నేపాల్‌లో సంభవించిన విధ్వంసకర వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి, తీవ్రంగా ప్రభావితమైన వారందరికీ మా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాము. ఈ విషాదంలో కొట్టుకుపోయిన తమ ప్రియమైనవారిని తలచుకుంటూ ఎన్నో కుటుంబాలు, సంఘాలు ఊహించలేని దుఃఖాన్ని ఎదుర్కొంటున్నాయి, అలాగే ఇంకా ఆచూకీ తెలియని వారి కోసం లెక్కలేనంత మంది ఎదురుచూస్తున్నారు. ఈ విపత్తు గురించిన వార్త తెలిసినప్పటి నుండి, మన అధ్యక్షులు శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరితో సహా, వై.ఎస్.ఎస్. మరియు ఎస్.ఆర్.ఎఫ్. ఆశ్రమాలకు చెందిన గురుదేవుల సన్యాసులు, సన్యాసినుల యొక్క ప్రార్థనలు ప్రభావితమైన వారందరికీ, అలాగే నేపాల్ మరియు ఆ ప్రాంతమంతటా ఉన్న గురుదేవుల ప్రియమైన, అంకితభావంగల భక్తులందరికీ గాఢంగా ప్రవహిస్తున్నాయి.
ఒక పవిత్రక్షేత్రం వైపు విశ్వాసంతో ప్రయాణిస్తున్న యాత్రికులకు ఇటువంటి విషాదం ఎలా సంభవించిందని చాలా మంది భక్తులు సహజంగానే ప్రశ్నిస్తున్నారు. తీవ్రనష్టం కలిగిన ఇటువంటి సమయాలలో, సృష్టిని మరియు ప్రతి ఆత్మ భగవంతుని వైపు తిరిగి చేసే ప్రయాణాన్ని నియంత్రించే వ్యక్తిగత మరియు సామూహిక కర్మ యొక్క దివ్యనియమాల కార్యాచరణను పరిమితమైన మానవ బుద్ధి పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయాసపడుతుంది. కాని విశ్వాసంతో మనం తెలుసుకోగలిగేది ఏమిటంటే, ఈ పవిత్ర యాత్రను చేపట్టడం ద్వారా తమ హృదయాలు భక్తితో అనుసంధానమైన సమయంలో దివంగతులైన ప్రతి ఆత్మ ఇప్పుడు సురక్షితంగా, భద్రంగా ఉండి, ప్రకాశము, సౌందర్యం మరియు స్వేచ్ఛతో నిండిన ఉన్నత లోకానికి ఆరోహించిందని.
మర్త్య జీవితంలోని విపత్తులను, దుఃఖాలను దైవంపై ప్రేమపూర్వక విశ్వాసంతో, ఈ భూమి మన నిజమైన నివాసం కాదనే గ్రహింపుతో చూసినప్పుడు, జీవితంలోని చీకటి క్షణాలలో కూడా భగవంతుని అనంతమైన ప్రేమ, కృప మనలో ప్రతి ఒక్కరితో ఎల్లప్పుడూ ఉంటాయని, అలా ప్రతి ఆత్మ యొక్క జన్మజన్మల యాత్రను అంతిమ మోక్షానికి, పరమానందానికి అవి నడిపిస్తాయని మనం మరింత స్పష్టంగా తెలుసుకుంటాము.
ఈ విపత్తు కారణంగా అకస్మాత్తుగా, విషాదకరంగా దూరమైన వారి ప్రియతములు మరియు కుటుంబాల కోసం కరుణతో, ప్రార్థనతో మన హృదయాలను ఏకం చేద్దాం, అలాగే, దెబ్బతిన్న సమాజాలకు భౌతిక సహాయాన్ని అందించడానికి మనకు చేతనైనదంతా చేద్దాం. నేపాల్, హిమాలయ ప్రాంతం మరియు ఈ విపత్తు వల్ల ప్రభావితమైన వారందరూ భగవంతుని స్వస్థపరిచే కాంతితో ఆవరించబడి ఉన్నట్లుగా మనం కలిసి మానసిక చిత్రణ చేద్దాం. స్వామి చిదానంద గారు మనకు ఇలా గుర్తు చేశారు: “గురుదేవులు పరమహంస యోగానందగారి ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులుగా మరియు వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. ప్రపంచవ్యాప్త ప్రార్థనా మండలి సభ్యులుగా, అవసరంలో ఉన్నవారికి ఓదార్పు, బలం మరియు ఆధ్యాత్మిక ఉన్నతిని కలిగించే ప్రార్థనా ప్రకంపనలను పంపడం అనేది మనకున్న పవిత్రమైన సౌభాగ్యం మరియు బాధ్యత. గాఢమైన ధ్యానం, ప్రార్థన మరియు గురుదేవులు బోధించిన స్వస్థతా ప్రక్రియని సాధన చేయడం ద్వారా, మనం ఓదార్పు, ఆశ మరియు దివ్య స్వస్థతకు మార్గాలుగా మారగలము.”
స్వామి చిదానంద గారు ఈ ప్రార్థనను పంపుతూ మనందరినీ ఇందులో పాల్గొనమని కోరుతున్నారు: “గురుదేవులు మరియు మన మహాగురువుల కృప, ఆశీస్సులు ప్రభావితమైన వారందరినీ దివ్య రక్షణ, ఓదార్పు మరియు శాంతితో ఆవరించుగాక. ఇంకా ఆచూకీ తెలియని వారు సురక్షితంగా రక్షించబడెదరు గాక. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారు తమ దుఃఖాన్ని భరించే శక్తిని పొందెదరు గాక, గాయపడిన వారు స్వస్థత పొందెదరు గాక మరియు ఇంకా సమాచారం కోసం ఎదురుచూస్తున్నవారు ఆశతో నిలబడెదరు గాక. అన్నింటికంటే ముఖ్యంగా, జీవితంలోని అనిశ్చితుల మధ్య కూడా, మనలో ప్రతి ఒక్కరిపై భగవంతుని ప్రేమే ఏకైక అచంచలమైన సత్యమని మనలో ప్రతి ఒక్కరం గుర్తుంచుకొనెదము గాక.”
వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. ప్రపంచవ్యాప్త ప్రార్థనా మండలి
వై.ఎస్.ఎస్. మరియు ఎస్.ఆర్.ఎఫ్. ఆశ్రమాల సన్యాసులు, సన్యాసినులు అవసరంలో ఉన్న వారందరి కోసం గాఢంగా ప్రార్థిస్తూనే ఉన్నారని మేము మీకు హామీ ఇస్తున్నాము. మీ కోసం లేదా మరొకరి కోసం మేము ప్రార్థించాలని మీరు కోరుకుంటే, క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి:
యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రచురించిన వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. ప్రపంచవ్యాప్త ప్రార్థనా మండలి యొక్క ఈ క్రింది చిన్నపుస్తకాన్ని కూడా చదవమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము.




















