స్వామి చిదానందగిరి గారి శ్రీకృష్ణ జన్మాష్టమి సందేశం – 2025

9 ఆగష్టు, 2025

నా యందే లీనమైన మనస్సుతో, నా అనుగ్రహముచే నీవు సమస్త అడ్డంకులను అధిగమించగలవు.

— గాడ్ టాక్స్ విత్ అర్జున: భగవద్గీత

ఆత్మీయులారా,

ఈ శుభప్రదమైన శ్రీకృష్ణ జన్మాష్టమి వేళ, మీలో ప్రతి ఒక్కరికీ ఆనందమయ శుభాకాంక్షలు! భగవంతుని అనంతమైన ప్రేమ, జ్ఞానం, శక్తి మరియు సౌందర్యాన్ని అందించిన దివ్యదూతయైన భగవాన్ శ్రీకృష్ణుని జన్మోత్సవాన్ని జరుపుకోవడంలో, మీతో మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది భక్తులతో నేను కూడా పాలుపంచుకుంటున్నాను. ఆయన ఒక రాజుగా మరియు ఒక యోగిగా జీవించారు, తన జీవిత ఉదాహరణ ద్వారా మరియు భగవద్గీతలో బోధించిన రాజయోగం ద్వారా, మన భౌతిక బాధ్యతలను నెరవేరుస్తూనే దైవచైతన్యాన్ని వ్యక్తపరచడం సాధ్యమేనని రుజువు చేశారు.

మనం ఎంత అదృష్టవంతులం! మన గురువు, పరమహంస యోగానందజీ, వేల సంవత్సరాల క్రితం భగవాన్ కృష్ణుడు గీతలో కీర్తించిన ఆత్మ-నియంత్రణ శాస్త్రాన్ని — యోగ సారాన్ని వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. పాఠాలలో ఎంతో సమగ్రంగా వెల్లడి చేశారు. క్రియాయోగ ధ్యాన పద్ధతులను భక్తిశ్రద్ధలతో అభ్యసించడం ద్వారా, మనం శరీరం లేదా మనస్సు కాదని, వాటి బలహీనతలు మరియు స్వయం-పరిమితమైన, ఇంద్రియపరమైన ఇష్టాయిష్టాలు కావని, కానీ పరమాత్మయొక్క ప్రతిబింబమైన అమర ఆత్మ అని గ్రహించగలుగుతాము. దైనందిన ధ్యానం మరియు సత్కర్మల ద్వారా, ఉదాత్తమైన దైవానుగ్రహం మరియు ఆశీర్వాదాలచే సమస్త అడ్డంకులను అధిగమిస్తూ, శ్రీకృష్ణునివలె ఆత్మ-చైతన్యపు రాజసంతో మనం జీవించవచ్చు.

ఈ ఆధ్యాత్మిక అన్వేషణలో భగవంతుడు మనల్ని ఒంటరిగా వదలిపెట్టలేదు, కానీ ఒక శాశ్వత స్నేహితునిగా ఆప్యాయంగా మన ప్రక్కనే ఉన్నాడు: భ్రాంతి తుఫానుల నుండి మనల్ని రక్షిస్తూ, జీవిత సంగ్రామ క్షేత్రంలో ఒక జ్ఞానవంతుడైన సారథిగా మనకు మార్గనిర్దేశం చేస్తూ, మరియు విశ్వ స్వప్న-నాటకంలో మన ప్రియమైన సహచరునిగా ఆనందంగా మనతో నృత్యం చేస్తూ. మాయా బంధం నుండి మనల్ని విముక్తం చేయడానికి,ముఖ్యంగా మనం మన దివ్య అన్వేషణను భక్తితో నింపినప్పుడు, భగవంతుడు ఏ పాత్రనైనా పోషించగలడని శ్రీకృష్ణుని, వేణుగానం మనకు చూపిస్తాయి.

ప్రపంచంలో ధ్యానం మరియు సత్కర్మల స్వర్ణ మధ్యే మార్గంలో నడిచే ఆధ్యాత్మిక సాధకులందరికీ విజయం మరియు వ్యక్తిగత సహాయం లభించగలవన్న భగవాన్ కృష్ణుని వాగ్దానం, విస్తృతమైన మనలోని ఆత్మ-శక్తులను కనుగొనడానికి నూతన పరాక్రమంతో మనల్ని శక్తివంతం చేయుగాక. అప్పుడు, మనం ఈ లోకంలో దుర్బలమైన మానవులుగా కాకుండా, దివ్య ప్రేమను మరియు ఆనందాన్ని అందరికీ పంచే ప్రకాశవంతమైన – పరమాత్మయొక్క – జ్ఞాన-గాన సాధనాలుగా జీవించగలం.

మీకు మరియు మీ ప్రియతములకు అత్యంత శుభప్రదమైన జన్మాష్టమి శుభాకాంక్షలు.

జై శ్రీకృష్ణ! జై గురు!

స్వామి చిదానందగిరి

ఇతరులతో పంచుకోండి