నేడు ప్రజలు ఎదుర్కొంటున్న ఒత్తిళ్ల మధ్య కూడా సమతుల్యమైన జీవితం సాధ్యమేనా? – శ్రీ దయామాత

6 జూన్, 2026

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ యొక్క మూడవ అధ్యక్షురాలు మరియు సంఘమాత అయిన శ్రీ దయామాతను, 1993 జనవరి 5న పరమహంస యోగానంద గారి జయంతి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా, 1992లో చేసిన ఇంటర్వ్యూలో, ఆయన జీవితం మరియు ఆశయం గురించి అనేక ప్రశ్నలు అడిగారు. ఆమె సమాధానాలు, ఆ వార్షికోత్సవం సందర్భంగా 1993లో ప్రచురించబడిన యోగాదా సత్సంగ పత్రిక యొక్క ప్రత్యేక సంచికలలో ప్రచురించబడ్డాయి. ఆ సమాధానాల సంకలనం త్వరలో రాబోయే శ్రీ దయామాత గారి ప్రసంగాల మూడవ సంకలనం అయిన పరమహంస యోగానందతో ప్రయాణం అనే పుస్తకంలో ఒక అధ్యాయంగా ప్రచురించబడుతోంది. ఆమెను అడిగిన ఒక ప్రశ్నకు, ఆమె ఇచ్చిన ఎంతో ప్రోత్సాహకరమైన సమాధానాన్ని ఇక్కడ మేము అందిస్తున్నాము.

కమలం-నారింజ-రేఖాచిత్రం

ప్రశ్న: ధ్యానం మరియు సత్కర్మలతో కూడిన సమతుల్య జీవితం అనే భావన, సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ [యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా] లో ఒక ముఖ్యమైన సూత్రంగా కనిపిస్తుంది. పరమహంస యోగానంద గారు నిస్సందేహంగా ఆ ఆదర్శాన్ని ఆచరించారు. ఆయన దేశమంతటా పర్యటించారు, నగరాల్లో ప్రసంగించారు, వేలాది మందిని కలుసుకున్నారు. అయినప్పటికీ, ఆయన దైవ సాంగత్యంతో కూడిన అంతర్గత జీవితాన్ని గడిపారు. నేడు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఒత్తిడుల మధ్య ఒక సగటు వ్యక్తికి ఇది సాధ్యమేనా?

పరమహంస యోగానంద గారి సందేశంలోని ఒక భాగం ఏమిటంటే, దైవానుభూతి కేవలం ఆశ్రమాలు, మఠాలలో నివసించే వారికి మాత్రమే పరిమితం కాదు. అది మానవాళి అందరి కోసం ఉద్దేశించబడింది. మీరు హిమాలయ గుహకు పారిపోనవసరం లేదు! మీరు ఎక్కడ ఉన్నా ఆయనను కనుగొనవచ్చు. మీ జీవితం ఎంత గందరగోళంగా ఉంటే, అంత ఎక్కువగా ఆయనను కనుగొనడం మీకు అవసరం.

మీరు మీ కార్యనిమగ్నమైన జీవితాన్ని ధ్యానం కోసం కేటాయించే సమయంతో సమతుల్యం చేసుకుంటే, గొప్ప సాధువులు, గురువులు చేసినట్లే మీరు కూడా దేవుడిని మీ సొంతం చేసుకోగలరు. ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు ధ్యానంలో పొందిన ఆయన సాన్నిధ్యపు చైతన్యాన్ని కార్యకలాపాలలో ఉన్నప్పుడు నిలుపుకోవాలి. దీని అర్థం ఏమిటంటే, మీరు ఏ పని చేస్తున్నా సరే, ఆయనను మరచిపోకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. మీరు ఆయనను మీ జీవితంలోకి ఆహ్వానించి, మీ జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి. తద్వారా మీ ఆలోచనలు, చేతలన్నింటిలో ప్రవహించే ఏకీకృత సూత్రంగా, నిశ్శబ్ద ప్రేమగా ఆయన మారిపోతాడు.

