సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ అంతర్జాతీయ ప్రధాన కార్యాలయాన్ని (ఎస్.ఆర్.ఎఫ్. మదర్ సెంటర్ ను) పరమహంస యోగానందగారు 1925లో కొనుగోలు చేశారు, మరియు అదే సంవత్సరం అక్టోబర్ 25న ఆయనచే అధికారికంగా అంకితం చేయబడింది. మదర్ సెంటర్ యొక్క 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొనే నిమిత్తం, ఈ దిగువన ఉన్న అంశాలు శ్రీ దయామాతగారు కొన్ని సంవత్సరాల క్రితం మదర్ సెంటర్ ప్రార్థనా మందిరంలో చేసిన ప్రసంగం నుండి సంగ్రహించినవి. ప్రపంచమంతా వ్యాపించినటువంటి పరమహంస యోగానందగారి బోధనల మూలస్థానమైన ఈ కేంద్రం యొక్క ప్రారంభ చరిత్రను ఆమె ఇందులో గుర్తు చేసుకున్నారు. ఈ అంశాలు యోగదా సత్సంగ పత్రిక యొక్క 2025 వార్షిక సంచికలో ప్రచురించబడ్డాయి.
ఈ పోస్ట్‌లో దయామాతగారు, వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. వ్యవస్థాపకులు మరియు గురువు అయిన పరమహంస యోగానందగారిని కొన్నిసార్లు “మాస్టర్,” లేదా “గురుదేవులు” అని సంబోధిస్తారు, మాస్టర్ అనేది ఒకరి గురువును, ఆత్మాధిపత్యం సాధించిన వ్యక్తిని సూచించే గౌరవప్రదమైన పదం.
గురుదేవులు పరమహంస యోగానందగారి ప్రపంచవ్యాప్త కార్యాచరణకు సంబంధించిన వృత్తాంతం — ప్రత్యేకంగా, మౌంట్ వాషింగ్టన్‌లో మన ప్రధాన కార్యాలయాన్ని ఆయన స్థాపించడం — ప్రేమపూరిత త్యాగం మరియు దేవునిపై అచంచలమైన విశ్వాసాలకు సంబంధించినది.
వారి ఆత్మకథలో మీరు చదివినట్లుగా, 1920లో అమెరికాకు ఆయన రాబోతున్నట్లుగా ఆయనకు భగవంతుడు సమాధిలో చూపించిన రోజునే, రాంచీలోని తమ ప్రియమైన పాఠశాల మరియు ఆశ్రమాన్ని ఆయన విడిచిపెట్టారు — ఆయన్ని భగవంతుడు అడిగినదాన్ని నెరవేర్చేందుకు ఎటువంటి ఏర్పాట్లుగాని, ప్రణాళికలుగాని ఏమీ లేవు; అప్పటికప్పుడు ఆయన బయలుదేరారు. భగవంతుడికి సంపూర్ణ శరణాగతి చెందడమే ఆయన మార్గం. ఈ దేశంలో ఆయన మొదటిసారి అడుగుపెట్టినప్పుడు గురుదేవులకు ఇక్కడ ఒక్కరు కూడా తెలియదు. కాని ఆయన దివ్యోత్సాహాన్ని, చిన్నపిల్లల వలె భగవంతునిపై పూర్తిగా స్వచ్ఛమైన, సంపూర్ణమైన విశ్వాసాన్ని — మరియు ఎక్కడకు వెళ్ళినా ఆత్మలను తనవైపు ఆకర్షించే ఒక గొప్ప ఆధ్యాత్మిక ఆకర్షణశక్తిని కలిగి ఉండేవారు.
లాస్ ఏంజిలిస్ నగరానికి చేరుకోవడం
1924లో, బోస్టన్ మరియు ఇతర తూర్పు తీర నగరాల్లో బోధిస్తూ విజయవంతమైన సంవత్సరాలు గడిపిన తర్వాత, ఆయన అనేక ఖండాంతర ఉపన్యాస పర్యటనలలో మొదటిదాన్ని ప్రారంభించారు. ఈ పర్యటనలో లాస్ ఏంజిలిస్ చివరి గమ్యస్థానం; ఆయన 1925 జనవరిలో ఇక్కడికి చేరుకున్నారు.
