యోగ శాస్త్రం మరియు జీవితం యొక్క ప్రయోజనం
యోగా యొక్క అంతరంగంలో ఏముంది?
పరమాత్మతో ఆత్మను ఏకం చేయడమే యోగా — ప్రతి ఒక్కరూ కోరుకునే ఆ గొప్ప ఆనందంతో పునఃకలయిక. ఇది అద్భుతమైన నిర్వచనం కాదా? పరమాత్మ యొక్క నిత్య నూతన ఆనందంలో మీరు అనుభవించే ఆ పరమానందం ఏ ఇతర ఆనందం కంటే గొప్పదని మరియు మిమ్మల్ని ఏదీ దిగజార్చలేదని మీరు నమ్ముతారు.
— పరమహంస యోగానంద
ప్రాచీన కాలం నుండి భారతదేశం యొక్క యోగ తత్వ శాస్త్రంలో ధ్యానం ప్రధానమైనది. సాహిత్యపరమైన అర్థంలో యోగా అనే పదానికి ప్రయోజనం కనుగొనవచ్చు: “అనంతత్వం,” శాశ్వతానందం లేదా పరమాత్మతో మన వ్యక్తిగత చైతన్యం లేదా ఆత్మ యొక్క—“ఐక్యత.”
ఆత్మ పరమాత్మతో ఐక్యతను పొంది పరమానందం పొందడానికి—అన్ని రకాల బాధల నుండి మనం విముక్తి చెందాలి—అనాదిగా కాలపరీక్షకు నిలిచిన, క్రమబద్ధమైన ధ్యాన ప్రక్రియను ఓర్పుతో సాధన చేయడం అవసరం. అంటే మనం ఒక శాస్త్రాన్ని ఆచరణలో పెట్టాలి.
రాజ (“రాజోచిత”) యోగమే దైవ సాక్షాత్కారానికి సంబంధించిన సంపూర్ణమైన శాస్త్రం—యోగ గ్రంథాలలో సూచించబడిన దశలవారీ ధ్యాన పద్ధతులు మరియు సత్కర్మ, ఇవి సహస్రాబ్దులుగా భారతదేశ సనాతన ధర్మానికి (“శాశ్వతమైన మతం”) అవసరమైన ఆచారాలుగా అందించబడ్డాయి. సర్వ సత్యమతాల అంతరంగంలో నిగూఢమై ఉన్న బోధనలను ఈ సనాతన సార్వత్రిక యోగ శాస్త్రం కలిగి ఉన్నది.
క్రియాయోగం యొక్క పునాది మీద ఆధారపడి శరీరం, మనస్సు మరియు ఆత్మలో పరిపూర్ణ వికాసానికి తోడ్పడే జీవన విధానాన్ని యోగదా సత్సంగ రాజయోగ బోధనలు వివరిస్తాయి, దీనిలో ప్రాణాయామ (ప్రాణ-శక్తి నియంత్రణ) ప్రక్రియ కూడి ఉంటుంది, క్రియాయోగం గురించి భగవద్గీతలో కృష్ణ భగవానుడు మరియు తన యోగ సూత్రాలలో పతంజలి మహర్షి పేర్కొన్నప్పటికీ, దానిని వారు వివరించలేదు. అనేక శతాబ్దాలుగా మానవాళికి అందకుండా మరుగున పడినప్పటికీ, ఆధునిక యుగంలో ప్రసిద్ధులైన యోగా గురు పరంపర: మహావతార్ బాబాజీ, లాహిరీ మహాశయ, స్వామి శ్రీయుక్తేశ్వర్, మరియు పరమహంస యోగానంద ద్వారా క్రియాయోగం పునరుద్ధరించబడింది.
క్రియాయోగ శాస్త్రాన్ని పాశ్చాత్య దేశాలకు పరిచయం చేసి, ప్రపంచమంతా వ్యాప్తి చేయడానికి మహనీయులైన తన గురు పరంపరచే పరమహంస యోగానందగారు ఎంపిక చేయబడ్డారు; మరియు ఈ ప్రయోజనం కోసమే 1920లో సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ అనే సంస్థను ఆయన స్థాపించడం జరిగింది.
