స్వామి చిదానంద గిరి గారి 2024 క్రిస్మస్ సందేశం

13 డిసెంబర్, 2024

ప్రియమైన ఆత్మస్వరూపా,

మీకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరమహంస యోగానంద ఆధ్యాత్మిక కుటుంబంలోని అందరికీ మిత్రులకూ నా క్రిస్మస్ శుభాకాంక్షలు. మీ హృదయము, ఆత్మ సంవత్సరంలోని ఈ పవిత్ర సమయంలో దివ్యసీమల నుండి వ్యాపిస్తున్న శాంతి మరియు ఆనంద స్పందనలతో ఉత్తేజితమవాలని ప్రార్థిస్తున్నాను.

బెత్లహామ్ లో ఏసు జన్మించి శతాబ్దాలు గడచిపోయాయి; అయినా నిత్యుడైన ఈ దివ్య ప్రేమావతారుని బోధనలు, ఆదర్శం తమ ఆత్మవిమోచక శక్తిని ఇంకా వెదజల్లుతూ, ప్రపంచం అన్నిదిశలలోని ఆత్మలను సార్వజనీన బోధలైన — నైతిక ధైర్యం, సర్వ భూతదయ, ఈశ్వరుడే కేంద్రంగా జీవించడం అన్నవి పాటించాలని ప్రోత్సహిస్తున్నాయి. మనల్ని మనం ఆ కృపకు, శక్తికి అనుసంధానంలో ఉంచుకుంటే, ఏసు తన అవతార కాలంలో ప్రదర్శించిన శారీరకస్వాస్థ్య అద్భుతాల కంటే కూడా ఆయన ఇప్పటికీ కలుగ చేస్తున్న ఆధ్యాత్మిక పరిణామాలు ఎంతో గొప్పవని మనం తెలుసుకుంటాము.

మానవజాతిని ఒక కొత్త ఉన్నత చైతన్యంలోకి పునరుజ్జీవింప చేయడానికి మహావతార్ బాబాజీతో కలిసి ఏసు పని చేస్తున్నారని పూజ్యులైన మన గురువుగారు మనకు నిశ్చయంగా తెలియజేశారు. వారిరువురూ కలిసి ప్రపంచానికి సెల్ఫ్-రియలైజెషన్ ఫెలోషిప్ /యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా బోధనలైన క్రియాయోగ బోధనలను ప్రపంచానికి అందించారు. దీని ద్వారా మనం మన చైతన్యమనే ఊయలను అనంతత్వపు క్రీస్తు శిశువు జననానికి సంసిద్ధం చేయగలుగుతాము.

మన గురుదేవులు ఒకసారి అన్నారు “మనం బాల ఏసును తన ఊయలలో నిస్సహాయంగా ఉన్నట్టుగా భావిస్తాము… అయినా ఆ చిన్ని రూపంలోనే విశ్వ తేజమైన అనంత క్రీస్తుతత్వం దాగి ఉంది.” సృష్టిలోని ప్రతి అణువులోనూ స్పందిస్తున్న ఆ సర్వవ్యాప్త క్రీస్తుచైతన్యానికి (కూటస్థ చైతన్యానికి) మన జీవితాలను ప్రకాశింపజేసి ప్రపంచాన్ని స్వస్థపరచగల శక్తి ఉంది.

మానవ జాతికి ఈ గొప్ప క్రిస్మస్ కానుకను అందించడంలో మనం చురుకైన పాత్రను ఎలా వహించగలం? ఏసు ప్రకటించిన కరుణను, సర్వాన్నీ కలుపుకొనే క్రీస్తు భావనను; లోకపు గుర్తింపు కాని, ప్రత్యేకమైన స్వీయప్రాముఖ్యం కాని అవసరం లేని నమ్రతను; మరియు తీవ్రమైన కష్టాల మధ్యలో కూడా అంతఃకరణంలో శత్రుత్వాన్ని తనకు తాకనివ్వని, సమస్తాన్నీ క్షమించగల ప్రేమను మన అస్తిత్వంలోకి లీనం చేసుకోవడం ద్వారానే. ఇక పరమహంస యోగానందగారు బోధించినట్టుగా ధ్యానంలో అంతర్ముఖమైన నిశ్చలతలో ఈశ్వరుడితో అనుసంధానంలో ఉండడం ద్వారా మనం ప్రేమ, కాంతి, అనంతత్వాల విస్తృత చైతన్యాన్ని గాఢమైన పద్ధతిలో అనుభవించగలము. అదే నిజమైన క్రిస్మస్. దాన్ని మన బాహ్య జీవితాల్లోకి పొంగిపొరలేటట్టు చేయగలుగుతాము.

ఈ పవిత్ర సమయపు నిజమైన స్ఫూర్తి—క్రీస్తు మరియు మహా గురువుల శాశ్వత స్ఫూర్తి—ఇప్పుడు మరియు నూతన సంవత్సరమంతా మీ హృదయాన్ని, గృహాన్ని నింపాలని నా హృదయపూర్వక ప్రార్థనను మీకు పంపిస్తున్నాను.

భగవంతుడు, క్రీస్తు మరియు గురువుల ప్రేమ మరియు ఆనందంలో,

స్వామి చిదానంద గిరి

ఇతరులతో పంచుకోండి