YSS

వై‌.ఎస్‌.ఎస్. శత జయంతిని పురస్కరించుకుని తపాలా బిళ్ళను విడుదల చేసిన భారత ప్రధానమంత్రి

7 మార్చి, 2017

యోగదా సత్సంగ సొసైటీ 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తపాలాబిళ్ళ విడుదల

మార్చి 7, 2017న న్యూ ఢిల్లీలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి యావజ్జీవిత కృషికి భారత ప్రధాన మంత్రి, గౌరవనీయులైన శ్రీ నరేంద్ర మోదీ నివాళులర్పించారు.

యోగదా సత్సంగ సొసైటీ 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం తపాలా బిళ్ళను విడుదల చేసిన సందర్భము ఇది. మార్చి 7,1952న జరిగిన పరమహంసగారి మహాసమాధి వార్షికోత్సవాన్ని గౌరవించడానికి ఈ తేదీని ఎంచుకున్నారు.

1917 మార్చిలో భారతదేశంలోని దిహికాలో పరమహంస యోగానందగారిచే స్థాపించబడిన ఒక చిన్న ఆశ్రమం మరియు బాలుర పాఠశాలలో యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రారంభించబడింది. ఈ రోజు వై‌.ఎస్‌.ఎస్.కి భారతదేశం, నేపాల్ మరియు శ్రీలంక అంతటా 200 ధ్యాన కేంద్రాలు మరియు మండళ్ళు ఉన్నాయి.

(గమనిక: దయచేసి వీడియోలో 15:56 నుండి 18:18 వరకు సంభవించే ప్రసార దోషాన్ని క్షమించండి.)

అధికారిక కార్యక్రమాల కోసం ప్రభుత్వ సమావేశ కేంద్రమైన విజ్ఞాన్ భవన్‌లోని విశాలమైన ప్రధాన హాలులో 1,500 మందికి పైగా ప్రభుత్వ అధికారులు మరియు వై‌.ఎస్‌.ఎస్. సభ్యులు మరియు అభిమానులతో కూడిన సమావేశం ముందు ప్రధానమంత్రి కొత్త స్టాంపును ఆవిష్కరించారు. ఆ తర్వాత ఆయన స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు, అందులో పరమహంసగారిని భారతదేశపు గొప్ప యోగులు మరియు బోధకులలో ఒకరిగా అభివర్ణించారు—ఆయన జీవితం మరియు కార్యం, భారతదేశ ఆధ్యాత్మికత యొక్క మహత్తరమైన విలువను ప్రపంచానికి చాటి చెప్పడంలో దృష్టాంతంగా నిలిచిందని చెప్పారు—భారతదేశ ప్రాచీన సంస్కృతిని ఆధినిక ప్రపంచానికి అందించడంలో, దాని వ్యవస్థాపకుడి వారసత్వాన్ని మరియు స్ఫూర్తిని విజయవంతంగా కొనసాగిస్తున్నందుకు వై‌.ఎస్‌.ఎస్.ను ప్రశంసించారు.

ఆంగ్లంలో పూర్తి పాఠం | హిందీలో

ప్రధాన మంత్రి ప్రసంగం నుండి సారాంశాలు

పరమహంస యోగానందగారు మరియు క్రియా యోగా గురించి మాట్లాడుతున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ.“ఈ రోజు మార్చి 7వ తేదీన, ఒక ప్రత్యేక సందర్భ స్మారకార్థం మనం ఒకచోట సమావేశమయ్యాము,” అని ప్రధాన మంత్రి అన్నారు. “మరియు శ్రీ శ్రీ [మృణాళినీ] మాతాజీకి నా ప్రాణామాలు, ఎందుకంటే ఆమె లాస్ ఏంజిలిస్ నుండి ఈ వేడుకలో మనతో కలుస్తారని నాకు చెప్పబడింది….

