మీ స్థిర ప్రోత్సాహానికి ధన్యవాదములు

25 మార్చి, 2025

పేరు పెట్టనిది(9)

అమితమైన ఆనందం మరియు కృతజ్ఞతతో, గత సంవత్సర కాలంలో మనం పంచుకున్న ఆధ్యాత్మిక సహవాసాన్ని మేము గుర్తు చేసుకుంటున్నాము. వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో మీ భాగస్వామ్యం, మీ హృదయపూర్వక సందేశాలు, సేవ మరియు ఆర్థిక తోడ్పాటు, గురుదేవులు శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి పట్ల కృతజ్ఞతతో మా హృదయాలను నింపుతోంది; ఆయన మనందరినీ కలిపి తన దివ్య ఆలింగనంలో హత్తుకున్నారు.

ఈ సంవత్సరమంతా మీరు చూపిన నిరంతర దాతృత్వానికి మరియు ప్రోత్సాహానికి మేము మా గాఢమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇది మన గురుదేవుల పవిత్ర కార్యాచరణను ఈ క్రింది రంగాలలో ముందుకు తీసుకువెళ్ళడానికి మాకు సహాయపడింది:

గురుదేవుల బోధనల వ్యాప్తిని విస్తరించడం

  • యోగదా సత్సంగ పాఠాలు యొక్క నూతన ప్రచురణ ఇప్పుడు హిందీ, తమిళం, తెలుగులో అందుబాటులో ఉన్నాయి, బెంగాలీ మరియు కన్నడ అనువాదాలు జరుగుతున్నాయి.

  • ఒక యోగి ఆత్మకథ ఆడియో పుస్తకం గుజరాతి మరియు మలయాళంలో ఇప్పుడు అందుబాటులో ఉంది, మరియు దీని ఈ-పుస్తకం బెంగాలీ, ఒడియా మరియు నేపాలీలో విడుదలయ్యింది. సత్యాన్వేషకులు, గురుదేవుల బోధనలను తమ మాతృభాషలోనే చదివేందుకు సౌలభ్యం కల్పిస్తూ అనేక వై.ఎస్.ఎస్. పుస్తకాలు వివిధ భారతీయ భాషల్లో ప్రచురించబడ్డాయి.

నూతన వై.ఎస్.ఎస్. ప్రచురణలను ఇటీవలి భారతదేశ పర్యటనలో స్వామి చిదానందగారు విడుదల చేశారు

భక్తులకు మరింత ఆధ్యాత్మిక ప్రోత్సాహం

వై.ఎస్.ఎస్. భక్తులకు తమ సాధనలో సహాయ పడేందుకు అనేక ప్రత్యేక కార్యక్రమాలను గత సంవత్సరంలో వై.ఎస్.ఎస్. ప్రారంభించింది, అదే సమయంలో గురుదేవుల సందేశాన్ని వేలాదిమంది నూతన అన్వేషకులకు పరిచయం చేసింది.

ప్రత్యేక కార్యక్రమాలు:

  • మన గౌరవనీయ అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక అధిపతి అయిన శ్రీ శ్రీ స్వామి చిదానందగారి బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, నోయిడా మరియు ఖాట్మండు పర్యటన వేలాదిమంది భక్తులకు స్ఫూర్తినిచ్చి ఉన్నతి చేకూర్చింది.

    ఒక భక్తుడు ఇలా వ్రాశాడు: “స్వామి చిదానందగారి సాన్నిధ్యంలో ఉండటమంటే—ఊరట, ఉన్నతి, మరియు గాఢమైన రూపాంతరణ చేకూర్చే—సూర్యుడి వెచ్చదనంలో నిలబడినట్లు అనిపించింది….ఆయన పర్యటన నాలో శాంతి మరియు స్పష్టతను జాగృతం చేసింది, నేను మరింత కేంద్రీకృతంగా మరియు సమన్వయంగా ఉండేందుకు అది నాకు సహాయం చేసింది.”

  • అదే విధంగా, 2025 కుంభమేళా వద్ద ఉన్న వై.ఎస్.ఎస్. శిబిరంలో బస చేయడం ద్వారా వేలాదిమంది ప్రయోజనం పొందారు. ఒక భక్తుడు ఇలా తెలిపారు: “అంతర్గతంగా నాలో ఉన్న నిరుత్సాహం, బాధలు మొదలైనవాటిని తొలగించుకోవడానికి నేను కుంభమేళాకు వెళ్ళాలనుకున్నాను. వై.ఎస్.ఎస్. శిబిరంలో మూడు-రోజులపాటు నివసించి తిరిగి వెళ్ళాక, నేను ఆ విషయంలో సాఫల్యం పొందడమేగాక, గురుదేవుల కృపతో నా హృదయం దివ్యప్రేమతోను మరియు అమితమైన ఆనందంతోను నిండిపోయింది. గురుదేవుల ప్రేమతో ప్రకాశిస్తూ ఎంతో జాగ్రత్తగా మా నివాసాన్ని సుఖప్రదం చేసిన సన్యాసులకు మరియు స్వచ్ఛంద సేవకులకు ధన్యవాదాలు.”