ఆ ఉపన్యాస పరంపర ముగింపు దశలో, గురుదేవులు తనకు సహాయం చేస్తున్న కొంతమంది శిష్యులతో ఇలా అన్నారు: “దేవదూతల నగరమైన, ఈ లాస్ ఏంజిలిస్ లో ఒక కేంద్రాన్ని స్థాపించడానికి ఒక ప్రదేశాన్ని వెతుకుదాం. నేను ఇక్కడ చాలా అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రకంపనను చూస్తున్నాను.” తరువాతి సంవత్సరాలలో, ఆయన తరచుగా, ఆధ్యాత్మిక సామర్థ్యంలో లాస్ ఏంజిలిస్ అమెరికా యొక్క బనారస్ అని అనేవారు — భారతదేశంలోని ఆ పవిత్ర నగరంతో పోల్చబడడం అన్నది ఈ నగరానికి ఒక గొప్ప అభినందన.
కేంద్రానికి అనువైన స్థలం కోసం కొంత ప్రయత్నం జరిగింది. ఒక రోజు గురుదేవులు మరియు ఆయన విద్యార్థుల్లో కొందరు అమ్మకానికి ఉన్న ఒక ఆస్తిని చూడటానికి వాషింగ్టన్ పైకి దారితీసే మలుపులుగల రహదారిపైకి వెళ్లారు. ఇది శాన్ రాఫెల్ అవెన్యూపై చెక్కతో చేయబడ్డ ఒక చిన్న భవనం (ఇది తరువాత స్థానిక లైబ్రరీకి ఒక శాఖగా ఉపయోగించబడింది). మాస్టర్ ఆ చిన్న ఇంటిని ఒకసారి నిరాసక్తంగా చూసి, సరిపడదని భావించి దాన్ని వెంటనే పూర్తిగా తిరస్కరించారు. ఆయన సహచరులు ఇది ఆదర్శంగా ఉంటుందని వాదించారు, కాని గురుదేవుల దృష్టిలో వారి దృక్పథం చాలా పరిమితమైనది. ఆయన ఆలోచనా విధానం దూరదృష్టి కలిగి, విస్తృతంగా ఉండేది; ఈ కార్యాచరణ కోసం భగవంతుని మనస్సులో మేలైనది ఇంకేదో ఉందని కూడా ఆయనకు తెలుసు!
“ఈ స్థలం మనదే అనిపిస్తోంది!”
వారి తిరుగు ప్రయాణంలో పైకి వెళ్తూ, ఈ ఆవరణను దాటుతున్నప్పుడు, అది మాస్టర్ దృష్టిని ఆకర్షించింది. ఆ ఆస్తిని చూడడానికి కారు ఆపమని ఆయన పట్టుబట్టారు – ఆ పెద్ద పాత భవనం, ఒకప్పుడు చాలా సొగసైన మౌంట్ వాషింగ్టన్ హోటల్. (ఇది లాస్ ఏంజిలిస్ యొక్క పూర్వకాలంలో ప్రసిద్ధి చెందింది; రద్దీగా ఉండే నగర హడావుడి నుండి బయటపడటానికి ప్రజలు వచ్చే రిసార్ట్ ఇది. అప్పట్లో మౌంట్ వాషింగ్టన్ దాదాపు ఒక నిర్జన ప్రాంతం. ప్రజలు ఇప్పుడు ఏదైనా ఎడారి వద్దకో లేదా మరేదైనా రమణీయ ప్రదేశానికి వెళుతున్నట్లుగా సెలవులకు ఇక్కడికి వచ్చేవారు. ఆ రోజుల్లో గొప్ప టెన్నిస్ క్రీడాకారులు ఇక్కడ ప్రధాన రహదారి క్రింద ఉన్న టెన్నిస్ కోర్టులో టెన్నిస్ ప్రదర్శన పోటీలలో పాల్గొనేవారు.)
