యువ సాధకుల ఏకాంత ధ్యాన వాసం: ఒక అంతరంగ ప్రయాణం

April 22, 2025

ఈ ఏకాంత ధ్యాన వాసం, నాకు చాలా గొప్ప అనుభూతిని ఇచ్చింది, అది నాకు శాంతిని అనుభవించేందుకు, దేవుని పట్లా, నా గురుదేవుల పట్లా భక్తిని పెంచుకునేందుకు మరియు, ఒత్తిడి నుండి ఉపశమనం పొందేందుకు వీలు కలిగించింది.

— ఎం.ఆర్., ఝార్ఖండ్

మొట్టమొదటిసారిగా, యువ సాధకుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఏకాంత ధ్యాన వాసం, మార్చి 5 నుండి 10, 2025 వరకు రాంచీలోని యోగదా సత్సంగ శాఖా మఠంలో నిర్వహించబడింది. యువ ఆధ్యాత్మిక సాధకులకు – 18 నుంచి 35 సంవత్సరాల వయసులో ఉన్న వై.ఎస్.ఎస్. భక్తులకు మరియు క్రియాబాన్ల కోసం — యువ సత్యాన్వేషకులు అందులో నిమగ్నమయ్యేట్లుగాను, పరివర్తనకారక అనుభవంగాను ఉండే విధంగా అది రూపొందించబడింది. ఈ ఏకాంత ధ్యాన వాసం, గురుదేవుల బోధనలతో వారి సంబంధాన్ని మరింత దృఢపరచడానికి, ధ్యానప్రక్రియల గాఢ అభ్యాసానికి, ఆంతరంగిక చింతన, స్వయం-శిక్షణ, మరియు ఇతర యువ భక్తులతో సహవాసానికి ఒక స్థానం కల్పించాలని లక్ష్యాలుగా పెట్టుకుంది. 

స్మృతి మందిరం వద్ద స్వామీజీలు శంకరానంద, శ్రేయానందలతో ఏకాంత ధ్యాన వాస యువ సాధకులు

పరమహంస యోగానందగారు, మరియు స్వామి శ్రీయుక్తేశ్వర్ గార్ల మహాసమాధి దినోత్సవాలయిన మార్చి 7 మరియు మార్చి 9వ తేదీలతో కలిసి ఏకకాలంలో ఈ ఏకాంత ధ్యాన వాసం జరగడం ఈ సందర్భాన్ని మరింత శుభప్రదం చేసింది. గాఢమైన, దీర్ఘమైన ధ్యానం, ఆధ్యాత్మిక ప్రసంగాలు, భక్తి కార్యక్రమాలు, సేవ, మరియు హుండ్రు జలపాతం వద్దకు ఒక ఉత్సాహభరితమైన విహారయాత్రలతో సమతుల్యం చేస్తూ, ఆలోచనాత్మకంగా ఇది రూపొందించబడింది.

ఇందులో పాలొన్న ఒక యువ సాధకుడు తన అనుభవాన్ని సంక్షిప్తంగా ఇలా తెలిపాడు:

భగవంతుడు మరియు గురుదేవులతో ఒక గాఢమైన సంబంధాన్ని వృద్ధి చేస్తూ, ధ్యానం, ఆత్మ-శిక్షణ, గురుసేవ వంటి వాటితో వై.ఎస్.ఎస్. రాంచీ ఆశ్రమంలో ఆరు రోజులపాటు జరిగిన ఈ ఏకాంత ధ్యాన వాసం ఆధ్యాత్మిక ప్రగతిని పెంపొందించింది.

— ఎస్.ఎన్., ఝార్ఖండ్

దిశానిర్దేశం మరియు నిమగ్నమవ్వడం

ఈ ఏకాంత ధ్యాన వాసంలో పాల్గొంటున్న వారందరూ సరియైన మానసికస్థితిలోకి ప్రవేశించేందుకు, వారి లక్ష్యాలను సుష్పష్టం చేసుకొనేందుకు, మరియు ఏకాంత ధ్యాన వాసం నుండి అత్యధిక ప్రయోజనం పొందే దిశానిర్దేశంతో ఇది ప్రారంభమయ్యింది.

ఆ తరువాత స్వామీజీలు శంకరానంద, శ్రేయానందలు, ఏకాంత ధ్యాన వాసంలో పాల్గొన్న వారితో, వై.ఎస్.ఎస్. రాంచీ ఆశ్రమ ప్రదేశాల తీర్థయాత్రను కావించారు; వారితో ఆశ్రమం యొక్క చరిత్రను పంచుకొని, గురుదేవులు పావనం చేసిన సుందరమైన ప్రదేశాల ప్రాముఖ్యతను వారు అర్థం చేసుకొనేందుకు తోడ్పడ్డారు.

