సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ అంతర్జాతీయ ప్రధాన కార్యాలయాన్ని స్థాపించిన 100వ వార్షికోత్సవానికి 2025వ సంవత్సరం గుర్తుగా నిలుస్తుంది — ఇక్కడే ఆయన 25 సంవత్సరాల పాటు నివసించారు, బోధించారు మరియు భగవంతునితో అనుసంధానం పొందారు, దీన్ని 1925 అక్టోబరులో ఆయన అంకితం చేశారు.
లాస్ ఏంజిలిస్ నగరంలోని చారిత్రాత్మక మౌంట్ వాషింగ్టన్ కొండపై ఉన్న సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం, ఎప్పుడూ కూడా ఒక పెద్ద సంస్థ యొక్క పాలనాకేంద్రం కన్నా చాలా మహత్తరమైనది. వంద సంవత్సరాల క్రితం పరమహంస యోగానందగారు దీన్ని స్థాపించినప్పటి నుండి కూడా మదర్ సెంటర్ (పరమహంసగారు దీన్ని ప్రేమతో అలా పిలిచేవారు) ఒక ఆశ్రమంగా, ఒక “జీవన పాఠశాల”గా, ప్రపంచంలోని అన్ని మూలల నుండీ తీర్థయాత్ర చేసే వేలాదిమందికి పుణ్యక్షేత్రంగా — మరియు జ్ఞానమూర్తులైన గురుదేవుల క్రియాయోగ బోధనలకు, సత్యాన్వేషకులు మరియు భక్తిపూర్వక శిష్యుల విభిన్న ఆధ్యాత్మిక కుటుంబానికి నిలయంగా భాసిల్లుతోంది.
1925లో మౌంట్ వాషింగ్టన్ కేంద్రం అంకితోత్సవ సందర్భంగా పరమహంసగారు చేసిన స్ఫూర్తిదాయకమైన వ్యాఖ్యలు మరియు భగవంతుని అనుగ్రహం కొరకు చేసిన ప్రార్థనల నుండి సంగ్రహించినవి ఈ క్రింద పొందుపరచబడ్డాయి. ఇవి మొదట, “శరీరము, మనస్సు మరియు ఆత్మల స్వస్థతకు అంకితం చేయబడ్డ” వై.ఎస్.ఎస్. వారి యోగదా సత్సంగ పత్రిక, 2024 వార్షిక సంచికలో, “At Mt. Washington With the Master and His Disciples,” అన్న వ్యాసంలో ప్రచురించబడ్డాయి.

మదర్ సెంటర్ అంకితోత్సవం సందర్భంగా ప్రసంగిస్తూ పరమహంసగారు ఇలా అన్నారు:
సత్యం యొక్క స్ఫూర్తి రాజ్యమేలే మన ఇంటికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఇక్కడ మీరు అంధవిశ్వాసాలకు భయపడవలసిన అవసరం లేదు. అంధవిశ్వాసాలకు సంబంధించిన ఏ సిద్ధాంతమూ ఇక్కడ రాజ్యమేలదు. అంధకారాన్నంతటిని, విభజనలను సృష్టించే అన్ని మత దురభిమాన సిద్ధాంతాలను సత్యం తరిమివేస్తుంది. సత్యం యొక్క వెలుగులోకి, సహనం యొక్క వెలుగులోకి, పరస్పర అవగాహన అనే వెలుగులోకి నేను మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను.
ఈ సంస్థను నిర్మించడంలో నాకు సహాయపడిన వారందరికీ ప్రత్యేక స్వాగతం; అలాగే, ఆచరణలోను, సద్భావనలోను, ఆలోచనలోను కూడా మాతో సహకరించిన మీలో ప్రతి ఒక్కరికీ స్వాగతం చెబుతున్నాను. మీ అందరికీ నా ధన్యవాదాలు. నా వంతు నేను చేస్తున్నాను; మీ వంతు బాధ్యత మీపై ఉంది.
