వై.ఎస్.ఎస్. సమాచార లేఖ మరియు విజ్ఞప్తికి స్వాగతం — జనవరి 2023

మీ హృదయాలలో కేవలం దయ మరియు శాంతిని శాశ్వతంగా స్థాపించుకోండి. ఇతరులకు మీరే ఉదాహరణగా నిలిచి ప్రేమతో వారికి సహాయం చేయండి.

 

— శ్రీ శ్రీ పరమహంస యోగానంద

ప్రియమైన దివ్యాత్మస్వరూపా,

నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ గొప్ప స్వప్నాలు మరియు ఆకాంక్షలు సాధించడానికి ఈ సంవత్సరం మీకు నూతన ఉత్సాహాన్ని మరియు దృఢ సంకల్పాన్ని కలుగజేయాలని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాము.

రెండేళ్ల సుదీర్ఘ విరామం తరువాత, మేము గత సంవత్సరం మార్చిలో క్రమంగా ఆశ్రమాలను మరియు కేంద్రాలను తిరిగి తెరిచి, వ్యక్తిగత కార్యక్రమాలను ప్రారంభించినప్పుడు, ఆశ్రమాలను తిరిగి సందర్శించిన మిమ్మల్ని కలిసి, చిరునవ్వు చిందిస్తున్న మిమ్మల్ని చూడడం మాకు చాలా ఆనందాన్ని కలిగించింది. మహమ్మారి సవాలు విసురుతున్న సమయంలో ధైర్యం మరియు విశ్వాసంతో కూడిన మీ కథలను వింటున్నప్పుడు, మన ఆధ్యాత్మిక బంధాలు తగ్గలేదనీ అవి మరింత దృఢంగా పెరిగాయని మేము గ్రహించాము, ఎందుకంటే కష్ట సమయాలను మనం దేవుని పట్ల మరియు గురువుల పట్ల మనకున్న ప్రేమ మరియు విశ్వాసంతో ఐక్యంగా ఎదుర్కున్నాము.

ఈ క్రింది పుటలలో, గత సంవత్సరంలో గురుదేవుల పవిత్ర కార్యం ఎలా అభివృద్ధి చెందుతూ ఉందో మీకు తెలియజేస్తున్నాం — అవి ఏమిటంటే:

  • భారతీయ భాషలలొ వై.ఎస్.ఎస్. పాఠాలు విడుదల చేయటం
  • ఆన్‌లైన్/వ్యక్తిగత కార్యక్రమాలను మేము పెద్ద సంఖ్యలో అందించగలగటం
  • దీనులు మరియు నిరుపేదలను చేరుకోవటం

వివిధ ఆశయాలను కూడ మేము విజయవంతముగా పూర్తి చేశాము: 

  • రాంచీలోని జగన్నాథ్‌పూర్‌ విద్యా సంస్థ ఆవరణలోని సదుపాయాల ఆధునీకరణ, 
  • మన సేవాశ్రమ ధార్మిక ఆసుపత్రి మరియు రాంచీలోని ప్రధాన వంటశాల-భోజనశాల సౌకర్యాల పునరుద్ధరణ.

వై.ఎస్.ఎస్. దక్షిణేశ్వరం ఆశ్రమానికి ఆనుకొని ఉన్న స్థిరాస్తిని సమకూర్చుకున్నామన్న సమాచారాన్ని మీతో పంచుకోవడం మాకు ఎంతో సంతోషాన్ని కలుగజేస్తోంది.

జీవితాలలో పరివర్తన తీసుకొచ్చే మన ప్రియ గురుదేవుల బోధనలను దప్పికగొన్న ఆత్మలకు అందించే కార్యంలో మీరు మాకు అందిస్తున్న ప్రేమ, ప్రోత్సాహం మరియు ప్రార్థనలకు దయచేసి మా హృదయపూర్వక కృతజ్ఞతలను స్వీకరించండి. మా దైనందిన ధ్యానాలలో, ప్రార్థనలలో మరియు భగవంతుడు, గురుదేవుల పట్ల మా ఐక్యమైన ప్రేమలో మిమ్మల్ని తలుస్తాము. మహాత్ముల ఆశీస్సులు మరియు ప్రేమను మీ జీవితాలలో మరింత స్పష్టముగా అనుభవించెదరుగాక.