యోగదా సత్సంగ పాఠాలలో పరమహంస యోగానందగారు బోధించిన శాస్త్రీయ ధ్యాన ప్రక్రియల యొక్క దైనందిన అభ్యాసమే సంతులన క్రియాయోగ మార్గంలో ప్రధానమైనది. ధ్యానం చేయడం ద్వారా శరీరం మరియు మనస్సు యొక్క అశాంతిని, ఎలా నిశ్చలం చేయగలమో మనం నేర్చుకుంటాము, తద్ద్వారా మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఏమి జరిగుతున్నప్పటికీ మన ఉనికి యొక్క సహజ స్వభావమైన శాశ్వత శాంతి, ప్రేమ, జ్ఞానం మరియు ఆనందాన్ని మనం అనుభవించగలం.
ఎక్కువగా ధ్యానించండి. అది ఎంత అద్భుతమైనదో మీకు తెలియదు. డబ్బు లేదా మానవ ప్రేమ లేదా మీరు ఆలోచించగలిగే మరేదైనా కోరుకుంటూ గంటలు గడపడం కంటే ధ్యానం చేయడం ఎంతో గొప్పది. మీరు ఎంత ఎక్కువగా ధ్యానం చేస్తారో, మరియు కార్యకలాపాల నిర్వహణ సమయంలో కూడా మీ మనస్సును ఆధ్యాత్మిక స్థితిలో ఎంత గాఢంగా కేంద్రీకృతం చేయగలుగుతారో, అంత ఎక్కువ దరహాసంతో మీరు ఉండగలుగుతారు. నేను ఎల్లప్పుడూ ఆ భగవంతుని పరమానంద చైతన్యంలో మునిగి ఉంటాను. ఏదీ నన్ను ప్రభావితం చేయలేదు; నేను ఒంటరిగా ఉన్నా లేదా ప్రజలతో ఉన్నా, భగవంతుని పరమానందం ఎల్లప్పుడూ ఉంటుంది. నేను నా దరహాసాన్ని నిలుపుకున్నాను—కాని కష్టపడితే, దాన్ని శాశ్వతంగా పొందవచ్చు! అదే దరహాసం మీలోనూ ఉంది; ఆత్మ యొక్క అదే ఆనందం మరియు పరమానందం ఉంది. మీరు వాటిని పొందవలసిన అవసరం లేదు, కాని వాటిని తిరిగి సాధించండి.
— పరమహంస యోగానంద

ధ్యాన ప్రయోగశాల లోపల
నేను మీకు చెప్పిన అనుభవాలన్నీ శాస్త్రీయంగా పొందదగినవి. మీరు ఆధ్యాత్మిక నియమాలను అనుసరిస్తే, ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది.
— పరమహంస యోగానంద

నిర్దిష్ట ప్రయోగం యొక్క ఫలితాలను ధృవీకరించడానికి ఒక శాస్త్రవేత్త ప్రయోగశాలలో ప్రవేశించినట్లుగానే, భారతదేశ ఋషులు మరియు ప్రతి సత్యాన్వేషకుడు నిరూపించిన ఫలితాలను పొందేందుకు యోగి కూడా ధ్యానం అనే “ప్రయోగశాల” లో ప్రవేశించాలి. సత్యం యొక్క లోతుల్లోకి తొంగిచూచిన వారందరూ — ఏ దేశం లేదా ఏ కాలానికి చెందినవారైనా — అదే ఫలితాలను పొందవచ్చు.
ఏదైనా అంధ విశ్వాసం లేదా సిద్ధాంతాన్ని అంగీకరించమని శాస్త్ర విజ్ఞానం మనకు చెప్పదు. అనేక శతాబ్దాలుగా యోగి-శాస్త్రవేత్తలచే నిరూపించబడిన, ప్రతిరూపం పొందిన ఖచ్చితమైన ధ్యాన పద్ధతులను ఉపయోగించడం ద్వారా, వాటి ప్రభావాన్ని మనమే నిరూపించుకోవచ్చు — తద్ద్వారా మనం ఈ పరిమిత శరీరాలనే తప్పుడు, పిడివాదపు ఆలోచనను క్రమంగా అధిగమించగలం. ఆ విధంగా మనం ప్రపంచంలోని మాయ మరియు పరీక్షలచే స్పృశించబడని, అంతర్యామియైన స్వస్వరూపం, ఆత్మగా సత్యాన్ని మనం కనుగొనగలం; మనం ఎల్లప్పుడూ పరమానందమైన అనంతునితో ఒక్కటిగానే ఉంటాము. ఒక సద్గురువు — పరమాత్మతో తన తాదాత్మ్యమును సంపూర్ణంగా గ్రహించిన వ్యక్తి — మార్గదర్శకత్వంలో సరియైన ధ్యాన పద్ధతులను సాధనచేసే ప్రతి ఒక్కరికీ, అంతిమంగా అటువంటి లోతైన అవగాహన లభిస్తుంది.
