స్వామి చిదానంద గిరి గారి నుండి 2026 గురు పూర్ణిమ సందేశం

14 జూలై, 2026

మానసికంగా తనతో అనుసంధానంలో ఉన్న శిష్యులకు, గురువు తన ద్వారా ప్రవహించే దైవ ప్రకాశాన్ని ప్రసరింపజేస్తారు. భక్తుడు గాఢమైన మానసిక ఏకాగ్రతతో తన గురువుకు ప్రార్థనలు పంపితే, గురువు వాటిని స్వీకరించి, అదే విధంగా తిరిగి అవసరమైన సహాయాన్ని నిశ్శబ్దంగా పంపిస్తారు.

— శ్రీ శ్రీ పరమహంస యోగానంద

ప్రియతములారా,

మీ అందరికీ గురుపూర్ణిమ శుభాకాంక్షలు. ఈ పవిత్రమైన రోజున, యుగయుగాలుగా దైవ సాక్షాత్కార జ్యోతిని ప్రకాశవంతం చేస్తున్న దైవజ్ఞానులైన గురువులందరికీ మన కృతజ్ఞతలను సమర్పిస్తూ, మన ప్రియమైన గురుదేవులు, శ్రీ శ్రీ పరమహంస యోగానందగారికి మన ప్రగాఢమైన కృతజ్ఞతలను తెలియజేయడానికి ఏకమవుదాం. జగద్గురువుగా ప్రపంచానికి ఆయన చేసిన విశిష్టమైన సేవలకు, ఇంకా, వ్యక్తిగతంగా మన ఆధ్యాత్మిక వికాసానికి ఆయన చూపే ప్రేమపూర్వకమైన, నిరంతర పర్యవేక్షణకు మనం ఆయనను గౌరవిస్తాము. ఆయన భగవంతుడికి ఒక దివ్య వాహకముగా పనిచేస్తూ, మనల్ని మార్గనిర్దేశము చేస్తూ, మేల్కొలుపుతూ మన ముక్తికి పాటుపడుతున్నారు.

గురూజీ యొక్క విజయవంతమైన జీవితం మరియు ఆయన పరివర్తనాత్మక బోధనల స్ఫూర్తిని, ఆదర్శాన్ని పొందడం మన గొప్ప అదృష్టం. వాటి ద్వారానే ఆయన మన ఆంతరిక ప్రకాశాన్ని ఆవిష్కరించే తాళాలను మనకు ప్రసాదించారు. ఆయన అనుగ్రహపు నిరంతర ప్రవాహానికి మన హృదయాలను మరింత సంపూర్ణంగా తెరిచి, పవిత్రమైన క్రియాయోగ సాధనకు మనల్ని మనం అంకితం చేసుకున్నప్పుడు, ఆయనతో మన అనుసంధానం గాఢమవుతుంది మరియు ఆయన ఉనికి మన దైనందిన జీవితాలలో ఒక సజీవ, స్పష్టమైన వాస్తవంగా మారుతుంది. ఆ ఉనికిని మనం స్వీకరించే తత్వం ద్వారా మరియు ఆయన బోధనలలోని ప్రతి ఆలోచనా రత్నం నుండి ప్రవహించే పవిత్ర శక్తి ద్వారా, ఆయన భౌతిక రూపంలో ఈ భూమిపై నడిచినప్పుడు ఎలాగైతే నిత్యమూ జీవిస్తూ, ఎల్లప్పుడూ సమీపంలోనే ఉండేవారో, అలాగే ఉంటారు. ఆయన మనల్ని వియోగమనే స్మృతి నుండి మేల్కొల్పి, మనలోనే ప్రకాశించే దైవ కాంతిని గుర్తించడంలో సహాయపడతారు.

గురుదేవుని పాదాల చెంత మనం సమర్పించగల గొప్ప కానుక ఏమిటంటే, “మౌనంగా ఉండే దేవుని వాక్కు” అయిన ఆయన పట్ల మన వినయపూర్వకమైన స్వీకరణశక్తి, అంకితభావంతో కూడిన ఆధ్యాత్మిక కృషి, మరియు అచంచలమైన, హృదయపూర్వకమైన భక్తిశ్రద్ధలు. ఆయన నిరంతర ఆశీస్సుల పవిత్ర ప్రవాహం మీ చైతన్యాన్ని పవిత్రం చేస్తూ, మీ హృదయాలను ధైర్యంతో, శాశ్వత ఆనందంతో మరియు మనందరినీ దైవంలో ఏకం చేసే గొప్ప దివ్య కాంతితో నింపాలని నేను ప్రార్థిస్తున్నాను. జై గురు!

భగవంతుడు మరియు గురుదేవుల అంతులేని ప్రేమ మరియు ఆశీస్సులతో,

స్వామి చిదానంద గిరి

ఇతరులతో పంచుకోండి