“లోపలికి వెళ్దాం,” అని గురుదేవులు అన్నారు. ఆయనతో ఉన్న భక్తుల్లో బాగా ఆచరణాత్మకంగా ఆలోచించే ఒక శిష్యుడు ఇలా అన్నాడు. “అయ్యో, మాస్టర్, మీకు అంత పెద్ద భవనం వద్దు!”
ఆయన పట్టించుకోలేదు. టెన్నిస్ కోర్ట్ పై నిలబడి, భవనం వైపు దృష్టి సారించి ఇలా అన్నారు: “ఈ స్థలం మనదే అనిపిస్తోంది!”
అప్పుడా భక్తుడు కొన్ని నిరుత్సాహకరమైన వాదనలతో అడ్డు చెప్పాడు — ఇంత పెద్ద కేంద్రం యొక్క నిర్వహణ ఖర్చులు భరించడం కష్టమని; ఒకే చోట ఎక్కువ మంది మనుష్యులు కలిసి ఉన్నప్పుడు, ప్రతి ఒక్కరూ తమ స్వంత దారిలో వెళ్లాలనుకుంటే వచ్చే సమస్యల గురించి చెప్పాడు. కాని, ఈ సమస్యలు కాక, భవిష్యత్తులోని సంభావ్యత, గురుదేవుల ఆలోచనలను దృఢనిశ్చయంతోనూ, ధైర్యంతోనూ నింపింది — భగవంతుని ఆదేశాన్ని అనుసరించి ఈ దివ్యకార్యాన్ని చేపట్టడానికి అటువంటి ధైర్యం ఎంతో అవసరం.
నిస్సంకోచంగా, ఆయన ఈ విశాలమైన ఎస్టేటును కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఉదార హృదయులైన తన విద్యార్థుల సహాయంతోను, మరియు గురుదేవులు భుజాన వేసుకున్న రెండు తనఖాలతో, 1925లో సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ మదర్ సెంటర్ ఆవిర్భవించింది….
తొలి సంవత్సరాల్లోని ఇబ్బందులు
ఈ మార్గదర్శక కార్యాచరణ ఆరంభంలో గురుదేవులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మౌంట్ వాషింగ్టన్ ఆస్తిపై తనఖా చెల్లింపు చేయవలసిన ఒక సందర్భం నాకు గుర్తుంది, అది చెల్లించడానికి మాకు డబ్బులు లేవు. అప్పట్లో మిల్వాకీ ప్రాంతానికి చెందిన ఒక గొప్ప ధనవంతుడు ఇక్కడ ఉండేవాడు. ఆయన ప్రాపంచిక వ్యక్తి అయినప్పటికీ, యోగాపై ఆసక్తి కలిగి, ఉపదేశం స్వీకరించడానికి ఇక్కడకు వచ్చాడు. తనఖా విషయంలో మాస్టర్‌కు ఈ ఇబ్బంది ఉందని ఆయనకు తెలిసి, ఒక ప్రతిపాదనతో వారిని కలిశాడు: ప్రాచ్యం నుండి వచ్చిన ఈ విశిష్టమైన బోధనను వాణిజ్యపరంగా మరింత లాభదాయకంగా మార్చడానికి మాస్టర్ ఆయనకు అనుమతిస్తే, తాను తనఖా చెల్లించడానికి డబ్బు ఇస్తానన్నాడు.