ఈ వైజ్ఞానిక యుగంలో, భౌతిక విశ్వంలోని విస్తారమైన ప్రాంతాల నుండి అతి సూక్ష్మ కణాల వరకు అన్వేషణలు కొనసాగుతున్నప్పుడు, ఆధ్యాత్మిక రంగాన్ని అర్థం చేసుకోవడానికి సమానమైన సాహసోపేతమైన మరియు శాస్త్రీయ విధానం అవసరం. కేవలం మత పరమైన నమ్మకాలను గురించిన చర్చల నుండి కాక, ప్రత్యక్ష అనుభవం ద్వారా సత్యాన్ని తెలుసుకున్న సంతృప్తిని పొందినవారిగా, మన ఆధ్యాత్మిక పరిశోధనలను మనం ముందుకు తీసుకెళ్ళాలి. అటువంటి జ్ఞానాన్ని అందించే క్రమబద్ధమైన విధానాలు మరియు క్రమశిక్షణలను అనుసరించడానికి ఇష్టపడే ఎవరైనా ఇదే సత్యాన్ని ధృవీకరించగలగాలి.
ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా, యోగి లేదా యోగిని, తమ చైతన్యంలో — ఆత్మ మరియు పరమాత్మ యొక్క నిత్యమైన స్వభావాన్ని పూర్తి స్పష్టతతో ఖచ్చితంగా మరియు సంపూర్ణ పారవశ్యంతో అనుభవించగల ఏకైక ప్రయోగశాలలో — దేవునితో సంపర్కం యొక్క స్పష్టమైన శాంతి, ప్రేమ, జ్ఞానం మరియు ఆనందాన్ని చిందించడానికి ధ్యాన ప్రక్రియలను సాధన చేస్తారు.
యోగా ధ్యానంలో, ప్రాణాయామం (ప్రాణ-శక్తి నియంత్రణ) అని పిలువబడే ప్రక్రియ ద్వారా — ధ్యానం చేసేవారు జ్ఞాన నాడులు మరియు చాలక నాడుల నుండి ప్రాణశక్తిని (ప్రాణ) ఉపసంహరించుకుంటారు — దానిని వెన్నెముక మరియు మెదడులోని ఉన్నత జాగృత కేంద్రాలకు నిర్దేశిస్తారు. అంతర్గతంగా విశ్రమించిన ప్రాణం, చైతన్యాన్ని స్వయంచాలకంగా బాహ్య ప్రపంచం నుండి అంతర్ముఖంగా ఉన్న అనంత సామ్రాజ్యం వైపు ఉపసంహరించుకుంటుంది. ఆలోచన యొక్క అస్పష్టమైన మానసిక ప్రక్రియ లేదా తాత్విక ఆలోచనలా కాకుండా, ప్రాణాయామ ధ్యానం అనేది ఆత్మ యొక్క అనంతమైన సామర్థ్యాన్ని కనుగొనడానికి కాల పరీక్షకు నిలిచి నిరూపితమైన మార్గం.
శాస్త్రవేత్తలు ప్రార్థన ద్వారా మాత్రమే కాకుండా, ప్రకృతి యొక్క నియమాలను ఆచరిస్తూ ఆవిష్కరణలు చేస్తారు. అదే విధంగా, ధ్యాన శాస్త్రం యొక్క నియమాలను అనుసరిస్తూ, వాటిని ఆచరించేవారి వద్దకు దేవుడు వస్తాడు. వేదాంతమనే అడవులలో తిరుగుతూ జనులు దారి తప్పిపోయారు. నేను దేవుడిని అన్వేషిస్తూ ఆలయాల వెంబడి తిరిగాను; కాని దేవుని గొప్ప ప్రేమికులైనవారి ఆత్మ అనే దేవాలయాలలో ఆయనను నేను కనుగొన్నాను, ఆయన అక్కడ ఉండటం నేను చూశాను. ఆయనకు దివ్యమైన భవనాలు అవసరం లేదు. నిరంతరం తనను పిలుస్తున్న హృదయం యొక్క కన్నీటి వేదిక వద్దకు ఆయన వస్తాడు. దేవుడు ఉండడమనేది సత్యం. సంవత్సరాల తరబడి ధ్యానానికి అంకితమయిన మహాత్ములు ఆయనను కనుగొన్నారు.
