భరోసా మరియు విశ్వాసం కలిగించే ఒక సందేశం – స్వామి చిదానంద గిరి

10 మే, 2025

ప్రియతములారా,

భారతదేశం మరియు చుట్టుప్రక్కల ప్రాంతాన్ని ప్రభావితం చేస్తున్న అంతర్జాతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయనే వార్తలు నా హృదయంలో గాఢమైన, ప్రార్థనాపూర్వక చింతను రేకెత్తిస్తున్నాయి, మీ హృదయంలో కూడా అలాగే ఉంటుందని నాకు తెలుసు. ఇలాంటి కలవరపరచే సమయాల్లో, ధ్యానం చేసే భక్తులు ప్రపంచానికి కీలకమైన సేవను అందించగలరు మరియు అదృశ్యంగా ముఖ్యమైన పాత్రను పోషించగలరు—కాబట్టి మనందరిలో ఉన్న దేవుని దివ్యశాంతి యొక్క స్థితిస్థాపక స్థితిలో ప్రశాంతతతో, కేంద్రీకృతమై దృఢంగా నిలిచి, విశ్వాసంతో స్థిరంగా ఉండాలని నేను అభ్యర్థిస్తున్నాను.

ధ్యాన సమయంలోను మరియు రోజులో పలుమార్లు ప్రత్యేక ప్రార్థనలు చేసేందుకు, నాతోను మరియు పరమహంస యోగానందగారి ఆశ్రమాలలోని సన్యాసులతోను కలవమని వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. భక్తులను మరియు స్నేహితులను నేను ఆహ్వానిస్తున్నాను. గురుదేవుల ఆధ్యాత్మిక కుటుంబంలోను, వారి ప్రపంచవ్యాప్త ప్రార్థనా వలయంలోని సభ్యులుగా మనమందరం —ఆ ప్రదేశమంతటా దేవుని అపరిమితమైన ఆశీస్సులు ఆవరిస్తున్నట్లు, పవిత్రమైన ఓం ప్రకంపనల యొక్క దైవప్రేమ శక్తి ప్రసరిస్తూ సామరస్యం, సద్భావన మరియు పరస్పర విభేదాల పరిష్కారం వైపు ఆ ప్రవాహాన్ని మళ్లిస్తున్నట్లుగా మానసిక ఊహా చిత్రణ చేస్తూ ధ్యానం అనంతరం వారి యోగ స్వస్థతా ప్రక్రియను అభ్యసించడాన్ని కొనసాగిద్దాం.

మనమందరం కలిసి, అందరి హృదయాలను ప్రకాశవంతం చేసి, వారిని అవగాహన మరియు శాశ్వత శాంతి వైపు మార్గనిర్దేశం చేసేందుకు, దేవుని కాంతిని మరియు ఆశీస్సులను ఆవాహన చేద్దాం. ప్రతి కేంద్రీకృత ప్రార్థన-ప్రకంపనల ప్రసారంతో, ఉన్నతిని చేకూర్చే దైవసాన్నిథ్యం మరియు జ్ఞాన-నిర్దేశంతో దేవుని సంతానమంతటికీ ఉజ్జ్వల భవిష్యత్తును అందించేందుకు మనం సహాయం చేద్దాం.

నా ప్రేమ మరియు ప్రార్థనల్లో మీ అందరినీ తలుస్తానని దయచేసి తెలుసుకోండి. మన ప్రియగురుదేవులు మరియు పరమగురువుల రక్షణాశ్రయం మిమ్మల్ని మరియు మీ ప్రియమైనవారిని చుట్టుముట్టి, సుఖప్రదమైన అనంత ప్రేమమయమైన సంరక్షణలో ఉంచబడ్డారనే ఓదార్పుకరమైన హామీ మీకు ఉండుగాక.

భగవంతుడు మరియు గురుదేవులలో నిరంతర ఆశీస్సులు,

స్వామి చిదానంద గిరి

పరమహంస యోగానందగారు బోధించిన స్వస్థతా ప్రక్రియను, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక అధిపతి స్వామి చిదానంద గిరిగారితో పాటు అభ్యసించేందుకు దయచేసి క్రింద ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి:

ఇతరులతో పంచుకోండి