“నేను చేయగలను” అనే చైతన్యంతో నిరుత్సాహాన్ని అధిగమించడం గురించి పరమహంస యోగానందగారు

18 అక్టోబరు, 2024

ఒక పరిచయం: 

మీరు ఎప్పుడైనా ఒక విలువైన ఆధ్యాత్మిక లేదా లౌకిక లక్ష్యాన్ని సాధించాలని నిర్దేశించుకొన్నారా, ఆ తరువాత సహజంగా అడ్డంకులు ఎదుర్కొంటున్నప్పుడు, ధైర్యం కోల్పోయారా లేక నిరుత్సాహానికి గురయ్యారా?

సరే, అది మానవునిలో ఉండటం సహజమే, కాని పరమహంస యోగానందగారి బోధనలు, ఎటువంటిదాన్నైనా మరియు నిరుత్సాహాలన్నిటినీ మన అజేయమైన సంకల్పశక్తితో కూడిన పట్టుసడలని దృఢవిశ్వాసంగల ప్రబలమైన దృక్పథంతో భర్తీచేయవచ్చని, దాన్ని మరింత పెంపొందించుకోవచ్చని మనం గుర్తు చేసుకోవచ్చు.

పరమహంసగారు ఇలా అన్నారు, “ఒక యుక్తమైన, హితకరమైన, నిర్మాణాత్మకమైన లక్ష్యాన్ని ఎంచుకుని, దాన్ని మీరు సాధించబోతున్నారని నిశ్చయించుకోండి. మీరు ఎన్నిసార్లు విఫలమైనా, ప్రయత్నిస్తూనే ఉండండి. ఏమి జరిగినా, ‘భూమి బద్దలైనా సరే, నేను చేయగలిగినంత బాగా చేస్తూనే ఉంటాను,’ అని మీరు స్థిరముగా సంకల్పించినట్లయితే, మీరు క్రియాశీలక సంకల్పాన్ని ఉపయోగిస్తున్నారు, మీరు విజయం సాధిస్తారు.”

మనకు దీర్ఘకాలపు సందేహాలు ఉన్నా లేదా తాత్కాలికంగా ఉత్సాహం లేకపోయినా, మన చైతన్యాన్ని మరియు మన పరిస్థితుల్లోను “చెయ్యలేను” నుండి “చెయ్యగలను” అని మార్చుకునే శక్తి మనకు ఉంది.

మీ జీవితంలో ఒక ఉదాత్తమైన ఆశయం కోసం ఉత్సాహాన్ని నింపడానికి ఈ నెల వార్తా — లేఖను మీరు ఉపయోగించగలరని మేము ఆశిస్తున్నాము — మరియు ముఖ్యంగా దివ్యత్వాన్ని సాధించాలనే ఆత్మ యొక్క అత్యున్నత లక్ష్యాన్ని గ్రహించడం కోసం దాన్ని ఉపయోగించగలరు.

పరమహంస యోగానందగారి ప్రసంగాలు మరియు రచనల నుండి:

“చేయలేను అనే చైతన్యానికి” ఒక ప్రతిక్రియ ఉంది: “నేను చెయ్యగలను!” అనే దివ్యసంకల్పం. మీ మనస్సుతో ఆ ప్రతిక్రియను సృష్టించుకొని, మీ సంకల్పంతో దాన్ని అమలు చేయండి. 

ప్రతి ఉదయం, మీరు దేవుని సంతానమని, ఎలాంటి కష్టాలు వచ్చినా, వాటిని అధిగమించే శక్తి మీకు ఉందని గుర్తుచేసుకోండి. పరమాత్మ యొక్క విశ్వశక్తికి వారసులైన మీరు, ప్రమాదం కంటే ప్రమాదకరమైనవారు!

