ఉపోద్ఘాతం:
మీ సంబంధాలలో సామరస్యాన్ని కొనసాగించడం ఒక నిజమైన కళ అని ఎప్పుడైనా కనుగొన్నారా — ఒక వ్యక్తి దాన్ని అభివృద్ధి చేసుకొని అభ్యసించాల్సిన అవసరం ఉంది?
పరమహంస యోగానందగారు నిజంగానే ఇలా సూచించారు “ఇతరులతో ఐకమత్యంగా జీవించడం అనే కళ, జీవితంలోని గొప్ప కళలలో ఒకటి. ఇది విజయవంతమైన అస్తిత్వానికి ఆచరణాత్మక అవసరం మాత్రమే కాదు, ఆత్మ యొక్క జాగృతికి మరియు ఉన్నతికి ముఖ్యమైన భాగం.”
మన ఆత్మల యొక్క దివ్యప్రేమ, అవగాహన, మరియు ఉన్నత సామర్ధ్యాలను ఉపయోగించి, వాటిని వ్యక్తపరచడం ద్వారా — మన సంబంధాలలో గొప్ప సామరస్యాన్ని అభివృద్ధి చేసుకొనే మార్గాల గురించి పరమహంస యోగానందగారి మార్గదర్శక జ్ఞానాన్ని ఈ సమాచారలేఖలో మేము పంచుకొంటున్నాం.
పరమహంస యోగానందగారి ప్రసంగాలు మరియు రచనల నుండి:
ఇతరులతో మీ సంబంధాల్లో, వాళ్ళు తమలో ఏర్పరుచుకొన్న గుణాలను గుర్తించి, వాటిని అభినందించడమనేది అత్యవసరం. మీరు నిష్కపటమైన మనస్సుతో జనులను అధ్యయనం చేసినట్టయితే, వాళ్ళను బాగా అర్థం చేసుకోగలిగి వాళ్ళతో ఐకమత్యంగా ఉండగలుగుతారు.
ప్రతి ఒక్కరూ చూసి, ప్రేమించే ఒక అందమైన పుష్పం మాదిరిగా అయేంతవరకూ మీరు ఇతరులను గురించి ఆలోచించడాన్ని, మంచితనాన్ని అభ్యసించండి. ఒక పుష్పంలో ఉండే అందంలా, ఒక స్వచ్చమైన మనస్సులోని మనోహరత్వంలా ఆకర్షణీయంగా ఉండండి. మీరా విధంగా ఆకర్షణీయంగా ఉన్నప్పుడు, మీకెప్పుడూ నిజమైన స్నేహితులు ఉంటారు.
ధ్యానంలో మీరు అనుభూతి చెందే ప్రశాంతతను మీ దైనందిన కార్యక్రమాలలోకి తీసుకొని వెళ్ళండి; అది మీ జీవితంలోని ప్రతి అంశంలోనికి సామరస్యాన్ని, సంతోషాన్ని తీసుకురావడంలో సాయపడుతుంది.
ఇతరులు మీపట్ల సానుభూతి చూపాలని కోరుకొంటే, మీ చుట్టూ ఉన్న వారిపట్ల సానుభూతి చూపండి. గౌరవం పొందాలని మీరు కోరితే, ప్రతి ఒక్కరితోను, పెద్దలు, పిన్నలు, ఇద్దరితోనూ తప్పకుండా మర్యాదగా ఉండటం నేర్చుకోండి. ఇతరులు శాంతంగా ఉండాలని మీరు కోరుకుంటే, మీకు మీరు శాంతంగా ఉండాలి. ఇతరులు భక్తులుగా ఉండాలని మీరు కోరుకుంటే, మీరు ఆధ్యాత్మికంగా ఉండటం మొదలుపెట్టండి. గుర్తుంచుకోండి, ఇతరులు ఎలా ఉండాలని మీరు కోరుకుంటారో, మీరు మొదట అలా ఉండండి, అప్పుడు ఇతరులు కూడా మీ పట్ల అలాగే స్పందిస్తున్నట్లు మీరు కనుగొంటారు.
[ఇలా దివ్య సంకల్పం చేయండి:] “ఇతరులకు నేను ప్రేమను, సౌహార్ధాన్ని ప్రసరింపజేస్తూ భగవంతుడి ప్రేమ నా దగ్గరకు రావడానికి నేను మార్గాన్ని తెరుస్తాను. దివ్యప్రేమ అనే అయస్కాంతం శుభాన్నంతటినీ నా వద్దకు ఆకర్షిస్తుంది.”
2019 ముంబైలో స్వామి చిదానంద గిరిగారు చేసిన ప్రసంగం నుండి ఒక సారాంశాన్ని చదవడం ద్వారా ఈ విషయాన్ని మరింతగా తెలుసుకొనేందుకు మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మరింత శాంతియుతమైన మరియు ఐక్యమైన ప్రపంచం కోసం ఒక నిజమైన ఆశావాదాన్ని సృష్టించేందుకు — ఇతరులతో గాఢమైన ఆధ్యాత్మిక సంబంధాలను ఏర్పరచుకొనేందుకు ధ్యానం ఎలా సహాయపడుతుంది అనే అంశంపై వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు ఇందులో చర్చిస్తారు.