“అంతర్గత ప్రయాణాన్ని ప్రారంభించడానికి మరియు తనను తాను ఆంతర్ముఖంగా మార్చుకొవడానికి చాలా ధైర్యం మరియు దృఢవిశ్వాసము అవసరం. యోగం యొక్క కొన్ని వ్యవస్థలకు బాహ్య బలం మరియు మృదుత్వం అవసరం, అయితే [క్రియాయోగ మార్గం] అంతర్గత నిబద్ధతను కోరుతుంది, మరియు ఆ ధైర్యాన్ని అందించడం ద్వారా, ఇది జీవితంలోని రహస్యాలను అర్థంచేసుకునే ప్రయాణంలోకి మిమ్మల్ని తీసుకువెళుతుంది….

“[పరమహంస యోగానందగారు] తరచుగా చెబుతూ ఉంటారు, ‘నాకు ఆసుపత్రిలో మంచం మీద చనిపోవడం ఇష్టం లేదు. నేను నా బూట్లు వేసుకొని నా మాతృమూర్తి భారతదేశం గురించి మాట్లాడుతూ చనిపోవాలనుకుంటున్నాను.’ అంటే, పాశ్చాత్య ప్రపంచానికి భారతదేశ ప్రాచీన బోధనల సందేశాన్ని వ్యాప్తి చేయడానికి ఆయన భారతదేశ తీరాన్ని విడిచిపెట్టినప్పటికీ, ఆయన తన ప్రియమైన మాతృభూమి నుండి అరక్షణంపాటు కూడా వేరు చేయబడినట్లు లేదా విడిపోయినట్లు భావించలేదు….

“కఠినమైన సిద్ధాంతాన్ని తొలగించి, ఆయన ఆధ్యాత్మికతను చాలా చేరువగా మరియు ప్రత్యక్షంగా చేశారు, ఆయన దానిని ప్రారంభించిన ఈ వంద సంవత్సరాల్లో, ఆయన కార్యం ప్రపంచవ్యాప్త ఉద్యమంగా మారింది, ఆధ్యాత్మిక అవగాహన యొక్క శాశ్వత ఆధారముగా మారింది….[ఆయన] తన సంస్థను నేటికీ తన లక్ష్యాన్ని నెరవేర్చే విధంగా నిర్మించారు మరియు వ్యవస్థీకరించారు మరియు ఈ రోజు ఆయన సాక్షాత్కారాన్ని, ఆయన ఆత్మ-ఆనందాన్ని, స్వీకరించినప్పుడు మరియు పాలుపంచుకుంటున్నప్పుడు ఆయన కార్యం ముందుకు సాగుతూనే ఉంటుంది. ఇది ఆయన అతిపెద్ద సహకారాలలో ఒకటని నేను భావిస్తున్నాను.”

శ్రీ మృణాళినీమాత నుండి ఒక సందేశం

ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు వేదికపై వై.ఎస్.ఎస్. ప్రధాన కార్యదర్శి స్వామి స్మరణానంద, లాస్ ఏంజిలిస్ లోని అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం నుండి ఈ కార్యక్రమంలో హాజరు కావడం కోసం వచ్చిన వై‌.ఎస్‌.ఎస్./ఎస్‌.ఆర్‌.ఎస్. బోర్డు డైరెక్టర్ల సభ్యుడు స్వామి విశ్వానందతో సహా వై.ఎస్.ఎస్. డైరెక్టర్ల బోర్డు ఇతర సభ్యులు ఉన్నారు. స్వామి స్మరణానంద కార్యక్రమంలో ప్రారంభ ఉపన్యాసం ఇచ్చారు, ఆ తర్వాత లాస్ ఏంజిలిస్ నుండి ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న వై‌.ఎస్‌.ఎస్./ఎస్‌.ఆర్‌.ఎఫ్. అధ్యక్షురాలు మరియు సంఘమాత శ్రీ మృణాళినీమాతగారి నుండి స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని స్వామి విశ్వానంద అందించారు.

