
ఉపోద్ఘాతం:
పరమహంస యోగానందగారి ఒక యోగి ఆత్మకథ ద్వారానే ఒక నిజమైన అద్భుత ఆధ్యాత్మికమూర్తి అయిన మహావతార్ బాబాజీ గురించి ప్రపంచం తెలుసుకొన్నది.
ప్రాచీనమైన క్రియాయోగ శాస్త్రాన్ని ఆధునిక యుగంలో పునరుద్ధరించిన మహాత్ములు బాబాజీయే; మరియు యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ కార్యాచరణ వెనుక ఉన్న జ్ఞానదీప్తులైన గురుపరంపరలో ఆయన అత్యున్నత గురువు. ఒక యోగి ఆత్మకథలో చెప్పినట్లుగా, లెక్కలేనన్ని శతాబ్దాలుగా ఆయన హిమాలయాలలో ఏకాంతంగా నివసించారు.
పరమహంస యోగానందగారు భారతదేశం నుండి బయలుదేరే ముందు 1920లో జులై 25న కోల్ కతాలో బాబాజీ ఆయనను కలుసుకొని, ప్రపంచానికి క్రియాయోగం పరిచయం చేయమని చెప్పి దీవించారు. ప్రతి సంవత్సరం ఆ రోజును వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. ఉత్సవంగా జరుపుకుంటుంది.
“పాశ్చాత్య ప్రపంచంలో క్రియాయోగ సందేశాన్ని వ్యాప్తి చెయ్యడానికి నేను ఎంపిక చేసినవాడివి నువ్వే,” ఆ సమావేశంలో బాబాజీ ఇలా అన్నారు. “దైవసాక్షాత్కారసిద్ధికి తోడ్పడే శాస్త్రీయ ప్రక్రియ అయిన క్రియాయోగం, చివరికి అన్ని దేశాలకీ వ్యాపించి, అనంత పరమపిత అయిన పరమేశ్వరుణ్ణి గురించి మానవుడికి కలిగే వ్యక్తిగత అతీంద్రియ దర్శనం ద్వారా, దేశాల మధ్య సామరస్యం కలిగించడానికి తోడ్పడుతుంది.”
ప్రపంచంలో పరివర్తన తీసుకురాగల మహావతార్ బాబాజీ ప్రభావం గురించి పరమహంసగారి ఈ క్రింది మాటలను చదవమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.
పరమహంస యోగానందగారి ప్రసంగాలు మరియు రచనల నుండి:
యోగమనే శాస్త్రం ద్వారా ఆత్మ, శరీరం పైనా మనస్సు పైనా ఆధిపత్యం సాధించి, వాటిని ఆత్మజ్ఞానం — సర్వోత్కృష్టమైన అమరత్వాన్ని, పరమాత్మతో తన ఏకత్వాన్ని గుర్తిస్తూ జాగృతమైన ఆత్మ చైతన్యం — పొందడానికి ఉపయోగిస్తుంది.
ప్రాచీన కాలంలో కృష్ణుడిచే అర్జునుడికి ఉపదేశించబడి, భగవద్గీతలో ప్రస్తావించబడిన క్రియాయోగ ప్రక్రియ, యోగాధ్యానం యొక్క పరమోత్కృష్ట ఆధ్యాత్మిక శాస్త్రం. భౌతికవాద యుగాలలో మరుగుపరచబడిన ఈ నాశరహితమైన యోగాన్ని ఆధునిక మానవుడి కోసం మహావతార్ బాబాజీ పునరుద్ధరించారు. దైవానుసంధానం కలిగించే ఈ పవిత్ర శాస్త్రాన్ని సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ [యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా] సంస్థ ద్వారా వ్యాప్తి చేయడానికి బాబాజీ స్వయంగా నన్ను నియమించారు, బాబాజీ మరియు నా గురుదేవుల ఆజ్ఞానుసారం ఈ సంస్థను నేను స్థాపించాను.
ఆధునిక యుగ ధోరణి బాబాజీకి బాగా తెలుసు, ముఖ్యంగా పాశ్చాత్య నాగరికతలోని క్లిష్టతల ప్రభావం ఇంకా బాగా తెలుసు. అంతే కాదు, యోగపరమయిన ఆత్మవిమోచన పద్ధతులను ప్రాచ్య, పాశ్చాత్య దేశాలన్నిటా సమంగా వ్యాప్తి చేయవలసిన అవసరాన్ని గ్రహించారాయన.
[మహావతార్ బాబాజీ ఇలా అన్నారు:] “దైవసాక్షాత్కారసిద్ధికి తోడ్పడే శాస్త్రీయ ప్రక్రియ అయిన క్రియాయోగం, చివరికి అన్ని దేశాలకీ వ్యాపించి, అనంత పరమపిత అయిన పరమేశ్వరుణ్ణి గురించి మానవుడికి కలిగే వ్యక్తిగత అతీంద్రియ దర్శనం ద్వారా, దేశాల మధ్య సామరస్యం కలిగించడానికి తోడ్పడుతుంది.”

పరమహంసగారి ఆధ్యాత్మిక మహాకావ్యం ఒక యోగి ఆత్మకథ లో, మహావతార్ బాబాజీ ఆధ్యాత్మిక స్థితి గురించి మరియు ఆయన ప్రత్యేక పాత్ర గురించి లోతుగా వివరించే “ఆధునిక భారతదేశపు యోగి-క్రీస్తు (యోగీశ్వరులు) బాబాజీ” అనే అధ్యాయాన్ని చదవమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రపంచానికి ఉన్నతి చేకూర్చేందుకు పనిచేస్తూ, క్రియాయోగ మార్గంలో ఉన్న సాధకులందరికీ సహాయం కొనసాగిస్తానని వాగ్దానం చేసిన ఈ మహాత్ముడి గురించి మరింతగా తెలుసుకోండి.