“మీ జీవితాన్ని ఒక సానుకూల స్ఫూర్తితో నింపుకోవడం ఎలా?” — శ్రీ మృణాళినీమాత

21 అక్టోబర్, 2022

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్ -రియలైజేషన్ ఫెలోషిప్ యొక్క నాలుగవ అధ్యక్షురాలు మరియు సంఘమాత అయిన శ్రీ శ్రీ మృణాళినీమాత 2016 లో, వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. సభ్యులకు, మిత్రులకు వ్రాసిన ఒక లేఖ నుండి ఈ సందేశం సంగ్రహించబడింది. 2011 నుండి 2017లో గతించేవరకు, వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షురాలిగా సేవలందించిన మృణాళినీమాతగారు, మనలో సానుకూల స్ఫూర్తిని అభివృద్ధి చేసుకోమని, మరియు భగవంతుని మీద, మనమీదా విశ్వాసం కలిగి ఉండమని ప్రోత్సహిస్తున్నారు. మనం మన సమస్యలను అవకాశాలుగా మార్చుకోవాలనుకునే ప్రతిసారీ, ఈ కాలాతీతమైన ఉపదేశం ఉత్తమమైనది.

గతించిన యుగాల భౌతిక, ఆధ్యాత్మిక అజ్ఞానాన్ని విసర్జించే ప్రయత్నంలో ఈ ప్రపంచం అనుభవిస్తున్న సంక్షోభాన్ని మన రోజువారీ సంఘటనలు తరచుగా మనకు జ్ఞప్తికి తెస్తాయి. కాని పరమహంస యోగానందగారు మనం ఊర్ధ్వగతిలో ఉన్న పరిణామయుగంలో ఉన్నామని మనకు హామీ ఇచ్చారు. ఆ పైన, ఈ తాత్కాలికమైన ఒడుదుడుకుల మధ్య, అత్యంత ఆశాజనకము, విశ్వాసపూరితము అయిన దర్శనాన్ని మనముందు ఉంచారు.

మీరు మీ స్వీయజీవితాల్లో ఆ విధమైన సానుకూల స్ఫూర్తిని నిరుత్సాహాన్నీ, భయాన్నీ తిరస్కరించడం ద్వారా — భగవంతుడు అన్ని ఆత్మలకూ ప్రసాదించిన స్వాతంత్ర్యాన్ని, దైవశక్తిని ప్రతిరోజూ స్పృశించడం ద్వారా — నింపుకోగలరు.

మనం భగవంతుని ప్రతిరూపంలోనే సృష్టించబడ్డాం. తద్ద్వారా, ఈ కష్టతరమైన ద్వంద్వాత్మక నాటకంకన్నా ఉన్నతమైన సత్యంలో స్థిరంగా ఉండగల, భగవంతునిలా స్వేచ్ఛగా ఉండగల, ఆయన యొక్క సర్వోత్కృష్టమైన చైతన్యం, ప్రేమ, ఆనందాలలో ఐక్యమవ్వగల సామర్థ్యం మనలో అంతర్గతంగా ఉంది. ఆ సత్యాన్ని కనుగొనడమే మన జీవితం యొక్క లక్ష్యం, మరియు, ఈ ప్రపంచంలోని దుఃఖాలకూ, పరస్పర వైరుధ్యాలకూ, అంతిమ పరిష్కారం.

మాయ మనల్ని భౌతిక ప్రపంచానికి బంధించేందుకు ప్రయత్నిస్తూ, మన బాహ్య స్థితిగతుల ముందు మనం అల్పులుగా, దుర్బలులుగా భావించేట్లు చేస్తుంది. అది సంకల్పశక్తిని బలహీనపరిచి, మనోదృక్పథాన్ని సంకుచితం చేసే భయం, ఆందోళన, లేక ఇతర ప్రతికూల భావోద్వేగాలతో, అహాన్ని అతిసున్నితత్వంతో ప్రతిస్పందించేలా చేస్తుంది. కాని పరమహంసగారు, ఆ నిస్సహాయత అనే భ్రమని ఒప్పుకోవద్దని, దానికి ప్రత్యామ్నాయంగా, మన మనస్సులూ, సంకల్పాలూ, భగవంతుని సర్వజ్ఞమైన మనస్సుకీ, సర్వశక్తిమంతమైన సంకల్పానికీ ప్రవేశద్వారాలని, దివ్యసంకల్పం అభ్యసించమంటూ మనకు విజ్ఞప్తి చేస్తున్నారు. మనస్సుని, సంకల్పాన్ని తగిన విధంగా ఉపయోగిస్తే, మనం ఆ అంతర్గత ప్రవేశ ద్వారాలని తెరిచి ఉంచగలిగితే, కష్టతరమైన బాహ్య పరిస్థితులు కూడా మన ఆత్మ యొక్క స్వాభావికమైన ధైర్యాన్ని, సామర్థ్యాలని, వెలికితీసే అవకాశాలుగా మారుతాయి. ఈ విధంగా మన దైనందిన పరిసరాలకు మనం నిస్సహాయంగా ప్రతిస్పందించే బదులు, వాటిపట్ల ఒక సానుకూలమైన ప్రభావంతో వ్యవహరించగలం.

“వ్యక్తుల హృదయాలు మారితే, ప్రపంచం కూడా మారుతుంది,” అని పరమహంసగారు మనకు చెప్పారు. ఆ మార్పు మన స్వీయచైతన్యాన్ని నిగ్రహించుకోవడంతో ప్రారంభమవుతుంది. ప్రతిరోజూ ధ్యానం చేయండి; మరియు ఆయన ఉపదేశాలలోని ప్రోత్సాహకరమైన, పునరుజ్జీవకారకమైన సత్యాలను కొన్నింటిని ప్రతిరోజూ గ్రహించండి. ఆ విధంగా మీరు, భగవంతునిపైన, మీపైన, మీ విశ్వాసాన్ని బలపరుచుకుంటారు. ఆ పైన, మీ జీవితాలను, ఆయన సనాతనమైన సూత్రాలతో అనుసంధానం చేసేందుకు ప్రేరణని దృఢపరుచుకుంటారు.

మీ హృదయంలో దివ్యసామరస్యానికి — చిత్తశుద్ధితో జీవించేందుకు, ఇతరులతో కరుణ, అవగాహన, వివేకంతో ప్రవర్తించేందుకు — ప్రథమస్థానం ఇవ్వడానికి మీరు నిర్ణయించుకున్నప్పుడు, ఈ ప్రపంచంలో వేదనకి, విభేదాలకి ప్రధాన కారణమైన స్వార్థాన్ని, మరియు అది పెంపొందించే ఒంటరితనాన్ని, కలహాలను తొలగిస్తున్నారని తెలుసుకోండి.

ఇతరులతో పంచుకోండి