శ్రీ మృణాళినీమాత తన సందేశంలో ఇలా పేర్కొన్నారు: “భారతదేశం యొక్క గొప్ప సంపద మరియు బలం—ఆ దేశ సుదీర్ఘ చరిత్రలో—నేడు ఆ దేశ ద్రష్టలు గ్రహించిన మరియు మానవాళికి ప్రసాదించిన శాశ్వతమైన ఆధ్యాత్మిక సత్యాలను, ఆ దేశం గౌరవించడం మరియు చురుకుగా వ్యక్తీకరించడంలోనే ఉంది….అటువంటి ఆదర్శప్రాయమైన దివ్య వ్యక్తి యొక్క జీవితకార్యాన్ని గౌరవించటానికి ఈ రోజు ఎంపిక చేయబడింది, ఇది భారతదేశానికి మాత్రమే కాకుండా, ఈ సమస్యాత్మక సమయాల్లో ఆధ్యాత్మిక వెలుగు కోసం ఆ దేశం వైపు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్న లక్షలాదిమంది ఆశలకు మరియు ప్రేరణకు లోతైన మూలం అవుతుంది.” (ఆమె సందేశం యొక్క పూర్తి పాఠం క్రింద ఇవ్వబడింది.)

వై‌.ఎస్‌.ఎస్. శత జయంతి ఉత్సవాల అదనపు వార్తా సేకరణ

వై.ఎస్.ఎస్. రాంచీ ఆశ్రమంలో ఈ నెల మార్చి 19–23 తేదీల్లో నిర్వహిస్తున్న వై.ఎస్.ఎస్. శతాబ్ది ఉత్సవాల గురించి త్వరలో మరిన్ని వివరాలను తెలియజేయడానికి మేము ఎదురుచూస్తున్నాము. సంవత్సరమంతా జరిగే వారి శతాబ్ది ఉత్సవాల గురించి మరింత సమాచారం కోసం మరియు మార్చి 7న విడుదలైన స్టాంపుల ఫోటో ఆల్బమ్‌ను వీక్షించడానికి వై.ఎస్.ఎస్. వెబ్‌సైట్‌ను సందర్శించాల్సిందిగా మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము

కార్యక్రమము యొక్క అదనపు ఫోటోలు

దీపాన్ని వెలిగిస్తున్న నరేంద్ర మోదీ.
ప్రధానమంత్రి మోదీ మరియు వై.ఎస్.ఎస్./ఎస్‌.ఆర్‌.ఎఫ్. డైరెక్టర్ల బోర్డులోని సన్యాసులు ఉత్సవ దీపాన్ని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
యోగానందగారి బోధనలపై స్మరానందజీ ప్రసంగించారు.
స్వామి స్మరణానంద పరమహంసగారు ఉదహరించిన భగవంతుని జ్ఞానాన్ని గురించి మాట్లాడారు మరియు ఆయన రచించిన ఒక యోగి ఆత్మకథ యొక్క అనేక అనువాదాలు ఇప్పుడు ప్రపంచ జనాభాలో దాదాపు 95% మంది దానిని చదవగలిగేలా చేశాయి.
ప్రధానమంత్రి స్మారక తపాలాబిళ్ళను ప్రదర్శిస్తున్నారు.
వై.ఎస్.ఎస్. 100వ జయంతిని స్మరించుకునే తపాలా బిళ్ళను, తపాలా బిళ్ళతో పాటుగా ప్రభుత్వం తయారు చేసిన ప్రత్యేక కరపత్రాన్ని విజ్ఞాన్ భవన్‌లో ప్రేక్షకుల కరతాళధ్వనుల మధ్య ప్రధానమంత్రి మోదీ ప్రదర్శించారు.
ప్రధాని మోదీ ప్రసంగించారు.
భారతదేశం యొక్క ఆధ్యాత్మికత మరియు ఆధునిక ప్రపంచంలో దాని ఏకైక పాత్రను అర్థం చేసుకోవడానికి పరమహంస యోగానందగారు మరియు ఆయన క్రియాయోగ బోధనలు చేసిన విశిష్ట సహకారాన్ని నొక్కిచెబుతూ ప్రధానమంత్రి మోదీ ప్రసంగించారు.
వై.ఎస్.ఎస్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లతో నరేంద్ర మోదీ.
శ్రీ మోదీ తన ప్రసంగం తర్వాత ప్రేక్షకులకు ప్రణామాలు చెస్తూ, ప్రేక్షకుల చేత నిలబడి చప్పట్లు అందుకున్నారు.
ప్రధాని మోదీకి స్వామి విశ్వానంద బహుమతి
యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ తరపున స్వామి విశ్వానంద, శ్రీ మోదీకి పరమహంస యోగానందగారి కవిత "మై ఇండియా" లోని కొంత భాగంతో కళాత్మకంగా రూపొందించిన బహుమతిని అందజేశారు. పద్యంలోని ఈ పంక్తులే 1952 మార్చి 7న తన దేహాన్ని విడిచిపెట్టే ముందు గొప్ప గురువు చెప్పిన చివరి మాటలు:

“ఎక్కడైతే గంగానది, అరణ్యాలు, హిమాలయ గుహలు, మనుషులు, దేవుణ్ణి గురించి కలలు కంటారో—
ఆ గద్దను నా దేహం తాకింది; నేను పవిత్రుడనయ్యాను.”

