హృదయపూర్వక కృతజ్ఞతలు — మీ సహాయం ఎన్నో జీవితాలను నిలబెట్టడానికి, వేలమందికి సాంత్వన ఇవ్వడానికి సహకరించింది

14 జూలై, 2021

ప్రియమైన దివ్యాత్మ స్వరూపా,

ఈమధ్య కొన్ని వారాల్లో భారతదేశమంతటా వ్యాపించిన ఇటీవలి కోవిడ్-19 మహామ్మారి రెండవ అల, ఇంతకు మునుపెన్నడూ లేని మానవతాపరమైన సంక్షోభానికి కారణమై, దేశంలోని ప్రతి వ్యక్తి యొక్క కుటుంబాన్ని, స్నేహితులను ప్రభావితం చేసింది.

వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు అందించిన సందేశం

గౌరవనీయులైన మన అధ్యక్షులు శ్రీ శ్రీ స్వామి చిదానందగిరిగారు భారతదేశ జనావళికి, ప్రపంచ వ్యాప్తంగా ఊహించరాని సవాళ్ళను ఎదుర్కొంటున్న వారికి స్వాంతనను, భరోసాను, ప్రోత్సాహాన్ని ఇచ్చే ఒక హృదయానికి హత్తుకునే చాలా సమయోచితమైన సందేశాన్ని అందించారు.

వై.ఎస్.ఎస్. కేంద్రాలు, మండలుల మొదటి అడుగు

కోవిడ్-19 మహమ్మారి రెండవ అల ప్రారంభంలో, స్వామి చిదానందగారిచే ప్రోత్సాహించబడి, స్ఫూర్తిని పొంది, భారత ఉపఖండమంతటా ఉన్న ప్రజల అవసరాలు, వారు పడుతున్న కష్టాల వలన కలిగే బాధను అనుభూతి చెందుతూ, వై.ఎస్.ఎస్. తనకు చేతనైనంతవరకూ భారతదేశంలో ఎంత ఎక్కువమందికి వీలైతే అంతమందికి సహాయాన్ని అందించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అత్యుత్తమ పద్ధతి, దేశవ్యాప్తంగా ఉన్న వై.ఎస్.ఎస్. కేంద్రాలు, మండలుల నెట్ వర్క్ లో సేవలందిస్తున్న భక్తజనులతో నిండిన మన విశాలమైన ఆధ్యాత్మిక కుటుంబం వైపు తిరగడమేనని మేము తొందరగానే గుర్తించాము. మన వై.ఎస్.ఎస్. కేంద్రాలలోని మేనేజింగ్ కమిటీలతో వీడియో సమావేశాల ద్వారా తమ సమయాన్ని, శక్తిని, వనరులను ఉదారంగా ఇవ్వడం ద్వారా ఈ ఉదాత్త ఆశయానికై సేవలందించడానికి సిద్ధంగా వందలాది స్వచ్ఛంద సేవకులైన భక్తుల సహాయాన్ని మేము నమోదు చేయగలిగాం. ఈ భక్తులు అనేకమంది ఎన్జీవోలు, స్థానిక అధికారుల సహకారంతో వై.ఎస్.ఎస్. వారి సహాయ కార్యక్రమాలను జయప్రదంగా నిర్వహించారు.

అవసరమైన వారికి ఆహారం, అనారోగ్యంతో ఉన్నవారికి మందులు, భద్రతా వస్తుసామాగ్రి, ప్రాణరక్షణ పరికరాలు ఆస్పత్రులకు, ఎన్జీవోలకు అందించడానికి చాలామంది భక్తులు తమ గృహాలలో ఉన్న భద్రతను విడిచిపెట్టి మరీ చేశారు. వేలమంది ఆర్తులకు సహాయాన్ని అందించడానికి, వారిలో చాలామందిలో ఆశాభావాన్ని పెంపొందించడానికి ఈ స్వచ్ఛంద సేవకులు చేసిన లెక్కలేనన్ని వ్యక్తిగత త్యాగాల గురించి మనమెన్నటికీ పూర్తిగా తెలుసుకోలేమేమో. భారతదేశంలోని కోవిడ్-19 సంక్షోభం శిఖరాగ్ర స్థాయికి చేరుతున్నప్పుడు ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా, అతి కొద్ది వ్యవధిలో, మనము మన సహాయకార్యక్రమాల పూర్తి పరిధిని సాధించగలిగాం.

భారతదేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ వై.ఎస్.ఎస్. నుంచి సహాయాన్ని అందుకున్నారు

ఉత్తరభారతం లోని ఉన్నతమైన హిమాలయ పర్వతాలలో ఏకాకులై పోయిన సాధువుల నుంచి దక్షిణ భారతం కొసన ఉన్న కేరళలోని గిరిజన గ్రామస్తుల వరకు, మధ్యలోని అనేక రాష్ట్రాలలోని వారికి వై.ఎస్.ఎస్. సహాయాన్ని అందించగలిగింది. ఎన్నో వేలమంది ఆర్తులకు మిక్కిలి అవసరమైన వండిన ఆహారం కాని, వండని ఆహార దినుసులు కాని మనము ఇవ్వగలిగాము. ఆస్పత్రులలో మంచాలు, పరుపులు, చక్రాల కుర్చీలు, పి.పి.ఇ. సామాగ్రి, నాణ్యమైన ఫేస్ మాస్కులు, చేతి శానిటైజర్లు, నిత్యావసర ఔషధాలు, కోవిడ్ జబ్బును తగ్గించే మందులు, పల్స్ ఆక్సీమీటర్లు, ధర్మామీటర్లు, దేశవ్యాప్తంగా విభిన్న పట్టణాల్లో పనిచేస్తున్న చిన్నా పెద్దా కోవిడ్ కేంద్రాలకు అందించిన ఎన్నో వస్తువులలో కొన్ని రకాలు.

హిమాలయాలలోని గంగోత్రిలో ఒంటరి వారైపోయిన సాధువులకు ఆహారమందిస్తున్న వై.ఎస్.ఎస్. భక్తులు

ఆక్సిజెన్ కాన్సంట్రేటర్లు, BiPAP వెంటిలేటర్లు అందించారు

కేరళలోని ఒక కోవిడ్ ఆస్పత్రికి వై.ఎస్.ఎస్. BiPAP యంత్రాలను విరాళమిచ్చింది

కొన్ని ఆస్పత్రులు తమ వార్డులను పై శ్రేణికి చెందిన కోవిడ్ చికిత్సా కేంద్రాలుగా మార్చాలనుకున్నాయి. వారికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, BiPAP వెంటిలేటర్ల మెషిన్లు వై.ఎస్.ఎస్. అందించ గలిగింది. కేరళలోని ఒక ఆస్పత్రిలో ఆక్సిజెన్ అవసరమైన రోగులకు చికిత్స చేయడానికి, ఆక్సిజెన్ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయడంలో వై.ఎస్.ఎస్. సహాయం చేసింది.

ఆస్పత్రులలో ఆక్సిజెన్ బెడ్లు అందుబాటులో లేనపుడు, ఆక్సిజెన్ కాన్సంట్రేటర్లు ఏవిధంగా ప్రాణాలను రక్షిస్తాయో చూసిన వై.ఎస్.ఎస్. మన పెద్ద కేంద్రాలు, మండలులలో చాలా చోట్ల ఒక ఆక్సిజెన్ కాన్సంట్రేటర్ ను ఉంచాలని నిర్ణయించింది. 40 కి పైగా ఆక్సిజెన్ కాన్సంట్రేటర్లను పంచారు. ఈ కాన్సంట్రేటర్లను ఎలా నడపాలో, ఎలా సంరక్షించుకోవాలో వివరంగా తెలిపే సమాచారాన్ని వ్రాతపూర్వకంగానూ, వీడియోల ద్వారానూ ఒక నిపుణుల సంఘం అందించి, ఈ విభాగాలను సంరక్షిస్తూ, అందరికీ పంపే స్వచ్ఛంద సేవకులకు శిక్షణ నిచ్చింది.

