భారతదేశ పూర్వ రాష్ట్రపతి, గౌరవనీయులైన శ్రీ రామ్‌నాథ్ కోవింద్ అక్టోబర్ 28, 2025న ద్వారాహాట్ లోని యోగదా సత్సంగ శాఖా ఆశ్రమాన్ని సందర్శించారు.
స్వామి విశ్వానంద మరియు మరో ఐదుగురు వై.ఎస్.ఎస్. సన్యాసులతో కలిసి స్వామి వాసుదేవానంద ఆయన్ని ఆహ్వానించారు. ఆయన వచ్చిన వెంటనే వారు ఆయనకు పూలగుత్తి సమర్పించారు. ఆయన్ని, ఆయన పరివారాన్ని, మరియు భద్రతా దళాన్ని వారు ధ్యాన మందిరానికి తీసుకువెళ్లారు, అక్కడ ఆయన కొంత సేపు ధ్యానం చేశారు, ఆ తరువాత కృష్ణ మందిరానికి వెళ్ళి అక్కడ గౌరవ వందనం సమర్పించారు.
ఆశ్రమం అతిథి గృహంలో జరిగిన సమావేశంలో, ఒక శాలువను, నూతనంగా విడుదలైన హిందీ పుస్తకం ద యోగా ఆఫ్ ద భగవద్ గీత ప్రతిని మరియు 2026 వై.ఎస్.ఎస్. వాల్ క్యాలండర్ ను శ్రీ కోవింద్ కు స్వామి వాసుదేవానంద బహూకరించారు. ఆయనతో పాటు వచ్చిన మరికొందరు ప్రముఖులకు కూడా క్రొత్తగా విడుదలైన ఈ పుస్తకంతో పాటు శాలువ, క్యాలండర్ బహూకరించడం జరిగింది.
అనుచరవర్గంలోని ప్రతి సభ్యుడు ప్రసాదము మరియు 2026 వై.ఎస్.ఎస్. క్యాలండర్ ప్రతిని అందుకున్నారు.
స్వాములు విశ్వానంద మరియు వాసుదేవానందతో శ్రీ కోవింద్ కొన్ని నిమిషాలసేపు సంభాషిస్తూ గడిపారు. ఆశ్రమం యొక్క వివిధ కార్యకలాపాల గురించి తెలుసుకొని, ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. మళ్ళీ వచ్చే సంవత్సరంలో యోగదా ఆశ్రమం సందర్శించేందుకు గాఢమైన ఆసక్తి కనబరిచారు.
ఆశ్రమంలో సుమారు అరగంట సేపు ఆయన గడిపారు.
అక్టోబర్ 29, 2025న మహావతార్ బాబాజీ గుహ సందర్శన
ఆ మరుసటి రోజున, ద్వారాహాట్ దగ్గర పాండుఖోలి పర్వతంపై నెలకొని ఉన్న మహావతార్ బాబాజీ గుహ దగ్గరకు శ్రీ రామ్‌నాథ్ కోవింద్ చేరుకున్నారు.
వై.ఎస్.ఎస్. సన్యాసులు పూలగుత్తితో ఆయనను ఆహ్వానించినప్పుడు, ఆయన దాన్ని స్వీకరించకుండా బాబాజీ పట్ల తమకున్న ప్రగాఢమైన భక్తిని వ్యక్తం చేస్తూ, “స్వీకరించడం నా పని కాదు, నేనే పువ్వులను ఆయన పాదాల వద్ద అర్పించవలసి ఉంది” అని అన్నారు. ఆ తరువాత ఆయన్ని స్మృతి భవనానికి తీసుకొని వెళ్లారు, అక్కడ ఆయన మహావతార్ బాబాజీ చిత్రపటం ముందు నివాళులర్పిస్తూ కొంత సమయం గడిపారు.
అనంతరం ఆయన బాబాజీ గుహను సందర్శించారు, అక్కడ ద్వారం వద్ద స్వామి విశ్వానంద ఆయనకు స్వాగతం పలికి గుహ లోపలకు తీసుకువెళ్లారు. ఆయన 15 నుండి 20 నిమిషాల సేపు ధ్యానం చేశారు, ఆ తరువాత ఒక రుద్రాక్షమాలను స్వామి విశ్వానంద ఆయనకు బహూకరించారు.
తేలికపాటి ఉపాహారం కోసం గుహ దిగువ ప్రాంతంలో ఉన్న స్మృతిభవనం వద్దకు ఆయన తిరిగి వచ్చారు. స్వాములు విశ్వానంద, చైతన్యానంద, బాబాజీ గుహ యొక్క చరిత్రను వివరించారు; అలాగే ఏడాది పొడవునా గుహను సందర్శించే యాత్రికుల సంఖ్య పెరుగుతున్న కారణంగా, వారికి మెరుగైన సేవలందించేందుకు, సహాయంగా ఉండేందుకు, గుహ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి గురించి వారు ఆయనకు సుదీర్ఘంగా వివరించారు. ఈ ప్రాజెక్టు పట్ల శ్రీ కోవింద్ గాఢమైన ఆసక్తి కనబరచి, తన మద్దతును తెలియజేశారు. పర్వతంపై నుండి కారు వద్దకు ఆయన తిరిగి వచ్చినప్పుడు వై.ఎస్.ఎస్. నిర్మాణ స్థలం ఆయనకు చూపించబడింది, అక్కడ సందర్శకుల భవనం మరియు బహుళ ప్రయోజన భవనం నిర్మాణంలో ఉన్నాయి.
గౌరవనీయులైన పూర్వ రాష్ట్రపతి తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో ఆశ్రమానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. తరువాత ఆయన వై.ఎస్.ఎస్. ద్వారాహాట్ ఆశ్రమం మరియు బాబాజీ గుహ రెండింటిలోనూ లభించిన ఉత్తేజకరమైన మరియు సమాచారాత్మక అనుభవం పట్ల తన ప్రశంసలను వ్యక్తం చేశారు.
ఆ తరువాత రోజు, అక్టోబర్ 30, 2025న, పూర్వ రాష్ట్రపతి, తమ వ్యక్తిగత కార్యదర్శితో స్వామి ధైర్యానందకు ఫోన్ చేయించి ఆయనతో మాట్లాడారు; అందులో, వై.ఎస్.ఎస్. ఆశ్రమంలో తనకు లభించిన ఆతిథ్యం పట్ల తన హృదయపూర్వక ఆనందాన్ని మరియు గాఢమైన కృతజ్ఞతలను వ్యక్తం చేశారు.




