2025 కుంభమేళా వద్ద వై.ఎస్.ఎస్. శిబిరం

ఆశ్రమాలను ఆధ్యాత్మిక పవిత్ర స్థలాలుగా అభివృద్ధి చేయడం

వై.ఎస్.ఎస్. చెన్నై ఆశ్రమం వద్ద జన్మోత్సవ వేడుకలు

శాంతి మరియు దివ్య పునరుత్తేజానిచ్చే పవిత్ర స్థలాలుగా వై.ఎస్.ఎస్. ఆశ్రమాలు కొనసాగుతున్నాయి, మీ తోడ్పాటుకు ధన్యవాదాలు:

  • సంవత్సరం పొడవునా సన్యాసులు నిర్వహించే ఏకాంత ధ్యాన వాసాలు, సంగమాలు మరియు ధ్యాన కార్యక్రమాలతో చెన్నై ఏకాంత ధ్యాన వాసం అధికారికంగా ఒక పూర్తిస్థాయి ఆశ్రమంగా నియుక్తమైనది.

  • భక్తులకు ప్రశాంతమైన మరియు సౌకర్యవంతమైన బసను నిశ్చయపరుస్తూ రాంచీ మరియు దక్షిణేశ్వరం ఆశ్రమాలలోని అతిధి సౌకర్యాలు నవీకరించబడ్డాయి.

  • అత్యాధునికమైన ఆడియో-వీడియో వ్యవస్థలతో, సౌకర్యవంతంగా కూర్చునే ఏర్పాట్లతో, ఎయిర్-కండిషన్ ఏర్పాటుతో అన్ని వాతావరణాలకు అనుకూలమైనదిగా రాంచీ ఆడిటోరియం పునరిద్ధరించబడింది.

  • 2024లో ప్రారంభించబడిన రాజమండ్రి సాధనాలయం, ఆధ్యాత్మిక చింతనకు మరియు సాధనకు ఒక ప్రశాంతమైన ఏకాంత ధ్యాన వాసంగా ఇప్పుడు సేవలందిస్తోంది.

ధార్మిక మరియు మానవతావాద కార్యకలాపాలు

మీ సహాయంతో భారతదేశమంతటా వై.ఎస్.ఎస్. ఔషధశాలల్లో ఉచిత వైద్య సమాలోచనలు మరియు మందులు వేలాదిమంది పేదలకు ఏర్పాటు చేయడం జరిగింది, ధన్యవాదాలు. మన వై.ఎస్.ఎస్. విద్యా సంస్థలలో నిరుపేద కుటుంబాల విద్యార్థులకు మా తోడ్పాటును కొనసాగిస్తున్నాం మరియు అవసరంగల ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకార వేతనాలు మరియు విద్యా సహాయం కూడా అందిస్తున్నాము.

మీ మద్దతును గాఢంగా ప్రశంసిస్తున్నాము

గురుదేవుల కార్యాచరణను కొనసాగించడంలో మీ ప్రార్థనలు, భాగస్వామ్యం, మరియు సహకారాలు ఎంతో కీలకమైనవి. మీ నిరంతర మద్దతు క్రియాయోగం యొక్క ఆత్మ-విమోచన బోధనలను మరింత మంది సత్యాన్వేషకులతో పంచుకోవడంలో మేము గొప్ప విజయం సాధించేందుకు మాకు వీలు కల్పిస్తుంది.

పరమహంస యోగానందగారు ఇలా అన్నారు, “తమ సాఫల్యతను, దైవసాక్షాత్కారానికి సంబంధించిన అంతిమ అనుభవాలను దైవసాక్షాత్కార మార్గంలోని ఇతరులతో పంచుకోకుండా సాధువులలోని గొప్పవారు కూడా సంపూర్ణ విముక్తి పొందలేదు.”

మనం ముందుకు కొనసాగుతున్న కొద్దీ, భగవంతుడు మరియు మన ప్రియ గురుదేవుల మార్గదర్శక కాంతి మనల్ని ఉద్ధరించి రక్షించుగాక. ఈ దివ్య కుటుంబంలో మీ పాత్రను మేము గౌరవిస్తాము మరియు ఈ పవిత్ర కార్యంలో కీలకపాత్ర పోషిస్తూనే ఉండమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.

దివ్య స్నేహంలో,
యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా

ఇతరులతో పంచుకోండి