిత్రులకు ప్రణామాలు మరియు అభినందనలు.

అమెరికాలోను మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక నగరాల్లో తలెత్తిన జాతి-ఆధారిత కల్లోల పరిస్థితుల గురించి మీరు కూడా నాలాగే ఎంతో ఆందోళన చెందుతున్నారని నాకు తెలుసు. దీని గురించి కొన్ని ఆలోచనలను మీతో పంచుకుంటాను.

అన్నింటి కన్నా ముందుగా, సమస్య గురించి స్పష్టంగా తెలుసుకుందాం. మనలో ఎవరి హృదయాలు మరియు మనస్సులలో దేవునికి స్థానం ఉండదో, అటువంటివారికి జాతి పక్షపాతం మరియు అన్యాయం అనేది ఒక రుగ్మతలా వ్యాపించి ఉంటుంది. ఇటీవలి రోజుల్లో, అమెరికా అంతటా, ఆ రుగ్మత కొత్తగా వ్యాపించడాన్ని మనం చూశాం. అమెరికాలో మాత్రమే కాదు: ప్రపంచంలోని చాలా దేశాలలో జాతి, వర్ణం మరియు ఖచ్చితంగా చాలా ప్రాంతాలలో మతం ఆధారంగా భేదభావాలు, విద్వేషం ఏదో ఒక స్థాయిలో వ్యాపిస్తున్నాయి.

ఏదేనా దీర్ఘకాలిక వ్యాధి మాదిరిగానే, మనం ఆ లక్షణాలకు చికిత్స చేయవచ్చు — అది సహాయకారిగా ఉంటుంది, ఎటువంటి సందేహం లేదు — కాని మనం దాని మూలకారణాన్ని కూడా పరిష్కరించాలి.
ఇలాంటి సమయాల్లో, ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపే అన్ని హృదయాలు మరియు మనస్సులు, సహాయం చేయడానికి నేను ఏం చేయగలను? అని తమను తాము ప్రశ్నించుకుంటాయి. ఈ ప్రపంచంలో మనందరికీ విభిన్నమైన ప్రతిభ, సామర్థ్యాలు కలిగి వేర్వేరు పాత్రలు నిర్వహించవలసి ఉంటుంది; అంటే ఏ సమయంలోనైనా మన మానవ కుటుంబానికి ఎదురయ్యే నిర్దిష్ట సంక్షోభం లేదా సమస్యపై ఆధారపడి వివిధ మార్గాల్లో మనం ఇతరులకు సేవ చేయడానికి అర్హత పొందుతాము.

మన ప్రపంచం, మన సమాజంలోని ఇతరుల జీవితాలను మెరుగుపరచడానికి మన ఎస్.ఆర్.ఎఫ్. మరియు వై.ఎస్.ఎస్. సభ్యులలో చాలామంది, నైపుణ్యం కలిగిన మరియు వృత్తిపరమైన తమ ప్రతిభను వినియోగించడం ద్వారా, లేదా కేవలం ధార్మిక సేవ ద్వారా లేదా తోడ్పాటును అందించడం ద్వారా సహాయపడతున్నారని నాకు తెలుసు. భగవంతుడు వారందరినీ ఆశీర్వదిస్తాడు! ప్రపంచవ్యాప్తంగా పేదరికం, జాతి వివక్ష మరియు మానవ అజ్ఞానానికి సంబంధించిన అన్ని ఇతర పర్యవసానాల నిర్మూలనకు చురుగ్గా సహకరిస్తున్న ప్రతి వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తాడు.

కాని పరమహంస యోగానందగారి అనుచరులందరూ, ధ్యాన ఆధారిత ఆధ్యాత్మిక బోధనలను అనుసరించే వారందరూ సేవ చేయగల మరియు సేవ చేయదగిన ప్రత్యేక మార్గం ఒకటి ఉంది – అది శాంతిసంధాతగా ఉండటం. ధ్యానసాధన ద్వారా మనలో ప్రశాంతతను నెలకొల్పుకొని, మన నుండి ప్రసరింపజేసే శాంతి, సామరస్యం, ప్రార్థన, మరియు దైవప్రేమ యొక్క ప్రకంపనల ద్వారా మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి సేవ చేయండి.