ఒక నిర్మాణాత్మక, ఆత్మపూర్వక దినచర్య

ఆలోచనాశీలక, ప్రశాంత ప్రవృత్తులను కలుగచేసే సామూహిక ధ్యానంతో, ప్రతిదినం ప్రారంభమయ్యేది. దీని తరువాత, ఆధ్యాత్మిక పఠనము, అనుభవజ్ఞులైన సన్యాసులతో సంభాషణాపూర్వక సత్సంగాలు, మరియు గురుదేవుల బోధనల పట్ల అవగాహనను పెంపొందించే సామూహిక కార్యక్రమాలు జరిగేవి. ఏకాంత ధ్యాన వాసులు ఆ తరవాత విరామంలో స్మృతిమందిరం, లిచీ వేది, లేక గురుదేవుల గదిలో మధ్యాహ్న ధ్యానం చేసేవారు. సమగ్రమైన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సు యొక్క అనుభూతిని అందించే బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, క్రికెట్, జపం చేస్తూ నడక వంటి తేలికపాటి వినోద కార్యక్రమాలతో సాయంత్రాలు ఉల్లాసంగా గడిచేవి.

స్మృతిమందిరం మరియు లిచీ వేది వద్ద ధ్యానం చేస్తున్న యువసాధకులు

పరధ్యాన ప్రపంచంలో ఏకాగ్రతను సాధించడం

“పరధ్యాన ప్రపంచంలో కేంద్రీకృతమై ఉండడం” అన్న విషయంపై మాతృమందిరంలో స్వామి నిర్మలానంద నిర్వహించిన సత్సంగం ఒక ముఖ్యమైన అంశం. ఇందులో పాల్గొన్నవారు ఆత్మపరిశీలన అభ్యాసాల ద్వారా పరధ్యానం కలిగించే ముఖ్య సాధనాలు — సామాజిక మాధ్యమాలు (సోషల్ మీడియా), మితిమీరిన స్క్రీన్ టైమ్ (ఫోన్లు, టాబ్లెట్లు, వంటి సాధనలపై గడిపిన సమయం), అశాంతికరమైన ఆలోచనలు, మొదలగునవి గుర్తించారు. ధ్యానంలోను, స్వీయ అవగాహనలోను గాఢంగా నిమగ్నమయ్యేందుకు వీలుగా, ఏకాంత ధ్యాన వాస సమయంలో ఫోన్ల ఉపయోగాన్ని పరిమితం చేసేందుకు వారిని ప్రోత్సహించడం జరిగింది. చాలామంది యువ సాధకులు హాంగ్-సా యొక్క అభ్యాసం, తమ దైనందిన జీవితంలో ఏకాగ్రతను, క్రమశిక్షణను వృద్ధి చేసుకోవడానికి ఎంతగానో సహాయపడిందని తెలిపారు.

గురుసేవ: క్రియ రూపంలో ప్రేమ

“ప్రేమ మాత్రమే నా స్థానాన్ని భర్తీ చేయగలదు” అన్న గురుదేవుల వచనాల స్ఫూర్తితో, “క్రియ రూపంలో ప్రేమ — గురుసేవ యొక్క అనుగ్రహం” అన్న విషయంపై జీవించడం-ఎలా కార్యక్రమం నిర్వహించబడింది; ఇందులో, నిస్వార్థమైన సేవ భగవంతునితోను, గురువుతోను సంబంధాన్ని ఎలా దృఢపరుస్తుందన్న అంశం మీద సామూహిక చర్చ నిర్వహించబడింది. ఈ చర్చ అనంతరం, శ్రవణాలయ మందిరంలోను, ఆశ్రమంలోని వనాలలోను సేవ చేయడం ద్వారా, ప్రేమను క్రియ రూపంలో వ్యక్తపరిచే ఆచరణాత్మకమైన కార్యక్రమం నిర్వహించబడింది.

