ఎప్పుడయినా, ఎవరయినా భక్తితో బాబాజీ పేరు పలికినట్లయితే ఆ భక్తుడికి తక్షణమే ఆధ్యాత్మిక అనుగ్రహం లభిస్తుంది.
— ఒక యోగి ఆత్మకథ లో లాహిరీ మహాశయులు
శతాబ్దాల పాటు ప్రపంచానికి మరుగున ఉన్న ప్రాచీన క్రియాయోగ విజ్ఞానాన్ని 19వ శతాబ్దంలో మరణంలేని అవతార పురుషులు మహావతార్ బాబాజీ పునరుద్ధరించారని, పరమహంస యోగానందగారు తమ ఒక యోగి ఆత్మకథలో వివరించారు. తమ శిష్యులైన లాహిరీ మహాశయులకు దీక్షనివ్వడం ద్వారా, బాబాజీ మానవాళిని, కృష్ణభగవానుడి కాలానికి చెందిన, మరియు పతంజలి వంటి ఇతర ఆధ్యాత్మిక గురువులు అభ్యసించిన ఒక ఆధ్యాత్మిక పరంపరకు కలిపారు.
క్రియాయోగ బోధనలను పాశ్చాత్యదేశాలకు తీసుకుని వెళ్ళే నిమిత్తం పరమహంస యోగానందగారు తమ అమెరికా ప్రయాణాన్ని ప్రారంభించడానికి కొద్దిరోజుల ముందు, జూలై 25, 1920న, ఆయన కలకత్తాలోని తమ ఇంటిలో కూర్చుని, తాము చేపట్టబోయే కార్యాన్ని గురించి భగవంతుడి హామీ పొందడం కోసం గాఢంగా ప్రార్థించారు. మహావతార్ బాబాజీ ఆయనకు కనిపించి ఇలా చెప్పారు: “నీ గురువుగారి ఆదేశాల్ని అనుసరించి అమెరికా వెళ్ళు. భయపడకు; నీకు రక్ష ఉంటుంది. పాశ్చాత్య ప్రపంచంలో క్రియాయోగ సందేశాన్ని వ్యాప్తి చెయ్యడానికి నేను ఎంపిక చేసినవాడివి నువ్వే.”
బాబాజీ మరియు యోగానందగారి మధ్య జరిగిన ఈ మహత్వపూర్ణ సమావేశాన్ని వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. భక్తులు ప్రతి ఏటా, మహావతార్ బాబాజీ స్మృతి దినోత్సవంగా జరుపుకుంటారు.
జూలైలో, ఈ క్రింది కార్యక్రమాలతో ఈ పవిత్రమైన సందర్భాన్ని జరుపుకుంటున్న మాతో కలిసి పాల్గొనడానికి మీకు స్వాగతం పలుకుతున్నాం:
ప్రత్యేక ప్రసంగాలు
క్రియాయోగ అమర గురువులు: మహావతార్ బాబాజీ
పరమహంస యోగానందగారు వ్రాసిన విశ్వవిఖ్యాత ఆధ్యాత్మిక మహాకావ్యమైన ఒక యోగి ఆత్మకథ లో ప్రస్తావించబడిన అద్భుతయోగి మహావతార్ బాబాజీ ఎవరు? బదరీనారాయణ క్షేత్రానికి సమీపంలో ఉత్తరహిమాలయ పర్వతప్రాంతాలలో ఉండే అమర గురువుగా పరిచయం చేయబడిన మహావతార్ బాబాజీ ఒక మహావతారంగా, జననమరణ చక్రం నుంచి సంపూర్ణంగా విముక్తి పొంది, మానవాళిని ఆధ్యాత్మికంగా ఉద్ధరించడం కోసం సహస్రాబ్దులుగా ఒక తేజోవంతమైన యువశరీరాన్ని ధరించి ఉన్న దివ్యావతారంగా వర్ణించబడ్డారు. బాబాజీని కలిసినవారు స్వచ్ఛమైన ప్రేమ ఆయన స్వభావమని, వినమ్రత ఆయన ప్రత్యేక గుణమని చెబుతారు. ఆయన పవిత్రనామాన్ని భక్తితో ఉచ్చరించినంత మాత్రానే తక్షణ అనుగ్రహం లభిస్తుందని అంటారు.
యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.) కు చెందిన సన్యాసులు ఇంగ్లీషు, హిందీ, బెంగాలీ, కన్నడ, తమిళం మరియు తెలుగు భాషలలో ఇచ్చే ప్రసంగాల ద్వారా మహావతార్ బాబాజీ గురించి మరింతగా తెలుసుకోమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.
భగవత్-సాక్షాత్కారాన్ని కలిగించే పవిత్ర, శాస్త్రీయ ప్రక్రియ అయిన క్రియాయోగం ఒక అవిచ్ఛిన్న గురు-శిష్య పరంపర ద్వారా — బాబాజీ నుంచి లాహిరీ మహాశయులకు, ఆపై స్వామి శ్రీయుక్తేశ్వర్ గారికి, చివరకు ఆయన నుంచి పరమహంస యోగానందగారికి — ఎలా అందించబడిందో, మరియు ఈ బోధనలను పాశ్చాత్యదేశాలకు తీసుకొని వెళ్లడం కోసం 1920లో బాబాజీ పరమహంస యోగానందగారిని స్వయంగా ఆదేశించడాన్ని గురించి ఈ ప్రసంగాల ద్వారా తెలుసుకోండి.
ఈ ప్రసంగాలు తరువాత వీక్షించడానికి కూడా అందుబాటులో ఉంటాయి.
క్రియాయోగ అమర గురువులు: మహావతార్ బాబాజీ
1:07:34
1:14:14
58:58
1:07:20
ఇతర భాషలలో రాబోతున్న కార్యక్రమాలు:
- బెంగాలీ మరియు కన్నడ: శుక్రవారం, జూలై 24 నాడు విడుదల.
ప్రత్యేక స్మారకోత్సవ కార్యక్రమం
ఆన్‌లైన్ స్మారకోత్సవ ధ్యానం
శనివారం, జూలై 25, 2026
ఉదయం 6:30 – 8:00 గంటలు (భారతీయ కాలమానం ప్రకారం)
జూలై 25 నాడు, మహావతార్ బాబాజీ గౌరవార్థం, ఒక ప్రత్యేక ఆన్‌లైన్ ధ్యానం ఒక వై.ఎస్.ఎస్. సన్యాసిచే నిర్వహించబడుతుంది. అందులో భక్తి గీతాలాపన, ధ్యానం మరియు స్ఫూర్తిదాయకమైన పఠనం ఉంటాయి.
దయచేసి గమనించండి: ఈ కార్యక్రమం, ఆదివారం, జూలై 26, రాత్రి 10 గంటల (భారతీయ కాలమానం ప్రకారం) వరకు వీక్షించడానికి అందుబాటులో ఉంటుంది.
వ్యక్తిగతంగా పాల్గొనే కార్యక్రమాలు
మహావతార్ బాబాజీ గౌరవార్థం, వ్యక్తిగతంగా పాల్గొనే ప్రత్యేక కార్యక్రమాలు కూడా, వై.ఎస్.ఎస్. ఆశ్రమాలు, కేంద్రాలు మరియు మండళ్ళలో నిర్వహించబడతాయి. వీటి గురించి మరింత తెలుసుకోడానికి, వీటిలో ఒకదానిలో పాల్గొనడానికి, మీ సమీపంలో ఉన్న ధ్యాన కేంద్రంను సంప్రదించండి.
ఈ పవిత్ర సందర్భంలో, వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. గురుపరంపర ద్వారా మనకు లభించిన క్రియాయోగ మార్గం యొక్క అనుగ్రహాలకు కృతజ్ఞత వ్యక్తం చేయడం కోసం భక్తులు ప్రణామిని సమర్పిస్తారు. ఆత్మవిముక్తి ప్రసాదించే ఈ బోధనలను నిజాయతీ గల సాధకులకు అందించే వై.ఎస్.ఎస్. యొక్క కార్యక్రమాలకు మీరు విరాళం ఇవ్వాలనుకుంటే, ఈ క్రింది లింకు వద్ద సమర్పించమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.

















