మీరు శాశ్వతమైన భద్రతను ఎక్కడ పొందగలరు? అనే అంశం గురించి పరమహంస యోగానందగారు

17 మే, 2025

“భగవంతునితో అనుసంధానం: మానవుడి ప్రధాన అవసరం,” (“గాడ్ కమ్యూనియన్: మాన్స్ గ్రేటెస్ట్ నెసెస్సిటీ”) అనే ఉపన్యాసం నుండి ఈ క్రింది పోస్ట్ గ్రహించబడినది. పరమహంస యోగానందగారి ప్రసంగాలు మరియు వ్యాసాల నుండి సేకరించబడిన జీవిత రహస్యాన్ని పరిష్కరించడం (సాల్వింగ్ ద మిస్టరి ఆఫ్ లైఫ్) సంపుటం IV అనే గ్రంథంలో దీనిని పూర్తిగా చదవగలరు — ఈ గ్రంథం త్వరలో సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ ద్వారా మరియు తరువాత యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ద్వారా విడుదల చేయబడుతుంది. జనవరి 7, 1940న కాలిఫోర్నియాలోని ఎన్సినీటస్ లోని సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ గోల్డెన్ లోటస్ టెంపుల్ రెండవ వార్షికోత్సవ వేడుకలో పూర్తి ప్రసంగం ఇవ్వబడింది.

ఈ ప్రపంచంలో కొన్ని లోపాలు ఎప్పుడూ ఉంటాయి. మానవజాతికి ప్రయోజనం చేకూర్చే అద్భుతమైన పద్ధతులు ఎన్ని కనుగొనబడినా, ఈ భౌతిక ప్రపంచం మానవజాతికి పూర్తిగా భద్రతగా ఉండదు. యేసు కొన్ని చేపలు మరియు రొట్టెలతో ఐదు వేల మందికి ఆహార మివ్వడం మరియు చనిపోయినవారిని లేపడం వంటి అద్భుతాలు చేయగలిగినప్పటికీ, మంచి చేసినందుకు ఆయన బాధలు అనుభవించవలసి వచ్చింది. తన శక్తుల ద్వారా సమస్తమూ భగవంతునిదేనని ఆయన చూపించాడు. ఆ అతీంద్రియ ఆత్మ చైతన్యాన్ని మనం పెంపొందించుకొన్నప్పుడు, మనం క్రమంగా అన్ని పరిధులను దాటి బాహ్య వ్యక్తీకరణాలన్నింటికీ అంతర్లీనంగా ఉన్న ఒకే వాస్తవికతను గ్రహిస్తాము.

దుఃఖం లేదా ఆనందం, ఆరోగ్యం లేదా అనారోగ్యం, జీవితం లేదా మరణం, అస్తిత్వం యొక్క అన్ని ద్వంద్వాలలో — అదే మనం సంతోషంగా ఉండగల ఏకైక మార్గం, మరియు, అదే మనం భద్రంగా, సురక్షితంగా ఉన్నామని భావించగల ఏకైక సమయం. నిరంతరం మారుతున్న భౌతిక పరిస్థితుల నుండి మనం పరిపూర్ణతను ఆశించకూడదు, కానీ శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వగలిగేది ఆ పరమపిత మాత్రమే అని గ్రహించాలి.

మీకు భయంకరమైన వ్యాధి ఉన్నట్లుగా మీరు కల కంటున్నారని, మీ కలలో బలంగా మరియు ఆరోగ్యంగా ఉన్న మరొకరిని మీరు చూస్తున్నారని అనుకుందాం. అప్పుడు మీరు పేదవారిగా మరియు ఆకలిగా ఉన్నారని, మరొకరికి పుష్కలంగా ఉందని మీరు చూస్తారు. మీరు కల కంటున్నప్పుడు, మీ నొప్పి మరియు ఆకలి నిజమైనవిగానే అనిపిస్తాయి; కానీ మీరు మేల్కొన్నప్పుడు మీరు ఉపశమనంతో చిరునవ్వు చిందిస్తారు.

కాబట్టి మనం జీవిస్తున్న ఈ కలల ప్రపంచం విషయంలో కూడా అలాగే జరుగుతుంది. నేను దీన్ని నిత్యం చూస్తూనే ఉన్నాను. బాహ్యంగా నేను ఈ స్వప్న మాయా ప్రపంచంలో భగవంతుడి కోసం పని చేయడానికి శరీరం మరియు భౌతిక అస్తిత్వం యొక్క పరిమితులతో పోరాడాలి; కానీ దేవుని-ఎరుక యొక్క అంతర్గత జాగృతిలో నేను ఆత్మానందం మరియు బేషరతైన స్వేచ్ఛను నిరంతరం అనుభవిస్తున్నాను.

