పరమహంస యోగానంద గారి స్వేచ్ఛా భావన గురించి స్వామి చిదానంద గిరి గారి విశ్లేషణ

14 జూలై, 2026

సెప్టెంబర్ 19, 2020న ఎస్.ఆర్.ఎఫ్. మదర్ సెంటర్‌లో వై.ఎస్.ఎస్./ ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు ఇచ్చిన, మరియు యోగదా సత్సంగ పత్రిక 2021 జనవరి–మార్చి సంచిక లో ప్రచురించబడిన ప్రసంగం, “పరమహంస యోగానంద: చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన వారధి నిర్మాత,” నుంచి ఈ అంశాలు సంగ్రహించబడ్డాయి. పరమహంస యోగానంద అమెరికాకు వచ్చిన వందవ వార్షికోత్సవ వేడుకలో స్వామి చిదానంద గిరి చేసిన ప్రసంగమిది. పశ్చిమ దేశాలలో పరమహంస గారు తన మొదటి ప్రసంగంలో ప్రశంసించిన ఆత్మ స్వేచ్ఛను మీ జీవితంలో శాశ్వత వాస్తవికతగా చేసుకోవడంలో, ధ్యానయోగశాస్త్రాన్ని అన్వయించుకోవడానికి ఈ బ్లాగ్ పోస్ట్ మిమ్మల్ని ప్రేరేపిస్తుందని మేము ఆశిస్తున్నాము.

కమలం-నారింజ-రేఖాచిత్రం

బాహ్యంగా, పరమహంస యోగానంద ఒక హిందువుగా, అమెరికా దత్తత తీసుకున్న వ్యక్తిగా, ప్రపంచ పౌరుడిగా కనిపించేవారు. కానీ ఆయన నిజస్వరూపం ఆయన అంతరంగంలో ఉన్నదే. తమ ఒక కవితలో తమ అంతర్గత అనుభవం ఏమిటో ఆయన వెల్లడించారు:

నాకు దేశం లేదు, మాతృభూమి లేదు ప్రియతమా;
నేను హిందువునో, క్రైస్తవ ఋషినో కాను;
పాశ్చాత్యుడను కాను, ప్రాచ్యుడను కాను, వారసత్వపు చెరలో జాతిపరమైన బందీని కాను….
నా ఆత్మ స్వేచ్ఛలో ఆనందిస్తున్నది —
దాని ఏకైక మతం, స్వేచ్ఛ మాత్రమే….

ఇతరులకు తెలియకున్నా, నేను సచేతనంగా
ఆనందంలో మేల్కొంటాను, నడుస్తాను, కలలు కంటాను
ఆనందంలోనే తింటాను, త్రాగుతాను, తేలిపోతాను.
నేను వెతికిన ఆనందం నేనే —
అందరూ కోరుకునే ఆనందం నేనే1

దీని గురించి ఆలోచించండి: “నా ఆత్మ స్వేచ్ఛలో ఆనందిస్తుంది — దాని ఏకైక మతం స్వేచ్ఛే.” ఇది చాలా ఆసక్తికరమైనది, ఎందుకంటే ఇది 1920లో బోస్టన్‌లో జరిగిన ‘మతధార్మిక ఉదారవాదుల సభ’ (కాంగ్రెస్ ఆఫ్ రెలిజియస్ లిబరల్స్) లో ప్రసంగించడానికి పరమహంసగారి రాక యొక్క వృత్తాంతాన్ని మనకు గుర్తు చేస్తుంది. అమెరికాలోని మరియు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి మత నాయకులను ఆకర్షించిన ఆ కాంగ్రెస్, స్వేచ్ఛను కోరుతూ ఇంగ్లాండ్ నుండి వచ్చిన యాత్రికులు అమెరికాలో అడుగుపెట్టిన 300వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించబడింది; ఈ సభకు నిర్వాహకులు ఇచ్చిన ఇతివృత్తం ఏమిటంటే, “స్వేచ్ఛ యొక్క నిజమైన ప్రాముఖ్యత ఏమిటి?”2