దివ్య స్నేహంలో,

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా

సదుపాయాల అభివృద్ధి

రాంచీలోని జగన్నాథ్‌పూర్‌లో వై.ఎస్.ఎస్. విద్యా సంస్థలు 

వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. యొక్క పూజ్యనీయ అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక అధిపతి స్వామి చిదానందగారు జనవరి 29, 2023న రాంచీలోని జగన్నాథ్‌పూర్‌లో యోగదా సత్సంగ విద్యావరణలో నూతన సదుపాయాలను అంకితం చేశారు. అత్యాధునిక సౌకర్యాలతో స్థాపించిన ఈ పాఠశాల ప్రకృతి సాన్నిధ్యంలో అభ్యాసం అనే శ్రీ పరమహంస యోగానందగారి ప్రాచీన గురుకుల సూత్రాలకు అనుగుణంగా రూపొందించడం జరిగింది.

ప్రపంచవ్యాప్తంగా యోగ శాస్త్రానికి కాలాతీతమైన ప్రాచుర్యం కలిగించినందుకు మరియు ఆయన యొక్క ఉన్నత ఆధ్యాత్మిక స్థాయిని గుర్తిస్తూ భారతదేశ ప్రభుత్వం మన గురుదేవులైన పరమహంస యోగానందగారి స్మారకార్థం 125వ జయంతి వార్షికోత్సవాన్ని నాలుగు సంవత్సరాల క్రితం నిర్వహించింది. ఈ ప్రణాళిక కింద మంజూరు చేయబడిన అనేక కార్యక్రమాలలో ఒకటి, యోగదా సత్సంగ పాఠశాల కోసం కొత్త భవన సముదాయం మరియు రాంచీలోని జగన్నాథ్‌పూర్‌లో యోగదా సత్సంగ విద్యా సంస్థల (YSEI) సముదాయంలోని కళాశాల మరియు పాఠశాల, రెండింటి ఉపయోగార్ధం ఒక పెద్ద బహుళార్ధసాధక హాలు నిర్మాణానికి  8 కోట్లు కేటాయించడం జరిగింది.

రాంచీ శివార్లలోని దీనులు మరియు నిరుపేద వర్గాల కోసం పాఠశాల మరియు కళాశాల ఏర్పాటు చేయడమైనది. చాలా మంది గిరిజన పిల్లలు కూడా ఈ ధార్మిక విద్యా సంస్థలకు హాజరవుతారు. సాధారణ తరగతులే కాకుండా, విద్యార్థులకు యోగా, క్రీడలు, నాటకం మరియు ఇతర పాఠ్యేతర అంశాలలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ మంది విద్యార్థులు మొదటి తరం నేర్చుకునేవారు.

ప్రస్తుత పాఠశాల భవనం దాదాపు 40 సంవత్సరాల క్రితం నిర్మించబడింది, పూర్తిస్థాయి భవనం కానందున మరియు దాని జీవితకాలం ముగిసినందున, భారత ప్రభుత్వం చేసిన ధన సహాయంతో మరియు ఉదార ​​భక్తుల సహకారంతో పని ప్రారంభించబడింది.

ఇందులో ఉన్న నిర్మాణ పనులు:

  • మొదటి అంతస్తులో 900 మంది కూర్చొనే సామర్థ్యం కలిగిన 10,000 చదరపు అడుగుల అత్యాధునిక బహుళ ప్రయోజనాల హాలు మరియు గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒక్కొక్కటి 2,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐదు హాలులు-తరగతి గదుల నిర్మాణం జరిగింది. ఈ భవన నిర్మాణానికి  2 కోట్లు ఖర్చు చేయడం జరిగింది.
  • కొత్త పాఠశాల సముదాయం కోసం 5 కోట్లు వెచ్చించడం జరిగింది. వాటిలో ఈ క్రిందివి ఉన్నాయి:
    • పరిపాలనా విభాగం
    • కంప్యూటర్ మరియు సైన్స్ లాబరేటరీ భవనాలు
    • సమకాలీన సదుపాయాలతో కొత్త గ్రంథాలయ భవనం
    • ఎన్.సి.సి. మరియు ఎన్.ఎస్.ఎస్. భవనాలు
    • మరుగు దొడ్లు
  • 4 కోట్ల వ్యయంతో ఒక్కొక్కటి ఆరు తరగతి గదులతో (మొత్తం 24 తరగతి గదులు) నాలుగు విభాగాలుగా నిర్మించబడ్డాయి. ఈ తరగతి గదులు ప్రత్యేకమైన రూపాన్ని కలిగి ఉంటాయి, ఇవి పుష్కలంగా సూర్యరశ్మి మరియు గాలిని ప్రసారం చేయడానికి ప్రత్యేకంగా రూపకల్పన చేయడము ద్వారా విద్యార్థులను ప్రకృతికి దగ్గరగా ఉండేలా చేస్తాయి. పాఠశాల కోసం గత సంవత్సరాల్లో మేము స్వీకరించిన ఉదారమైన ​​విరాళాల వల్ల ఈ విభాగాల నిర్మాణం సాధ్యమైంది.
  • తరగతి గదులు మరియు బహుళార్ధసాధక హాలు కోసం ఫర్నిచర్, మధ్యాహ్న భోజన భవనం, పాఠశాల పిల్లలకు సైకిల్ షెడ్డు, బహుళార్ధసాధక హాలు కోసం వేదిక, ధ్వని సంబంధిత పరికరాలు, విద్యుత్ ఫలకాలు, లాన్ వ్యవస్థ, పచ్చిక బయళ్ళు, అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు, వీధి దీపాలు వంటి లోపలి మరియు అనుబంధ పనులు, మరియు రమణీయత.

ప్రాజెక్ట్ యొక్క మొత్తం వ్యయం 22 కోట్లు. మేము ప్రభుత్వం నుండి 8 కోట్లు ధన సహాయం పొందాము. ఇప్పటివరకు ఈ ప్రాజెక్టులోని వివిధ అంశాలకు సంబంధించి అనేక మంది భక్తులు 10 కోట్ల రూపాయలను అందించారు. ఇంకా కావలసిన 4 కోట్ల లోటును భర్తీ చేయడానికి మేము మీ సహాయాన్ని కోరుతున్నాము. మీరు ఉదారతతో ఇచ్చే తోడ్పాటు ఎంతో ప్రశంసనీయమైనది.

రాంచీలోని ప్రధాన వంటశాల

వై.ఎస్.ఎస్. రాంచీ ఆశ్రమంలోని వంటశాల మరియు భోజనశాల పునరుద్ధరణ పనులు నవంబర్ 2022లో పూర్తయ్యాయి. పెద్ద భోజన ఆవరణతోపాటు, మరింత పరిశుభ్రమైన రీతిలో భోజనం తయారు చేయడానికి మరియు వడ్డించడానికి వంట సామగ్రిని నవీకరించడం జరిగింది. ఒక రెఫ్రీజరేటర్ తోపాటు నిలువ చేసే సామర్థ్యాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ మొత్తం 1.5 కోట్లతో పూర్తి చేయబడింది మరియు డిసెంబర్ 8, 2022న ప్రారంభించబడింది.

ఎక్కువమంది అన్వేషకులకు పరివర్తన చేకూర్చే గురుదేవుల బోధనలను అందించడం

తమిళం మరియు తెలుగులో వై.ఎస్.ఎస్. పాఠాల విడుదల

22 జులై, 2022న, యోగదా సత్సంగ పాఠాల కొత్త సంచిక తమిళ అనువాదాన్ని చెన్నైలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో స్వామి సుద్ధానంద గిరి విడుదల చేశారు మరియు పరిచయ పాఠం మొదటి కాపీని ప్రముఖ నటుడు, నిర్మాత, పరోపకారి, వై.ఎస్.ఎస్. భక్తుడు అయిన పద్మవిభూషణ్ శ్రీ రజనీకాంత్ అందుకున్నారు. కొన్ని నెలల తరువాత, డిసెంబర్ 3, 2022న వై.ఎస్.ఎస్. పాఠాల తెలుగు అనువాదాన్ని వై.ఎస్.ఎస్. సన్యాసులు ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో విడుదల చేశారు. పాఠాలు ఇతర భారతీయ భాషలైన హిందీ మరియు బెంగాలీలో అనువదించబడుతున్నాయి. 