మన గురువుగారు పదే పదే నొక్కి చెప్పినట్లుగా, మానవులకు హృదయ వేదనను కలిగించే నిరంతర సామాజిక సమస్యలకు శాశ్వత నివారణ – మనల్ని మనం మరింత శాంతియుతంగా, ప్రేమగా, దైవ-కేంద్రీకృత వ్యక్తులుగా మనల్ని మనం మార్చుకోవడంలోనే ఉంది. దానిపై పని చేయడమంటే మూల కారణాన్ని పరిష్కరించడమే. మిగిలినవన్నీ, విలువైనవైనప్పటికీ, లక్షణాలను మాత్రమే పరిష్కరిస్తున్నాయి.

కాబట్టి, ప్రస్తుతం మనమందరం కలిసి కొంత సమయం గడుపుదాం. ప్రశాంతతను పెంపొందించుకొని, మనం గడుపుతున్న సమస్యాత్మక కాలాన్ని అధిగమించడం కోసం మనవంతు సహకారంగా దానిని బాహ్యంగా ప్రసారం చేద్దాం.

ఎందుకంటే కేవలం మాటలు మాత్రమే సరిపోవు, అపార్థం, భయం మరియు కోపం కలిగించే ఇలాంటి సమయాల్లో — మనం ఒకరికొకరం చెప్పుకొనే మాటలు ఒక పరిమితమైన ప్రభావాన్ని కలిగి ఉంటాయి. తరచుగా అవి ప్రతికూల ప్రభావాన్ని కలిగి ఉంటాయి, ఎందుకంటే మనం ఇతర మానవులతో మాట్లాడే పదాలు చాలా సులభంగా తప్పుగా అర్థం చేసుకోబడతాయి. కాని ప్రార్థనలో, ధ్యానంలో మరియు దేవునితో అనుసంధానంలో మన గాఢమైన పరితాపం నుండి దేవునికి ప్రవహించే పదాలు — మానవ సంభాషణ యొక్క రూపాలన్నిటినీ మించిన ఒక శక్తిని కలిగి ఉంటాయి.

కాబట్టి నా ప్రార్థన రెండు భాగాలు: మన కాలంలోని సహృదయంగల సంస్కర్తల — అన్ని జాతులు, మతాల యొక్క సామాజిక మరియు రాజకీయ ఐక్యతలను పెంపొందించేవారి — మాటలను మనమందరం గౌరవంగా మరియు అత్యవసరంగా వినాలని నేను ప్రార్థిస్తున్నాను. ఒకరి మాటలను ఒకరు వినే ఆ గాఢమైన ఆధ్యాత్మిక చర్య ద్వారా, గొప్ప ఆదర్శాలను పదాల నుండి నయం చేసే స్పష్టమైన చర్యలలోకి పరివర్తనకారక ఉత్తమ మార్గాన్ని గుర్తించేందుకు ప్రయత్నిద్దాం.
కాని అంతకంటే ఎక్కువగా, ఈ విభజిత సమయంలో మన అత్యంత హృదయపూర్వకమైన మాటలు, మన స్వభావంలోని మంచితనానికి, నిజాయితీకి మరియు ఉన్నతి కలిగించే వాటన్నిటికీ మూలభాండాగారమైన ఆ దైవానికి చేరుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను.

మనం సంభాషించే పదాలు నివేదించేందుకు మరియు మనం ఆలకించేందుకు, ధ్యానం యొక్క నిశ్శబ్ద అంతర్ముఖత్వంలో లభించే శాంతి మరియు అవగాహన యొక్క శక్తిని అనుమతించేందుకు అవసరమైన సమయాన్ని కేటాయించి, మన ఆత్మలలోని అవసరమైన గాఢతను కనుగొందాం. మరియు మనం పరస్పరం సంభాషించే పదాలతోపాటు, ప్రస్తుత సంఘర్షణలు మరియు అసమానతలతో మనకు పరస్పరం ఎదురయ్యే ఆపదలకు, భగవంతుడితో మనం పలికే పదాలు మరియు ప్రార్థనలు, మన ప్రతిస్పందనను నిర్వచించే విధంగాను, ఒక రూపమిచ్చే విధంగాను ఉండనివ్వండి.

జాతి వివక్షను నయం చేయడానికి ఒక ప్రార్థన

పరమేశ్వరా, జగన్మాతా, సఖా, ప్రియతమ ప్రభూ,

అమెరికా మరియు ప్రపంచవ్యాప్తంగా జాతి వివక్ష మరియు విభేదాలకు వ్యతిరేకంగా విస్తృతమైన నిరసనలు వ్యాపిస్తున్న ప్రస్తుత సందర్భంలో, కోపం, భయం, అపార్థం మరియు బాధను ఎదుర్కొనగలిగే అత్యంత నిర్మాణాత్మక వైఖరిని మాకు చూపించండి.