ఈ భూమిపై అన్ని దేశాల నుండి అంధకారాన్ని పారద్రోలి, ఈ ప్రపంచానికి జ్ఞానోదయాన్ని కలిగించే వివేకయుక్తమైనటువంటి విద్య యొక్క స్పూర్తిని పెంపొందించడంలో మనం పరస్పరం సహకరిద్దాం. ఆ స్ఫూర్తిలో మనమందరం ఏకమవుదాం, మనం చేతులు కలుపుదాం, మనం పరస్పరం సహకరించుకుందాం — భౌతికంగానే కాక, ఒక ఆత్మల యొక్క సమితిగా కూడా; అప్పుడు ఆ పునాది మీద ఒక నిజమైన సర్వదేశాల కూటమి నిర్మితమవుతుంది.
నేను ఇప్పుడు ఒక ప్రార్థనను — సాంప్రదాయకమైన ప్రార్థన కాకుండా, నా ఆత్మ నుంచి ప్రవహించే ప్రార్థన చేస్తాను. దయచేసి నిటారుగా కూర్చోండి, మీ శరీరాలను, మనస్సులను సడలించండి; ఇప్పుడు ఏకమైన హృదయాలతోను, ఆత్మలతోను ప్రార్థిద్దాము. నేను ప్రార్థిస్తున్నట్లుగా, పరిపూర్ణమైన భక్తితో, మానసికంగా నాతో కలిసి ప్రార్థించండి.
“ఓ పరమాత్మా! తేజోమయ దివ్య కాంతివైన నీవు వచ్చి, ఇక్కడ వ్యాపించు! సత్యమనే నీ కాంతితో మమ్మల్ని నింపు; నీ నిత్యప్రకాశం ద్వారా మాలోని అంధకారాన్ని సంపూర్ణంగా పారద్రోలు!
“ఓ అదృశ్యకాంతీ, అంతరంగంలో గాఢంగా శోధించేవారికి నీ దర్శనమివ్వు! ఈ పవిత్ర సందర్భంలో మాకు సహాయం చెయ్యి. మా అంతరంగంలో నీ శాశ్వతమైన ప్రకాశాన్ని వెలిగించు. అంధకారాన్ని పూర్తిగా తరిమేసే సత్యమనే జ్యోతిని పైకెత్తి పట్టుకోవడం మాకు నేర్పించు! నీ వెలుగు ఉన్న చోట అంధకారం ఉండజాలదు.
“రా, పరమాత్మా, రా! క్రీస్తు యొక్క స్ఫూర్తితో అందరు ప్రేరణను పొందేటట్లుగా, క్రీస్తు భగవంతుని బిడ్డ అయినట్లుగానే, మేమందరము కూడా సమానంగా భగవంతుని బిడ్డలమని అందరము భావించేలా — నీ సత్యమనే జ్యోతితో అందరి ఆత్మలను జ్వలింపజేయి! ఏసు, కృష్ణుడు, బుద్ధుడి వలె, నీ నిజమైన బిడ్డల రూపంలో మేము మా జీవితాలను పునర్నిర్మించుకోవడం మాకు నేర్పు! నీ ఏకైక సార్వజనీనమైన సత్యానికి వారందరు ఆదర్శవంతమైన నిదర్శనాలు.
“రా, పరమాత్మా, రా! మా ప్రతి కణం యొక్క పూజావేదికపై అవతరించు! మా రక్తాన్ని నీ శక్తితో సంపూర్ణంగా నిండిపోనివ్వు! నీ సజీవమైన ఉనికిని మేము అనుభూతి చెందేలా చెయ్యి!
“ఓ పరమాత్మా, అమరత్వం యొక్క శక్తితో మమ్మల్ని కప్పివేయి! సేవాభావంతో మమ్మల్ని కప్పివేయి! అందరి పట్ల సహనం మరియు ప్రేమభావాల స్ఫూర్తితో మమ్మల్ని కప్పివేయి! అలాగే, మా గురించి ప్రతికూలంగా ఆలోచించే వారందరి పట్ల ద్వేషాన్ని, నీ సర్వశక్తివంతమైన ప్రేమతో హరింపజేయడం మాకు నేర్పించు! ఓ పరమాత్మా, మా దృష్టిని అంధకారంపై కాక, నీ ప్రకాశంపై మరియు నీ సర్వవ్యాపకమైన ప్రేమపై ఏకాగ్రం చెయ్యి!