— పరమహంస యోగానంద

పరమానందమే మనకు ప్రేరణ
ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వివిధ విషయాలలో మీరు అన్వేషించేది, వాస్తవానికి మీ కోరికలను నెరవేర్చుకొనడం ద్వారా మీరు ఆనందాన్ని అన్వేషిస్తున్నారు…. అటువంటప్పుడు ఆనందాన్ని నేరుగా అన్వేషించవచ్చు కదా!
— పరమహంస యోగానంద

అమెరికాలో ఆయన మొదటి ఉపన్యాసంలో, మరియు తన మత విజ్ఞాన శాస్త్రం అనే పుస్తకంలో, పరమహంస యోగానందగారు పాశ్చాత్యులకు సత్-చిత్-ఆనందం —నిత్య స్థిత, నిత్య చైతన్య, నిత్య నూతనానందం — అనే పురాతన వేద భావనను పరిచయం చేశారు.
మన వివిధ కోరికలన్నిటినీ నెరవేర్చుకోవడానికి మరియు ప్రాథమిక కోరికైన ఆనందం కోసం మనం చేసే ప్రయత్నాలలో, బాధ నుండి విముక్తి పొందాలనే కోరిక లేదా? పరమహంసగారు తన బహిరంగ ప్రసంగాలకు హాజరయ్యేవారిని మరియు తరువాత తన క్రియాయోగ బోధనలకు విద్యార్థులుగా చేరిన వారిని నేరుగా ఆ ఆనందాన్ని కనుగొనమని ఆహ్వానించారు — యోగా ధ్యానం యొక్క శాస్త్రీయ పద్ధతిని ఉపయోగించి పరమాత్మ యొక్క ఆనందాన్ని తమలో తాము అన్వేషిస్తారు.
ధ్యానంలో భగవంతుడిని పరమానందంగా తెలుసుకునే అవకాశం గురించి మాట్లాడుతూ పరమహంసగారు ఇలా అన్నారు: “ప్రశాంతమైన అనుభవం ఉన్న అందరిలోకి ఆయన వస్తాడు. పరమానంద చైతన్యంలోనే మనం ఆయనను సాక్షాత్కరించుకుంటాం. ఆయన ఉనికికి అంతకంటే ప్రత్యక్ష రుజువు మరొకటి ఉండదు. మన భక్తి మరియు ప్రేమతో పరమానంద స్థితిలో పరమాత్మని కనుగొని మన ఆధ్యాత్మిక ఆశలు మరియు ఆకాంక్షలను నెరవేర్చుకుందాం.”
వైవిధ్యభరితమైన పాత్రలు, భంగిమలతో అలరించే నటుడిలా అన్ని వేళలా లయబద్ధంగా మారుతూ, దానంతట అదే మారని ఆనందాన్ని మనమంతా అన్వేషిస్తున్నాం. అటువంటి ఆనందాన్ని క్రమబద్ధమైన, గాఢమైన ధ్యానం ద్వారా మాత్రమే కనుగొనవచ్చు. మార్పులేని నిత్య నూతన ఆనందపు అంతర్గత ఊట మాత్రమే మన ఆధ్యాత్మిక తృష్ణను తీర్చగలదు. దాని సహజస్వభావం ప్రకారం, ఈ దివ్యమైన పరమానందం అనేది మనస్సును ఎన్నడూ అలసటకు గురిచేయదు లేదా దానికి బదులుగా మరొకదానిని కోరుకోనివ్వని ఏకైక మంత్రము.
— పరమహంస యోగానంద

యోగా యొక్క సార్వత్రికత

వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక అధిపతి అయిన స్వామి చిదానంద గిరి గారు 2017లో భారతదేశంలో మాట్లాడుతూ ఇలా అన్నారు: “మానవాళికంతటికీ సహస్రాబ్దులుగా భారతదేశం అత్యున్నతమైన ఆధ్యాత్మిక సత్యానికి సారథిగా ఉంది. భారతదేశంలోని అత్యుత్తమమైన వాటిని మొదట పాశ్చాత్య దేశాలకు, తరువాత ప్రపంచానికి, మరియు తన ప్రియమైన భారతదేశానికి తిరిగి తీసుకురావడం పరమహంసగారి యొక్క ప్రత్యేక విధి. ఆయన భారతదేశ ఉన్నత నాగరికత యొక్క స్వర్ణయుగమైన ఉన్నత యుగాలకు చేరి భారతదేశ సార్వత్రిక ఆధ్యాత్మికత యొక్క సారాంశాన్ని, స్వచ్ఛమైన దాని రూపంలోనే తీసుకువచ్చారు. అదే యోగా. ఇది ఒక శాస్త్రం, మతం యొక్క తెగ లేదా శాఖ కాదు; మరియు అదే కారణంగా, ఈ విశిష్ట దైవ నిర్ణీత విధానం—యోగా యొక్క ప్రకాశం—నిజంగా మొత్తం మానవాళికి ప్రపంచవ్యాప్త ఆధ్యాత్మిక ఆశీర్వాదం కాగలదు.”
