Finding the Joy Within You: Personal Counsel for God-Centred Living అనే పుస్తకంలోని “An Anthology of Counsel” (“బోధనల సంకలనం”)” అనే అధ్యాయం యొక్క సారాంశం ఈ క్రింద ఇవ్వబడింది. ఇందులో శ్రీ దయామాతగారి సత్సంగాల నుండి మరియు ఆమె సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ సభ్యులకు వ్రాసిన లేఖల నుండి తీసుకోబడిన మార్గదర్శక, ప్రేరణాత్మక కథనాలు ఉన్నాయి. పరమహంస యోగానంద గారి అత్యంత సన్నిహిత శిష్యులలో ఒకరైన శ్రీ దయామాత, 1955 నుండి 2010లో ఆమె గతించే వరకు యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియ/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ యొక్క మూడవ అధ్యక్షురాలిగా మరియు సంఘమాతగా సేవలందించారు.
గురుదేవులు ఎన్నో సంవత్సరాలలో భక్తులకు వ్రాసిన అనేక లేఖలను “దివ్య స్నేహంలో” అనే మాటలతో ముగించేవారు; అలాగే, సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ సభ్యులకు పంపే లేఖలను ఈ పదాలతో ముగించడం ఒక సంప్రదాయంగా చేశారు.
ఆత్మల మధ్య ఉండగల అత్యున్నతమైన మరియు స్వచ్ఛమైన సంబంధం, స్నేహం యొక్క స్ఫూర్తి మాత్రమే అని ఆయన తరచుగా మాకు చెప్పేవారు. అందులో ఎటువంటి నిర్బంధము లేదు.
ఆయన సాధారణ మానవ స్నేహం గురించి మాట్లాడటం లేదు; ఆయన ఉద్దేశం బేషరతైన స్నేహం, క్రీస్తుకు తన శిష్యుల పట్ల ఉన్న స్నేహం, వారికి తమ గురువు పట్ల మరియు ఒకరి పట్ల ఒకరికి ఉన్నటువంటి స్నేహం. ఇది వ్యక్తిగతం కానిది; అయినప్పటికీ సంబంధాలలో అత్యంత సన్నిహితమైనది. ఒక వ్యక్తిని, అతడి లోపాలన్నిటితో, ఉన్న వ్యక్తిని ఉన్నట్లుగా, ఏ షరతులు లేకుండా అంగీకరించడం అనే అర్థంలో ఇది బహిరంగమైనది.
అభిప్రాయ భేదాలు తలెత్తినా, స్నేహితుడిని తప్పుగా భావించరు; స్నేహం విచ్ఛిన్నం కాకుండా ఉంటుంది మరియు కాలక్రమేణా మరింత మధురంగా పెంపొందుతుంది. గురుదేవులు తనకు సన్నిహితంగా ఉండే ప్రియమైన భక్తులకు ఇలా చెప్పేవారు: “స్నేహం మధువు లాంటిది; సంవత్సరాలు గడిచే కొద్దీ దాని మాధుర్యం మరింతగా పెరుగుతుంది.”
ప్రపంచ మైత్రి: మానవ జాతికి ఒక సర్వరోగనివారిణి
సార్వత్రిక స్నేహం, ప్రపంచ మైత్రి యొక్క ఆదర్శం గురించి గురుదేవుల ఆలోచనలు కొన్నిటిని నేను చదవాలనుకుంటున్నాను:
“‘ప్రపంచ మైత్రి’ అనేది చాలా సరళమైన మాటలా అనిపిస్తుంది, కానీ ప్రపంచంలోని భౌతిక, మానసిక, నైతిక మరియు ఆధ్యాత్మిక ఆనందాన్ని భయపెడుతున్న వ్యక్తిగత, సామాజిక మరియు రాజకీయ రుగ్మతల కన్నిటికీ దివ్యౌషధం ఈ రెండు పదాలలోనే ఉంది…. ఈ ప్రపంచం మీకు లేదా నాకు చెందినది కాదు. మనము ఇక్కడ కొద్దికాలం మాత్రమే ఉండే ప్రయాణికులం. ఈ ప్రపంచం దేవునికి చెందినది. ఆయన మన అధ్యక్షుడు, మరియు ఆయన అధీనంలో మనం ఐక్య ప్రపంచాన్ని స్థాపించాలి, ప్రతి సోదర దేశం మైత్రిలో నివసిస్తుంది…. దేవుడిని తెలుసుకోవడమే ఏకైక మార్గం; ఆయనను ధ్యానించడమే ఆయన్ని తెలుసుకొనే మార్గం…. ప్రపంచ మైత్రి మాత్రమే ద్వేషాన్ని పారద్రోలి యుద్ధాలను నిరోధించగలదు. ప్రపంచ మైత్రి మాత్రమే మానవాళికి శ్రేయస్సును సుస్థిరం చేయగలదు. కాబట్టి నేను మీకు చెబుతున్నాను, దేవునితో అనుసంధానం పొందడం ద్వారా ఆ మైత్రిని మీ హృదయాల్లోకి తీసుకురండి. దేవుని పితృత్వాన్ని, ప్రతి మానవుడు మీకు చెందినవాడనీ అనుభూతి చెందండి. మీరు మీ హృదయంలో దేవుడిని అనుభూతి చెందిన వెంటనే, ఇంతకు ముందు ఏ రాజు లేదా రాజకీయ నాయకుడు చేయని విధంగా ప్రపంచ నాగరికతకు మీరు తోడ్పడతారు. మీరు కలిసిన వారినందరినీ ప్రేమించండి. ‘ఆయన నా సోదరుడు, ఎందుకంటే నాలో ఉన్న నా దేవుడు ఆయనలో కూడా ఉన్నాడు’ అని దృఢంగా చెప్పగలగాలి.’”
