దయ యొక్క లోతైన అభ్యాసం మరియు ప్రభావం గురించి పరమహంస యోగానందగారు

20 నవంబర్, 2024

ఉపోద్ఘాతము: 

మనమందరము మన జీవితాల్లోను, ఈ ప్రపంచంలోను కూడా, దేవుని ఉనికి ఇంకొంచెం ప్రత్యక్షంగా ఉండాలని కోరుకుంటాము. 

దీనిని అత్యంత శీఘ్రంగా, సార్వత్రికంగా సాధించగలిగే మార్గాలలో ఒకటి ఏమిటంటే, మనం ఇతరులను ఎలా చూస్తాము, వారితో ఎలా ప్రవర్తిస్తాము అనేదే. 

వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక అధిపతి అయిన స్వామి చిదానంద గిరి గారు ఇలా సలహా ఇచ్చారు: “మీకు తారసిల్లిన వారందరిలోను – మీ అభిప్రాయాలతో ఏకీభవించని వారితో సహా – మంచితనాన్ని, ఆధ్యాత్మిక చైతన్యాన్ని గుర్తించి, వాటిమీద మీ దృష్టిని కేంద్రీకరించండి; ఈ విధమైన శ్రద్ధ చూపడమనే చర్య ద్వారానే ఈ లోకంలో భగవంతుని అభివ్యక్తి పెరుగుతుందని మీరు గమనిస్తారు…ఇతరులను ఆత్మస్వరూపులుగా చూడండి; ఈ విధమైన గౌరవప్రదమైన దృక్పథంతోను, ప్రశంసాత్మక వైఖరితోను, మీరు నిగూఢంగా వారినుండి — మరియు మీనుండి కూడా — ఆత్మలక్షణాల వ్యక్తీకరణను సూక్ష్మంగా ఆకర్షిస్తారు.” 

ఆత్మలక్షణమైన దయాగుణం యొక్క ఆచరణ — గొప్ప ప్రయోజనం, ప్రాముఖ్యత — గురించి పరమహంస యోగానందగారి ఉత్తేజకరమూ, సంతులితమూ అయిన జ్ఞానాన్ని ఈ క్రింద గ్రహించవచ్చు.

పరమహంస యోగానందగారి రచనలు, ప్రసంగాల నుండి:

హృదయపూర్వకమైన, మధురమైన పలుకులు దప్పికగొన్న ఆత్మలకు అమృతం వంటివి. సర్వత్రా దయగల పలుకుల ఆవశ్యకత ఉంది. 

దయను చూపడానికి ప్రతి ఒక్కరితోను అంగీకరించవలసిన అవసరం లేదు. ఇతరులతో ఒకరు అంగీకరిస్తున్నా, లేకున్నా, ప్రశాంతమైన మౌనం, హృదయపూర్వకత, ఇంకా మర్యాదతో కూడిన మాటలు, ఎలా ప్రవర్తించాలో తెలిసిన మనిషి తాలూకు ఆనవాళ్లు ఇవే.

ఆగర్భశత్రువు విషయంలోనయినా సరే, నిర్దయగా ఉండడం నేను తలచలేను. అది నన్ను బాధిస్తుంది. లోకంలో ఎంతో ఉంది నిర్దయ; దానికి మరికొంత కలపవలసిన కారణం నాకు లేదు. మీరు దేవుణ్ణి ప్రేమించినప్పుడు, ప్రతి ఆత్మలోను మీరు దేవుణ్ణి చూసినప్పుడు మీరు నీచంగా ఉండలేరు.

ఇతరులను మీ మీద అధికారం చెలాయించనివ్వవద్దు. కానీ, అంతర్గతంగా, మిమ్మల్ని ఎవరూ గాయపరచలేనంతగా, మీ మానసిక శాంతిని హరించలేనంత ప్రశాంతంగా ఉండండి. నా దయాగుణాన్ని ఎవరైనా పదేపదే దుర్వినియోగపరిచారనిపిస్తే, ఆ వ్యక్తి ఆ తప్పు తెలుసుకునేంతవరకు నేను గంభీరమైన మౌనాన్ని అవలంబించి, దూరంగా ఉంటాను; కానీ, నిర్దయుడిగా మాత్రం ఉండను.

చిన్ని అహం మీద సాధించే మహావిజయాల్లో ఒకటి ఏమిటంటే, ఎల్లప్పుడూ ఆలోచనాపరత్వంతోను ప్రేమతోను మీ సత్తాను రూఢిచేసుకోవడం, ఏ ఒక్కరూ కూడా మీరు వేరే విధంగా వ్యవహరించేటట్లు చెయ్యలేరన్న జ్ఞానంతో సురక్షితులై ఉండడం. దీన్ని సాధన చెయ్యండి. రోమన్ ప్రభుత్వం మొత్తం, క్రీస్తులో నిర్దయ రేపలేకపోయింది. తనకు శిలువ వేసినవాళ్ళ కోసం సైతం ఆయన ప్రార్థించాడు: “తండ్రీ, వాళ్ళను క్షమించు; వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకు తెలియదు కనుక.”

ఇతరులను సంతోషపరచడానికి మీరు మీ పరిధులు దాటిపోండి. మీరు అందరినీ సంతోషపెట్టలేరు, కానీ మీ మార్గంలో ఎదురైన వాళ్ళకి దయను, ప్రేమను ఇవ్వండి. మీమీద నిర్దయ ప్రదర్శించిన వాళ్ళపట్ల మనఃపూర్వకంగా తిరిగి దయచూపడం కంటే గొప్ప మోక్షదాయకమయిన పని ఇంకోటి లేదు.

[ఇలా దివ్యసంకల్పం చేయండి:] “నన్ను అపార్థం చేసుకున్నవారి మనస్సులను ఉత్సాహపరిచే ఆశతో, నేనెల్లప్పుడు, నిరంతరమైన దయ అనే శాశ్వతమైన దివిటీని పట్టుకొని ఉంటాను.”

ధ్యానశాస్త్రం ద్వారా, మనం మన చైతన్యాన్ని ఎలా వృద్ధి చేసుకుని, సత్యమైన మన ఆత్మస్వభావం యొక్క దివ్యలక్షణాలను ఎలా మేలుకొల్పుకోగలమో వివరిస్తూ వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు స్వామి చిదానందగారు 2023లో హైదరాబాద్ లో చేసిన ప్రసంగం నుండి ఈ చిన్న వీడియో చూసేందుకు మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. 

ఇతరులతో పంచుకోండి