గురుదేవుల కార్యాచరణకు సేవ చేయడంలో గల రెండు అంశాలైన సేవ మరియు సాధన యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, మన పూజ్య అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక అధిపతి అయిన శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి గారు ఇలా అన్నారు, “సాధన లేకుండా, సేవ శాశ్వత ఫలాన్ని ఇవ్వదు. అలాగే, సేవ— నిస్వార్థత, తనను తాను అర్పించుకోవడం — లేకుండా సాధన యొక్క లక్ష్యం సాధారణంగా అందకుండానే ఉండిపోతుంది.”
పై మార్గదర్శకాన్ని ఆచరణలో పెడుతూ, భారతదేశం మరియు నేపాల్ నలుమూలల నుండి 60 మందికి పైగా వై.ఎస్.ఎస్. యువజన సేవా వాలంటీర్లు 2026, ఆగష్టు 19-23 వరకు సాధన, ఆధ్యాత్మిక అధ్యయనం మరియు సామూహిక అభ్యాసంపై దృష్టి పెట్టడానికి వై.ఎస్.ఎస్. దక్షిణేశ్వర్ ఆశ్రమానికి చేరుకున్నారు. ఈ మొట్టమొదటి ఐదు రోజుల యువజన సేవా నాయకుల ఏకాంత ధ్యానవాసం, దైనందిన కార్యకలాపాలకు దూరంగా ఉంటూ, అందరు కలిసి ఆధ్యాత్మిక సాధనలో గాఢంగా లీనమయ్యే అవకాశాన్ని కల్పించింది.
దక్షిణేశ్వర్ ఆశ్రమంలో వై.ఎస్.ఎస్. సన్యాసులతో యువజన సేవా వాలంటీర్లు
సన్యాసులచే నిర్వహించబడిన కీర్తనలతో కూడిన దీర్ఘ ధ్యానాలు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. “వై.ఎస్.ఎస్. ప్రచురణల నుండి తీసుకున్న అంశాల ఆధారంగా జరిగిన రోజువారీ శ్రవణ (సామూహిక అధ్యయనం) సమావేశాలు, సంఘ నిర్మాణం మరియు నాయకత్వంపై దృష్టి సారించాయి. అవి హాజరైన వారు పునరుత్తేజితమవడానికి మరియు పరస్పర-బంధాలను పెంపొందించుకునేందుకు ఎంతో విలువైన అవకాశాన్ని కూడా కల్పించాయి.” వ్యూహాత్మక సమీక్షా సమావేశాలు, భవిష్యత్ కార్యక్రమాలను నిర్ధారణ చేసే సమావేశాల ద్వారా, ఈ ఏకాంత ధ్యానవాసం వాలంటీర్లకు యువజన సేవా కార్యకలాపాలు, దాని తక్షణ అవసరాలు, దాని వివిధ కార్యక్రమాలకు వారు ఎలా అర్థవంతంగా తోడ్పడగలరనే దానిపై విస్తృత అవగాహనను పెంపొందించడానికి తోడ్పడింది.
“ఈ ఏకాంత ధ్యానవాసం ఆత్మపరిశీలన, ఆధ్యాత్మిక పునరుజ్జీవనం, అర్థవంతమైన సంబంధాలు మరియు సేవ పట్ల నూతన నిబద్ధతతో కూడిన ఒక అందమైన ప్రయాణం.”
సేవ యొక్క ఆధ్యాత్మిక పునాదిని ప్రగాఢం చేసుకోవడం
ఈ ఏకాంత ధ్యానవాసం, వాలంటీర్లు శిష్యులుగా తమ ప్రయాణం గురించి గాఢంగా ఆలోచించడంలోనూ, మరియు సేవను అందించడంలో తమ లోతైన ఉద్దేశాలను, లక్ష్యాలను సుస్పష్టం చేసుకోవడంలోనూ సహాయపడింది. ప్రతి ఒక్కరి దృష్టిని “దేవుడు మాత్రమే” అనే దానిపై తిరిగి కేంద్రీకరించడం ద్వారా, ఈ కార్యక్రమం, సహవాసంలో ఉండి అభిప్రాయాలు పంచుకోవడం, నేర్చుకోవడం మరియు పరస్పర సాహచర్యాలను వై.ఎస్.ఎస్. మార్గం యొక్క ప్రధాన ఆధ్యాత్మిక లక్ష్యంతో సమతుల్యం చేసింది.
గంగానది ఒడ్డున ఉన్న దక్షిణేశ్వర్ ఆశ్రమం యొక్క ప్రాంగణం ఈ అంతర్ముఖ దృష్టికి తోడ్పడింది. తెల్లవారుజామున దక్షిణేశ్వర్ కాళికాదేవి ఆలయ సందర్శన, అలాగే రాత్రి భోజనం తర్వాత కథలు చెప్పుకోవడం, కవిత్వం మరియు సహవాసం ఈ ఏకాంత ధ్యానవాసంలో అల్లిన వినూత్న అనుభవాలలో కొన్ని.
దక్షిణేశ్వర్ కాళికాదేవి ఆలయంలో జగన్మాత ఆశీస్సులు కోరడం
“చక్కగా ఆలోచించి రూపొందించిన ఏకాంత ధ్యానవాసానికి, ముఖ్యంగా కాళీమాత ఆలయ సందర్శనకు హృదయపూర్వక కృతజ్ఞతలు. దివ్యమైన ప్రేమ నన్ను ఆవరించినట్లు స్పష్టంగా అనుభూతి చెందగలిగాను.”