“నీ ప్రేమ నాలో రాజ్యం చేస్తోంది. నా ఆత్మ నీ ప్రేమతో ప్రకంపిస్తోంది! నా ఆత్మ నీ ప్రేమతో పూర్తిగా నిండియుంది! పరమానందానికి శాశ్వత మూలస్రోతమైన నీ అమర అస్తిత్వం నుండి నా ఆత్మ వికసిస్తుంది!
“నీ కాంతిని మా వద్దకు తీసుకొని రా; నిత్యనూతనమైన ఉత్సాహాన్ని మాకు తీసుకొని రా. నీ చైతన్యంలో ప్రతిరోజు ఒక నూతన ప్రారంభమవుగాక! నిత్యనూతనానందంగా — నీ ఉనికిని ప్రతిరోజు నిత్యనూతనత్వంలో మరియు వైభవోపేత మార్గాలలో అనుభూతి చెందడం మాకు నేర్పించు! గ్రోలిన వారందరూ దివ్యజీవన ప్రవాహాన్ని రుచి చూసేటటువంటి నీ సజీవ ధారను మాలో ఆవిష్కరించు!
“ఓ పరమాత్మా, మమ్మల్ని ఆశీర్వదించు! లాస్ ఏంజిలిస్ నగరాన్ని ఆశీర్వదించు! నా అమెరికాను, నా భారతదేశాన్ని, నా ప్రపంచాన్ని ఆశీర్వదించు!
“మమ్మల్ని ఆశీర్వదించు! మమ్మల్ని ఆశీర్వదించు! మమ్మల్ని ఆశీర్వదించు!”
[ఈ కార్యక్రమంలో తరువాత, మౌంట్ వాషింగ్టన్ కేంద్రం పట్ల తమ దర్శనాన్ని గురించి పరమహంసగారు ఇలా చెప్పారు:]
దీని ధ్యేయం సరియైన విద్య, ఆధ్యాత్మిక విద్య. సరియైన విద్య, మేధాశక్తిని అభివృద్ధి చేసి, శారీరక బలాన్ని పెంపొందించడమే కాక, మీ ఆత్మను సత్యం యొక్క సౌరభంతో నింపుతుంది. అది మీ ఆత్మకు జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది. శరీరాన్ని సంపూర్ణం చేసి, మనస్సును మరింత సమర్థవంతం చేసే శాస్త్రీయమైన పద్ధతులలో ఈ కేంద్రం మీకు శిక్షణ నిస్తుంది; అన్నింటి కన్నా ముఖ్యంగా, ఈ ఆధునిక నాగరికతకు అనుగుణంగా మిమ్మల్ని — మీ ఆత్మను — మలచుకునే సూత్రాలు మీకు నేర్పబడతాయి.

ఈ సంస్థ, మీరు మీ అంతరంగంలోకి వెళ్లి, భగవంతుడిని బయటకు తీసుకురావడాన్ని నేర్పిస్తుంది. భగవంతుడిని కనుగొనడానికి అడవులకు లేదా పర్వతాలకు పారిపోవాలని చాలామంది అనుకుంటారు. కాని, అన్వేషకులు నగరాలను విడిచిపెట్టి అడవులకు వెళితే, అప్పుడు మనం అరణ్యాలలో నగరాలను నిర్మించవలసి ఉంటుందని నేను ఎప్పుడూ అంటూ ఉంటాను! భగవంతునితో నేను చెప్పేటట్లుగానే, ఇక్కడ బోధించబడే ఆధ్యాత్మిక విద్య, మీకు కూడా భగవంతునితో చెప్పగలిగే సామర్థ్యాన్ని కలిగిస్తుంది:
“నీ ఉనికి సెలయేటి తీరాన ఉందని నేను భావించాను,
లేక సుదూర లోయల్లోనో, పర్వతాల మూలల్లోనో ఉందనుకున్నాను;
కాని, ప్రతి పిల్లగాలిలో నిన్నిప్పుడు చూస్తున్నాను,
ప్రశాంత చంద్రకిరణాలలో నీ ఉనికిని అనుభవిస్తున్నాను.