యోగాను అభ్యసించడానికి మరియు దాని అద్భుతమైన ప్రయోజనాలను పొందడానికి ఏ వ్యక్తి నిర్దిష్ట జాతి లేదా తెగ లేదా మతానికి చెందినవారు కానవసరం లేదని పరమహంస యోగానందగారు తరచుగా సూచించారు. ఒక శాస్త్రంగా దాని సార్వత్రికత అనేది, తూర్పు లేదా పశ్చిమ దేశాలలో ఏ దేశానికి చెందిన వారైనా నిజమైన ఫలితాలను పొందడంలోనే ఇమిడి ఉంది.
క్రమం తప్పకుండా యోగా ధ్యానాన్ని అభ్యసించడం ద్వారా, మనమందరం ఆనందం, ప్రేమ, కరుణ మరియు శాంతి యొక్క లోతైన భావాన్ని అనుభవించవచ్చు. మరియు ఈ మార్పులు మనలో కలిగినప్పుడు, అదృశ్యమైన ధర్మం ద్వారా వాటి ప్రభావం బాహ్యంగా కూడా వ్యాపిస్తుంది, మొదట మన కుటుంబంపై, సమాజంపై మరియు తరువాత ప్రపంచంపై విస్తృతంగా వ్యాపిస్తుంది. పరమహంసగారు చెప్పినట్లుగా, “మిమ్మల్ని మీరు సంస్కరించుకొంటే, వేలమందిని మీరు సంస్కరిస్తారు.”
యోగా యొక్క ఒక గొప్ప ప్రయోజనం ఏమిటంటే, మొత్తం మానవాళితో ఏకత్వ భావన ధ్యానులలో వృద్ధి చెందుతుంది. ఒకరి ఆధ్యాత్మిక విశ్వాసాలతో సంబంధం లేకుండా, లేక అటువంటి విశ్వాసాలు లేకున్నా, యోగ శాస్త్రాన్ని అభ్యసించే వారు చివరికి ప్రతిదానిలో మరియు ప్రతి ఒక్కరిలో దైవం ఉన్నారని గ్రహిస్తారు.
అటువంటి సార్వత్రికతతో నిండిన హృదయాలు మరియు మనస్సులు నిజంగా మన కాలానికి ఎంతో అవసరం, సాంకేతిక పురోగతి ఫలితంగా మన ప్రపంచం విపరీతంగా కుంచించుకుపోయి, మనందరినీ అతి దగ్గరగా చేర్చుతోంది. 1951లో ఒక సమావేశం సందర్భంగా, ప్రపంచానికి క్లుప్తంగా తన సందేశాన్ని ఇవ్వవలసిందిగా పరమహంసగారిని అడగడం జరిగింది. మానవాళి తన ఆవశ్యక ఐక్యతను గుర్తించవలసిన ప్రాథమిక అవసరాన్ని గురించి ఆయన మాట్లాడారు—ఆ ప్రవచనాత్మక పదాలు ఈ రోజు ఎంతో ముఖ్యమైనవి, లేదా ఆయన వాటిని మొదట పలికినప్పటి కంటే, మరింత ఎక్కువగా ప్రాముఖ్యమైనవి:
“ప్రపంచంలోని నా సోదర సోదరీమణులారా: దేవుడే మన తండ్రి అని, ఆయన ఒక్కడే అని దయచేసి గుర్తుంచుకోండి. మనమందరం ఆయన సంతానం, కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వసుదైక కుటుంబంలో ఆదర్శవంతమైన పౌరులుగా మారడానికి మనమందరం శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా మరియు ఆధ్యాత్మికంగా ఒకరికొకరు సహకరించుకుంటూ నిర్మాణాత్మక మార్గాలను అనుసరించాలి. వెయ్యి మంది వ్యక్తుల సమూహంలో ప్రతి వ్యక్తి ఇతరులను పణంగా పెట్టి అక్రమ సంపాదన, పోరాటం మరియు మోసం ద్వారా తనను తాను సంపన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, ప్రతి వ్యక్తికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది శత్రువులు ఉంటారు; అయితే, ప్రతి వ్యక్తి—శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా మరియు ఆధ్యాత్మికంగా ఇతరులతో సహకరిస్తే ప్రతి ఒక్కరికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది స్నేహితులు ఉంటారు. దేశాలన్నీ ప్రేమతో ఒకరికొకరు సహాయం చేసుకుంటే, భూమండలమంతా అందరి శ్రేయస్సును ప్రోత్సహించడానికి పుష్కలమైన అవకాశాలతో నిండి శాంతితో జీవిస్తుంది.
