ఫలించిన ఈ శుభదినం కోసం ఓపికగా ఎదురుచూస్తూ, నెలలకు నెలలు, ఏళ్ళకు ఏళ్ళు నిన్ను కనిపెట్టుకొనే ఉన్నాను. ఇప్పటికి నువ్వు నా దగ్గరున్నావు! ఇదుగో నీ గుహ; పూర్వం నుంచీ నీకు ప్రియమయినది. నీకోసం దీన్ని ఎప్పటికీ శుభ్రంగా, సిద్ధంగా ఉంచాను.
— ఒక యోగి ఆత్మకథలో లాహిరీ మహాశయులతో మహావతార్ బాబాజీ
1861వ సంవత్సరంలో, హిమాలయాల్లోని కుమావోన్ ప్రాంతంలో ఉన్న సుందరమైన దునగిరి పర్వతాల ఒడిలో ఉన్న ఒక చిన్న గుహలో, ఆధునిక యుగపు ఆధ్యాత్మిక చరిత్రలో ఒక కీలక మలుపుకు దారితీసిన ఒక దివ్య సంఘటన చోటుచేసుకుంది. మరణం లేని మహాయోగి, అమర గురువులయిన మహావతార్ బాబాజీ, తన ఉన్నత శిష్యుడైన లాహిరీ మహాశయులకి ఈ పవిత్ర గుహలోనే ప్రాచీన క్రియాయోగ శాస్త్రాన్ని ఉపదేశించారు. తద్ద్వారా, మానవ చైతన్య ఉన్నతి కోసం ఆత్మ-సాక్షాత్కారానికి సంబంధించిన ఒక ప్రాచీన ప్రక్రియను ఆయన పునరుద్ధరించారు.
మహావతార్ బాబాజీ మరియు లాహిరీ మహాశయుల ఆశీస్సులు ఇప్పటికీ ఈ పవిత్ర గుహలోనూ, దాని పరిసర ప్రాంతంలోనూ వ్యాపించి ఉన్నాయి. క్రియాయోగులందరూ తమ పరంపర యొక్క మూలాలను ఈ సంఘటనకే ఆపాదిస్తారు.






సత్యాన్వేషకులకు ఒక యాత్రాస్థలం
మహావతార్ బాబాజీ గుహ ఉన్న పవిత్ర స్థలం, ప్రపంచవ్యాప్తంగా సత్యాన్వేషకులకు ఒక ధృవతారగా మారింది.
గుహ సమీపంలో మహావతార్ బాబాజీ గౌరవార్థం స్మృతి భవనం అనే ఒక చిన్న మందిరాన్ని కూడా వై.ఎస్.ఎస్. స్థాపించింది. ఈ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని సందర్శించే భక్తులకు ఇది ఒక జ్ఞాపకంగా, ధ్యాన ప్రదేశంగా ఉపయోగపడుతుంది.
చాలామంది సందర్శకులకు ఈ తీర్థయాత్రలు మహావతార్ బాబాజీ గురించి మరియు ప్రాచీన క్రియాయోగ శాస్త్రం గురించి మరింతగా తెలుసుకోవడానికి అవకాశాన్నిస్తాయి. ఈ క్రియాయోగ శాస్త్రం యొక్క ఆధునిక పునరుజ్జీవనం మరియు ప్రపంచవ్యాప్త విస్తరణకు ఈ మహాగురువులే, పరమహంస యోగానంద మరియు వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. గురుపరంపర ద్వారా మార్గదర్శకత్వం వహించారు.
ప్రముఖులు మరియు ఉన్నతాధికారుల సందర్శనలు
మన ప్రియ గురుదేవుల ఒక యోగి ఆత్మకథ ద్వారా, అలాగే ఇంటర్నెట్ మరియు ఆన్‌లైన్ మాధ్యమాల ద్వారా మహావతార్ బాబాజీ గురించి మరింత ఎక్కువ మందికి తెలుస్తున్నందున, ఇక్కడికి ప్రతిరోజూ వచ్చే సందర్శకుల సంఖ్య పెరుగుతోంది (వీరు కొన్నిసార్లు బస్సుల నిండా కూడా వస్తూ ఉంటారు). ఈ గొప్ప అమర గురువుల ఆశీర్వాదాలను పొందడానికి ఈ పవిత్ర స్థలానికి తీర్థయాత్రగా వచ్చే వారిలో ప్రముఖులు, ఉన్నతాధికారులు కూడా ఉంటారు.






