ఆ తొలినాళ్ళలో మావద్ద ఒక్కపైసా కూడా మిగిలేది కాదు. మా భోజనంలో పాలకూర సూప్ మాత్రమే ఉన్న అనేక సందర్భాలు ఉన్నాయి. తక్కువ స్థాయి బోధకులయితే అత్యవసర పరిస్థితుల్లో డబ్బు కోసం ఇటువంటి ప్రతిపాదనను అంగీకరించి ఉండేవారు — ఆ తర్వాత ఒప్పందం నుండి బయటపడే ప్రయత్నం చేసేవారెమో. కాని గురుదేవులు అలా కాదు. ఆ వ్యక్తి చేసిన ప్రతిపాదన గురించి ఆయన మాతో మాట్లాడిన సాయంత్రం నేను ఎన్నటికీ మర్చిపోలేను. ఆయన ఇలా అన్నారు, “ఇది జగన్మాత యొక్క ప్రలోభం. ఈ తనఖా యొక్క భారం నుండి, ఈ భవనం మరియు ఇక్కడ నివసిస్తున్న ప్రజలందరి సంరక్షణ భారం నుండి నన్ను విడిపిస్తానని ప్రతిపాదిస్తూ ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు; అతడికి సరేనని చెప్పడం సులభమే. కానీ నేను నా ఆదర్శాలతో రాజీపడలేను. డబ్బు కారణంగా నేను నా ఆదర్శాలను వదులుకోవడం కంటే పని ఆగిపోవడం మంచిది” అని ఆయన ఆ ప్రతిపాదనను తిరస్కరించారు.
జేమ్స్ జే. లిన్‌ని కలవడం మరియు తనఖాని చెల్లించడంలోని ఆనందం
ఈ అనుభవం తర్వాత, 1932 ఫిబ్రవరిలో, గురుదేవులు కాన్సాస్ సిటీలో వరుసగా ఉపన్యాసాలు ఇచ్చారు. హాజరైన వారిలో శ్రీ జేమ్స్ జే. లిన్ ఒకరు, ఆయన ఒక సంపన్న వ్యాపారవేత్త మరియు ఒక గాఢమైన సత్యాన్వేషకుడు. ఆయనను గురుదేవులు చూసిన క్షణంలోనే ఎన్నో జన్మల్లో తన సహచరుడైన వ్యక్తిగా ఆ భక్తుడిని గుర్తించారు. ఈయనే తదనంతర కాలంలో రాజర్షి జనకానందగా పిలువబడిన గురుదేవుల ప్రియ శిష్యుడు.
ఈ సమయానికి, తనఖాదారుడు ఉదారంగా గడువును పొడగించినప్పటికీ, గురుదేవులకు ఇంకా తనఖా చెల్లించే దారి దొరకలేదు. తన దాతృత్వం మరియు భక్తితో, రాజర్షి జనకానంద మాస్టర్‌కు ఈ ఒక్క చెల్లింపు కోసం డబ్బు ఇవ్వడమే కాకుండా, మౌంట్ వాషింగ్టన్ ఆస్తిపై ఉన్న తనఖా మొత్తాన్ని చెల్లించారు. క్రీస్తు తన ప్రలోభాన్ని మరుభూమిలో ప్రతిఘటించినట్లే, తమ ఆదర్శాల నుండి వెనక్కి తగ్గకుండా, మునుపటి ప్రలోభాన్ని మాస్టర్ ప్రతిఘటించినందు వలన, జగన్మాత గురుదేవులకు అవసరమైనవన్నీ, మరింత గొప్ప రీతిలో అందించింది.
తనఖా నుండి విడుదలై గురుదేవుల చేతుల్లోకి వచ్చినప్పుడు మేము ఎంతటి ఆనందాన్ని పొందామో! మేము టెంపుల్ ఆఫ్ లీవ్స్ వద్ద భోగి మంటలను వేసి, ఆ పత్రాన్ని మంటలకు ఆహుతి చేశాము. గురుదేవులు, ఎంతో ఆచరణాత్మకంగా ఉండడంవల్ల, వారు వంటగది నుండి చాలా బంగాళాదుంపలను తెచ్చి, వాటిని బొగ్గుల క్రింద వేశారు. తరువాత మేము మంట చుట్టూ కూర్చుని రుచికరంగా కాల్చిన బంగాళాదుంపలను తిన్నాము.