ఆధ్యాత్మిక అవసరాల కోసం డిజిటల్ ప్రోత్సాహం

నవీకరించబడిన ఎస్.ఆర్.ఎఫ్./వై.ఎస్.ఎస్. యాప్ 

నవీకరించబడిన ఎస్.ఆర్.ఎఫ్./వై.ఎస్.ఎస్. యాప్ ఇటీవల ఆవిష్కరించబడింది, మీ ఆధ్యాత్మిక ప్రయాణానికి విస్తరించిన వనరుగా ఇది ఉపయోగపడుతుంది. సంతులిత ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపేందుకు ఆచరణాత్మక మార్గాలు మరియు ధ్యానం, క్రియాయోగ శాస్త్రం నేర్చుకోవాలనుకొనే ఎవరికైనా ఈ యాప్ ఉపయోగపడుతుంది. వివిధ అంశాలపై విభిన్న సమయాలతో నిర్దేశిత ధ్యానాలు, ఆన్‌లైన్‌ ధ్యాన కార్యక్రమాలకు ప్రవేశం, రాబోవు వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. కార్యక్రమాల సమాచారం, ప్రతి వారం ఆన్‌లైన్‌ స్ఫూర్తిదాయక ప్రసంగాలు, అలాగే పాఠాల విద్యార్థులకు తమ మొబైల్ మరియు కంప్యూటర్ లలో వై.ఎస్.ఎస్. పాఠాలు మరియు అనుబంధ విషయాలకు ప్రవేశం దీనిలో లభిస్తుంది.

వై.ఎస్.ఎస్. వెబ్‌సైట్‌ వివిధ భారతీయ భాషల్లోకి అనువదించబడింది

గత సంవత్సరంలో, సన్యాసుల నేతృత్వంలోని భక్తుల బృందం వై.ఎస్.ఎస్. వెబ్‌సైట్‌ను (yssofindia.org) హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో అనువదించడానికి మరియు ప్రచురించడానికి సహాయం చేసారు — అనేక మంది పాఠకులు యోగానందగారి బోధనల గురించి మరియు క్రియాయోగ మార్గం గురించి డిజిటల్ గా తెలుసుకొనేందుకు వీలు కల్పించారు.

సామాజిక ప్రసార సాధనాలు

సెప్టెంబర్, 2021లో, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రాం మరియు ట్విటర్ లలో తన సామాజిక ప్రసార సాధనాల ఛానెళ్లను వై.ఎస్.ఎస్. ఆవిష్కరించింది. వై.ఎస్.ఎస్. బోధనలు, సమాచారం మరియు కార్యక్రమాల గురించి తెలుసుకోవడానికి భక్తులు, స్నేహితులు మరియు సత్యాన్వేషకులకు ఒక సాధనంగా ఇవి ఉపయోగపడతాయి. ఇప్పటి వరకు మీరు వాటిలో చేరకపోతే, ఈ ఛానెళ్లలో చేరమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.(మా హ్యాండిల్ @yoganandayss

మీ దాతృత్వంతో, మేము భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. ఆధ్యాత్మిక కుటుంబంలోని భక్తులకు సామూహిక ధ్యానాలు, స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు మరియు భగవద్గీతపై ఉపన్యాసాలు వంటి ఆన్‌లైన్ కార్యక్రమాలతో ప్రోత్సహిస్తూనే ఉన్నాము. 

సేవా స్ఫూర్తి

“విశాలమైన స్వీయ ఆత్మగా మానవాళికి సేవ” అనే లక్ష్యాన్ని నెరవేర్చడానికి ముఖ్యంగా ఇటీవల కోవిడ్-19 మహమ్మారి సవాలు విసిరిన సమయంలో మరియు ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రభావితమైన భారతదేశమంతటా ఉన్న స్థానిక సంఘాలకు వస్తువులు, వైద్యం మరియు ఆర్థిక సహాయాన్ని వై.ఎస్‌.ఎస్. చురుగ్గా అందిస్తుంది, దీనులకు, నిరుపేదలకు ఉచిత వైద్య సేవలు మరియు స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది.

