మొదట భగవంతుణ్ణి అన్వేషించడం ద్వారానే సాఫల్యత లభిస్తుంది అనే అంశం గురించి శ్రీ దయామాత

1 ఆగష్టు, 2026

ఈ పోస్ట్ లో త్వరలో విడుదల కానున్న Journey With Paramahansa Yogananda ప్రసంగాల సంపుటిలోని “The Many Aspects of God” అనే అధ్యాయం నుండి ఒక భాగాన్ని అందిస్తున్నాము. శ్రీ దయామాత 1955 నుండి 2010లో గతించే వరకు యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్‌కు అధ్యక్షురాలిగా మరియు సంఘమాతగా సేవలందించారు. ఆమె దయాపూరితమైన, ప్రోత్సాహకరమైన బోధన — మరియు ఆధ్యాత్మికతను పూర్తిగా ఆచరణలో పెట్టడమంటే ఏమిటో చూపే ఆమె ఉత్కృష్ట ఉదాహరణ — ప్రపంచవ్యాప్తంగా పరమహంస యోగానందగారి బోధనలను అనుసరించే వారికి ఎంతో ప్రియమైనది.

లోటస్-ఆరెంజ్-లైన్-ఆర్ట

ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించడానికి అంకితం చేసిన నా స్వంత జీవితాన్ని గురించి ఆలోచిస్తూ, భగవంతుడిని అన్వేషించడం వల్ల కలిగే గొప్ప శాంతి మరియు ఆనందం — సంతోషం, భద్రత మరియు అవగాహన — వీటితో మరే ఇతర అన్వేషణ యొక్క ప్రతిఫలాలు సరితూగగలవని నేను అనుకోను. అందరూ అక్షరాలా ప్రపంచాన్ని త్యజించి, భగవంతుడిని కనుగొనడానికి గుహలు లేదా మఠాల ఏకాంతంలోకి వెళ్లాలని నేను నమ్ముతున్నానని దీని అర్థం కాదు. అస్సలు కాదు. సన్యాసం యొక్క నిజమైన స్ఫూర్తి సన్యాసానికి సంబంధించిన వస్త్రాలు ధరించడంలో లేదని, భగవంతుడితో ఆంతరంగిక అనుసంధానం కోసం అన్వేషించడంలోనే ఉందని పరమహంస యోగానందగారు మాకు బోధించారు.

దీనికి మన బాధ్యతలను విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. భగవంతుడు మనలో ప్రతి ఒక్కరికీ ఈ ప్రపంచంలో కొన్ని బాధ్యతలను ఇచ్చి, వాటిని మనం నెరవేర్చాలని ఆయన ఆశిస్తాడు. మనం ఎక్కడ ఉంచబడినా, మన బాధ్యతలను నిర్వర్తించాలి, కానీ ఒక విషయాన్ని పూర్తిగా తెలుసుకోవాలి: “ప్రభూ, ప్రతి క్షణం, ప్రతి పరిస్థితిలోనూ నేను వ్యవహరించాల్సింది నీతోనే. నా బాధ్యతలన్నింటినీ నిర్వర్తిస్తున్నప్పుడు కూడా, నేను అన్వేషిస్తున్నది నిన్నే, నా జీవితంలో మొదటి స్థానం నీదే.” నిజమైన సన్యాసిగా జీవించే మార్గం ఇదే. పరమహంసగారు ఇలా చెప్పారు, “నీ హృదయాన్ని ఒక ఆశ్రమంగా చేసుకో, భగవంతుడి ప్రేమనే నీ వస్త్రంగా చేసుకో.”