దేవుణ్ణి వెతకడానికి ప్రపంచాన్ని త్యజించాల్సిన అవసరం లేనప్పటికీ, వేగాన్ని తగ్గించుకోవడం, అంటే మరింత ప్రశాంతమైన, అంతర్ముఖమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నించడం మాత్రం తప్పనిసరి. మనం ఈ ప్రపంచంలో ఎంత ఉద్రిక్తంగా ఉన్నామో మనకు అర్ధమవుతోందని నాకు అనిపించడం లేదు. బాధ్యతలు పెరిగిపోయి, ఒత్తిడి అధికమై, పనులు పేరుకుపోయినప్పుడు, “అది అసాధ్యం!” అని ప్రజలు ఆలోచించడం మొదలుపెడతారు. అప్పుడు మీతో మీరే, “ప్రశాంతంగా ఉండు” అని చెప్పుకోవాలి. ఆ తర్వాత ఆందోళనల్ని వదిలేయండి. ప్రశాంతంగా ఉండండి. నా స్వంత జీవితంలో, నేను ఒత్తిడికి గురైనప్పుడు సాధించే దానికంటే, ఇలా చేయడానికి ప్రయత్నించడం వల్ల చాలా ఎక్కువ సాధించగలుగుతున్నానని గమనించాను. అలా ఒత్తిడికి లోనవడంలో అర్థం లేదు; మీరు అలా చేయడం వల్ల కేవలం తీవ్రమైన ఆందోళనకు గురై మానసికంగా కుంగిపోతారు.

మీరు దేవుణ్ణి అన్వేషిస్తున్నప్పుడు, ‘తొందరగా, తొందరగా, తొందరగా’ అనే భావన అస్సలు ఉండకూడదు. మీరు ధ్యానంలో తొందరపాటు వైఖరిని అవలంబిస్తే, దేవుని సాన్నిధ్యాన్ని అనుభూతి చెందడం గురించి మర్చిపోవడమే మంచిది. మీరు ఆ విధంగా ఇరవై సంవత్సరాల పాటు ప్రతిరోజూ ధ్యానం చేసినా ఎటువంటి ప్రయోజనం పొందలేరు. మీరు కేవలం యాంత్రికంగా ధ్యానం చేస్తున్నట్లే అవుతుంది. మీరు నెమ్మదించి, మీ ప్రేమపూర్వకమైన శ్రద్ధను దేవునిపై పెట్టడం నేర్చుకోవాలి. అది చాలా ముఖ్యమైనది.

ఆహారం, నిద్ర లేదా అవసరాలుగా మనం భావించే ఇతర విషయాలు లేకుండా మనం జీవించలేమని అనుకుంటాము, అందుకే వాటి కోసం సమయం కేటాయించుకుంటాము. అదేవిధంగా, మన మనస్సులకు, మన శరీరాలకు, మన కార్యకలాపాలన్నింటికీ శక్తిని ప్రసాదిస్తున్న దేవుడు లేకుండా మనం జీవించలేమని గ్రహించాలి. మనం ఆయనను నిర్లక్ష్యం చేస్తే, మన జీవితాలకు సృష్టికర్త మరియు పోషకుడైన ఆ ఒక్కరి నుండే మనల్ని మనం వేరు చేసుకున్నవారమవుతాము.

పని కోసం ఒక సమయం ఉంటుంది; ధ్యానానికి ఒక సమయం ఉంటుంది. దేవుని కోసం చాలా క్రియాశీలకంగా పని చేయాలని గురుదేవులు మాకు బోధించారు; కాని, పని చేస్తున్నప్పుడు, అప్పుడప్పుడు ఆగి మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవాలి అని కూడా బోధించారు, “నా చైతన్యం ఎక్కడ ఉంది? నా అంతరంగంలో ఉన్న దేవుణ్ణి నా మనస్సు నిశ్శబ్దంగా గమనిస్తోందా, లేక ఈ బాహ్య చింతలలో చిక్కుకుపోయిందా?” మీరు ధ్యానం చేసి, ఆ తర్వాత పనులు చేస్తున్నప్పుడు కూడా మనస్సును దైవంపై కేంద్రీకరించడానికి ప్రయత్నిస్తే, మీ అంతట మీరే మీ జీవితంలో సమతుల్యతను వ్యక్తం చేయడం మొదలుపెడతారు. ఇంకా మీరు భావోద్వేగాలతో కాకుండా, లోతైన అంతర్గత ప్రశాంతతతో పనిచేసే ఒక ప్రశాంతమైన వ్యక్తిగా మారతారు.

కమలం-నారింజ-రేఖాచిత్రం

భగవంతునికి, గురుదేవులైన పరమహంస యోగానంద గారికి ప్రేమతోను, వినయంతోను, మరియు అంకితమైన సేవతోను కూడిన వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. యొక్క ప్రియతమ మూడవ అధ్యక్షురాలు మరియు సంఘమాత అయిన శ్రీ దయామాత గారి స్ఫూర్తిదాయకమైన జీవితం గురించి తెలుసుకోవడానికి మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.

ఇతరులతో పంచుకోండి