ఈ క్రింది పోస్ట్ “భగవంతుణ్ణి చేరే భక్తి మార్గం,” (The Devotional Way to God) అనే ప్రసంగం నుండి సంగ్రహించబడింది. పరమహంస యోగానందగారి ప్రసంగాలు మరియు వ్యాసాల IVవ సంపుటం జీవిత రహస్యాన్ని పరిష్కరించడం (Solving the Mystery of Life) అనే పుస్తకంలో దీనిని పూర్తిగా చదవవచ్చు — ఇది యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ద్వారా హార్డ్ బ్యాక్, పేపర్ బ్యాక్ మరియు ఈ-బుక్ ప్రచురణలలో త్వరలో విడుదల చేయబడుతుంది.

తన లెక్కలేనన్ని రూపాలను సరియైన స్థానాలలో అమర్చడం ద్వారా, ఈ జగత్తును అలంకరించి, భూమిని జీవరాశులతో నింపిన ఈ విశ్వమనే కల్పవృక్షాన్ని ఎవరు సృష్టించారు?
గడియారం యొక్క పనితీరును మనం చూసినప్పుడు, దాని సంక్లిష్టమైన భాగాలను తయారుచేసి వాటినన్నింటిని సమకూర్చినది మానవుడేనని మనకు అర్థమవుతుంది. కానీ మనం పచ్చికబయలును చూసినప్పుడు, మనం తప్పకుండా ఇలా అడగాలి, “పచ్చని గడ్డితో నేలను అలంకరించే శక్తిని విత్తనంలో ఎవరు సృష్టించారు?” సృష్టి యొక్క అద్భుతమైన రహస్యాలను మనం వీక్షించేలా చేసింది ఎవరు? సృష్టికర్త తనను తాను మరుగు పరచుకుంటున్నాడు, బహుశా ఏదో ఒక రోజు మనం ఆయనను వెతికి కనుగొంటామని….
దాగి ఉన్న దేవుణ్ణి కనుగొనడానికి, మీరు ఆయనను ప్రేమించవలసి ఉంటుంది; కానీ నా మనసులో ఇలా మెదిలింది, మీరు దేవుణ్ణి తెలుసుకోకుండా ఆయన్ని ఎలా ప్రేమించగలరు? మీకు తెలియనిదాన్ని మీరు ప్రేమించలేరు. మీరు ఎన్నడూ చూడని ఒక పుష్పాన్ని ప్రేమించగలరా? సముద్రం అనేది ఒక పదం మాత్రమే అయితే దాన్ని మీరు ప్రేమించగలరా? మీకు ఎప్పుడూ తెలియని వ్యక్తిని లేదా వినని వ్యక్తిని మీరు ప్రేమించగలరా? మీరు ఎన్నడూ కలవనివారిని స్నేహితునిగా ప్రేమించగలరా? మీకు తెలియని దాన్ని దేన్నైనా మీరు ప్రేమించగలరా? అలాంటప్పుడు, దేవుణ్ణి ఎన్నడూ చూడకుండా ప్రేమించడం ఎలా సాధ్యమవుతుంది? నేను ఇక ఎంత మాత్రం అలా అనలేను. నేను ఆయన్ని అన్ని సమయాలలో చూస్తూనే ఉంటాను. మీరు ప్రస్తుతం ఆలోచిస్తున్న ప్రతి ఆలోచన, ఆ కాంతి నుండి వస్తున్నట్లు నేను చూస్తాను.
ఒక నగరంలో ఎంతో అందంగా కాంతులీనుతున్న దీపాలను ఒక కొండపై నుండి మీరు చూసినప్పుడు, బల్బులు వెలిగేందుకు విద్యుత్తును అందించేది డైనమో అని మీరు మరచిపోతారు. అలాగే మానవుల కాంతివంతమైన జీవశక్తిని చూసినా, వాటిని ఉత్తేజపరిచేదేమిటో మీకు తెలియనప్పుడు, మీరు ఆధ్యాత్మికంగా అంధులయినట్లే. ఆ శక్తి, కనిపించనప్పటికీ, చాలా స్పష్టంగా విశదమవుతుంది. అన్నివేళలా అది మన ఆలోచనల వెనుక దాగుడుమూతలాడుతూ ఉంటుంది. దేవుడు దాగి ఉండాలని అనుకుంటున్నాడు కాబట్టి, ఆయన్ని గురించి ఆలోచించడం మరియు ఆయనను ప్రేమించడం కష్టం.