“ప్రతిచోటా నీవే!
అన్నిటికన్నా ఎక్కువగా, నాలోనే నిన్ను కనుగొన్నాను.
నీవెక్కడో దూరాన ఉన్నావని భావించాను,
కాని యోగదా* రాకతో ప్రతిదినం కనుగొంటున్నాను,
నా భావాల గుండా నీ శక్తిప్రవహిస్తోంది, నా ఆలోచనల్లో నీవే, నాలోను నీవే.
అక్కడ, నా అంతరంగంలో, నిన్నే అన్వేషిస్తాను, నిన్నే అనుభూతి చెందుతాను, నీతోనే అనుసంధానమవుతాను!”
అన్నింటికన్నా మిన్నగా, అత్యున్నత ఆధ్యాత్మిక ప్రమాణాలకు అనుగుణంగా జీవించే విధానాలకు ఈ సంస్థ దృష్టాంతంగా నిలుస్తుంది. ప్రతి వ్యక్తి స్వతసిద్ధంగా సంతోషంగా ఉండడానికి “జీవించడం ఎలా” సూత్రాలను అర్థం చేసుకోవడం తప్పక నేర్పాలి. ఆధ్యాత్మికంగా ఉండడం అంటే సంతోషంగా ఉండడమే; ఆధ్యాత్మికంగా ఉండనివారు ఎప్పటికీ శాశ్వతంగా సంతోషంగా ఉండలేరు. అందుకే, ఈ సంస్థ ఈ ఆలోచనను ప్రకంపిస్తుంది. నా శరీరం పోవచ్చు కాని, నా ఈ కోరిక ఎప్పటికీ ఇక్కడ ప్రకంపిస్తూనే ఉంటుంది — ఒక అదృశ్య ప్రకంపన నిరంతరాయంగా ఈ సందేశాన్ని ప్రకంపిస్తూనే ఉంటుంది: “రండి! రండి! అందరు రండి! దుఃఖంలో ఉన్నవారు, అనారోగ్యంతో ఉన్నవారు, అంధకారంలో దారితప్పినవారందరు శారీరక, మానసిక, ఆధ్యాత్మిక రోగాల నుండి స్వస్థత పొందండి!”
* అమెరికాలో తమ కార్యాచరణ యొక్క తొలి సంవత్సరాల్లో పరమహంస యోగానందగారు, భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక అభివృద్ధికి ఉద్దేశించబడిన తమ బోధనలకు “యోగదా” అనే పదాన్ని ఒక సాధారణ పదంగా ఉపయోగించేవారు; అలాగే వారి సంస్థ, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ అమెరికా అని పిలువబడేది. 1930ల తొలి సంవత్సరాల్లో, ఆయన ఈ సంస్థ యొక్క పేరును, సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ అని అనువదించారు. (భారతదేశంలో ఆయన కార్యాచరణకు ఇప్పటికీ ఈ మునుపటి పేరుతోనే పిలుస్తారు – యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా.) అప్పటి వరకు “యోగదా బోధనలు” (లేదా కేవలం “యోగదా”) అని పిలువబడినవాటిని అప్పటి నుండి, ఆయన “ఎస్.ఆర్.ఎఫ్. బోధనలు” లేదా “సెల్ఫ్-రియలైజేషన్ బోధనలు” అని పిలిచేవారు.
యోగదా సత్సంగ పత్రిక యొక్క 2025 వార్షిక సంచికలో, సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ మదర్ సెంటర్ స్థాపించిన 100 సంవత్సరాలను పురస్కరించే వ్యాసాల విభాగాన్ని చూడవచ్చు.