అల్మోరా జిల్లా ఆసుపత్రికి అంబులెన్స్ బహూకరణ

ద్వారహాట్ మరియు చుట్టుపక్కల గ్రామాలలో కొనసాగుతున్న మన స్వచ్ఛంద కార్యక్రమాలలో భాగంగా, ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లా ఆసుపత్రికి వై.ఎస్.ఎస్. ఒక ప్రాథమిక లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ ను విరాళంగా అందించింది, ఆసుపత్రికి రోగులను రవాణా చేసే సమయంలో సహాయం అందించడానికి , ఆధునిక వైద్య పరికరాలతో ఈ అంబులెన్స్ బాగా అమర్చబడింది.

రాంచీలోని  ధార్మిక వైద్య ఆసుపత్రి  సేవాశ్రమంలో సౌకర్యాల అభివృద్ధి

వై.ఎస్.ఎస్. రాంచీ ఆశ్రమంలోని సేవాశ్రమంలో — ధార్మిక ఆసుపత్రిలో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా, పాత ఆసుపత్రి భవనంలోని వైద్య సౌకర్యాలను మీ ఉదారమైన విరాళాలతో పూర్తిగా పునరుద్ధరించాము. వీటిలో: ఆపరేషన్ థియేటర్ యొక్క పూర్తి పునరుద్ధరణ; శుక్ల శస్త్ర చికిత్సల కోసం కొత్త పరికరాలు; భవనం యొక్క పైకప్పు పునరుద్ధరణ; భవనమంతా కొత్త విద్యుత్ తీగల ఏర్పాటు; శారీరక అంగవైకల్యుల కోసం ర్యాంప్ ఏర్పాటు; వ్యాధిగ్రస్తులకు సౌకర్యంగా ఉండేందుకు విశాలమైన కొత్త స్వాగత ప్రాంగణం ఏర్పాటు చేయబడినది. 

అస్సాం మరియు ఒడిశాలలో వరద సహాయక చర్యలు

రుతుపవనాలకు ముందు కురిసిన భారీ వర్షాలకు అస్సాంలోని గ్రామాలలో భారీనష్టం సంభవించింది, దీనివల్ల ఆహార పంటలకు నష్టం కలిగింది, అనారోగ్యాలు పెరిగాయి మరియు గృహాలకు పెద్దఎత్తున నష్టం ఏర్పడ్డాయి. బాధిత కుటుంబాలకు దినసరి వస్తువులు మరియు నిత్యావసర వస్తువులను అందజేయడంలో గౌహతిలోని వై.ఎస్.ఎస్. భక్తులు మన సహాయ చర్యలకు నాయకత్వం వహించారు. అలాగే, ఇటీవల ఒడిసాలోని వరదల నేపధ్యంలో పూరీ జిల్లాలోని గోపా మరియు నిమపరా ప్రాంతాలలోని వరద బాధిత నివాసితులకు 716 సౌర దీపాలను స్థానిక పాఠశాల ఉపాధ్యాయులు మరియు పరిపాలనా విభాగం సహాయంతో భువనేశ్వర్ మరియు పూరీ ధ్యాన కేంద్రాలకు చెందిన వై.ఎస్.ఎస్. భక్తులు అందజేయడం జరిగింది.

మన గురుదేవుల కార్యానికి మీరు ఇస్తున్న ప్రోత్సాహంతో ఆయన బోధనల లభ్యత భారతదేశమంతటా ఎలా విస్తరిస్తోంది మరియు ఉన్నతి ఎలా కలుగజేస్తోందో తెలుసుకోవడానికి వై.ఎస్.ఎస్. సమాచార లేఖ మరియు విజ్ఞప్తి — జనవరి 2023ని పూర్తిగా చదవమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.

వై.ఎస్.ఎస్. సమాచార లేఖ మరియు విజ్ఞప్తి — జనవరి 2023

ఇతరులతో పంచుకోండి