ఈ ప్రపంచంలోని ద్వైతాలన్నీ భగవంతుని పరీక్షలే. మర్త్య జీవితపు భ్రమ నుండి మనం మేల్కోవాలని, అమరత్వ చైతన్యంలోకి మనం ఎదగాలని ఆయన కోరుకుంటున్నాడు. మహాత్ములు కూడా పరీక్షించబడతారు; వారు అనేక పరీక్షలకు గురి కావలసి ఉంటుంది. సెయింట్ ఫ్రాన్సిస్ జీవితాన్ని చదవండి — ఇతరులకు స్వస్థత చేస్తున్నప్పుడు కూడా ఆయన ఎంతగానో బాధ పడుతుండేవాడు, కాని తన స్వస్థత కోసం దేవుడిని ఆయన ఎన్నడూ ప్రార్థించలేదు. ప్రతి రాత్రి ఆయన యేసుక్రీస్తును దర్శించేవాడు. ఆయన విషయాసక్తులతో కూడిన అలవాట్లతోనే జన్మించాడు, అయినప్పటికీ భగవంతుడికి సంపూర్ణ శరణాగతితో అత్యున్నత స్థితులకు ఆయన ఎదిగాడు.

మన పొగడ్తలకు దేవుడు స్పందించడు, కాని మన ప్రేమకు స్పందిస్తాడు

అద్భుతాలు చేసే సామర్థ్యంతో మహాత్ములు కాలేరు. అలాంటి విన్యాసాలు దేవుణ్ణి మెప్పించలేవు; ఈ సంక్లిష్టమైన మరియు అద్భుతమైన సృష్టిలో ఆయన ఎల్లప్పుడూ అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు. తనను ప్రేమించేవారి ప్రేమ పట్ల మాత్రమే ఆయన ఆసక్తి కలిగి ఉంటాడు. దేవుని పట్ల ప్రేమతో మీ హృదయాన్ని పవిత్రంగా మార్చుకోవడమే గొప్ప అద్భుతం; మరేదీ మీ ఆత్మను పూర్తిగా సంతృప్తి పరచలేదు.

పొగడ్తలతో దేవుడు స్పందించడు, ఎందుకంటే ఆయనలో అహంకారం లేదు. మీరు ఇతరులెవరి ఆసక్తిని కోరకుండా, మిమ్మల్ని ప్రేమించే నిజమైన ఆత్మల పట్ల మాత్రమే ఆసక్తిని కలిగి ఉన్నప్పుడు, నిజమైన స్నేహం అంటే ఏమిటో మీరు అర్థం చేసుకున్నప్పుడు, ముఖస్తుతి పలుకులు మిమ్మల్ని స్పందింపజేయకుండా, నిజమైన హృదయాల ప్రేమ మాత్రమే మిమ్మల్ని స్పందింపజేసినప్పుడు — దేవుడు మీ నుండి ఆశిస్తున్న ప్రేమను, మీపై చూపిస్తున్న ప్రేమను, అప్పుడు మీరు తెలుసుకొంటారు.

అందుకే ఇలాంటి దేవాలయాలు ముఖ్యమైనవి — మనమందరం మతం యొక్క ఉపరితలాలను భగవంతుని ప్రత్యక్ష అనుభవంగా మార్చుకోవచ్చు. చర్చివాదం నుండి చర్చిని రక్షించడానికి మరియు నిజమైన క్రైస్తవ మతాన్ని తిరిగి తీసుకువచ్చేందుకు మహాత్ములైన యేసుక్రీస్తు, బాబాజీ, లాహిరీ మహాశయులు మరియు నా గురుదేవులు కలిసి సమావేశమయ్యారు. అందుకే నేను మీకు సేవ చేయడానికి వచ్చాను. ఈ బోధన ప్రతి వ్యక్తికీ ముక్తిదాయకంగా నిలుస్తుంది. ప్రపంచంలోని సౌఖ్యాలకు సంబంధించిన ఆవిష్కరణలన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగించలేవు. ప్రాచ్య దేశాల నుండి ఇక్కడికి వచ్చిన నేను మొదట అమెరికాలోని చమత్కారంగల యంత్రాలు మరియు భౌతిక పురోగతి పట్ల ఆకర్షితుడయ్యాను; కానీ ఈ విషయాలు మీకు శాంతి మరియు సంతృప్తిని కలిగించడం లేదని నేను గమనించాను. నిజమైన శాంతి మరియు సంతృప్తి భగవంతుని పరమానందంలోనే ఉన్నాయి.

ఆత్మ చైతన్యపు శాశ్వతమైన భద్రతలో, మాయా లోకం యొక్క కలలను దాటి అక్కడకు ఎటువంటి మరణం, ఏ వ్యాధి, ఏ ఇబ్బంది ఎప్పుడూ ప్రవేశించలేవు. ఆ శరణాలయంలో లంగరు వేయండి. లోతైన, క్రమబద్ధమైన ధ్యానం ద్వారా ఆ చైతన్యంలో మిమ్మల్ని మీరు స్థిరపరచుకొంటే, మీరు అక్కడ పరమాత్మను కనుగొంటారు.

ఇతరులతో పంచుకోండి