జీవితంలో మనకు గొప్ప దుఃఖాన్ని కలిగించి, మన సమస్యలన్నింటికీ కీలకమైనది నెరవేరని కోరికలే. మనం ప్రేమను కోరుకుంటాం, ఆ ప్రేమలో నిరాశ ఎదురైనప్పుడు బాధపడతాం. ఆర్థిక భద్రతను కోరుకుంటాం, అది లభించనప్పుడు ఆ లోటుకు సంబంధించిన బాధను అనుభవిస్తాం. ఆరోగ్యం, సంతోషం, శాంతి, జ్ఞానం, అనిశ్చితుల మధ్య భద్రత వంటి కోరికలు నెరవేరకపోవడం — ఇవన్నీ మానవుల దుఃఖానికి మూలకారణం. భగవంతుణ్ణి అన్వేషించడమే ఈ నిరాశలను అంతం చేయడానికి మార్గం. “నీవు మొదట భగవంతుని రాజ్యాన్ని, ఆయన ధార్మికతను అన్వేషించు, మిగిలినవన్నీ నీకు సమకూర్చబడతాయి” అని క్రీస్తు చెప్పలేదా?* ఆ ఆదర్శాన్నే నేను ఎల్లప్పుడూ నా ముందు ఉంచుకున్నాను.

ఒకరి బాధ్యతలు లేదా జీవన విధానంతో సంబంధం లేకుండా, భగవంతుడిని అన్వేషించడానికి మార్గం ఆయనను మొదటి స్థానంలో ఉంచడమే. ఏ వ్యక్తిలో భగవంతుని పట్ల గల మహోన్నత కోరికకు, గాఢమైన వాంఛకు లోబడి మిగిలిన కోరికలన్నీ ఉంటాయో ఆ వ్యక్తే నిజమైన సన్యాసి. ఆ భగవంతుడే మన ఆకాంక్షలన్నింటికీ అంతిమ పరిపూర్ణత. భగవంతుని కోసం అన్నిటినీ అంతరంగంలో త్యజించడం ద్వారా మనం హృదయాన్ని పవిత్రం చేసుకున్నప్పుడు, ప్రేమ, భద్రత, ఆనందాల కోసం ఉన్న ఆకాంక్షను మనం త్యజించడం లేదు. సమస్త జీవుల లక్ష్యాలైన ఈ విషయాలను మనం ఇంకా కోరుకుంటూనే ఉన్నాము. కానీ వాటిని ప్రపంచం నుండి పొందాలనే వ్యర్థమైన ఆశను మనం వదిలిపెడతాము, మరియు పరిపూర్ణత అనేది ముందుగా భగవంతుడిని అన్వేషించడం ద్వారానే లభిస్తుందని గ్రహించే వివేకాన్ని కలిగి ఉంటాము. అత్యంత ముఖ్యమైనదాన్ని చైతన్యంలో అత్యున్నత స్థానంలో ఉంచుతాము. అప్పుడు ఆధ్యాత్మిక విజయం లభిస్తుంది. అప్పుడు ఈ ప్రపంచంలోని బాధాకరమైన నిరాశల నుండి విముక్తి లభిస్తుంది.

నిజమైన అన్వేషకుడు, కేవలం భగవంతునితో మౌన సంభాషణకు మాత్రమే అంకితమైన ఒక పవిత్ర స్థలాన్ని తనలో సృష్టించుకుంటాడు. గురుదేవులు పెద్ద దేవాలయాలకు తక్కువ ప్రాధాన్యతనిచ్చి, మౌన ఆరాధన మరియు దైవానుసంధానం కోసం హృదయం మరియు ఆత్మలోపల భగవంతుని ఆలయాన్ని స్థాపించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ప్రపంచం మొత్తం మనల్ని నిరాశపరచవచ్చు లేదా విడిచిపెట్టవచ్చు, కానీ మనం భగవంతునితో మధురమైన, కోమలమైన అంతరంగ సంబంధాన్ని ఏర్పరచుకుంటే, మనం ఎన్నటికీ ఒంటరిగా లేదా విడిచిపెట్టబడినట్లు భావించము. ఎల్లప్పుడూ మన ప్రక్కన ఎవరో ఒకరు ఉంటారు — నిజమైన స్నేహితుడు, నిజమైన ప్రేమ, నిజమైన తల్లి లేదా తండ్రి. మీరు దివ్యత్వాన్ని ఏ రూపంలో ఊహించుకుంటే, భక్తుడైన మీకు భగవంతుడు ఆ రూపంలోనే ఉంటాడు.

పాదపీఠిక:

* మాథ్యూ 6:33 (బైబిల్)

ఇతరులతో పంచుకోండి