నేడు మన ప్రపంచానికి ఎంతో అవసరమైనది ఏమిటంటే, ఎక్కువ మంది వ్యక్తులు అందరికీ దివ్య ప్రేమ మరియు స్నేహాన్ని అందించడం ద్వారా తమ చిన్న వ్యక్తిత్వాన్ని దాటి చైతన్యాన్ని విస్తరించుకోడానికి ప్రయత్నించాలి.
అందరికీ ప్రేమ మరియు స్నేహాన్ని ఇవ్వడం
మహాత్మాగాంధీ గురించి గురుదేవులు మాట్లాడుతూ, ఇలా అన్నారు: ఆయన భారతదేశానికి మాత్రమే చెందినవారు కాదు. ఇక్కడ ఉన్నది ఒక నిరాడంబరమైన వ్యక్తి – గురుదేవులు ఆయనను కలిసి, ఆయనతో కొన్ని రోజులు గడిపారు – అత్యంత నిరాడంబరంగా జీవించి, కేవలం ఒక కౌపీనం మాత్రమే ధరించే ఒక నిగర్వియైన ఆత్మ. ఆయన భారతదేశానికి చెందిన హిందువు అయినప్పటికీ, ఆయన ఈ ఆధునిక యుగంలో జన్మించిన నిజమైన క్రైస్తవుడు. ఆయన ఇలా అన్నారు: “నా భారతదేశాన్ని ప్రేమించే వ్యక్తి ఎవరైనా, అతడు భారతీయుడే.” ఈ మాటల ద్వారా, ఆయన తన ప్రేమ నుండి ఎవరినీ మినహాయించలేదు. దేవుని పట్ల మరియు తన స్వంత ప్రజల పట్ల తమ ప్రేమలో ఆయన సమస్త మానవాళిని చేర్చారు. మానవ ఆత్మ యొక్క సార్వత్రికతను ఆయన గుర్తించి, దానికి ఉదాహరణగా నిలిచారు.
అదే స్ఫూర్తిని గురుదేవులు తమ జీవితంలో కూడా వ్యక్తపరిచారు. ఆయనకు అపరిచితులు ఎవరూ లేరు. ఆయన అందరినీ ఎంతో ఆప్యాయంగా – మధురమైన, సరళమైన, సాధు స్వభావంతో కూడిన విశ్వాసం మరియు స్నేహంతో కలిసేవారు. తమను అర్థం చేసుకోనివారిని కూడా ఆయన అర్థం చేసుకున్నారు. మొదట దేవుణ్ణి హృదయపూర్వకంగా అన్వేషించడం అనే ఆదర్శాన్ని ఆయన ఆచరించారు — మనం ఆయన వారమని, ఆయన మన హృదయాల రహస్య పిలుపుకు ప్రతిస్పందిస్తాడని మనం ఎటువంటి సందేహం లేకుండా సంతృప్తి చెందాలి — ఆపై ఆయన తన మార్గంలో తారసపడిన ప్రతి ఒక్కరికీ దేవుని యందు తాము కనుగొన్న అదే దివ్యప్రేమ మరియు స్నేహాన్ని అందించారు.
నిజమైన స్నేహం అనేది మన జీవితాన్ని మరియు మన ప్రపంచాన్ని ఎలా మార్చగలదు అన్న విషయాలపై పరమహంస యోగానంద గారి కాలాతీత జ్ఞానాన్ని తెలియచేసే రాబోయే పుస్తకం The Spiritual Expression of Friendship (స్నేహానికి ఆధ్యాత్మిక వ్యక్తీకరణ) గురించి తెలుసుకోవడానికి మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.



















