“ఆ వెదురు వేణువు” — గురుచరణ్

10 మార్చి, 2023

2018లో యోగదా సత్సంగ పత్రికలో ప్రచురించబడిన ఒక భారతదేశపు సాంప్రదాయక కథ తిరిగి పునరావృతం చేయబడింది.

ఒక మధ్యాహ్న సమయం తరువాత, బృందావనం సమీపంలోని అటవీ ప్రాంతంలోని ఒక డొంక వద్ద ఉన్న కదంబ వృక్షం నీడ కింద కూర్చుని కృష్ణుడు తన మురళిని (వెదురుతో తయారుచేసిన వేణువు) వాయించడం ప్రారంభించాడు. ఆకుల మధ్యలో నుండి బంగారు కాంతి ప్రసరిస్తోంది. నెమళ్ళు మధ్యలో ఆగి, తలలు తిప్పి మంత్రముగ్ధులను చేసే రాగాన్ని వింటున్నాయి. కిలకిలారావాలు చేసే పక్షులు నిశ్శబ్దమైపోయాయి. జింకలు పొదల్లోంచి చూసి, వాటి చెవులను కదలించకుండా ఉండిపోయాయి. ఒక ఆవు సౌమ్యంగా భగవంతుని పాదాల వద్ద ప్రశాంతంగా వాలిపోయింది. సమీపంలోని వాగు కూడా నిర్మలంగా ప్రవహిస్తున్నట్లు అనిపించింది. ప్రకృతి అంతా ప్రేమను ప్రసరింపజేసే పారవశ్యపు మత్తులో ఉన్నట్లు అనిపించింది.

గోపికలు కృష్ణుని వద్దకు వచ్చి ఇలా అన్నారు, “గోపాలా! మాకొక సమస్య ఉంది. దానికి కారణం నువ్వే. కాబట్టి దానిని నీవే మా కోసం పరిష్కరించాలి.”

కృష్ణుడు వాయించడం ఆపి వారి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు.

గోపికలలో ప్రధానమైన రాధ ఇలా అన్నది, “మేము నీ భక్తులం కాదా? మేము నీ గురించి నిరంతరం ఆలోచించడం లేదా, నీ కోసం దుఃఖించడం లేదా, మరియు నీ సాన్నిధ్యంలో ఉండాలని కోరుకోవడం లేదా?”

“అవును?”

“కానీ, ప్రతి రోజు చివరిలో, నీవు ఇతర ఆవుల కాపరులతో కలిసి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు మా ఇంటి ద్వారాల వద్ద నుండి నిన్ను క్షణంపాటు మాత్రమే అరుదుగా దర్శించగలుగుతాము. మేము త్వరగా బయటకు వచ్చి సాయంత్రమంతా నీతోనే ఉండాలని కోరుకుంటున్నప్పటికీ, మేము చూసుకోవాల్సిన కుటుంబాలు ఉన్నాయి. మా ఇంటి బాధ్యతలు మమ్మల్ని వెనక్కు లాగుతుంటాయి. పవిత్రమైన పర్వదినాలలో మరియు పండుగలలో, మేము సాధారణ సమయం కంటే ఎక్కువ సమయం నీతో గడిపే అవకాశం కలుగుతుంది. కానీ, అది సరిపోదు. నీ నిరంతర సాన్నిధ్యం లేకుండా మా ఆత్మలు శుష్కించిపోతున్నాయి.”

కృష్ణుడు చిరునవ్వు నవ్వి, వారిని కూర్చోమని సైగ చేస్తూ మరలా తన వేణువును అందుకున్నాడు. ఆయన రాగం వారి హృదయాలను పరవశింపజేసి మరియు వారి భారాలను ఉపశమింపజేసింది.

గాఢమైన దివ్య సంసర్గంలో, వారు తమ శరీరాలను, కుటుంబాలను మరియు బాధ్యతలను మరచిపోయారు. తమ ప్రియమైన భగవంతునితో ఉన్న ఈ పరిపూర్ణ క్షణానికి మించిన జీవితం ఉందని వారు మరచిపోయారు.

గుమిగూడే సంధ్యా నిశ్శబ్దంలోకి ఆఖరి స్వరములు మసకబారుతుండగా, ఒక నిముషంలో శాశ్వతత్వం గడిచిపోయినట్లు అనిపించిన తర్వాత, గోపికలు తాము కృష్ణుడిని విడిచివెళ్ళే సమయం ఆసన్నమైందని దుఃఖంతో విలపించారు.

