ఇది, “సరియైన దృక్పథం: జీవితంలోని కష్టాలను సానుకూల విజయాలకు ఉపయోగించుకోవడం” అనే అంశంపై శ్రీ దయామాత గారు 1961 క్రిస్మస్ రోజున ఇచ్చిన ప్రసంగం నుండి సంగ్రహించబడిన చిన్న భాగం. ఇది శ్రీ దయామాత గారి ప్రసంగాల కొత్త సంకలనం అయిన జర్నీ విత్ పరమహంస యోగానంద అనే పుస్తకంలో ఒక అధ్యాయం (ఇది త్వరలో యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ద్వారా విడుదల కానుంది). యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ యొక్క ప్రియమైన మూడవ అధ్యక్షురాలు మరియు సంఘమాత అయిన శ్రీ దయామాత, జీవితంలో అనివార్యంగా వచ్చే సవాళ్ల పట్ల సరైన దృక్పథాన్ని పెంపొందించుకోవడమన్నది మనల్ని భగవంతునికి చేరువ చేసి, నిజమైన అంతర్గత స్వేచ్ఛను మరియు సంతృప్తిని కనుగొనడంలో ఎలా సహాయపడుతుందో చర్చిస్తున్నారు.
ప్రేమ మరియు అవగాహన, జ్ఞానం, ఆరోగ్యం, భద్రత, నిత్యానందం — వీటిని ప్రతి మానవుడు కోరుకుంటున్నాడు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న మనకందరికీ భగవంతునితో అనుసంధానం పొందడం ద్వారా ఈ లక్ష్యాలను సాధించగలమనే దృఢమైన నమ్మకం ఉంది. ఇది సార్వత్రిక సత్యం అయినప్పటికీ, దైవంతో అనుసంధానమయ్యే మార్గం మానవులందరికీ వర్తించే శాశ్వత సూత్రాలతో కూడుకున్నప్పటికీ, ఒక కోణంలో చూస్తే ప్రతి వ్యక్తి చాలా ప్రత్యేకమైన, ఏకాంత మార్గంలోనే పయనిస్తాడు. మన సహజమైన జ్ఞానాన్ని మేల్కొలపడానికి మరియు భగవంతునితో మన ఆత్మ యొక్క పరిపూర్ణమైన సంబంధాన్ని సాక్షాత్కరింపజేయడానికి మనలో ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా అవసరమైన నిర్దిష్ట పరిస్థితులు, పరీక్షలు మరియు పాఠాల ద్వారా ఆ మార్గం మనల్ని నడిపిస్తుంది.
కష్టకాలం వచ్చినప్పుడు, మనం కేవలం మానవమాత్రులమనుకునే మన చెడు అలవాటు వల్ల, “నాకే ఎందుకు? ఇలా జరగడానికి నేను ఏం తప్పు చేశాను?” అనే తప్పుడు ఆలోచనలకు లొంగిపోవడం లేదా మన జీవితం సాగుతున్న విధానంపై రోషం లేదా కోపం కలగడం సులభంగా జరుగుతాయి. సరైన దృక్పథాన్ని పెంపొందించుకోవడం వల్ల ఆ పరిస్థితులు ఎంత “అన్యాయంగా” అనిపించినా, సరైన దృక్పథాన్ని పెంపొందించుకోవడం అన్నది వాటిని మంచి అవకాశాలుగా చూడటానికి మనకు సహాయపడుతుంది — ఈ అవకాశాలు మన స్వంత కర్మ వల్ల సృష్టించబడినవే అయినప్పటికీ, మన ఆత్మల వికాసాన్ని వేగవంతం చేసే నిర్దిష్ట ప్రయోజనం కోసం భగవంతుని అంతర్లీన కృపతో ఆశీర్వదించబడినవి.
మన పురోగతి, మన కష్టాలు ఇతర వ్యక్తుల నుండి కాని, బాహ్య పరిస్థితుల నుండి కాని, వేరే ఏ మూలం నుంచి కాని రావనీ, అవి కేవలం భగవంతుని నుంచి, ఆయన విశ్వ నియమాల ద్వారా మాత్రమే వస్తాయన్న విషయాన్ని మనం ఎంత బాగా గ్రహించగలిగామన్న దానికి అనుగుణంగా ఉంటుంది. మనకు జరిగేది ఏదైనా అది మన అత్యున్నత మేలు కోసం ఉపయోగించుకోగలమనే సత్యానికి కనుక మనం కట్టుబడియుంటే, భగవంతుని శాశ్వతమైన అభయహస్తాన్ని అనుభూతి చెందుతాం, మన కష్టాలు మన అంతరంగాన్ని తాకలేవని గ్రహిస్తాము.
అందుకే మనం ఎదుర్కొనే పరిస్థితుల పట్ల సరైన దృక్పథాన్ని కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఆధ్యాత్మిక మార్గంలో దృక్పథమే ప్రతిదానికీ పునాది అని కూడా నేను చెబుతాను. మనం జీవితాన్ని ఎలా ఎదుర్కొంటాము, కష్టాలకు ఎలా స్పందిస్తాము, మన శ్రేయస్సు మరియు సమచిత్తతకు ఎదురయ్యే అనివార్య సవాళ్లకు ఎలా ప్రతిస్పందిస్తాము, మన ఆధ్యాత్మిక సాధనలలో ఎలా నిమగ్నమవుతాము — ఇవే మనం దైవానికి ఎంత దగ్గరగా వెళ్తామో, ఎంత త్వరగా వెళ్తామో నిర్ణయిస్తాయి.
మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంత కాలం, మనమందరం ఖచ్చితంగా తెలుసుకోగల ఒక విషయం ఉంది: మార్పు యొక్క అనిశ్చితి. మాయ యొక్క డోలాయమానాలు – వెలుగు మరియు చీకటి, ఆరోగ్యం మరియు అనారోగ్యం, జీవితం మరియు మరణం – మనకు నిరంతరం ఎదురవుతూనే ఉండే ద్వంద్వాలతో కూడిన ఈ ప్రపంచంలో దీనిని మనం తప్పించుకోలేము. వాటి అస్థిరత మనల్ని భయంతో లేదా నిరాశతో కృంగదీయకూడదు — అలా ఎన్నటికీ కాకూడదు! మన సహజస్వభావం సర్వోత్కృష్టం మరియు పరమానందభరితం అన్న పాఠాన్ని మనకు నేర్పడమే వాటి ఉద్దేశ్యం. అవి, ఈ నిరంతరమైన ఎత్తుపల్లాల నుండి విముక్తి పొందడానికి మనచేత ప్రయత్నం చేయించే ప్రేరకాలు. ద్వంద్వత్వనియమానికి అతీతంగా ఎదగడానికి మార్గం, మార్పులకు అతీతమైన, మార్పులేని సత్యమైన భగవంతునితో సంబంధం ఏర్పరచుకోవడమే.
పరమహంసగారు చెప్పినట్లుగా, “బ్రద్దలవుతున్న ప్రపంచాల విధ్వంసం మధ్య కూడా చలించకుండా నిలబడడం” మనం నేర్చుకోవాలి. అప్పుడు మనం భగవంతుని వైపు స్థిరంగా సాగుతున్నామని మనకు తెలుస్తుంది. అంతిమంగా మన మార్గం శాంతి అనే తీయని సెలయేటి గుండా వెళ్తుందా లేక పోరాటం అనే కఠిన యుద్ధభూమి మీదుగా వెళ్తుందా అనేది పెద్దగా పట్టించుకోనవసరంలేదు. మనం దేని కోసం ప్రయత్నిస్తున్నామో ఆ లక్ష్యంపై మన సంకల్పాన్ని, మన ఆకాంక్షలను స్థిరంగా ఉంచడమే ముఖ్యం. బహుశా మనం కొన్నిసార్లు తడబడి భ్రమలో కూరుకుపోవచ్చు, కానీ మన హృదయం నిజాయితీతో ఉంటే, భగవంతుని కోసం తపన గాఢంగా ఉంటే, ఆయన మనల్ని బంధించబడి ఉండనివ్వడు, ఎక్కువ కాలం ఆలస్యం చేయనీయడు. మనం ఏ అనుభవాలు మరియు అనుగ్రహాల ద్వారా విముక్తి పొందగలమో, వాటిని ఆయన మనకు పంపుతాడు.
నా జీవితంలో ఏదైనా అప్రియమైనది వచ్చినప్పుడు, దానిలోని ఆధ్యాత్మిక పాఠాన్ని గ్రహించడం కోసం దానికి సంబంధించిన వ్యక్తులను లేదా పరిస్థితులను దాటి చూడడం వల్ల ఎంత స్వేచ్ఛ లభిస్తుందో. నా జీవితంలోకి వచ్చిన ప్రతి బాధకు, ప్రతి నిరాశకు మరియు అపార్థానికి, అలాంటి ప్రతిదానికీ నేను వినమ్రంగా కృతజ్ఞురాలిని, ఎందుకంటే అవి నాకు – అలాగే, ఇదే దృక్పథంతో కష్టాలను ఎదుర్కొన్న మీ అందరికీ కూడా అవి – చేసిన మేలును నేను చూస్తున్నాను. కష్టాలు, భగవంతుడితో నా బంధాన్ని మరియు మనం ఎవరి అడుగుజాడల్లో నడిచే ప్రయత్నం చేస్తున్నామో ఆ ప్రియమైన గురుదేవులతో నా అనుసంధానాన్ని మరింత పటిష్టం చేస్తూ, నాకు బలాన్ని, అవగాహనను, ప్రేమను ఇచ్చే ఆ ఒక్కడి వైపు పరిగెత్తడం నాకు నేర్పాయి.
పరమహంసగారు ఒకసారి నాతో ఇలా చెప్పడం నాకు గుర్తుంది, “నీ జీవితం ఎన్నో వేధింపులతో నిండి ఉంటుంది, కానీ నీ మనస్సును నాతో ఉంచుకో.” భగవంతుని వైపు మనల్ని నడిపించే నమ్మకమైన మార్గదర్శి సద్గురువు. నా దగ్గరకు ఏది వచ్చినా అది నాకు ముఖ్యం కాలేదు, ఎందుకంటే నా మనస్సు మార్గంపై కంటే లక్ష్యంపైనే స్థిరంగా ఉంటుంది. మనలో ఎవరికీ కూడా మార్గం ఎల్లప్పుడూ సులభం కాదు. కానీ మనం నిరంతరం మనల్ని మనం “నాకు కలిగే ప్రతి అనుభవంతో నా మనస్సును మరింతగా భగవంతుని వైపు మళ్లించడానికి నేను ఎలా ఉపయోగించుకోగలను?” అని ప్రశ్నించుకుంటే, అప్పుడు మనం విజేతలమవుతాము. సరైన దృక్పథం ద్వారా మనం జీవితంలోని హృదయ వేదనలను దైవం వైపు వేగంగా పరుగెత్తడానికి ఉపయోగించుకుంటాము.




















