ఇతరులకు సేవ అనే ప్రకాశమానమైన కాంతి గురించి పరమహంస యోగానందగారు

18 ఫిబ్రవరి, 2025

పేరు-పెట్టనివి(11)

ఒక పరిచయం:

ప్రపంచవ్యాప్తంగా, ప్రజానీకం చూసే మరియు చూడని పరిస్థితులలో, ప్రజలు ధైర్యంతో నిస్వార్థంగా మరియు వినయంగా ప్రతిరోజు ఇతరులకు సేవ చేస్తూ అవసరమైన చోట ఆశను కలుగజేస్తారు.

ఇటువంటి సేవా చర్యలు, మన ప్రపంచం యొక్క సామరస్యం కోసం పూర్తిగా అవసరమని, ఆత్మ యొక్క స్వచ్ఛమైన స్వభావం యొక్క వ్యక్తీకరణలని, తద్ద్వారా ఆత్మ దైవంతో తన ఏకత్వాన్ని తెలుసుకొనేలా విస్తరిస్తుందని పరమహంస యోగానందగారు మరియు ఇతర మహాత్ములు చెబుతారు.

ఈ నెల వార్తాలేఖలో, ఇతరులకు సేవ చేయడమనేది మన జీవితాల్లో మరియు ఆధ్యాత్మిక అభివృద్ధిలో పోషించే కీలకపాత్ర గురించిన పరమహంసగారి జ్ఞానముపై మేము దృష్టి సారిస్తాము.

పరమహంస యోగానందగారి ప్రసంగాలు మరియు రచనల నుండి:

జీవితం ముఖ్యంగా సేవామయమై ఉండాలి. ఆ ఆదర్శం లేకపోతే, భగవంతుడు మీకిచ్చిన ప్రజ్ఞ దాని గమ్యం వైపుగా వెళ్ళడం లేదు. సేవలో, మీ చిన్న ఆహాన్ని మరచిపోయినప్పుడు, పరమాత్ముని ప్రతిరూపమైన ఆత్మను మీరు అనుభూతి చెందుతారు. శక్తివంతమైన సూర్యకిరణాలు అందరినీ పోషించినట్లే మీరు పేదల, అనాథల హృదయాల్లో ఆశాకిరణాలను ప్రసరింపచేయాలి. నిరాశా హృదయాలలో ధైర్యాన్ని రగుల్కొల్పాలి. జీవితంలో వైఫల్యం పొందామనుకొన్న వారి హృదయాల్లో నూతన శక్తితో వెలుగులు నింపాలి. 

నిరంతరం విస్తృతమవడానికి అవకాశం లభించినప్పుడే ఆత్మ సంతోషంగా ఉంటుంది. ఇతరులకి సేవ చెయ్యడం అనే ధర్మాన్ని నెరవేర్చడమనేది, మన చైతన్యం భగవంతునిలో విస్తరించడానికి దారితీసే మరో ధర్మమైన స్నేహం నెరవేరడానికి ఒక సోపానం.

ఇంకొక వ్యక్తి గురించి మీరు దయతో ఆలోచించడం మొదలుపెట్టగానే మీ చైతన్యం విస్తరిస్తుంది. మీ పొరుగువారి గురించి మీరు ఆలోచించినప్పుడు మీ అస్తిత్వంలో ఒక భాగం ఆ ఆలోచనతో పాటు వెళ్లిపోతుంది. ఆలోచించడం ఒక్కటే కాదు కావలసినది, ఆ ఆలోచనపై చర్య తీసుకోడానికి సిద్ధంగా ఉండడం.

మానవులందరినీ మరియు ఇతర జీవులను స్వయంగా మరియు వ్యక్తిగతంగా తెలుసుకొని ప్రేమించనవసరం లేదు. మీరు కలుసుకొనే జీవులన్నిటిపై స్నేహపూర్వక సేవ యొక్క కాంతిని ప్రసరింపజేయడానికి సదా మీరు సిద్ధంగా ఉంటే చాలు. ఈ దృక్పథానికి స్థిరమైన మానసిక ప్రయత్నం మరియు సంసిద్ధత అవసరమవుతాయి; మరో మాటలో చెప్పాలంటే, నిస్వార్థత.

ఇతరులకు సేవ చేయడమే విముక్తికి మార్గం. ధ్యానం మరియు దేవుడితో అనుసంధానమే ఆనందానికి మార్గం. ఇతరుల పట్ల ప్రేమతో మీ హృదయం స్పందించనివ్వండి, ఇతరుల అవసరాలను మీ మనస్సు తెలుసుకోనివ్వండి, ఇతరుల ఆలోచనలను మీ సహజావబోధం తెలుసుకోనివ్వండి.

భౌతికమైన మిథ్యా భద్రతల పట్ల వ్యామోహం లేకుండా, దైవసాన్నిధ్య ఆనంద చైతన్యంలో మీరు జీవించడానికి తోడ్పడే ప్రక్రియలను బోధించడం ద్వారా ప్రాపంచిక నిరాశల వ్యథల నుండి యోగం మీకు స్వేచ్ఛనిచ్చి, మీరు సంతోషకరమైన, మరింత సాఫల్యవంతమైన మరియు అర్థవంతమైన జీవితాన్ని గడిపే సమర్థత ఇస్తుంది. యోగం ప్రగాఢమైన ఆంతరిక సంతృప్త స్థితిని మీకు ప్రసాదిస్తుంది; ఇతరులకు ఇష్టాపూర్వకంగా సేవ చెయ్యడం ద్వారా, స్వతఃసిద్ధంగానే దానిని మీరు వారితో పంచుకోవాలనుకుంటారు.

జీవితం ఒక ఆహ్లాదకరమైన కర్తవ్య పోరాటమనీ, అదే సమయంలో గడిచిపోయే ఒక స్వప్నమని మీరు గ్రహించి ఇతరులకు కరుణను, శాంతిని ఇచ్చి వారిని సంతోషపెట్టడంలో ఆనందభరితులైనపుడు దేవుని దృష్టిలో మీ జీవితం సఫలమైనట్లు.

మన కుటుంబాలకు, స్నేహితులకు, పొరుగువారికి మరియు ప్రపంచమంతటికీ సహాయం చేసేందుకు — ఏకాగ్రతతో కూడిన ప్రార్థన అనేది మనందరం చేయగల ఒక అద్భుతమైన సేవ అని పరమహంస యోగానందగారి బోధనలు నొక్కి చెబుతాయి. వై.ఎస్.ఎస్/ఎస్.ఆర్.ఎఫ్. యొక్క ప్రియతమ మూడవ అధ్యక్షులు మరియు సంఘమాత అయిన శ్రీ దయామాతగారి వీడియో చూడమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఇందులో ప్రార్థనపై పరమహంసగారు చూపించిన ప్రాముఖ్యతను గురించి మరియు మన ప్రార్థనల వల్ల ఇతరుల జీవితాల్లో ఉన్నతిని చేకూర్చే గొప్ప సానుకూల ప్రభావాన్ని గురించి ఆమె వివరిస్తారు.

ఇతరులతో పంచుకోండి