కుంభమేళాలో వై.ఎస్.ఎస్. శిబిరం — 2025

15 మార్చి, 2025

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళన మయిన కుంభమేళా, గంగ, యమున మరియు నిగూఢమైన సరస్వతి నదుల యొక్క పవిత్ర సంగమానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాధకులను ఆకర్షిస్తుంది. యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ (వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్.) భక్తుల హృదయాలలో, మేళాకు గాఢమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది, ఎందుకంటే పరమహంస యోగానందగారు ఒక యోగి ఆత్మకథలో వర్ణించినట్లుగా ఇది పూజ్యులైన మన గురుదేవులు మరియు పరమగురువులు — మహావతార్ బాబాజీ, లాహిరీ మహాశయులు, స్వామి శ్రీయుక్తేశ్వర్ గారు మరియు పరమహంస యోగానందగారి పవిత్ర ఉనికితో ఆశీర్వదించబడింది.

తన దీర్ఘకాల సంప్రదాయానికి అనుగుణంగా, 2025లో జనవరి 10 నుండి ఫిబ్రవరి 15 వరకు ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో — వై.ఎస్.ఎస్. ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసి, వేలాది మంది వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. భక్తులు, కుటుంబాలు మరియు స్నేహితులకు ప్రశాంతమైన మరియు ఉత్తమమైన తీర్థయాత్ర అనుభవాన్ని అందించింది.

ఒక పవిత్ర ప్రారంభం: ప్రారంభోత్సవం మరియు ఆధ్యాత్మిక కార్యకలాపాలు

వై.ఎస్.ఎస్. శిబిరాన్ని జనవరి 10న స్వామి ఈశ్వరానంద గిరి ప్రారంభించారు. శిబిరంలో బస చేసిన భక్తులకు సంగమంలో పవిత్ర స్నానమాచరించడానికి మరియు వై.ఎస్.ఎస్. సన్యాసులు నిర్వహించే వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడానికి అవకాశం కలిగింది – సామూహిక ధ్యానాలు, కీర్తనలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు మరియు వీడియో ప్రదర్శనలు ప్రతిరోజూ నిర్వహించబడ్డాయి.

పరమహంస యోగానందగారి బోధనలను మరియు క్రియాయోగాన్ని మరింత గాఢంగా సాధన చేయడానికి కావలసిన ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం పొందేందుకు సన్యాసుల సలహా సమావేశం కూడా భక్తులకు అందుబాటులో ఉన్నది.

“నిర్మలం, ఆనందమయము, దివ్యము! జీవితంలో ఒక్కసారి మాత్రమే కలిగే ఒక అసమానమైన ఆధ్యాత్మిక అనుభవం.”

– ఎల్.ఎన్., తెలంగాణ

ఉత్సాహంగా పాల్గొన్న భక్తులు

ప్రపంచం నలుమూలల నుండి సుమారు 2,500 మంది భక్తులు ఉత్సాహంగా వై.ఎస్.ఎస్. శిబిరాన్ని సందర్శించారు. ప్రతి రోజు దాదాపు 300 మంది భక్తులు శిబిరం యొక్క కార్యకలాపాలలో పాల్గొనడంతో, ఇది దివ్యా సహవాసానికి ఒక శక్తివంతమైన కేంద్రంగా మారింది.

శిబిరం సజావుగా సాగేందుకు 100 మందికి పైగా భక్తులు స్వచ్ఛందసేవలో పాల్గొని, నిస్వార్థ సేవా స్ఫూర్తిని శిబిరంలో వ్యాపింపజేశారు. స్వచ్ఛంద సేవకులు పుస్తకాలు, స్వాగత కేంద్రం, వంటగది, ఆతిథ్యం మొదలైన వాటిలో పాల్గొన్నారు.

“గురుదేవుల ప్రేమ మరియు ఆప్యాయతతో నిండిన నా మాతృ గృహంలో ఉన్నట్లుగా నేను భావించాను. మొత్తం అనుభవం దివ్యమైనది…. ఎంతో ప్రేమతో, శ్రద్ధతో మాకు సేవ చేసిన స్వచ్ఛంద సేవకులందరిలో గురుదేవుల ఉనికిని మేము అనుభవించగలిగాము.”