“రేడియో, టెలివిజన్ వంటి ప్రసార సాధనాలు మరియు విమాన ప్రయాణం మునుపెన్నడూలేని విధంగా మనల్ని దగ్గరకు చేర్చింది. ఇది ఇకపై ఆసియావాసులకు ఆసియా, యూరప్ వాసులకు యూరప్‌గా, అమెరికా వారికి అమెరికా మొదలైన వాటివలె కాకుండా, భగవంతుని ఆశ్రయం క్రింద ఉన్న విశ్వమంతా ఒక్కటే అని మనం నేర్చుకోవాలి. అప్పుడే ప్రతి మనిషి పరిపూర్ణమైన శరీరం, మనస్సు మరియు ఆత్మతో ప్రపంచంలోని ప్రతి ఒక్కరితో ఆదర్శవంతమైన పౌరుడిగా మెలగడానికి అవకాశం ఉంటుంది.
“ప్రపంచానికి అదే నా సందేశం, నా విన్నపం.”
శరీరం, మనస్సు మరియు ఆత్మలో ఒకరికొకరు సహకరించుకుంటూ ఆదర్శవంతమైన ప్రపంచ పౌరులుగా ఎదగడానికి అత్యంత గాఢంగా ప్రభావితం చేసే “నిర్మాణాత్మక మార్గం” సార్వత్రిక శాస్త్రమైన యోగాలోనే కనుగొనవచ్చు.

రాజయోగ అష్టాంగ యోగ మార్గం

భారతదేశానికి అత్యంత ప్రీతిపాత్రమైన యోగా గ్రంథమైన గీత, యోగ శాస్త్రాన్ని సంపూర్ణమైన దృష్టాంతంగా వ్యక్తపరిచిందని గాడ్ టాక్స్ విత్ అర్జున: ద భగవద్గీత, అనే తన నిశ్చయాత్మక అనువాదం మరియు వ్యాఖ్యాన గ్రంథంలో పరమహంస యోగానందగారు వెల్లడించారు.
భగవద్గీతలో యోగ సందేశానికి సంబంధించిన సంగ్రహాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్న పతంజలి మహర్షి, రాజ (“రాజోచిత”) యోగ మార్గం యొక్క సారాంశాన్ని, నైపుణ్యంతో కూడిన యోగ సూత్రాలలో, యోగ మార్గానికి సరళమైన మరియు క్రమబద్ధమైన రూపాన్ని ఇవ్వడం జరిగింది.
పతంజలి పేర్కొన్న “సంక్షిప్త సూత్రాల శ్రేణిలో, ఎంతో విస్తారమైన మరియు సంక్లిష్టమైన దైవంతో-ఐక్యత పొందే విధానంపై సంగ్రహించబడిన సారాంశం అందజేయబడింది—ఎంతో అందమైన, స్పష్టమైన మరియు క్లుప్తమైన మార్గంలో ఆత్మను భేదంలేని పరమాత్మతో ఏకం చేసే పద్ధతిని నిర్దేశిస్తుంది. ఈ యోగ సూత్రాలను, యోగాపై అత్యంత ప్రాచీనమైన ప్రస్తావనగా తరతరాల పండితులు గుర్తించారు,” అని పరమహంస యోగానందగారు పేర్కొన్నారు.
పతంజలి పేర్కొన్న యోగ పద్ధతిని అష్టాంగ యోగ మార్గం అని పిలుస్తారు, ఇది దైవ సాక్షాత్కారం అనే అంతిమ లక్ష్యానికి దారితీస్తుంది.
