సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్, ఆ తర్వాత యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ద్వారా త్వరలో విడుదల కానున్న కొత్త పుస్తకం, జర్నీ విత్ పరమహంస యోగానంద అనే శ్రీ దయామాత గారి కొత్త ప్రసంగాల సంకలనంలోని “ఆధ్యాత్మిక పరిపక్వత అంటే దైవంతో అనుసంధానం కావడం” అనే అధ్యాయం నుండి ఒక చిన్న భాగం క్రింద ఇవ్వబడింది. ఈ సంగ్రహంలో, పరమహంస యోగానంద గారు చెప్పిన కొన్ని విముక్తిదాయక సత్యాలను మరియు మన జీవితాలలో మనం వ్యక్తపరచుకోవాలనుకొనే సత్యాలను ఆచరణాత్మకంగా పాటించడంలోని ప్రాముఖ్యత గురించి యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ యొక్క ప్రియమైన మూడవ అధ్యక్షులు మరియు సంఘమాత తెలియజేస్తున్నారు.
పరమహంస యోగానందగారు మమ్మల్ని ధ్యానం కోసం పిలిచినప్పుడు, కొన్నిసార్లు ఆయన చాలా తక్కువ మాట్లాడేవారు; కానీ ఆ కొద్దిమాటలలోనే అపారమైన అర్థం, అపారమైన సత్యం నిండి ఉండేది. ఆయన పలికిన ప్రతిమాటా, అది శిక్షణనిస్తున్నదైనా లేక ప్రశంసిస్తున్నదైనా, నా కోసమే అన్నట్లుగా నాకు అనిపించేది. ఆయన పలికిన ప్రతిమాటను స్వయంగా నేను పాటించవలసిన మార్గదర్శకంగా స్వీకరించాను. ఇతరులు అలా చేశారా లేదా అన్నది నాకు అనవసరం. ఆయన మాటలు, ముఖ్యంగా ఆయన చీవాట్లు ఇతరుల కోసం ఉద్దేశించినవని నేను ఎన్నడూ అనుకోలేదు. సత్యమనే ప్రతిచిన్న గులకరాయిని నేను ఏరుకుని, దాన్ని నిధిలా దాచుకున్నాను. ఆయన పలికిన ప్రతిమాటను నేను హృదయంలో భద్రపరచుకోకపోతే, ఆయన మాటలతో ప్రయోజనం లేదని నాకు అనిపించేది. ఈరోజు మనందరికీ కూడా ఇదే వర్తిస్తుంది. మనం భగవంతుడిని తెలుసుకోవాలనుకుంటే, గురువు యొక్క మార్గదర్శకత్వాన్ని అనుసరించడానికి మనం ఇలాంటి ప్రయత్నమే చేయాలి.
ఒక సాయంత్రం ధ్యానం తర్వాత, గురుదేవులు మమ్మల్ని ఆశీర్వదిస్తూ మూడు విషయాలు చెప్పారు. అప్పటినుండి నేను వాటిని ఆచరించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఈరోజు నుండి మీరందరూ వాటిని ఆచరించాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను:
- సానుభూతితో ఉండండి.
- విమర్శించవద్దు.
- వినయంగా ఉండండి.
నా గదికి తిరిగివచ్చి, వాటిని వ్రాసుకుని, నిరంతరం అవి గుర్తు ఉండే చోట వాటిని పెట్టుకున్నాను.
సానుభూతితో ఉండండి: దీని అర్థం మరింత అవగాహనతో, కరుణతో ఉండటం; ఇతరుల పట్ల సానుభూతి చూపడం, వారి గురించి ఆలోచించడం, అవసరమైన సమయాల్లో సహాయపడటం, మరియు ఎల్లప్పుడూ ఇతరుల గురించి మంచిగా ఆలోచించడానికి ప్రయత్నించడం.