విరుద్ధమైన వాస్తవం ఏమిటంటే భగవంతుడిని తెలుసుకోవటానికి సులభమైన మార్గం ప్రేమ మార్గమే. విజ్ఞానం ద్వారా ఆయనను తెలుసుకొనే మార్గం (జ్ఞాన యోగం) ఒకటుంది, దీని ద్వారా ఆయనను తెలుసుకోవచ్చు: “నేతి, నేతి,” ఇది కాదు; అది కాదు — అనే విశ్లేషణాత్మక వివేక మార్గం ద్వారా, భగవంతుడు కాని వాటినన్నిటినీ తొలగించే మార్గం ఇది. వేరొక మార్గం. ఉత్తమమైన కార్యాలు తప్ప మరేమీ చేయకపోవడం మరియు ఆ కర్మల ఫలాలను త్యజించడం ద్వారా తనను తాను పరిశుద్ధం చేసుకోవడం (కర్మ యోగం).
ఆ తరువాత భక్తి మార్గం ఉంది, ప్రతి దానిలో ఆయన్ని దర్శించే వరకు నిరంతరం భగవంతుడి గురించే ఆలోచించడం (భక్తి యోగం), భక్తితో నిండిన దృష్టితో ఆయన్ని చూడగలిగితే, ఆయన చాలా స్పష్టంగా వ్యక్తమవుతాడు. మనం ఆయనను కోరుకుంటున్నామని, ఆయన మనల్ని తప్పించుకోలేడని, మనం ఆయనకు తెలిసేలా చేయాలి. ఆయన కోసం మన గాఢమైన కోరికను వ్యక్తం చేస్తూ, మన ఆలోచనలతో ఆయనను స్పృశించినప్పుడు, తనను తాను వ్యక్తం చేసుకొనేందుకు, ప్రతిస్పందించేందుకు ఆయన కట్టుబడి ఉంటాడు.
దేవుని ఉనికి చాలా దగ్గరగా ఉంటుంది; ఒక చీకటి గదిలో ఎవరో మీతో దాగుడు మూతలు ఆడుతున్నట్లుగా ఉంటుంది. మీరు ఆ వ్యక్తిని చూడనప్పటికీ, ఆ వ్యక్తి అక్కడే ఉన్నట్లుగా మీరు భావిస్తారు. మీ చూడలేని కళ్ల చీకటి వెనుక, అదే విధంగా భగవంతుడు ఉంటాడు. జ్ఞాని ద్వారా మనతో ఆయన మాట్లాడతాడు. ఇంకా క్రీస్తు, కృష్ణుడు మరియు దివ్యగురువుల వంటి మహాత్ముల ద్వారా ఆయన మనలను ప్రేరేపిస్తుంటాడు.
ఆయన ఉన్నాడు, కాని ఆయన ఎక్కడ ఉన్నాడు? ఈ ప్రశ్నకు భక్తి సమాధానం చెబుతుంది: మీరు ఆయనకు అంకితం కావడానికి ఆయనను చూడవలసిన అవసరం లేదు. భక్తి అంటే, విశ్వం యొక్క అంధకార నిగూఢతలో ఆయన మీ చుట్టూ ఉన్నాడని, మీతో దాగుడుమూతలు అనే దివ్యమైన ఆట ఆడుతున్నాడని మీరు తెలుసుకోవడం. ఆకుల వెనుక, వీచేగాలి వెనుక, సూర్యుని వెచ్చని కిరణాల వెనుక — ఆయన దాగి ఉన్నాడు, కానీ ఆయన అక్కడే ఉన్నాడు. ఆయన సుదూరంగా లేడు; అందుకే ఆయనను ప్రేమించడం సులభమవుతుంది.
మన హృదయాలు తెలుసుకోగల గొప్ప ప్రేమికుడు భగవంతుడు. తనను అన్వేషించడాన్ని ఆయన ఇష్టపడతాడు, ఎందుకంటే ఆయన తన బిడ్డల ప్రేమను మాత్రమే ఆశిస్తున్నాడు. వారి ప్రేమను అందుకోవడమే ఆయన సృష్టి యొక్క ఏకైక ఉద్దేశ్యం. మన ప్రేమ తప్ప, ఆయనలోనే అన్నీ ఉన్నాయి. ఆయనను ప్రేమించేందుకు లేదా ప్రేమించకుండా ఉండేందుకు ఆయన మనకు స్వేచ్ఛను ప్రసాదించాడు. ఆయన మనల్ని ఎంతగానో కోరుకుంటాడు. అందుకే, తన వద్దకు తిరిగి వచ్చే మార్గాన్ని చూపించేందుకు, ఆయన తన సాధువులను పంపిస్తాడు.