- యమం: (ఒక వ్యక్తి వదిలిపెట్టవలసిన ప్రవర్తనలను వివరించే నైతిక నియమాలు): అహింస (ఇతరులకు బాధ కలిగించకపోవడం), సత్యం (అబద్ధం ఆడకపోవడం), బ్రహ్మచర్యం (లైంగిక ప్రేరణలపై అదుపులేని స్థితిని అధిగమించడం, ఇంద్రియ నిగ్రహం అలవరచుకోవడం), అపరిగ్రహం (ఇతరుల నుండి ఏదీ ఆశించకపోవడం; లోభి కాకపోవడం)
- నియమం: (ఆధ్యాత్మిక లక్షణాలు మరియు అలవర్చుకోవాల్సిన ప్రవర్తన): శౌచం (శారీరక, మానసిక పరిశుద్ధత), సంతోషం (అన్ని పరిస్థితులలోనూ తృప్తి), తాపం (స్వయం శిక్షణ), స్వాధ్యాయం (ఆత్మను అధ్యయనం చేయడం లేక ఆత్మ విచారణ) మరియు ఈశ్వర ప్రణిధానం (దేవుడి మీద, గురువు మీద భక్తి)
- ఆసనం: సరియైన భంగిమ
- ప్రాణాయామం: ప్రాణ నియంత్రణ, శరీరంలోని సూక్ష్మ జీవ ప్రవాహాలు
- ప్రత్యాహారం: బాహ్య వస్తువుల నుండి ఇంద్రియాల ఉపసంహరణ, చైతన్యం అంతర్ముఖమవ్వడం
- ధారణ: కేంద్రీకృతమైన ఏకాగ్రత; ఒక ఆలోచన లేదా వస్తువుపై మనస్సును లగ్నం చేయడం
- ధ్యానం: ధ్యానం, భగవంతుని విస్తారమైన జ్ఞానం యొక్క ఆయన అనంతమైన ఒక అంశంలో — పరమానందం, శాంతి, విశ్వప్రకాశం, దివ్యనాదం, ప్రేమ, జ్ఞానం మొదలైనవి — విశ్వమంతా వ్యాపించిన సర్వవ్యాపకత్వంలో ఐక్యం కావడం
- సమాధి: విశ్వాత్మతో వైయక్తికమైన ఆత్మ యొక్క సంయోగంతో కలిగే అధిచేతన అనుభవం
ప్రాణాయామం యొక్క అత్యున్నత అభ్యాసం (ప్రాణ-శక్తి నియంత్రణ, అష్టాంగ యోగ మార్గం యొక్క నాల్గవ దశ), మనస్సును అంతుర్ముఖం చేసుకొని (ప్రత్యాహార) మరియు అంతిమ లక్ష్యమైన ఆత్మతో ఏకత్వాన్ని (సమాధి స్థితిని) సాధించే ప్రాథమిక లక్ష్యంతో రాజయోగం అనే శాస్త్రీయ ధ్యాన పద్ధతులను ఉపయోగించడం.
సాధారణంగా ప్రాణశక్తి నిరంతరం నాడీ వ్యవస్థ మరియు ఇంద్రియాల ద్వారా బయటికి ప్రవహిస్తుంది, తద్ద్వారా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం తెలుసుకుంటాము. ప్రాణాయామం యొక్క పద్ధతుల ద్వారా అదే ప్రాణశక్తి (ప్రాణం) వెన్నెముక మరియు మెదడులోని ఆధ్యాత్మిక స్పృహ యొక్క ఉన్నత కేంద్రాల వైపు లోపలికి మళ్ళించబడుతుంది, తద్ద్వారా మనలో ఉన్న విశాలమైన ప్రపంచాన్ని మనం గ్రహించవచ్చు.
వై.ఎస్.ఎస్. బోధించిన యోగదా సత్సంగ పాఠాల లోని ధ్యాన ప్రక్రియలు, ముఖ్యంగా క్రియాయోగ ప్రక్రియ, గొప్ప రాజయోగ ప్రాణాయామ ప్రక్రియలుగా నిలుస్తాయి. వాటిని పరమహంస యోగానందగారు తరచుగా ఆత్మను పరమాత్మ యొక్క పరమానందంతో కలిపే వేగవంతమైన మార్గం అని పిలుస్తారు.
ప్రాణాయామ అభ్యాసం ద్వారా మనం ప్రత్యక్ష మార్గాల ద్వారా జీవిత పరధ్యానాల నుండి దృష్టిని విముక్తి చేస్తాము — శారీరక శక్తి ప్రవాహం నియంత్రణలో లేకపోతే మన చైతన్యం బాహ్యంగానే ఉంటుంది. అందువలన మన స్వస్వరూపాన్ని అజరామరమైన ఆత్మగా, నిత్యము పరమాత్మతో ఉండే ఆత్మను గుర్తించకుండా నిరోధించే చంచలమైన ఆలోచనలు మరియు అల్లకల్లోలమైన భావోద్వేగాలను శాంతపరుస్తాము.