విమర్శించవద్దు: విమర్శించడం అనేది ఒక దీర్ఘకాలిక మానసిక రుగ్మతగా మారవచ్చు. ఈ చెడు అలవాటుకు లోనవడం చాలాసులభం, ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏదీ పరిపూర్ణంగా ఉండదు; ప్రతిఒక్కరిలో స్పష్టమైన లోపాలు ఉంటాయి — నిస్సందేహంగా అందులో మనం కూడా ఉంటాము. కానీ, ఇతరులను ప్రతికూలంగా, అతిగా విమర్శించడానికీ, మనం ఆ తప్పులు చేయకుండా ఉండేందుకు ఒక వ్యక్తిగత పాఠంగా వారి తప్పులను మనసులో గమనించుకోడానికి మధ్య ఒక సూక్ష్మమైన తేడా ఉంది. ఒకరిపై మరొకరు తీర్పు చెప్పే హక్కు మనకు లేదు; ఆ హక్కు కేవలం దేవునికి మాత్రమే ఉంది. విమర్శనాత్మక స్వభావం ఉన్నవారు, అది వారి ఆధ్యాత్మిక పురోగతికి ఒక పెద్ద ఆటంకమని తెలుసుకుంటారు.
వినయంగా ఉండండి: వినయం అనేది “నేను వినయవంతుడిని” అనే ఉత్తమాటల్లో కాకుండా మన వైఖరిలో వ్యక్తమవుతుంది. ఇది దేవునితో ఉన్న ఒక మధురమైన, రహస్యమైన, నిశ్శబ్దమైన, ప్రేమపూర్వకమైన సంబంధం, దీనిలో మనకు దక్కవలసిన ఘనత ఏదో ఉందని మనం ఎన్నడూ భావించము. ప్రశంసించబడినప్పుడు, దేవుని ఆశీర్వాదం, మార్గదర్శకత్వం మరియు సహాయం లేకుండా మనం ఆ గుర్తింపును పొందలేకపోయేవారమని మనకు తెలుసు.
నిజమైన వినయం కోసం, అనగా ఆత్మవిస్మృతి అనే అంతర్గత వైఖరి కోసం, ప్రార్థించండి: “ప్రభూ, నీవే కర్తవు, నేను కాదు.” గాఢంగా కేంద్రీకరిస్తూ, అహంకారం నుండి విముక్తి కలిగించమని దేవుడిని వేడుకుంటూ దీనిని ఒక మానసిక మంత్రంగా జపించండి. వినయం లేకుండా ఆధ్యాత్మిక జీవితాన్ని నిర్మించుకోవడానికి దృఢమైన పునాది ఉండదు. మనసు, హృదయం భగవంతుడి ఆలోచనలతో, ఆయనపై ప్రేమతో ఎంత ఎక్కువగా నిండిపోతాయో, “నేను, నేను, నేను” అనే స్వార్థానికి అంత తక్కువ చోటు ఉంటుంది.
గురుదేవులు మనకు అందించిన విముక్తిదాయక సత్యాలను, సాధ్యమైనంత స్పష్టమైన రూపంలో మీకు అందించడం నా భాగ్యం మరియు ఆనందం. ఇది ఆయన ఉపదేశం. భగవంతుడిని తెలుసుకోవాలనే మీ చిత్తశుద్ధిగల ప్రయత్నంలో భాగంగా ఈ సత్యాలను అన్వయించుకోండి. ఆధ్యాత్మిక వికాసం, అన్నింటికంటే ముందుగా, ఒక అంతర్గత విషయం. మీరు ఈ సత్యాలను హృదయానికి హత్తుకుని, వాటిని అంతర్గతంగా మననం చేసుకుంటూ, వాటితో మీ ఆలోచనలను మరియు ప్రార్థనలను నింపుకుంటే, అవి మీ జీవితంలో బాహ్యంగా వ్యక్తమవడం ప్రారంభిస్తాయి. “ఒక మనిషి తన హృదయంలో ఎలా ఆలోచిస్తాడో, అతడు అలాగే ఉంటాడు.” *
అధోజ్ఞాపిక:
* సామెతలు 23:7 (బైబిల్).




