ఉమ్మడి లక్ష్య భావన
ప్రస్తుతం, దాదాపు 400 మంది యువజన సేవల స్వచ్ఛంద సేవకులు భారతదేశం నలుమూలలా అనేక కార్యక్రమాలలో వివిధ పాత్రలలో సేవలందిస్తున్నారు, వాటిలో:
- యువ సాధకుల సంగమాలు
- ఆన్లైన్ యువ సాధక సహవాసాలు
- బాలల/యుక్తవయస్కుల వేసవి శిబిరాలు
- ఆన్లైన్ యుక్తవయస్కుల (టీనేజీ) సత్సంగం
- కేంద్రాలు మరియు మండళ్ళలలో వ్యక్తిగతంగా పాల్గొనే బాలల మరియు యుక్తవయస్కుల సత్సంగాలు మొదలైనవి
ఈ ఏకాంత ధ్యానవాసం వివిధ పాత్రలలో సేవ చేస్తున్న వారిని — ఫెసిలిటేటర్లు, శిక్షకులు, కంటెంట్ సృష్టికర్తలు, కార్యాచరణ నిర్వాహకులు (ఆపరేషన్స్ లీడ్స్) మరియు కార్యక్రమ నిర్వాహకులు (ప్రోగ్రామ్ మేనేజర్లను) ఒకచోటకు చేర్చింది. యువ సాధకుల సహవాసం (YSF) యొక్క ముఖ్య బృందం నుండి దాదాపు 20 మంది యువ సాధకులు కూడా పాల్గొని కార్యక్రమానికి కొత్త ఆలోచనలను తీసుకువచ్చారు.
చక్కటి సహకార వాతావరణంలో, ఈ తరాల మధ్య సమావేశం భక్తులు ఒకరి నుండి ఒకరు తరాల అంతరాలను దాటి నేర్చుకోవడానికి, అనుభవాలను పంచుకోవడానికి, అంతర్దృష్టులను పొందడానికి మరియు యువజన సేవలలో సేవ చేయడం అంటే ఏమిటి, మరింత విస్తృతంగా వై.ఎస్.ఎస్. వాలంటీర్గా ఉండటం అంటే ఏమిటనే దానిపై విస్తృత అవగాహనను పెంపొందించుకోవడానికి వీలు కల్పించింది. ఈ సమావేశం అంతటిలోనూ, ఆత్మావలోకనం, సంభాషణ మరియు ఉమ్మడి అనుభవాల ద్వారా నేర్చుకోవడం అనే అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.
2027 కోసం ఊహించిన ఎనిమిది సేవారంగాలను హాజరైన వారికి పరిచయం చేయడం జరిగింది. ఈ విధంగా, వారు తమకు ఆసక్తి లేదా ముందస్తు అనుభవం ఉన్న రంగాలను ఎంచుకోవడంతో పాటు, ముందుకు వెళ్తూ తాము ఇంకెక్కడ తోడ్పడగలరో కూడా అన్వేషించే వీలు వారికి కలిగింది.
ఏకాంత ధ్యానవాసంలో గ్రహించిన ప్రధాన అంశాలు
- వాలంటీర్లు కార్యక్రమంలోని ధ్యానం మరియు విశ్రాంతి ద్వారా ఆధ్యాత్మికంగా ఉత్తేజం పొందినట్లు భావించారు.
- పరస్పర సేవా అనుసంధానాలు మరియు కొత్త స్నేహాల ద్వారా సహవాస స్ఫూర్తి మరింత బలపడింది.
- కేవలం నిర్దిష్ట సేవారంగాలకే పరిమితం కాకుండా, యువజన సేవల దార్శనికతను మరింత విస్తృత దృక్పథంతో వాలంటీర్లు అర్థం చేసుకున్నారు.
- సేవాసూత్రాల గురించి మరింత స్పష్టమైన అవగాహనను వాలంటీర్లు పొందారు.
- కొందరు వాలంటీర్లు గురుదేవుల కార్యాచరణ కోసం మరిన్ని బాధ్యతలను స్వీకరించడానికి ప్రేరణ పొందారు.
“జీవితం ముఖ్యంగా సేవయై ఉండాలి”
ఈ శిబిరంలో పరమహంస యోగానంద గారి ఒక సూక్తి నొక్కి చెప్పబడింది, అందులో ఆయన ఇలా అన్నారు:
జీవితం ముఖ్యంగా సేవ అయి ఉండాలి. ఆ ఆదర్శం లేకుండా, భగవంతుడు మీకు ఇచ్చిన మేధస్సు దాని లక్ష్యం వైపు విస్తరించడం లేదు. సేవలో మీరు చిన్న అహాన్ని మరచిపోయినప్పుడు, మీరు ఆత్మ యొక్క విశాల ఉనికిని అనుభూతి చెందుతారు…. జీవితం కర్తవ్యపు ఆనందకరమైన పోరాటమని, అదే సమయంలో ఒక క్షణికమైన స్వప్నమని మీరు గ్రహించి, ఇతరులకు దయను, శాంతిని చేకూర్చి వారిని సంతోషపెట్టడానికి ఆనందంతో నిండిపోయినప్పుడు, భగవంతుని దృష్టిలో మీ జీవితం సఫలమైనట్లే.
























