దైవానికి ప్రియ సంతానమైన మనలో ప్రతి ఒక్కరం, వాస్తవానికి సర్వ శక్తివంతమైన, నిత్యానందకర ఆత్మలమని పరమహంస యోగానందగారు బోధించారు.
కాని, మన జీవితం గడుస్తున్న కొద్దీ, మనం మన మన లోపాలనుకునే వాటి మీద మరియు తాత్కాలికమైన అలవాట్లపై దృష్టి పెట్టడం, తద్ద్వారా మనపై మనం నమ్మకం కోల్పోవడం సులభం కావచ్చు — మన గొప్ప కలలను సాకారం చేసుకోవడానికి, గొప్ప సాధువులు మరియు ఋషులు చెప్పిన ఉన్నత చైతన్య స్థితులను అనుభవించేందుకు మనం నిజంగా అర్హులమేనా అని ఆశ్చర్యపోతాము.
కాని నిజానికి మనం ఇప్పటికే భగవంతుడితో శాశ్వతంగా ఒక్కటై ఉన్నామని, ధ్యానం ద్వారా దైవ-చైతన్యాన్ని ఈ జీవిత కాలంలోనే పొందే సామర్ధ్యం ప్రతి ఒక్కరికీ ఉందని పరమహంసగారు తరచుగా తమ బోధనల ద్వారా మనకు గుర్తు చేస్తున్నారు.
దేవుని ప్రేమ మరియు ఆనందాన్ని మరింత గాఢంగా అనుభవించే మీ దివ్య జన్మహక్కును ఆత్మవిశ్వాసంతో కోరుకొనేందుకు, మరింత సానుకూలమైన మరియు ఆధ్యాత్మికోత్సాహంతో కూడిన దృక్పథాన్ని పెంపొందించుకునేందుకు, పరమహంసగారి శక్తివంతమైన మార్గదర్శకత్వం మీకు క్రింద లభిస్తుంది.
శ్రీ పరమహంస యోగానందగారి ప్రసంగాలు మరియు రచనల నుండి:
మీరు పరమాత్మలో ఒక భాగమని, మీ జీవితమనే నిప్పురవ్వ వెనుక అనంతత్వమనే జ్వాల ఉందని; మీ ఆలోచనలనే మిణుకు మిణుకుమనే దీపం వెనుక భగవంతుని గొప్ప జ్యోతి ఉందని గ్రహించండి.
మీరు ఎప్పుడైనా ఎంతో ఆత్రంగా కోరే దేనికన్నా లేదా ఇంకెవరికన్నా మీరెంతో గొప్పవారు. దేవుడు మీలో వ్యక్తమయినట్టుగా మరే ఇతర మానవుడిలోను వ్యక్తమవలేదు. మీ ముఖం ఇంకెవరిదోలా లేదు. మీ ఆత్మ వేరెవరిదోలా లేదు. మీకు, మీరే తగినంత సామర్థ్యమున్నవారు. ఎందుకంటే మీ ఆత్మలో అన్నిటికన్నా పెన్నిధి అయిన భగవంతుడున్నాడు.
ఏదైనా చేయడానికి మీరు అసమర్థులని నమ్మకండి. తరచుగా మీరు దేనిలోనైనా విజయం సాధించలేనప్పుడు,. దాన్ని చేయలేనని మీ మనస్సులో నిర్ణయించుకోడం వల్లనే అలా జరుగుతుంది. కాని మీరు మీ మనస్సును దాని యొక్క సాధక శక్తి గురించి ఒప్పించగలిగితే మీరు దేన్నైనా చేయగలుగుతారు.
భగవంతుడితో అనుసంధానంలో ఉండడం ద్వారా మీరు మీ స్థానాన్ని ఒక మర్త్య మానవుడి నుంచి అమరుడిగా మారుస్తారు. మీరిలా చేసినప్పుడు, మిమ్మల్ని పరిమితం చేస్తున్న బంధాలన్నీ తెగిపోతాయి. ఇది గుర్తుంచుకోవలసిన గొప్ప నియమం.
ఎన్నో ఏళ్ల క్రితం ధ్యానం చేస్తున్నప్పుడు నేను ఇలా ఆలోచించేవాడిని, “నేను ఎప్పుడైనా సమాధి స్థితి పొందగలనా?” సమాధి స్థితి ఎప్పటికీ పొందలేనని భయపడుతూ ఉండేవాడిని. కాని భయంతో కూడిన ఆ ఆలోచనలను నేను వదిలిపెట్టిన వెంటనే అది నాకు లభించింది. నాకు నేను ఇలా చెప్పుకొన్నాన్ను: “ఎంత ఆశ్చర్యం! నా మనస్సు దేవుణ్ణి కనుగొనలేనంత అశాంతిగా ఉందని నేను భయపడ్డాను.” ఎప్పుడైతే నేను దేవుణ్ణి పొందలేననే భయాన్ని వదిలిపెట్టానో, నేను ఆయన్ని కనుగొన్నాను.
దేవుడు మీకు ప్రసాదించిన సహజమైన మానసిక శక్తుల యొక్క విత్తనాలను ఎలా అభివృద్ధి చేసుకోవాలో తెలుసుకోండి….మీరు దానికి విధించిన పరిమితులను తీసివేస్తే, అది ఎంత శక్తివంతమైనదో చూసి ఆశ్చర్యపోతారు.
“ఆధ్యాత్మిక చైతన్యం యొక్క అనుగ్రహానికి మనం అర్హులమే” అనే పేరుతో 2025 ఎస్.ఆర్.ఎఫ్. ప్రపంచ స్నాతకోత్సవంలో వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు స్వామి చిదానందగారి సత్సంగంలో ఆయన పంచుకొన్న పరమహంస యోగానందగారి ఒక స్ఫూర్తిదాయక వృత్తాంతాన్ని చదవండి, మరియు భగవంతుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్ధం చేసుకోవడానికి, పరమహంసగారి విశ్వగీతాలలో ఒక గీతాన్ని ప్రగాఢంగా ఎలా సాధన చేయవచ్చో అందులో ఆయన వివరించారు.