మా అందరి నిత్యమైన తండ్రీ-జగన్మాత — మీ చేత దైవ సమానులుగా సృష్టించబడిన సోదర సోదరీమణులుగా — యునైటెడ్ స్టేట్స్‌ను మరియు అనేక ఇతర దేశాలను పట్టి పీడిస్తున్న బాధలు మరియు జాతి ఆధారిత అన్యాయాన్ని ఎలా వినవలెనో, అనుభవించవలెనో మరియు వివేకంతో నడిపించే చర్యను ఎలా చేపట్టవలెనో మాకు నేర్పించండి.

అన్నింటికంటే ఎక్కువగా, దయ, స్వస్థతగల ప్రేమమయుడైన ఓ దేవా, ధ్యానం ద్వారా మరియు మా స్వాభావికమైన ప్రవృత్తుల స్వీయ-క్రమశిక్షణ ద్వారా, మా ఆత్మలలో నీ సాన్నిథ్యం నుండి ప్రవహించే విశ్వజనీన ప్రేమను మా అందరిలో మేల్కొల్పుకొనెదముగాక; మరియు దానితోపాటు మా వసుధైక కుటుంబంలోని ప్రతి సభ్యుని క్షేమం, శ్రేయస్సు మరియు ఆధ్యాత్మిక వృద్ధి కోసం, మా ప్రార్థనలతో సహకరించాలనే నిశ్చయాన్ని, మమ్మల్ని మార్చుకొనేందుకు చేసే మా ప్రయత్నాలను మరియు మాకు అందుబాటులో లభ్యమయ్యే బాహ్యసేవా చర్యలను కూడా మేల్కొలుపు.

ఓం. శాంతి. ఆమెన్.

[స్వామి చిదానందగారి ద్వారా ఒక ధ్యాన కార్యక్రమ నిర్వహణ.]

సమస్య యొక్క కర్మ కారణాన్ని పరిష్కరించడం

ప్రియమైన మిత్రులారా, ఇది గుర్తుంచుకొందాం: స్వస్థత చేకూరాలంటే, లక్షణాలను మాత్రమే కాకుండా, ఈ సమస్యలకుగల కారణాలను గుర్తించి పరిష్కరించడానికి, మనం ఆధ్యాత్మిక పరిపక్వతను పొందవలసి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి.

మన వ్యక్తిగత జీవితాలు మరియు దేశాల గమనాన్ని నిర్వహించేది కర్మ సూత్రమే. మరియు ఈ ప్రస్తుత ఉపద్రవాలు నిజంగా లోతైన అంతర్లీన కారణం యొక్క లక్షణాలు. వాటిని తగ్గించడం లేదా హేతుబద్ధం చేయడమనే తప్పు మనలో ఎవరూ చేయకూడదని నేను చెప్తున్నాను. మన వ్యక్తిగత జీవితాల్లో లేదా సమాజంలోని ఏదైనా స్థిరంగా ఉన్న కర్మ స్థితి మాదిరిగానే, మనం వాటిని ఎదుర్కొని, పరిష్కరించి, అవి మనకు నేర్పడానికి ఉద్దేశించిన ఆధ్యాత్మిక పాఠాలను నేర్చుకుంటే తప్ప వాటిని దూరంగా పారద్రోలలేము.

మన గురుదేవులు పరమహంస యోగానందగారు అమెరికాను ప్రేమించేవారు. ఆయన తరచుగా దాని భవితవ్యం గురించి మాట్లాడేవారు. వసుధైక కుటుంబం యొక్క ఉన్నత పరిణామంలో యునైటెడ్ స్టేట్స్ ప్రముఖ పాత్ర పోషిస్తుందని, ప్రపంచంలో అది చేసిన అన్ని మంచి పనులకు అద్భుతమైన మంచి కర్మ ఉంటుందని ఆయన అన్నారు. అయినప్పటికీ, ఆఫ్రికన్ అమెరికన్లు మరియు స్థానిక అమెరికన్ల పట్ల ఈ దేశం యొక్క అవమానకరమైన ప్రవర్తనతో సృష్టించబడిన బాధాకరమైన కర్మ పరిణామాల గురించి ఆయన స్పష్టంగా, ముందుచూపుతోను దివ్యదృష్టితోను మాట్లాడారు. ఆయన దత్తత తీసుకున్న దేశం ఈ దురాగతాన్ని అధిగమించడంలో సహాయం చేయడాన్ని గొప్ప బాధ్యతగా భావించారు — అమెరికన్లు తమ అత్యుత్తమ గొప్ప లక్షణాలను వ్యక్తపరచాలని ఆయన కోరుకోవడం వల్లో లేదా ముదురు రంగు చర్మంగల విదేశీయుడిగా అవమానానికి తాను గురైన స్వీయ అనుభవం కారణంగా మాత్రమే కాదు; కానీ ఆయన మొత్తం మానవజాతి పట్ల కలిగి ఉన్న క్రీస్తులాంటి ప్రేమ వల్ల మరియు దేవుని పై ఆయనకున్న దివ్య అవగాహన — ఆయనకున్న దివ్యనిశ్చయం — వల్ల మాత్రమే ఈ సమస్యలకు సమాధానం, బాహ్యమైన, లౌకికమైన లేదా సామాజికమైన సంస్కరణల్లో మాత్రమే కాక ఆధ్యాత్మికతలో ఉంది.

