పరమహంస యోగానందగారి “మీ నిజస్వరూపమైన బ్రహ్మాండతగా మారడం”

10 జూన్, 2025

ఈ క్రింది సంగ్రహం, “ఆత్మసాక్షాత్కారం: మీ అనంత స్వభావాన్ని తెలుసుకోవడం” (Self-realization: Knowing Your Infinite Nature) అన్న ప్రసంగం నుంచి తీసుకోబడింది. ఈ ప్రసంగాన్ని పూర్తిగా పరమహంస యోగానందగారి ప్రసంగాలు మరియు వ్యాసాల సేకరణ IVవ సంపుటం, జీవితపు రహస్యాన్ని పరిష్కరించడం (Solving the Mystery of Life) అన్న పుస్తకంలో చదువగలరు. ఈ పుస్తకం జూన్ 22న సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ ద్వారా, అ తరువాత యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ద్వారా విడుదల చేయబడుతుంది.

కమలం-02

మిమ్మల్ని శాంతి ఆవరించుగాక, మీలో శాంతి నిలిచి ఉండుగాక, ఆనందం మీ ఉనికిని లోపలా, బయటా నింపుగాక!

శాశ్వత శక్తి యొక్క ఒక మహాసముద్రం మీ చుట్టూ, మరియు మీ లోపలా ఉంది. బిరడాతో మూయబడ్డ సీసా ఎలా సముద్రంలో తేలుతూ ఉంటుందో, అలాగే మీరు కూడా భగవంతుడు, మరియు శాంతితో చుట్టబడి ఉంటారు. జీవితమనే మహాసముద్రంలో మీరు ఎక్కడ తేలియాడుతున్నా, ఆ మహాశక్తి మరియు మహాప్రాణంలోనే మునిగి ఉంటారు. దాన్ని తెలుసుకోండి!

మీరు భగవంతుని గురించి, మీలో ఉన్న శాశ్వతమైన శక్తి గురించి, మరింత ఎక్కువగా తెలుసుకొనే కొద్దీ, మీ జీవితం యొక్క దృష్టికేంద్రం తారుమారవుతుంది. నిరంతరం శరీరం యొక్క విధానాలను అనుభూతి చెందడానికి బదులు, మీరు మానవదేహం వెనుక ఉండే శాశ్వతమైన నిశ్శబ్దాన్ని అనుభవిస్తారు….

మీ శరీరం అనే ఏకాంత తరంగం మీద, దాని పరిమితమైన జీవితం మీద మీరు మీ దృష్టిని కేంద్రీకరించారు; అందువల్ల, మీరు భగవంతుని అనంత సర్వవ్యాపకత్వాన్ని మరచిపోతున్నారు. కాని, అన్ని శరీరాలలోను, మరియు ప్రకృతి యొక్క అన్ని అభివ్యక్తులలోనూ ఉన్న జీవం, భగవంతుని చైతన్యం యొక్క విస్ఫోటనాలే తప్ప వేరు కాదని మీరు గ్రహించినప్పుడు, మీరు ఆయన శాశ్వత సానిధ్యంలో ఉంటారు.

భగవంతుడు నక్షత్రాలలోనూ, భూమి మీది మట్టి గడ్డలలోను, మన ఆలోచనలలోను, భావాలలోను, మరియు సంకల్పాలలోను ఎల్లప్పుడూ ఉంటాడు; దీన్ని మీరు అనుభూతి చెందినప్పుడు, అనంతత్వంతో మీ సంబంధాన్ని మీరు తెలుసుకుంటారు. అదే ఆత్మసాక్షాత్కారం: అప్పుడిక మిమ్మల్ని మీరు జీవం యొక్క ఒక చిరుకెరటంలా కాక, మహాసముద్రంలా అనుభూతి చెందుతారు.

రోజంతా మీరు శరీరం ద్వారా పని చేస్తూ ఉంటారు, అందువల్ల మీరు దానితో తాదాత్మ్యత చెందుతారు. కాని, ప్రతి రాత్రి భగవంతుడు ఈ నిర్బంధకారకమైన భ్రమను మీ నుంచి తొలగిస్తాడు. గత రాత్రి కలలు లేని గాఢమైన నిద్రలో మీరు స్త్రీయా లేక పురుషుడా, అమెరికా వాసులా లేక హిందువా, ధనవంతులా లేక పేదవారా? ఏదీ కాదు. మీరు ఒక పరిశుద్ధమైన ఆత్మ.

పగటిపూట ఇన్ని కిలోల మాంసము మరియు ఎముకలు, ఒక నరాల మరియు కండరాల మూటను అన్న స్పృహలో మీరు ఉంటారు; కానీ, గాఢనిద్ర కలిగించే అర్ధ-అధిచేతనా స్వేచ్ఛలో, భగవంతుడు మీ మర్త్య జీవితానికి సంబంధించిన పేర్లను, బిరుదులను అన్నింటినీ తొలగించి, మీరు శరీరము నుండి, దాని యొక్క పరిమితుల నుండి, వేరనీ, ఆకాశంలో నిశ్చలంగా ఉన్న పరిశుద్ధాత్మ అనీ అనుభూతి చెందేలా చేస్తాడు.

అదే మీ నిజస్వరూపం యొక్క బ్రహ్మాండత. ధ్యానం అంటే, ఆ మరచిపోయిన ఆత్మస్వరూపం యొక్క స్వేచ్ఛ గురించి మీరు పూర్తిగా సచేతనమయ్యే పద్దతి.

