స్వామి చిదానంద గిరి గారి జన్మాష్టమి సందేశం – 2026

14 ఆగష్టు, 2026

ఏ వ్యక్తి నన్ను అంతటా చూస్తాడో, నాలో అన్నిటిని చూస్తాడో, అతడి దృష్టి నుండి నేను ఎన్నడూ తొలగిపోను, నాదృష్టి నుండి అతడు ఎన్నడూ తొలగిపోడు.

— గాడ్ టాక్స్ విత్ అర్జున: ద భగవద్గీత (VI:30)

ప్రియతములారా,

శ్రీ కృష్ణభగవానుని జన్మదినోత్సవం, జన్మాష్టమి యొక్క ఈ ఆధ్యాత్మికంగా ఉత్తేజపరిచే సమయంలో మీ అందరికీ ప్రేమపూర్వక శుభాకాంక్షలు. వేల సంవత్సరాల క్రితం జన్మించినప్పటికీ, దివ్యప్రేమకు సంబంధించిన ఈ గొప్ప మరియు ప్రియమైన అవతారం, తమ హృదయాలను ఆయనకు అనుగుణంగా మలచుకున్న వారికి, ఆయన తన సుందర మానవ రూపంలో భూమిపై నడిచినప్పుడు ఎంత వాస్తవంగా ఉన్నాడో, ఈనాడు కూడా అంతే వాస్తవంగా ఉన్నాడు — ఆత్మ-సాక్షాత్కార లక్ష్యం వైపు రాజయోగ మార్గంలో శ్రద్ధాళువులైన అన్వేషకులను మార్గనిర్దేశం చేయడానికి మరియు ఉద్ధరించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. మన గురుదేవులు, పరమహంస యోగానందజీ అందించిన క్రియాయోగ బోధనల ద్వారా, కృష్ణభగవానుడు అర్జునునికి ప్రసాదించిన ఆత్మ-స్వాతంత్ర్యానికి సంబంధించిన అదే పవిత్ర సూత్రాన్ని మనం కలిగి ఉన్నందుకు ఎంత ధన్యులమో కదా!

భగవద్గీతలో, ఏ వ్యక్తి తనను అంతటా చూస్తాడో, తనలో అన్నిటిని చూస్తాడో, అతడిని దేవుడు ఎన్నటికీ విడిచిపెట్టడు అని ప్రియమైన కృష్ణుడు మనకు భరోసా ఇస్తాడు. ప్రతిసారి మనం దైనందిన జీవితపు విధులు మరియు లయల మధ్య దేవుడిని స్మరించినప్పుడు, అశాంతికి బదులుగా ధ్యానాన్ని ఎంచుకున్నప్పుడు, మరియు మన దివ్య ప్రియతముడితో పాటు మరియు ఆయనకోసమే పనులను చేసినప్పుడు — ప్రతిసారి మనం ఒక నీచమైన ఆలోచనను కరుణామయమైన దానితో భర్తీ చేసినప్పుడు, ఇతరులకు దయను చూపినప్పుడు, లేదా ఒక ప్రతికూల అలవాటు యొక్క ఆకర్షణను ప్రతిఘటించినప్పుడు — మనం ఆయన సర్వవ్యాపకత్వాన్ని మన అవగాహనలోకి మరింత స్పష్టంగా ఆకర్షిస్తాము. కొన్నిసార్లు, భక్తులు దేవుడు స్పందించడానికి ముందు తాము గొప్ప ఆధ్యాత్మిక ఉన్నత శిఖరాలను చేరుకోవాలి లేదా పూర్తి స్వీయ-నియంత్రణను సాధించాలి అని భావించవచ్చు. అయినప్పటికీ, దివ్యమైన ప్రేమపూర్వక, జాగరూకతతో కూడిన భగవంతుడి నేత్రాలు ప్రతి భక్తి సమర్పణను మరియు ప్రతి చిత్తశుద్ధిగల ప్రయత్నాన్ని చూస్తాయి, ప్రతి దానిని అనంతమైన ఉదారతతో ఆదరిస్తాయి. గురుదేవ పరమహంస యోగానందజీ గాడ్ టాక్స్ విత్ అర్జున లో, భగవద్గీతకు సంబంధించిన ఆయన అనువాదం మరియు వ్యాఖ్యానంలో వెల్లడించినట్లుగా, “అత్యంత క్షణికమైన ఆలోచనను, అత్యంత స్వల్పమైన పనిని కూడా దైవసాన్నిధ్యానికి సోపానంగా ఉపయోగించవచ్చును.”

ప్రియతములారా, కృష్ణుని భక్తులను భౌతిక అనుబంధాలను త్యజించి, ఆయన దివ్య వేణునాదం యొక్క పిలుపును అనుసరించడానికి ప్రేరేపించిన విశ్వాసం మరియు ఆధ్యాత్మిక ఉత్సాహంతో మీరు మీ దైనందిన ధ్యానాలలో మరియు జీవిత అనుభవాలలో పాలుపంచుకొంటున్నప్పుడు, మీ హృదయాలు మరియు మనసులు ఆయన అనంతమైన, సర్వ-సమృద్ధివంతమైన ప్రేమ — మిమ్మల్ని ఎన్నటికీ విడిచిపెట్టని మరియు మీ ప్రతి ఆధ్యాత్మిక విజయంలో ఉప్పొంగే ప్రేమ — యొక్క సాన్నిధ్యానికి ఎప్పటికీ మరింతగా గ్రహణశీలంగా ఉండు గాక.

శ్రీకృష్ణుని జననాన్ని మనం సంతోషంగా జరుపుకుంటున్నప్పుడు, మీ ప్రతి ఒక్కరి కోసం నా ప్రార్థన ఏమిటంటే, మీ స్వంత చేతన యొక్క పవిత్రమైన ఊయలలో, ఆయన దివ్య జీవితం మరియు బోధనలు ప్రపంచానికి శాశ్వతంగా ప్రసాదించే ఆత్మ-ప్రబోధ కాంతిని మరియు ఆశీర్వాదాలను మీరు పొందగలగాలి.

జై శ్రీ కృష్ణ! జై గురు!
స్వామి చిదానంద గిరి

ఇతరులతో పంచుకోండి