తమ స్వంత వనరులతో చేయూత నిచ్చే హస్తాన్ని అందించిన వై.ఎస్.ఎస్. భక్తులు

కొన్ని వై.ఎస్.ఎస్. కేంద్రాలు మేము వాళ్ళని అడిగే వరకూ నిరీక్షించ లేదు. పూర్తిగా తమ వనరుల నుంచే కావలసిన ధనాన్ని సమకూర్చుకుంటూ వారు తమంతట తామే సహాయ కార్యక్రమాలను ప్రారంభించారు. రోగులను చికిత్సా కేంద్రాలకు తరలించడానికి వై.ఎస్.ఎస్. రాయపూర్ ధ్యాన కేంద్రం ఒక ఆంబులెన్స్ ను అద్దెకు తీసుకోగా, వై.ఎస్.ఎస్. తిరుపతి ధ్యాన కేంద్రం ఒక ఆక్సిజెన్ కాన్సంట్రేటర్ సరఫరా సేవను ప్రారంభించింది. చాలామంది భక్తులు ఇన్ఫెక్షన్ కి గురైన తమ పొరుగు వారికి, సమాజాలకు తాము అందించగలిగిన సహాయాన్ని అందించడానికి తమ జీవితకాలం పొదుపు చేసిన మొత్తాలలోంచి వెచ్చించారు.

రాయపూర్ లో కోవిడ్ రోగుల కోసం అద్దెకు తీసుకున్న ఆంబులెన్స్ తో భక్తులు

ద్వారాహాట్ లోనూ, చుట్టుపక్కల పల్లెల్లోనూ కోవిడ్ సహాయ కార్యక్రమాలు

ద్వారాహాట్ లోని వైద్య శిబిరంలో వద్ద ఉన్న ఒక డాక్టరు భక్తుడు

ద్వారాహాట్ లోనూ, చుట్టుపక్కలా వై.ఎస్.ఎస్. చేపట్టిన సహాయ కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. స్థానికంగా ఉన్న యువ స్వచ్ఛంద సేవక బృందం ఒకటి గ్రామస్తులకు కోవిడ్ మహమ్మారిలో ఉపశమనం కోసం చురుగ్గా సహాయాన్ని అందిస్తోందని మాకు తెలిసింది. ఉత్సాహంగా వారందిస్తున్న సహాయాన్ని, ముంబాయికి చెందిన ఒక వై.ఎస్.ఎస్. భక్తుడైన డాక్టరు అందించిన నిస్వార్థసేవను ప్రోత్సహిస్తూ ద్వారాహాట్ చుట్టూరా ఉన్న గ్రామాల్లోనూ, బాబాజీ గుహ ఉన్న ప్రాంతంలోనూ వై.ఎస్.ఎస్. అనేక కోవిడ్ చికిత్సా శిబిరాలను నిర్వహించగలిగింది. దూరంగా, ఏకాంతంగా ఉన్న ఆ ప్రాంతంలో సహాయ సహకారాలు అందించడానికి ఏ ఇతర సంస్థలూ పరిమితమైన తమ కార్యక్రమాలతో ముందుకు రాకపోవడంతో గ్రామస్తులు ఈ సేవను కృతజ్ఞతతో అందుకున్నారు; స్థానిక అధికారులు దీన్ని ఎంతగానో ప్రశంసించారు.