మీరు ఒక పనిని ప్రారంభించడం ద్వారా, అది చేయలేరు అనే ఆలోచనను అధిగమించండి. ఆ తరువాత ఆ పని చేయడం కొనసాగిస్తూనే ఉండండి. పరిస్థితులు మిమ్మల్ని అణచివేయడానికి ప్రయత్నిస్తాయి, మిమ్మల్ని నిరుత్సాహపరిచి, మళ్ళీ “నేను అది చేయలేను” అనేట్లుగా చేస్తాయి. దెయ్యం అనేది ఉన్నట్లయితే, ఆ దెయ్యం “నేను చేయలేను” అనేదే…“నేను దాన్ని చేయగలను” అనే మీ అసాధారణమైన దృఢవిశ్వాసంతో ఆ దెయ్యాన్ని మీ చైతన్యం నుండి బయటకు పారద్రోలండి.

ఈ నిశ్చయం చేసుకొని, మీకు వీలుచిక్కినప్పుడల్లా దాన్ని తరచుగా ధృవీకరిస్తూ ఉండండి. దాన్ని మానసికంగా విశ్వసించండి మరియు సంకల్పశక్తితో దానిపై పని చేయడం ద్వారా ఆ నమ్మకాన్ని శక్తివంతం చేయండి. పని చేయండి! మీరు పని చేస్తున్నప్పుడు, “నేను చేయగలను,” అనే ఆలోచనను ఎన్నటికీ వదిలి పెట్టకండి. వెయ్యి అడ్డంకులు వచ్చినా మీ మనస్సు మెత్తపడకూడదు. మీకు ఆ దృఢసంకల్పం ఉన్నట్లయితే, మీరు ఆశించింది అనివార్యంగా నెరవేరుతుంది; మరియు అది జరిగిప్పుడు, మీరు “మంచిది, అది చాలా సులభం!” అని ప్రకటిస్తారు. 

నేను మీకు చూపిస్తున్న విశాలమైన మార్గం ఎంత అద్భుతమైనదో మీరు తెలుసుకోండి. “నేను చేయగలను, నేను చేసి తీరాలి, మరియు నేను చేస్తాను” అనే మాటలు — మిమ్మల్ని మార్చుకోవడానికి మరియు సంపూర్ణ విజయం సాధించడానికి మార్గం.

మీకు ఇప్పటికే ఉన్న శక్తిని నిర్మాణాత్మక ప్రయోజనాల కోసం విడుదల చేయండి, అప్పుడు మరింత శక్తి వస్తుంది. విజయం యొక్క లక్షణాలన్నిటినీ ఉపయోగించి, స్థిరమైన సంకల్పంతో మీ మార్గంలో పయనించండి. ఆత్మ యొక్క సృజనాత్మక శక్తితో మిమ్మల్ని శృతి చేసుకోండి. మీకు మార్గనిర్దేశం చేయగల మరియు మీ సమస్యలన్నిటినీ పరిష్కరించగల అనంత ప్రజ్ఞతో మీరు సంబంధం ఏర్పరచుకొంటారు. మీ ఉనికికి ఆధారమైన క్రియాశీలక ఉత్పత్తిస్థానం నుండి శక్తి నిరంతరాయంగా ప్రవహిస్తుంది, తద్ద్వారా ఏ కార్యాచరణ దశలోనైనా మీరు సృజనాత్మకంగా పని చేయగలుగుతారు. 

 

అద్భుతమైన సానుకూలతతో జీవితంపై మరియు సంకల్పశక్తిపై మీ దృక్పథాన్ని మనసులో ధృఢంగా నింపడం — తద్ద్వారా మీ విలువైన లక్ష్యాలన్నింటినీ విజయవంతంగా మీరు సాధించగలరు — గురించి పరమహంస యోగానందగారి మరింత జ్ఞానాన్ని గ్రహించడం కోసం “నిజమైన సఫలత మరియు శ్రేయస్సును సాధించడం” అనే వెబ్‌పేజీని సందర్శించమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.  

మీ ఇన్‌బాక్స్‌లో నేరుగా ఇలా పరమహంస యోగానందగారి జ్ఞానాన్ని మరియు ప్రేరణ పొందేందుకు సైన్ అప్ చేయండి.

ఇతరులతో పంచుకోండి