వాళ్ళు ఇలా అన్నారు, “నీ మురళి పట్ల మేము అసూయగా ఉన్నాం. నీవు దానిని ఎప్పుడూ విడిచి ఉండవు. నీవు ఎక్కడికి వెళ్ళినా దానిని నీ కరకమలాలలో ఉంచుకుంటావు. నీవు దానిని నీ పెదవులపై ఉంచి, హృదయాన్ని కదిలించే రాగాలను ఆలపిస్తావు. నీవు నిద్రించే సమయంలో కూడా దానిని నీ వక్షస్థలం మీద పెట్టుకుని నిద్రపోతావు. నీ మురళి నిన్ను ఎన్నడూ విడువనప్పుడు మేము నీ సాన్నిధ్యాన్ని ఎందుకు విడిచిపెట్టాలి?”

“ఎందుకో నేను మీకు చెబుతాను,” అని భగవాన్ కృష్ణుడు ఇలా ప్రతిస్పందించాడు: “నా మురళి యొక్క కథను నేను మీకు చెప్పబోతున్నాను.”

గోపికలందరూ అత్యంత శ్రద్ధతో ఉన్నారు. చివరిగా, దాని రహస్యం ఇదే!

“ఒకరోజు నేను వెదురు మొక్క దగ్గరికి వెళ్ళి అడిగాను, ‘నేను ఏది అడిగినా ఇస్తావా?’ అని. వెదురు ఇలా సమాధానం చెప్పింది, ‘తప్పకుండా, మీ కోరికే నాకు ఆజ్ఞ. మీరు విశ్వ ప్రభువుతో ఒక్కటిగా ఉన్నారు. మీకు సేవ చేయడం నా అదృష్టం.’

“నేను అన్నాను, ‘అది బాధ కలిగిస్తుంది. ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం నేను నిన్ను నరకవలసి ఉంటుంది.’

“‘ఈ ప్రత్యేక ప్రయోజనాన్ని తీర్చే వేరే మార్గమేమీ లేదా?’ అని ఆ వెదురు అడిగింది.

“‘లేదు,’ అని నేను చెప్పగా, నరకడానికి వెదురు అంగీకరించింది. నేను ఒక దెబ్బ కొట్టాను, అది నొప్పితో కేకలు వేసింది. నేను దాని మూలాల నుండి వేరు చేయబడే వరకు కొట్టడం కొనసాగించాను. అప్పుడు నేను దానిని కత్తితో ఒక రూపంలో తయారుచేశాను మరియు ఒక పదునైన పరికరంతో లోపలి నుండి బోలుగా చేశాను. తరువాత, నేను దానిలో చాలా రంధ్రాలు వేశాను. అప్పుడు గరుకుగా ఉన్న దాని అన్ని అంచులను నేను నునుపుగా చేశాను. వెదురు వణికిపోయి, కంపించిపోయింది, కానీ ఎప్పుడూ ఫిర్యాదు మాత్రం చేయలేదు. శరణాగతి చెందడం ద్వారా, అది నా సంగీతానికి సరైన వాద్య పరికరంగా నా చేతుల్లోకి మారిపోయింది. దాని సహాయంతో, నేను ఇప్పుడు మొత్తం ప్రపంచాన్ని భ్రాంతికరమైన-మాయా నిద్ర నుండి మేల్కొల్పుతున్నాను. నా ఉద్దేశ్యాన్ని నెరవేర్చడానికి సహాయం చేయడంతో, అది నాకు ప్రియమైనదిగా మారింది. అందువల్ల, నేను దానిని ఎప్పటికీ విడిచి ఉండను.”

గోపికలు ఇప్పుడు అర్థం చేసుకున్నారు: మురళి తన అహాన్ని వినయంతో విడిచిపెట్టి, భగవంతుని సంకల్పానికి అనుగుణంగా తన జీవితాన్ని సమర్పించడం ద్వారా భగవాన్ కృష్ణుడితో విడదీయరానిదయ్యింది. భగవంతుడు తన మంత్రముగ్ధమైన శ్రావ్యమైన స్వరాలను వారి ద్వారా దోషరహితంగా వాయించేలా వారు కూడా దివ్య సాధనాలుగా మారాలి. అప్పుడు వారు కూడా తమకు ఆయనతో విభజన లేదని తెలుసుకుంటారు.

ఇతరులతో షేర్ చేయండి