శ్రీ మృణాళినీమాతగారి సందేశం యొక్క పూర్తి పాఠం, మార్చి 7, 2017

ప్రియతములారా,

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై‌.ఎస్‌.ఎస్.)100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని స్మారక స్టాంపును విడుదల చేసే ఈ ప్రత్యేక సందర్భంలో, మీకు నా ఆత్మీయ శుభాకాంక్షలు మరియు దివ్యప్రేమను తెలియజేస్తున్నాను. ఈ కార్య‌క్ర‌మం ద్వారా భార‌త ప్ర‌భుత్వం వై‌.ఎస్‌.ఎస్. మరియు దాని వ్యస్థాపకులు—భారతదేశపు గొప్ప సాధువులలో ఒకరైన—శ్రీ శ్రీ పరమహంస యోగానందగారికి నివాళులర్పిస్తున్నందుకు నేను ఎనలేని సంతోషం మరియు కృతజ్ఞతలతో నిండిపోతున్నాను. దీన్ని తీసుకురావడంలో పాత్ర పోషించిన వారందరికీ నా ప్రగాఢ ధన్యవాదాలు. భారతదేశంలోని విశ్వజనీన ఆధ్యాత్మికత మరియు ధ్యానయోగం యొక్క పురాతన శాస్త్రాన్ని వ్యాప్తి చేయడానికి ఆయన ఎక్కువ సమయం అమెరికాలో గడిపినప్పటికీ, పరమహంస యోగానందగారికి తన మాతృభూమి పట్ల ప్రేమ మరియు శ్రద్ధ ఎప్పుడూ తగ్గలేదు. 1952లో ఇదే రోజున—ఈ లోకాన్ని విడిచిపెట్టడానికి ముందు ఆయన పలికిన చివరి మాటలే, ఆయనకు ప్రియమైన భారతదేశానికి ఇచ్చిన హృదయపూర్వక నివాళి.

భారతదేశం యొక్క గొప్ప సంపద మరియు శక్తి—నేడు తన సుదీర్ఘ చరిత్రలో ఉంది—తన జ్ఞానవంతులు గ్రహించిన మరియు మానవాళికి అందించిన శాశ్వతమైన ఆధ్యాత్మిక సత్యాలను, ఆ దేశం రక్షించి మరియు చైతన్యవంతంగా వ్యక్తీకరించడంలోనే ఉన్నది. యుగయుగాలుగా, గొప్ప ఆత్మలు—మహాత్ములు, సాధువులు, అత్యున్నత దివ్య సాక్షాత్కారాన్ని పొందిన ఋషులు—భారతమాత పట్ల వారికున్న గొప్ప ప్రేమతో ఆ ఉన్నతమైన మరియు అత్యంత ఉదాత్తమైన కారణానికి సేవ చేసేందుకు ప్రేరేపించబడ్డారు. అటువంటి ఆదర్శప్రాయమైన దివ్య వ్యక్తి యొక్క జీవిత కార్యాన్ని గౌరవించటానికి భారతదేశ ప్రభుత్వం ఈ రోజుని ఎన్నుకోవడం భారతదేశానికే కాదు, ఈ సమస్యాత్మక సమయాల్లో ఆధ్యాత్మిక వెలుగు కోసం ఆ దేశం వైపు చూసే ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మందికి ఆశాజనకంగా మరియు ప్రేరణాత్మకంగా ఉంటుంది.