అసంఖ్యాకమైన అన్వేషకులకు పుణ్యక్షేత్రం మరియు ఆధ్యాత్మిక నిలయం
గురుదేవులకు ప్రియమైన మౌంట్ వాషింగ్టన్‌లో గడిచిన నా సంవత్సరాలను వెనక్కితిరిగి చూసుకున్నప్పుడు ఎన్నో జ్ఞాపకాలు నా హృదయాన్ని ముంచెత్తుతాయి. ఆయన దీన్ని స్థాపించడానికి తనను తాను సమర్పించుకున్నారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారి అసంఖ్యాక శిష్యులకు ఈ ఆధ్యాత్మిక నిలయాన్ని ఒక పుణ్యక్షేత్రంగా — భద్రపరచడం మనకివ్వబడిన పవిత్రమైన ప్రత్యేక హక్కు.
ఈ ఆవరణ అంతటా, గురుదేవులు సమాధిలో ధ్యానం చేశారు; అటువంటి అనేక సందర్భాలలో జగన్మాత, లేదా మన మహాగురువులు లేదా ఇతర సాధువుల సందర్శనతో ఆయన ఆశీర్వదించబడ్డారు. మౌంట్ వాషింగ్టన్ ప్రార్థనా మందిరంలో, అస్సిసికి చెందిన సెయింట్ ఫ్రాన్సిస్ యొక్క దర్శనం “భగవాన్! భగవాన్! భగవాన్!” అనే ఆయన కవితకు ప్రేరణనిచ్చింది.
క్రీస్తుతో ప్రగాఢమైన మరియు సుదీర్ఘమైన అనుసంధానం కోసం, ప్రతి సంవత్సరం ఒక రోజంతా అంకితం చేయాలనే ఆలోచనను ఆయన ఇక్కడ కూడా ప్రవేశపెట్టారు. ఆశ్రమంలో నా మొదటి క్రిస్మస్ అయిన 1931లో ప్రారంభమైన ఈ ఆచారం, మొత్తం ప్రపంచమంతటికీ మౌంట్ వాషింగ్టన్ నుండి వ్యాప్తి చెందుతుందని ఆయన ముందుగానే ఊహించారు — వాస్తవానికి అలాగే జరిగింది.
ఇతర సమయాల్లో ఆయన మమ్మల్ని సుదీర్ఘమైన ఆనందభరితమైన భక్తి గీతాలాపనలో నడిపించేవారు. అటువంటి సందర్భాలలో కొన్నిసార్లు దేవుని పట్ల ప్రేమతో ఆయన స్వరపరిచిన కొన్ని నూతన గీతాలను మొదటిసారిగా వినే భాగ్యం మాకు కలిగింది.
నిజంగా, ఆయన ఇక్కడ వదిలిన దివ్య ప్రకంపనలు తూర్పు మరియు పడమర దేశాలలో నేను సందర్శించిన అన్ని పుణ్యక్షేత్రాలలో కన్నా ప్రత్యేకమైనవి. నేను ఈ నేలపై అడుగుపెట్టినప్పటి నుండి ఇన్ని సంవత్సరాల్లో, నేను ఎప్పుడూ గొప్ప ఆనందాన్ని అనుభవించకుండా బయటకు రాలేదు.
ఎస్.ఆర్.ఎఫ్. వెబ్‌సైట్‌లో సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ అంతర్జాతీయ ప్రధాన కార్యాలయంలో వర్చువల్ యాత్ర చేసేందుకు మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. క్రియాయోగ బోధనలను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడానికి పరమహంస యోగానందగారు ఎస్.ఆర్.ఎఫ్. ను స్థాపించిన శతాబ్ది సందర్భంగా 2020లో ఈ “వర్చువల్ యాత్ర” రూపొందించబడింది.




















