శాంతి స్థాపనకు మార్గం ఏమిటి? ప్రతి సెప్టెంబరులో, ఐక్యరాజ్యసమితి పిలుపుతో అంతర్జాతీయ శాంతి దినోత్సవం ద్వారా సమాజాలు మరియు దేశాల మధ్య పరస్పర అవగాహన, గౌరవం మరియు బహిరంగ సంభాషణతో శాంతి యొక్క ఆదర్శం గౌరవించబడుతోంది.
శాంతి మరియు సామరస్యం యొక్క దివ్య మూలాన్ని మనం అంతర్గతంగా అనుభవించడం ద్వారా — ఆ లక్ష్యాన్ని చేరుకొనేందుకు మనతోనే దాన్ని మనం ప్రారంభించాలని పరమహంస యోగానందగారు మరియు మహాత్ములందరు బోధించారు.
“ప్రపంచంలోని ప్రతి పౌరుడికీ భగవంతునితో అనుసంధానం పొందడం నేర్పిస్తే (కేవలం ఆయనను మేధోపరంగా తెలుసుకోవడం కాదు), ముందెన్నడూ లేని విధంగా అప్పుడు శాంతి నెలకొంటుందని నేను నమ్ముతున్నాను,” అని పరమహంసగారు వివరించారు. “నిలకడగా ధ్యానం చేస్తూ ఆయనతో సంసర్గం ద్వారా భగవంతుడిని తెలుసుకున్నప్పుడు మీ హృదయం మానవ జాతినంతటినీ స్వీకరించడానికి సిద్ధంగా ఉంటుంది.”
2024 స్నాతకోత్సవంలో వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక అధిపతి అయిన స్వామి చిదానంద గిరిగారు తమ ఇటీవలి ప్రసంగంలో మనకు హామీ ఇచ్చినట్లుగా: మనం సమిష్టిగా దైనందిన ధ్యానం యొక్క పవిత్ర శాస్త్రాన్ని ఆచరించడం నేర్చుకున్నప్పుడు మరియు మన ఆధునిక ప్రపంచ నాగరికత యొక్క ఆవిష్కరణలను, అభివృద్ధిని నిర్మాణాత్మకంగా ఉపయోగించుకున్నప్పుడు, “శ్రేయస్సు, సామరస్యం, ఆధ్యాత్మిక అవగాహన మరియు శాంతిని కలిగించే కొత్త యుగం భూమిపై ఆవిర్భవిస్తుంది.”
మీ కోసం వేచి ఉన్న ఆత్మ యొక్క శాంతిని కనుగొనడానికి మరియు మొత్తం మానవాళితో మీ విడదీయరాని సంబంధాన్ని లోతుగా అనుభూతి చెందడానికి — ధ్యానాన్ని ఆచరణలో పెట్టేందుకు, ఈ వార్తాలేఖ మిమ్మల్ని ప్రేరేపిస్తుందని మేము ఆశిస్తున్నాము.
పరమహంస యోగానందగారి ప్రసంగాలు మరియు రచనల నుండి:
మీరు అంతరంగంలో ప్రశాంతతతోను మరియు శాంతముగాను ఉన్నప్పుడు, మీరు అందరినీ ప్రేమిస్తూ, అందరితో స్నేహపూర్వకంగా ఉంటారు. ఇది దేవుడు తన సృష్టికి ఉద్దేశించిన సామరస్యం.
ధ్యానంలో పొందే శాంతి భగవంతుని పరిభాష, ఆయన పరిష్వంగ సాంత్వన. మీ అంతరంగంలోని శాంతి సింహాసనాన్ని ఆయన అధిష్టించి ఉన్నాడు. ఆయనను ముందుగా అక్కడ కనుక్కోండి, అప్పుడు జీవితంలోని ఉత్తమమైన మరియు అర్థవంతమైన వాటన్నిటిలోను — నిజమైన స్నేహితులలోను, ప్రకృతి సౌందర్యంలోను, ఉత్తమ గ్రంథాలలోను, ప్రగాఢ భావాలలోను, ఉన్నతాశయాలలోను — మీరు ఆయనను కనుగొంటారు.
మీరు ప్రతి రాత్రి నిద్రలో శాంతి మరియు ఆనందాన్ని రుచి చూస్తారు. మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు, దేవుడు మిమ్మల్ని నిశ్చలమైన అధిచేతన స్థితిలో జీవించేలా చేస్తాడు, ఆ స్థితిలో ఈ ఉనికి యొక్క భయాలు మరియు చింతలన్నీ మరచిపోతారు. ధ్యానంతో మీరు మెలకువగా ఉంటూనే ఆ పవిత్రమైన మానసిక స్థితిని అనుభవించవచ్చు మరియు స్వస్థత చేకూర్చే శాంతిలో స్థిరంగా లీనమైపోవచ్చు.
యోగి ధ్యానజనిత శాంతిని పనిలోనూ, ఇతరులతో చేసే అన్ని వ్యవహారాలలోనూ మనస్సులో స్థిరంగా ఉంచుకోవడానికి సర్వవేళలా ప్రయత్నిస్తూ ఉంటాడు.
దైనందిన ధ్యానం యొక్క తమ భక్తిపూర్వక అభ్యాసం ద్వారా శాంతిని సృష్టించేవారే నిజమైన శాంతి సంధాయకులు…. భగవంతుని స్వభావాన్ని అంతర్గత శాంతిగా అనుభవించినప్పుడు, దేవుని-శాంతి తమ ఇంటిలో, పరిసరాల్లో, దేశంలో, అన్ని జాతులలో మరియు అన్ని వర్గాల మధ్య ఎల్లప్పుడూ ప్రత్యక్షంగా ఉండాలని కోరుకుంటారు.
ఒక క్రీస్తు, ఒక కృష్ణుడు, ఒక బుద్ధుడి జ్ఞానము మరియు దృష్టాంతాల ప్రకారం మనలో ప్రతి ఒక్కరూ తన జీవితాన్ని తీర్చిదిద్దుకున్నప్పుడు, ముందెన్నడూ లేనివిధంగా ఇక్కడ మనకు శాంతి నెలకొంటుంది. మనతో, మనం ఇప్పుడే ప్రారంభించాలి. మనకు మార్గాన్ని చూపేందుకు పదేపదే భూమిపైకి వచ్చిన మహాత్ముల వలె ఉండేందుకు మనం ప్రయత్నించాలి. వారు బోధించినట్లుగా మరియు వారి దృష్టాంతం ద్వారా, మనం ఒకరినొకరు ప్రేమించుకొంటే, మన అవగాహనను స్పష్టంగా ఉంచుకొంటే, శాంతి అవతరిస్తుంది.
ఈ జ్ఞానాన్ని వెంటనే ఆచరణలో పెట్టడానికి, ఎస్.ఆర్.ఎఫ్. సన్యాసి స్వామి సేవానంద గిరి నేతృత్వంలో “గైడెడ్ మెడిటేషన్ ఆన్ ఇన్నర్ పీస్ ఫ్రమ్ పరమహంస యోగానంద” లో పాల్గొనడానికి మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ధ్యాన ఆసనం గురించి అద్భుతమైన అవలోకనాన్ని, అలాగే పరమహంసగారు బోధించిన — ధ్యానానికి ముందు చేసే కొన్ని ప్రాథమిక శ్వాసాభ్యాసాలను కూడా ఈ వీడియో అందిస్తుంది.




