గురువులను గౌరవించడం: మహాసమాధి స్మారకోత్సవాలు

దీర్ఘాధ్యానాలు, భక్తిపూర్వక భజనలు, పుష్పాంజలి, కథాశ్రవణం, మరియు ధ్యానాలను, సేవను ఎలా గాఢతరం చేసుకోవాలన్న అంశంపై సన్యాసులతో సంభాషణలు వంటి కార్యక్రమాలతో గురుదేవులు, మరియు స్వామి శ్రీయుక్తేశ్వర్ గార్ల మహాసమాధి దినాలను శ్రద్ధతో పాటించడం జరిగింది. ఈ కార్యక్రమాల ద్వారా, యువ సాధకులకు ధ్యానప్రక్రియలు, వ్యక్తిగత సమస్యలు, గురు-శిష్య సంబంధం వంటి అంశాలపై మార్గనిర్దేశం పొందడానికి అవకాశాలు లభించాయి. “గురు-శిష్యుల సంబంధం ప్రపంచంలోని ఇతర సంబంధాలతో పోలిస్తే, అత్యున్నతమైన సంబంధం, ఎందుకంటే, ఇది స్వచ్ఛమైన, బేషరతైన, నిస్వార్థమైన ప్రేమ మీద ఆధారితమైనది,” అన్న స్వామి శ్రేయానందగారి సందేశం యువ సాధకులను ఆకట్టుకుంది.

యువసాధకులతో ఇష్టాగోష్టిగా సత్సంగంలో పాల్గొన్న స్వామి నిర్వాణానంద

హుండ్రు జలపాతాలకు విహారయాత్ర: ప్రకృతిలో ఒక ఆధ్యాత్మిక ఏకాంత ధ్యాన వాసం

గురుదేవులు అప్పుడప్పుడూ తమ శిష్యులను విహారయాత్రకు తీసుకువెళ్లేవారు. అదే విధంగా, యువ సాధకుల కోసం హుండ్రు జలపాతం వద్దకు ఒక విహారయాత్ర నిర్వహించబడింది. జలపాతం వద్దకు చేరుకున్న తరువాత, ఆ నిర్మలమైన పరిసరాలలో, వారు సామూహిక ధ్యానము, ఉల్లాసభరితమైన కార్యక్రమాలు, మరియు ప్రశాంతమైన ఆత్మపరిశీలనలో గడిపారు. ఆశ్రమానికి తిరిగి వచ్చిన తరువాత, సాధకులు, గురుదేవుల జీవితానికి సంబంధించిన ఒక డాక్యుమెంటరీ ప్రత్యేక ప్రదర్శన కోసం సమావేశమయ్యారు.

ఒక ఆనందభరితమైన ముగింపు

చివరి రోజున, “ఇంటికి-తీసుకువెళ్లే భావాలు” అన్న అంశంపై ఒక కార్యక్రమం జరిగింది. అందులో, ఈ ఏకాంత ధ్యాన వాసంలో నేర్చుకున్న విషయాలను దైనందిన జీవితంలో ఎలా సమన్వయం చేసుకోవాలన్న విషయంపై ఆచరణాత్మక మార్గనిర్దేశం చేయడం జరిగింది. ఇందులో పాల్గొన్నవారు, సరికొత్త స్పష్టతతో, భక్తితో, మరియు అంతర్గత బలంతో, వీడ్కోలు పలికారు.

చాలామంది ఈ ఏకాంత ధ్యాన వాసానికి కృతజ్ఞతలు తెలిపారు. హాజరైనవారిలో ఒక వ్యక్తి తన అనుభవం గురించి ఇలా అందంగా తెలిపారు:

నక్షత్రమయమైన రాత్రులలోనూ, సూర్యోదయపు ధ్యానాలతోనూ, కీర్తనలు, ప్రార్థనలు, దివ్యసంకల్పాల యొక్క నిరంతర ఝంకారాలతో మా హృదయాలు నిండాయి. నిశ్శబ్దంలో కూడా, మేము ఒకరి నుండి ఒకరికి పరస్పరం ప్రసరిస్తున్న ప్రేమలో ఆనందించాము. నా జీవితాన్ని ఏకాగ్రత, భక్తి, మరియు స్వయం-శిక్షణలతో నడిపించుకోవడానికి ఉపయోగపడే సాధనాలను ఈ ఏకాంత ధ్యాన వాసం అందించింది.

— కె. ఏ., చండీగఢ్

ఈ యువసాధకుల ఏకాంత ధ్యాన వాసం నిజంగానే ఒక విందు లాంటిది — ఒక పవిత్రమైన విరామం, ఆత్మతో సంపర్కం కలిగించుకునే అవకాశం, ఆపై, శాంతికి మార్గం ఆంతరంగికమని గుర్తుచేసే జ్ఞాపిక.

para-ornament

వై.ఎస్.ఎస్. యువజన సేవల గురించి మరిన్ని వివరాల కోసం ఈ క్రింది బటన్ ను క్లిక్ చెయ్యండి.

ఇతరులతో పంచుకోండి