శ్రీ శ్రీ పరమహంస యోగానందగారు తరచుగా ఇలా చెప్పేవారు, “మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి, వేలమందిని మీరు సంస్కరిస్తారు.” భారతదేశం యొక్క దివ్యమైన మరియు విశ్వజనీనమైన యోగం మరియు ధ్యానం, మన ప్రవర్తన మరియు ఆలోచనా విధానాలలో శాశ్వత సానుకూల మార్పులను తీసుకురావడానికి అత్యంత ప్రభావవంతమైన పద్ధతులను కలిగి ఉంటాయి. పరమహంస యోగానందగారి సంస్థ యొక్క ప్రధాన లక్ష్యాలు మరియు ఆదర్శాలలో ఒకటేమిటంటే, భారతదేశపు గొప్ప ఋషులు సహస్రాబ్దాలుగా బోధించిన ధ్యానం యొక్క శాస్త్రీయ ప్రక్రియల జ్ఞానాన్ని అన్ని దేశాలలో వ్యాప్తి చేయడం, తద్ద్వారా ప్రతి మానవుడు—జాతి, కులం లేదా మతంతో సంబంధం లేకుండా—అతను లేదా ఆమె, తమ స్వంత దివ్యత్వం మరియు అంతర్గత శాంతి, ప్రేమ మరియు ఆనందాన్ని సాక్షాత్కరించుకోవచ్చు. ప్రతి వ్యక్తిలో శాంతి ఉన్నప్పుడు, ప్రపంచ శాంతి సహజంగానే అనుసరిస్తుంది.

ఈ ప్రత్యేక రోజున తీరిక లేకుండా ఉన్నా కూడా తన సమయాన్ని వెచ్చించి వ్యక్తిగతంగా హాజరైనందుకు గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీగారి ఉపకారాన్ని నేను ఎంతో అభినందిస్తున్నాను. వై‌.ఎస్‌.ఎస్. శతాబ్ది ఉత్సవాల స్మారక స్టాంపును స్వయంగా గొప్ప యోగ సాధకుడైన శ్రీ మోదీ విడుదల చేయడం ఎంతో సముచితం. అంతర్జాతీయ యోగా దినోత్సవం—ఆయనే ప్రతిపాదించారు, తదనంతరం ఐక్యరాజ్యసమితి తీర్మానంగా రికార్డు సంఖ్యలో దేశాలు అతి తక్కువ సమయంలో ఆమోదించడం—ప్రపంచ వ్యాప్తంగా యోగశాస్త్రము యొక్క విశ్వజనీన సందేశాన్ని వ్యాప్తి చేయడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ఈ మైలురాయి వంటి తొలి ప్రయత్నానికి శ్రీ మోదీకి మా కృతజ్ఞతలు.

భారతదేశ ఆధ్యాత్మికతను పాశ్చాత్య దేశాల భౌతిక సామర్థ్యంతో కలపడం ద్వారా ఆదర్శవంతమైన ప్రపంచ నాగరికత ఆవిర్భవించనుందని పరమహంస యోగానందగారు ముందుగానే సూచించారు. అందువల్ల ఉన్నత పరిణామ చక్రంలో మానవ చైతన్యాన్ని పెంపొందించడంలో సహాయం చేయడానికి భారతదేశం ముఖ్యమైన మరియు ఆవశ్యకమైన పాత్రను పోషించాల్సిన అవసరం ఉంది. నా ప్రగాఢమైన ప్రార్థన ఏమిటంటే శ్రీ శ్రీ యోగానందగారు మరియు భారతదేశంలోని ఇతర గొప్ప మహాత్ములు ఉదహరించిన ఐక్యతను ప్రసాదించే ఆధ్యాత్మిక బోధనలను ఆచరించడం ద్వారా, మనం మన మానవ కుటుంబంలోని ప్రతి ఒక్కరినీ ప్రపంచ శాంతి, దివ్య సామరస్యం మరియు శ్రేయస్సు యొక్క యుగం వైపు నడిపించగలము.

దేవుడు మరియు మహాత్ముల వెలుగు, ప్రేమ మీ అందరినీ ఆశీర్వదించి, ఉద్ధరించుగాక,

శ్రీ మృణాళినీమాత

సంఘమాత మరియు అధ్యక్షురాలు,
యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్

Share this on

Share on facebook
Share on twitter
Share on whatsapp