మనకు తెలిసినట్లుగా, అమెరికా వ్యవస్థాపక పితామహులు స్వాతంత్ర్య ప్రకటనలో ఇలా వ్రాశారు: “మేము ఈ సత్యాలను స్వయం సిద్ధమైనవిగా విశ్వసిస్తున్నాము: మానవులందరూ సమానంగా సృష్టించబడ్డారని, వారి సృష్టికర్త వారికి కొన్ని విడదీయరాని హక్కులను ప్రసాదించారని, వాటిలో జీవించే హక్కు, స్వేచ్ఛ మరియు ఆనందాన్ని పొందే హక్కు ఉన్నాయని.” ఇవి ఉత్తేజ పరిచే మాటలు — అమర శబ్దాలు. కానీ ఇది ఒక యోగానికి సంబంధించిన భావన అని చాలా మంది గ్రహించకపోవచ్చు. నిజానికి, యోగా అనేది రాజకీయ నాయకులు, రాజనీతిజ్ఞులు మరియు ఆ విప్లవ నాయకుల కంటే కూడా చాలా లోతైనదని మనం చెప్పవచ్చని నేను భావిస్తున్నాను. జీవితం, స్వేచ్ఛ మరియు ఆనందాన్ని పొందే హక్కు అనేవి కేవలం విడదీయరాని హక్కులు మాత్రమే కాదని, అవి మానవ స్వభావం యొక్క మూలంలోనే ఇమిడి ఉన్న విడదీయరాని శక్తులు లేదా ప్రక్రియలని యోగా చెబుతుంది.

పరమహంసగారు ఎస్.ఆర్.ఎఫ్. [వై.ఎస్.ఎస్.] పాఠాల ద్వారా తీసుకువచ్చిన రాజయోగ శాస్త్రం గురించి, మీ ధ్యాన సాధనలో మీరు నేర్చుకున్న దాని గురించి ఆలోచించండి; మరియు దానిని జీవితం, స్వేచ్ఛ మరియు ఆనందాన్వేషణ అనే భావనల దృష్ట్యా ఆలోచించండి. యోగా మనకు చెప్పేదేమిటంటే, ప్రాణశక్తి (ప్రాణం), స్వేచ్ఛ (లేదా స్వేచ్ఛా సంకల్పం), మరియు ఆనందాన్వేషణ (లేదా, మనం చెప్పాలంటే, పరిపూర్ణ ఆనందం కోసం ఆత్మ యొక్క కోరిక) — ఇవి, మన అనుమతి ఉన్నా, లేకపోయినా, ఆత్మ యొక్క పది సాధనాల (అయిదు జ్ఞానేంద్రియాలు మరియు శారీరక క్రియలకు సంబంధించిన అయిదు కర్మేంద్రియాలు) ద్వారా పనిచేసే శక్తులు. అందుకే నేను ఇవి కేవలం విడదీయరాని హక్కులు మాత్రమే కాదని, విడదీయరాని శక్తులు లేదా ప్రక్రియలు అని అంటాను.

నేను ఈ విషయాన్ని ఇంకాస్త లోతుగా పరిశీలించాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది 1920లో జరిగిన ఆ సమావేశంలో పరమహంసగారు ఇవ్వడానికి వచ్చిన ఉపన్యాసాన్ని మనం ఏ విధంగా అర్థంచేసుకోవాలో తెలియచేస్తుంది: “మత విజ్ఞాన శాస్త్రం.” ఆయన తన బోధనలలో, మనం గర్భధారణ సమయంలో ప్రాణశక్తి మరియు చైతన్యాలతో కూడిన సూక్ష్మ శరీరాన్ని మరియు కారణ శరీరాన్ని ధరించిన ఒక దివ్యాత్మగా ఈ శరీరంలోకి వస్తామని వివరిస్తారు. అప్పుడు ఆ ఆత్మ, ఆ ప్రాణాన్ని మరియు చైతన్యాన్ని దేహం-మనస్సు యొక్క సాధనాలలోకి ప్రవహింపజేస్తుంది. ఇదే మర్త్యమానవ స్థితి; ఈ విషయంలో మనకు ఎటువంటి స్వేచ్ఛా లేదు. ప్రాణం క్రిందికి మరియు బయటకు— నాడీ వ్యవస్థలోకి, ఇంద్రియాలలోకి — ప్రవహిస్తూ, శరీరాన్ని సృష్టించి, దానిని ఉత్తేజితం చేస్తుంది; మరియు, అన్నింటికన్నా ముఖ్యంగా, మనం ఎంచుకున్నా, ఎంచుకోకపోయినా, ఆత్మ ఆ శరీరంతో తాదాత్మ్యం చెందేలా చేస్తుంది.