నేను మిమ్మల్ని నిశ్శబ్దంగా ఉండమని, ధ్యానం చేయమనీ ఎందుకు కోరుతున్నాను? ఆ బ్రహ్మాండతను మరియు స్వేచ్ఛను, శరీరంతో కట్టిపడి ఉండడమనే నిర్బంధిత చైతన్యంతో పోల్చి చూడడానికి. కళ్లు మూసుకుని ధ్యానం చేస్తున్నప్పుడు మీరు మీ శరీరాన్ని చూడరు; మూసిన కళ్ల వెనుక ఉన్న చీకటి గోళంలోకి దృష్టిని సారిస్తున్నారు. మీరు మరింత ప్రశాంతంగా ఉండి, మీ ధ్యానం మరింత గాఢమైనప్పుడు, ఈ చిన్ని శరీరానికి సంబంధించిన అనుభూతులు, అవగాహనా వెనుకకు మళ్ళుతాయి. మీ మర్త్య రూపం యొక్క హద్దులను దాటి మీ ఉనికి విస్తరించడాన్ని మీరు అనుభూతి చెందుతారు.

సువిశాలమైన ఆంతరిక ప్రదేశం మరింత పెద్దదవుతుంది; నిరంతరం పెరుగుతున్న ఆనందం మరియు శాంతులతో కూడిన అనంతమైన చైతన్యంగాను, ఈ విస్తరిస్తున్న సీమ రూపంగాను, మిమ్మల్ని మీరు అనుభూతి చెందడం ప్రారంభిస్తారు. అప్పుడే మీరు శరీరం కన్నా ఎంతో మహత్తు గలవారని మీరు గ్రహిస్తారు.

ఈ ఆనందమయమైన సువిశాల చైతన్యాన్ని, మళ్లీ శరీరమనే భ్రమలో కోల్పోకుండా మీరు నిలుపుకోగలిగితే, మీరు మీ నిజమైన ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతారు.

మీరెవరో మీకు తెలియకపోవడం, మీ ఆత్మస్వరూపం మీకు తెలియకపోవడం, విచిత్రం కాదూ? మీ శరీరానికి, మర్త్య జీవితంలోని మీ పాత్రలకు వర్తించే వివిధ బిరుదులతో మిమ్మల్ని మీరు నిర్వచించుకుంటారు. కాని, మీరు మీ శరీరమేనా? కాదు, ఎందుకంటే మీరు మీ శరీరం లేకుండా ఉండగలరు. మీరు ప్రతి రాత్రి అలా ఉంటారు. గాఢనిద్రలో, మీ శారీరక స్పృహ మీకు లేకపోయినా, మీరు జీవించి ఉన్నారని మీకు తెలుసు.

“నేను” అన్న భావనను కోల్పోకుండా మీరు మీ చైతన్యం నుంచి తీసివేయగలిగేది ఏదైనా కూడా, అది మీరు కాదు. ఈ బిరుదులను అన్నింటినీ మీరు ఆత్మ నుంచి తొలిచి వేయాలి. “నేను ఆలోచిస్తాను, కాని నేను ఆలోచనను కాను. నేను అనుభూతి చెందుతాను, కాని నేను అనుభూతిని కాను. నేను సంకల్పిస్తాను, కాని నేను సంకల్పాన్ని కాను.” ఇక మిగిలి ఉన్నదేమిటి? మీరు ఉన్నారు అని తెలిసిన మీరు; మీరు ఉన్నారు అని అనుభూతి చెందే మీరు — తన అస్తిత్వాన్ని గురించి ఆత్మకు ఉండే అపార జ్ఞానమైన సహజావబోధం ఇచ్చే రుజువు ద్వారా మీకది లభిస్తుంది.

నేను భారతదేశంలో నేర్చుకున్నది ఇదే: ఆత్మలో కేంద్రీకృతమై, ఆ అనంతమైన దృక్పథంలో నిరంతరం ఉండడం. నాకు తెలిసిన మహాత్ములు ఎవరూ కూడా, తమ శరీరంతో తాదాత్మ్యత చెందినవారు కాదు.

దివ్యమానవుడిలో, శరీరమన్నది అతడి అనంత అస్తిత్వం యొక్క అభివ్యక్తమైన ఒక పరిమిత భాగం మాత్రమే. తన శరీరం గురించి సాధారణ వ్యక్తులు బాధపడినట్లు అతడు బాధపడడు. మీరు నడుస్తున్నప్పుడు, మీ జుట్టు, మీ వ్రేళ్ళు వంటి ఏ ఒక్క నిర్దిష్టమైన శరీర భాగంతోనూ మీరు తాదాత్మ్యత చెందరు. మీరు మీ శరీరంతో ఉన్నారన్న ఒక సాధారణ భావం మాత్రమే అనుభవిస్తారు. నా విషయంలో కూడా అంతే. నాకొక శరీరం ఉందన్న ఎరుకలో ఉంటాను, కాని నేను ఒక ఆత్మనని నాకు తెలుసు.

మహాత్ములు నాలో తెచ్చిన మార్పు అటువంటిది. ఇప్పుడు ఒక్కటే చైతన్యం ఉంది: నేను నా నిజస్వభావం గురించి సచేతనంగా ఉంటాను. నా ఆత్మ యొక్క బ్రహ్మాండత నా రెక్కలను అంతటా విస్తరించింది, ఇక నేను అన్ని విషయాల గురించి సచేతనంగా ఉంటాను….

మీరు ధ్యానం చేస్తే, నేను చూసేదాన్ని మీరు కూడా చూడగలుగుతారు, నేను అనుభవించే ఆనందాన్ని మీరు కూడా అనుభవించగలుగుతారు.

ఇతరులతో పంచుకోండి