ద్వారాహాట్ లో ప్రభుత్వాస్పత్రికి వై.ఎస్.ఎస్. ఆంబులెన్స్ ను విరాళంగా ఇచ్చింది

ద్వారాహాట్ ప్రభుత్వాసుపత్రిలోని ప్రధాన వైద్యాధికారి అభ్యర్థన మేరకు చాలా అవసరమైన, అన్ని పరికరాలూ కలిగిన కొత్త ఆంబులెన్స్ ను వై.ఎస్.ఎస్. విరాళంగా ఇచ్చింది. తీవ్రంగా జబ్బు పడిన రోగులను ద్వారాహాట్ నుంచి అల్మోరా, హల్ ద్వానీల లోని ఉన్నత స్థాయికి చెందిన కోవిడ్-19 చికిత్సా కేంద్రాలకు తరలించడంలో ఈ వాహనం ఎంతో విలువైనదిగా నిరూపించబడింది. వై.ఎస్.ఎస్. చూపిన ఉదారతకు ధన్యవాదాలు చెబుతూ అల్మోరా లోని జిల్లా మేజిస్ట్రేటు గారు ఒక ప్రత్యేక లేఖ పంపారు. ఆంబులెన్స్ రాకను ద్వారాహాట్ నివాసులు ఎంతో ప్రశంసించారు; స్థానిక వార్తాపత్రికలూ, ప్రసార సాధనాలూ దీన్ని విస్తృతంగా ప్రచురించాయి, ప్రసారం చేశాయి.

ద్వారాహాట్ లోని ప్రధాన వైద్యాధికారికి కొత్త ఆంబులెన్స్ తాళం చెవులను అందిస్తున్న భక్తుడు

ప్రపంచమంతటినుంచీ వెల్లువెత్తిన సహాయ ప్రతిపాదనలు

భారతదేశంలోని పరిస్థితి యొక్క తీవ్రతను గురించిన సమాచారం పత్రికల్లోనూ, ప్రసార సాధనాల్లోనూ వ్యాప్తి చెందగానే భూగోళమంతా ఉన్న గురూజీ వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. భక్తుల నుంచి ఫోన్ కాల్స్ ను, సందేశాలను వై.ఎస్.ఎస్. అందుకోడం మొదలయింది. సహాయ ప్రతిపాదనలలో సానుభూతిపూర్వక, ప్రార్థనాపూర్వక తోడ్పాటు, ధనరూప విరాళాలు కూడా ఉన్నాయి. అంతమంది భక్తులనుంచి వెల్లువెత్తిన వారి ప్రేమను చూసి మా హృదయం ద్రవించింది; ఈ కరుణామూర్తులందరి ద్వారా మహాగురువులు తమ ప్రేమను, ఆశీస్సులను పంపుతున్నారని మేము గ్రహించాము. వారిలో ప్రతి ఒక్కరికీ మేము ప్రగాఢమైన కృతజ్ఞతను తెలియజేస్తున్నాము.

ద్వారాహాట్ చుట్టూ జరుగుతున్న సహాయ కార్యక్రమాలకు సమన్వయ కర్త అయిన ఒక భక్తుడు ఇలా వ్యాఖ్యానించారు:

“ద్వారాహాట్ లోనూ చుట్టుపక్కల గ్రామాల్లోనూ ఎవ్వరూ సందర్శించడానికి సాహసించని చోట మన స్వచ్ఛంద సేవకులు, డాక్టరు భక్తుడు అంకిత భావంతో అందించిన సేవ ఎంతో స్ఫూర్తిదాయకం. వైద్యపరమైన సలహాలు, మందులు అందించడం ద్వారా, మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి గ్రామస్తులకు తెలియజెప్పడం ద్వారా మన బృందం ఎన్నో విలువైన ప్రాణాలను కాపాడింది.” — టి.మ్., ద్వారాహాట్

కేరళలోని కన్నూరు జిల్లాలోని ఒక మారుమూల ప్రాంతంలో గిరిజనుల పునరావాసంలో సహాయం చేస్తున్న ప్రభుత్వోద్యోగి అయిన ఒక భక్తుడు కింది వివరాలను పంచుకున్నారు:

“ఈ ప్రాంతంలో ఏవిధమైన ప్రజారవాణా సౌకర్యం లేదు, స్థానికులకు వ్యవసాయం నుంచి లభించే ఆదాయం స్వల్పం. మహమ్మారి విజృంభించినపుడు, అక్కడ కోవిడ్ తో బాధపడ్తున్న వారికి తగినంత ఆహార సరఫరా లేదు, తగినన్ని వైద్య సరఫరాలు (మాస్కులు, గ్లోవ్స్ మొదలైనవి) — వాటిని వాడడానికి మొగ్గు చూపిన వారికి — లేవు. వై.ఎస్.ఎస్. అందించిన తక్షణ సహాయం వలన మేమక్కడి కుటుంబాలకు ఆహార పదార్థాలు, ఆక్సిజెన్ కాన్సంట్రేటర్, రక్షణ కోసం తగినంత పరిమాణంలో ఆరోగ్య సంబంధమైన, వైద్యపరమైన సామాగ్రిని సరఫరా చేయగలిగాం. ఈ ఉదాత్తమైన కార్యక్రమంలో భాగం అయినందుకు నా హృదయం ఆనందంతో పొంగి పొర్లుతోంది.” — జె.టి.వి., కాన్పూర్

