పరమహంస యోగానందగారి జన్మస్థలం — గోరఖ్‌పూర్

15 మే, 2025

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ మే 11, 2025న శంకుస్థాపన మరియు పునాదిరాయి స్థాపన మహోత్సవాన్ని నిర్వహించారు

ఉత్తరప్రదేశ్ (యు.పి), గోరఖ్‌పూర్ లో మన ప్రియ గురుదేవులు పరమహంస యోగానందగారు జనవరి 5, 1893న జన్మించిన స్థలం, ఇప్పుడు ఒక పవిత్ర స్మారక మందిరంగా అభివృద్ధి చేయబడుతోందనే శుభవార్త తెలియజేయడం మాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది.

మూలగృహం యొక్క చిత్రం. సుమారుగా 1990లోని చిత్రం
నూతన స్మారక మందిరం యొక్క నిర్మాణ ఆకృతి

ఎన్నో సంవత్సరాలుగా, ఇతరులకు వ్యక్తిగతంగా చెందిన ఈ ఆస్తిని మరియు మూల గృహాన్ని సంపాదించేందుకు యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.) క్రియాశీలకంగా ప్రయత్నిస్తోంది. ఈ స్వప్నం నెరవేరకుండా, మా అదుపులో లేని అనేక విషయాలు అడ్డుపడ్డాయి. ఈమధ్యనే గౌరవనీయ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ మార్గదర్శకత్వంలో ఉత్తరప్రదేశ్ పర్యాటకశాఖ దీర్ఘకాలంగా ఉన్న అడ్డంకులను అధిగమించి ఈ ఆస్తిని సంపాదించగలిగింది.

వై.ఎస్.ఎస్. సహకారంతో, శ్రీ శ్రీ పరమహంస యోగానందగారికి అంకితం చేయబడేట్లుగా ఒక స్మారక మందిరం, ఒక ప్రదర్శనశాల మరియు ధ్యాన మందిరంతో కూడిన అందమైన స్మారక కేంద్రం నిర్మించాలని ఒక ప్రణాళికను తయారు చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన ప్రియ గురుదేవుల భక్తులు మరియు స్నేహితులు, ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించి, నివాళులర్పించేందుకు మరియు ఈ పవిత్రస్థలంలో ధ్యానించేందుకు ఇది తెరిచి ఉంటుంది. భారతదేశపు దివ్య ప్రేమావతారుల జననం, జీవితం మరియు కార్యాచరణకు సంబంధించిన తీర్థయాత్రా స్థలంగా ఇది యోగ్యమైనదవుతుంది.

మే 11, 2025, ఆదివారం మధ్యాహ్నం, ఈ పావన స్థలంలో యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ బోర్డు సభ్యులు స్వామి విశ్వానంద గిరి, మరియు వై.ఎస్.ఎస్. బోర్డు సభ్యులు స్వామి ఈశ్వరానంద గిరి మరియు స్వామి చైతన్యానంద గిరితో కలిసి శ్రీ యోగి ఆదిత్యనాథ్ శంఖుస్థాపన మరియు పునాదిరాయిని స్థాపించే మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ వేడుకలో సుమారు 600 మంది స్థానిక గోరఖ్‌పూర్ ప్రముఖులు, వై.ఎస్.ఎస్. భక్తులు మరియు ప్రపంచానికి గురుదేవులు అందించిన ఆధ్యాత్మిక సేవను ఆరాధించేవారు పాల్గొన్నారు.

మూలగృహం మరమ్మత్తులు చేయలేని విధంగా పాడైపోవడంతో కూల్చివేయబడింది. మూల నిర్మాణం నుండి గురుదేవుల పవిత్ర స్పందనలతో నిండిన కొన్ని ఇటుకలను చేర్చుతూ నూతన స్మారక మందిరం సరిగ్గా అదే స్థలంలో నిర్మించబడుతుంది. నిర్మాణం వెంటనే ప్రారంభమై, సుమారు 18 నెలల్లో పూర్తవుతుందని అంచనా వేయడం జరిగింది. ఈ పావన ప్రణాళికకు సంబంధించి జరిగే నవీకరణలను వై.ఎస్.ఎస్. బ్లాగ్ లో ఎప్పటికప్పుడు మీతో పంచుకుంటాం.

పునాదిరాయిని స్థాపిస్తున్న గౌరవనీయ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి
భూమిపూజలో పాల్గొంటున్న వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. సన్యాసులు

ఇతరులతో పంచుకోండి