– జె.ఎల్., ఆంధ్రప్రదేశ్

బస కోసం సౌకర్యవంతమైన ఏర్పాట్లు

సౌకర్యవంతమైన మరియు ఆధ్యాత్మికంగా సుసంపన్నమైన బసను ఏర్పరిచేందుకు, గత మేళాలతో పోలిస్తే వై.ఎస్.ఎస్. శిబిరంలో అనేక మెరుగుదలలు చేయబడ్డాయి:

  • భక్తుల సౌకర్యార్థం మంచాలు, దుప్పట్లు, వేడినీరు ఏర్పాటు చేయబడ్డాయి.
  • చల్లదనాన్ని నిరోధించడానికి శిబిరం మొత్తం టార్పాలిన్‌ తో కప్పబడింది.
  • టైల్స్ ఫ్లోరింగ్‌తో కూడిన పరిశుభ్రమైన మరుగుదొడ్లు చాలా జాగ్రత్తగా నిర్వహించబడ్డాయి.

శిబిరం యొక్క ప్రశాంతమైన వాతావరణం భక్తులచే ఎంతగానో ప్రశంసించబడింది, ఇది కుంభమేళా యొక్క విస్తారమైన జనసంద్రం మధ్య ప్రశాంతమైన పవిత్ర స్థానంగా ఆవిర్భవించింది.

మరొక భక్తుడు ఇలా అన్నాడు: “ఈసారి, ప్రతిదీ బాగా మెరుగుపడింది! మంచాలు, దుప్పట్లు, ఛార్జింగ్ పాయింట్లు, పారిశుధ్యం ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి. ధ్యాన మందిరం, స్వాగత కేంద్రం, సమావేశ గదులు అన్నీ చాలా చక్కగా ఉన్నాయి. వాతావరణం ప్రశాంతంగా ఉంది మరియు శిబిరం విశాలంగా అనిపించింది. పుష్టికరమైన సాత్విక ఆహారం తీసుకుంటూ, గంగానది సమీపాన ధ్యానం చేయడం నిజంగా ఒక వరం. కుంభమేళాలో ఈ అద్భుతమైన అనుభవాన్ని అందించిన గురుదేవులకు, వై.ఎస్.ఎస్. కు మరియు వాలంటీర్లకు మా కృతజ్ఞతలు.”

యాత్రికులకు వైద్య సేవ

వై.ఎస్.ఎస్. భక్తులకు సేవలందించడంతో పాటు, కుంభమేళాకు హాజరైన వేలాది మంది యాత్రికులకు వైద్య సహాయం కూడా ఈ శిబిరంలో అందించడం జరిగింది. ప్రతిరోజు నిస్వార్థంగా, స్వచ్ఛందంగా సేవలందించే అంకితభావం కలిగిన వైద్యుల తోడ్పాటుతో, సహాయం కోరిన వారందరికీ ఈ శిబిరం సకాలంలో, దయతో కూడిన ఆరోగ్య సంరక్షణను అందించింది. శిబిరం యొక్క స్థలంలో వై.ఎస్.ఎస్. నిర్వహించిన వైద్య చికిత్సా కేంద్రము నుండి సుమారు 20,000 మంది ఉచిత వైద్య సహాయం పొందారు.

ఆధ్యాత్మిక బాహ్యవ్యాప్తి కార్యక్రమం: గురుదేవుల బోధనలను పంచుకోవడం

25,000 మంది సందర్శకులు పుస్తక విక్రయశాలను సందర్శించారు; గురుదేవుల బోధనల గురించి మరింత తెలుసుకోవాలనుకునే ఆసక్తిగల సత్యాన్వేషకులతో సంభాషించడానికి స్వచ్ఛంద సేవకులు, సన్యాసులు అందుబాటులో ఉండడం జరిగింది మరియు వారిలో కొందరు వై.ఎస్.ఎస్. పాఠాలకు కూడా నమోదు చేసుకున్నారు.

ముగింపు

వారాల తరబడి సాగిన ఆధ్యాత్మిక ఉద్దీపన అనంతరం ఫిబ్రవరి 15న శిబిరం నిర్వాహకులు స్వామి ధైర్యానంద గిరి గారి ముగింపు సత్సంగంతో వై.ఎస్.ఎస్. కుంభ మేళా శిబిరం ముగిసింది. కృతజ్ఞతతో, ​​ప్రేమతో, భగవంతుడు, గురువుల కృపతో నిండిన హృదయాలతో భక్తులు బయలుదేరారు. వారు గాఢమైన ధ్యానం, దివ్య సహవాసం మరియు గురుదేవుల అపరిమితమైన ప్రేమతో కూడిన ఆశీర్వాదాలను తమతో తీసికొని వెళ్లారు.

శిబిరంలో పంచుకున్న దివ్య క్షణాల సంగ్రహావలోకనం కోసం దయచేసి బటన్‌ను క్లిక్ చేయండి.

ఇతరులతో పంచుకోండి