బాధితులైనవారి బంధువర్గం నుంచి మేము ఎన్నో హృదయాన్ని ద్రవింపజేసే లేఖలు, ఫోన్ కాల్స్ అందుకున్నాం, వారికి మేము ధనసహాయం చేశాము; అనేక ఎన్జీవోలు, ఆస్పత్రుల నుంచి కూడా మేము హృదయాన్ని ద్రవింపజేసే లేఖలు, ఫోన్ కాల్స్ అందుకున్నాం, వారికి మేము ప్రాణాన్ని రక్షించే వైద్య పరికరాలను, ఔషధాలను ఇచ్చి సహాయం చేశాము. దేశమంతటా ఉన్న ఎన్నో ముద్రణ మరియు ఎలక్ట్రానిక్ ప్రసార సంస్థలు మన సంఘం నిర్వహించిన స్వచ్ఛంద కార్యకలాపాల గురించి ప్రచురించాయి.

సహాయ కార్యక్రమాలను సమన్వయపరుస్తూ నిస్వార్థంగా సేవలందించిన మన స్వచ్ఛంద సేవకులందరికీ మా ప్రగాఢమైన ప్రశంసలను, హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తున్నాం. ఈ గొప్ప మానవతా కార్యానికి ఉదారంగా సహకరించిన వారందరికీ, వారు సాధించిన మంచిని వర్ణించడానికి, తెలియజేయడానికి మాటలు చాలవు. అన్నిటికన్నా ఎక్కువగా మన ప్రపంచవ్యాప్త ప్రార్థనా మండలిలో, మన దైనందిన రోగనివారక ప్రార్థనా కార్యక్రమాల్లో చేరిన, చేరుతూ ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ మా మెచ్చుకోలును, హృదయపూర్వక కృతజ్ఞతలను మేము తెలియజేస్తున్నాం. అవసరమైన వారందరికీ స్వస్థత చేకూర్చే స్పందనలను, ప్రోత్సాహాన్ని, శక్తిని ఇచ్చే ప్రేమపూర్వక తలపులను పంపిస్తూ మనందరం కలసి ప్రార్థించడాన్ని కొనసాగిద్దాం.

మన గురుదేవులు పరమహంస యోగానందజీ అన్నారు, “నేను పరమాత్మ వల్లనే కదులుతున్నాను; మానవాళికి సేవ చేయాలని తప్ప, ధనం గురించిన ఆలోచనే లేదు. అందువల్ల నా ఉనికికి, ఈ సెల్ఫ్-రియలైజేషన్ [యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా] సంస్థ ఉనికికి తోడ్పాటు నందించడానికి ప్రభువు అన్ని మార్గాలనూ తెరిచి ఉంచాడు.” మనలో ప్రతి ఒక్కరం, మన సోదరులకు ఏవిధంగానైనా —  ఆధ్యాత్మికంగా కాని భౌతికంగా కాని — సేవ చేస్తూ ఉంటే, భగవంతుడు మరియు గురువులు మనకు మార్గదర్శనం చేస్తారు, స్ఫూర్తినిస్తారు; అవసరమైన వారికి వారి ప్రేమ మన ద్వారా ప్రవహిస్తుంది.

మీ చుట్టూ పరివేష్టించి ఉన్న భగవంతుని సాన్నిధ్యంలో మీరు ఉందురు గాక; ఆయన ప్రేమను, మంచితనాన్ని అందరికీ ప్రసరించెదరు గాక.

దివ్య స్నేహంలో,

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా

ఇతరులతో షేర్ చేయండి