కానీ, ఆ శరీరంలో మనం ఎలా జీవిస్తాం — మనల్ని బంధించి బానిసలుగా చేసే శరీరం మరియు దాని ఇంద్రియ వాంఛలు మరియు అలవాట్లనే ఎండమావులతో తాదాత్మ్యం చెంది ఉండిపోతామా లేదా – అనే దానిపై మనకు నియంత్రణ ఉంటుంది. అదే – మనం నిజంగా ఎవరము అన్న విషయంలో తప్పుడు భావనకు ఆత్మ బంధించబడటమే – నిజమైన బానిసత్వం. క్రియా యోగం — మన గురువుగారు 100 సంవత్సరాల క్రితం పశ్చిమ దేశాలకు, తద్వారా ప్రపంచానికి అందించిన ఎస్.ఆర్.ఎఫ్/వై.ఎస్.ఎస్ బోధనలు — ఆత్మ యొక్క తాదాత్మ్యం చెందే శక్తిని నియంత్రించే శాస్త్రాన్ని – అనగా, మంచి కోసమైనా, చెడు కోసమైనా, మనం ఆత్మగా ఏ బాహ్య పాత్రలతో, లక్షణాలతో తాదాత్మ్యం చెందుతామో వాటిని స్వీకరించే ప్రక్రియను – మనకు అందిస్తాయి. మనం మన జీవితం, స్వేచ్ఛ, ఆనందాన్వేషణ అనే శక్తులను — అనగా, మన ప్రాణశక్తిని, మన స్వేచ్ఛాసంకల్ప శక్తిని, మరియు అనంతానందం పొందాలన్న మన ఆత్మ యొక్క కోరికను నెరవేర్చడానికి మనం ఎక్కడ వెదుకుతాము అన్న దానిని — మనం ఎలా నిర్వహిస్తాం అనే దాని గురించే ఇదంతా. అదే ధర్మ శాస్త్రం; స్వేచ్ఛ యొక్క నిజమైన అర్థానికి అంకితమైన ఆ సర్వమత మహాసభలో పరమహంసగారు ఇచ్చిన ప్రసంగం యొక్క సారాంశం కూడా అదే.

స్వేచ్ఛను సాధించడానికి మత విజ్ఞాన శాస్త్రంలో ప్రావీణ్యం పొందడం

మీకు తెలిసినట్లుగా, అక్కడ ఆయన ప్రసంగం యొక్క శీర్షిక, “మత విజ్ఞాన శాస్త్రం.” తరువాత అదే పేరుతో ఒక చిన్నదైన, కానీ అత్యంత శక్తివంతమైన పుస్తకం కూడా ప్రచురించబడింది. దానిని మేము [ఎస్.ఆర్.ఎఫ్.] ఇప్పుడే ఎస్.ఆర్.ఎఫ్. శతాబ్ది పురస్కార సంచికగా తిరిగి విడుదల చేశాము. నిజమైన స్వేచ్ఛకు దాని ప్రాముఖ్యత పరంగా, ఆ సభలో మన గురుదేవులు చెప్పినదాన్ని మూడు ముఖ్యమైన అంశాలుగా సంగ్రహించవచ్చు.

అన్నింటికంటే ముందుగా, గురూజీ పుస్తకంలో చెప్పినట్లుగా, “నశ్వరమైన శరీరం మరియు అశాంతితో కూడిన మనస్సులతో తాదాత్మ్యం చెందడమే మన ఆత్మస్వరూపం యొక్క దుఃఖానికి మూలం.”

రెండవ విషయం ఏమిటంటే, మతధర్మం, అది సరిగ్గా రూపకల్పన చేయబడినప్పుడు, అటువంటి బాధను శాశ్వతంగా నివారించడం మరియు స్వచ్ఛమైన ఆనందాన్ని లేదా భగవంతుడిని పొందడాలను కలిగియుంటుంది. అదే మతానికి ఆయన ఇచ్చిన సార్వత్రిక నిర్వచనం.

మూడవ అంశం ఏమిటంటే, మనం ఆయన చెప్పినట్లుగా, “మతాన్ని రూపొందించే సులభమైన, అత్యంత హేతుబద్ధమైన మరియు అత్యంత ప్రాథమికమైన – మరియు అందరూ ఆచరించదగిన – పద్ధతులను, నిత్యానందభరితమైన ఆత్మస్వరూపాన్ని, తాత్కాలికమైన శరీరం మరియు మనస్సులతో దాని హానికరమైన సంబంధం మరియు తాదాత్మ్యతల నుండి విముక్తి చేసి, తద్వారా అది శాశ్వతంగా బాధను నివారించి, పరమానందాన్ని పొందేలా చేసే పద్ధతులను” మనమందరం ఉపయోగించవచ్చు.