కాబట్టి నేను ఆయన వివేకం మరియు ప్రేరణతో కూడిన అత్యద్భుతమైన పదాలతో ముగించాలనుకుంటున్నాను. ఈ పదాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక శక్తిని అనుభూతి చెందండి మరియు మన కోసం, అన్ని జాతులకు చెందిన మన సోదరసోదరీమణుల కోసం మరియు మన ప్రపంచం కోసం, ప్రేమ యొక్క ఆ శక్తి మనలో ప్రతి ఒక్కరిలోనూ ఒక కొత్త ఆశను మరియు అవకాశాలను నింపనివ్వండి.

ఆయన ఇలా అన్నారు:

“మనం ధ్యానంలో దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకున్న వెంటనే, మన స్వంత కుటుంబాన్ని ప్రేమించినట్లే మానవులందరినీ ప్రేమిస్తాం. తమ ఆత్మ-సాక్షాత్కారం ద్వారా భగవంతుడిని కనుగొన్నవారు — భగవంతుడి వాస్తవమైన అనుభవాన్ని పొందినవారు — వారు మాత్రమే మానవజాతిని ప్రేమించగలరు; రక్తసంబంధీకుల వలె, ఒకే తండ్రి సంతానమువలె వ్యక్తిగతంగా ప్రేమిస్తారు.”

para-ornament

“ఒకే ప్రాణాధారమైన రక్తము అన్ని జాతుల రక్తనాళాల్లో ప్రవహిస్తున్నదని గ్రహించండి. భగవంతుడు అందరిలోనూ జీవిస్తూ ఊపిరి తీసుకుంటున్నప్పుడు, ఏ జాతికి చెందిన మానవులనైనా ద్వేషించడానికి ఏ వ్యక్తయినా ఎలా ధైర్యం చేయగలరు? మనం కొన్ని సంవత్సరాలు మాత్రమే అమెరికన్లు లేదా హిందువులు లేదా ఇతర జాతీయులుగా ఉంటాం, కాని మనం ఎప్పటికీ దేవుని సంతానమే.”

para-ornament

“మీరు మీ లోపల ఉన్న భగవంతుడితో సంబంధం పెట్టుకొన్నప్పుడు, ఆయన అందరిలో ఉన్నాడని, ఆయన అన్ని జాతులకు సంతానముగా ఉన్నాడని మీకు తెలుస్తుంది. అప్పుడు మీరు ఎవరికీ శత్రువుగా ఉండరు. అటువంటి విశ్వజనీన ప్రేమతో ప్రపంచమంతా ప్రేమించుకొంటే, మానవులు ఒకరిపై ఒకరు ఆయుధాలు పట్టాల్సిన అవసరం ఉండదు. క్రీస్తుకు దృష్టాంతంగా మనం ఉండడం ద్వారా అన్ని మతాలు, అన్ని దేశాలు, అన్ని జాతుల మధ్య ఐక్యతను మనం తీసుకురావాలి.”

para-ornament

కాబట్టి స్నేహితులారా, మెరుగైన ప్రపంచాన్ని సృష్టించే శక్తి మనలోనే ఉందని తెలుసుకుని, ఆ మాటలను విశ్వసిద్దాం. మనం ప్రతిరోజూ దేవుణ్ణి ధ్యానిస్తున్నప్పుడు, ప్రార్థన మరియు ప్రార్థన-నిర్దేశిత చర్యలతో దైవశాంతి మరియు ప్రేమ యొక్క వాస్తవ అనుభవాన్ని ప్రపంచానికి ప్రసరింపచేద్దాం.

మీ అందరికీ దేవుని ప్రేమ మరియు ఆశీర్వాదం లభించుగాక.

ఇతరులతో పంచుకోండి