ఇది బహుశా కొంచెం తాత్వికంగా లేదా అర్థం చేసుకోవడానికి క్లిష్టంగా అనిపించవచ్చు, కానీ గురూజీ స్వేచ్ఛ అనే భావనను తీసుకుని, అది పూర్తిగా మత శాస్త్రంలో ప్రావీణ్యతపై ఆధారపడి ఉంటుందని ఎలా చూపించారో మనం గమనించాలని నేను కోరుకుంటున్నాను. ఆయన చెప్పినట్లుగా: “నిత్యానందమయమైన ఆత్మస్వరూపాన్ని, అశాశ్వతమైన శరీరం మరియు మనస్సులతో దాని హానికరమైన సంబంధం మరియు తాదాత్మ్యతల నుండి విముక్తి చేయడం.” మరో మాటలో చెప్పాలంటే, మన స్వేచ్ఛ మరియు సమానత్వపు సామాజిక ఆదర్శాలకు, మనలోని నీచ స్వభావం యొక్క పతనకరమైన ప్రేరణల నుండి విముక్తి అనే ఆధ్యాత్మిక స్వేచ్ఛా ఆదర్శాల మద్దతు లభించనంత వరకు, ఆ సామాజిక ఆదర్శాలు అమెరికాలో గానీ లేదా మరే ఇతర దేశంలో గానీ పాక్షికంగా మాత్రమే నెరవేరతాయని ఆయన అమెరికన్లకు, మరియు ప్రపంచంలోని ప్రతి దేశ పౌరులందరికీ సూచిస్తున్నారు.

పరమహంస యోగానంద గారి బోధనలైన ఎస్ఆర్ఎఫ్ /వైఎస్ఎస్ పాఠాలలో ఆయన, ఆ తాదాత్మ్య ప్రక్రియపై నియంత్రణ సాధించడానికి అవసరమైన సరైన మనోవైఖరులను, సరైన దివ్యసంకల్పాలను, అన్నింటికంటే ముఖ్యంగా సరైన శాస్త్రీయ పద్ధతులను ఆయన మనకు అందించారంటే, మనం ఎంత అదృష్టవంతులం! అదే యోగ శాస్త్రం, మతధర్మ శాస్త్రం: మన నిజస్వరూపం పరమాత్మతో ఏకత్వం, భగవంతునితో ఏకత్వం అని గ్రహించడం; మరియు మిగతా అన్ని తాత్కాలిక తాదాత్మ్యాలు పరిమితులను, బంధాలను, కర్మను, క్లేశాలను — పతంజలి తమ యోగ సూత్రాలలో ప్రస్తావించిన అయిదు రకాల ఇబ్బందులను — తెస్తాయని గ్రహించడమే. పతంజలి తన యోగ సూత్రాలలో ప్రస్తావించిన ఇబ్బందులు.3 “మత విజ్ఞాన శాస్త్రం” స్వేచ్ఛ యొక్క నిజమైన అర్థంపై ఇంతకంటే సముచితమైన, సమగ్రమైన మరియు లోతైన వివరణ ఇంకేముంటుంది!

అధోజ్ఞాపికలు:

  1. యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రచురించిన సాంగ్స్ ఆఫ్ ద సోల్ నుండి సంగ్రహించబడిన “ఇన్ ది లాండ్ ఆఫ్ డ్రీమ్స్” నుండి సంగ్రహించబడినవి.
  2. ఒక దశాబ్దానికి పైగా ముందు, 1607లో ఇంగ్లాండ్ నుండి వచ్చిన వలసదారులు వర్జీనియాలో మరొక శాశ్వత స్థావరాన్ని స్థాపించారు; కానీ ఈ బృందం యొక్క ఉద్దేశ్యం మత స్వేచ్ఛ కోసం అన్వేషణ కాకుండా, ప్రధానంగా వాణిజ్య స్వభావం కలిగినది.
  3. గాడ్ టాక్స్ విత్ అర్జున: ద భగవద్గీత లో, పరమహంస యోగానంద ఇలా వివరిస్తున్నారు: “యోగ సూత్రాలలో, II:3, క్లేశములు, లేదా ఇబ్బందులు, ఐదు విధాలవిగా నిర్వచించబడ్డాయి: అవిద్య (అజ్ఞానం), అస్మిత (అహం), రాగం (అనుబంధం), ద్వేషం (విరక్తి), అభినివేశం (శరీరవ్యామోహం).”
కమలం-నారింజ-రేఖాచిత్రం

యోగ ధ్యాన శాస్త్రం మరియు సమతుల్య జీవన కళపై పరమహంస యోగానంద గారి బోధనల సారాంశమైన యోగదా సత్సంగ పాఠాల గురించి మరింత తెలుసుకోవడానికి మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.

స్వామి చిదానందజీ 2020 ఎస్.ఆర్.ఎఫ్. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా చేసిన ప్రసంగంలోని ఈ భాగాన్ని మీరు ఎస్.ఆర్.ఎఫ్. యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోగా కూడా చూడవచ్చు.

ఇతరులతో పంచుకోండి