మానవజాతి యొక్క అత్యంత అధునాతన సాంకేతికత

సాంకేతికత అనేది మన జీవితంలోని అనేక అంశాలలో కీలకమైన ఒక తోడ్పాటు. కాని మనము వివిధ డిజిటల్ పరికరాలను ఉపయోగిస్తూ ఎక్కువ సమయం గడుపుతున్నప్పుడు, అంతర్గత శాంతి, సరళత, సామరస్యం మరియు సహజమైన స్వేచ్ఛా భావన నుండి దూరం అవుతున్నట్లు మనం తరచుగా భావించడం జరుగుతుంది.
సరళంగా చెప్పాలంటే, సాంకేతికత అనేది కోరుకున్న ముగింపును మరింత త్వరగా చేరుకోవడానికి ఉపయోగించే పద్ధతి. ఆదర్శంగా ఉండాలంటే, మనం నివసించే ప్రపంచానికి సంబంధించి మన గురించి ఒక లోతైన అవగాహనను, భద్రతను, మరియు ఆనందాన్ని సాధించగల మన సామర్థ్యాన్ని మెరుగుపరచడమే దాని సరియైన ఉపయోగం.
యోగా ధ్యానం యొక్క పద్ధతులను, ప్రత్యేకంగా క్రియాయోగ ప్రక్రియలను ఆచరిస్తూ మానవత్వం యొక్క అత్యంత అధునాతన సాంకేతికతను రాజయోగ వ్యవస్థలో కనుగొనవచ్చు.
తన గ్రంథమైన ఒక యోగి ఆత్మకథ లో “క్రియాయోగ శాస్త్రం,” అనే అధ్యాయంలో పరమహంసగారు ఇలా పేర్కొన్నారు: “యోగవిద్యకున్న అమోఘ, క్రమానుగత సాఫల్యశక్తి గురించి ప్రస్తావిస్తూ కృష్ణుడు, దాన్ని శాస్త్రోక్తంగా సాధన చేసిన యోగిని ఈ విధంగా ప్రశంసిస్తాడు: ‘శారీరిక క్రమశిక్షణ సాధనచేసే తపస్వులకన్నా గొప్పవాడు యోగి; జ్ఞానమార్గాన్ని కాని, కర్మమార్గాన్ని కాని అనుసరించే వాళ్ళకన్నా కూడా గొప్పవాడు; కాబట్టి, ఓ శిష్యా! అర్జునా! నువ్వు యోగివి అవు!”
“సాంకేతిక యోగి” — అంటే, యోగా యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి ఖచ్చితమైన పద్ధతులను ఉపయోగించే సత్యాన్వేషకుడు — వాస్తవానికి ఒక ఖచ్చితమైన పద్ధతిని అనుసరిస్తాడు, అమరమైన పరమానందకర ఆత్మతో సంబంధం పెట్టుకొన్నప్పుడు జీవితం నుండి శక్తిని, ఆనందాన్ని కోల్పోవడం జరగదు, బదులుగా శరీరం మరియు మనస్సుల యొక్క అనంతమైన సంపూర్ణతను మరియు పునరుజ్జీవాన్ని పొందుతారు.
భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుని ఆదర్శ శిష్యుడైన అర్జునుడి వలె, క్రియాయోగం యొక్క విజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా మనం అటువంటి సమతుల్యత మరియు అంతర్గత ప్రశాంత స్థితికి చేరుకోగలము. నేటి సాంకేతికతపై ఆధారపడిన ప్రపంచంలో సంపూర్ణత మరియు శ్రేయస్సు యొక్క మన సహజ భావాన్ని కోల్పోకుండా ఎలా జీవించాలో తెలుసుకునే స్థైర్యాన్ని మరియు విచక్షణను మనం పొందుతాము.
పరమహంసగారి మాటల్లో చెప్పాలంటే, “ప్రశాంతతలో చురుకుదనం మరియు చురుకుదనంలో ప్రశాంతత”గా ఉండటమే కీలకం. మన జీవితాల్లో ప్రశాంతతలో చురుకుదనంగా ఉండాలంటే (ఆన్‌లైన్ మరియు ఆఫ్), మొదట మనం ధ్యానంలో “చురుకుదనంలో ప్రశాంతత”గా ఉండాలి — మరియు మన సమకాలీన ప్రపంచంలోని అనూహ్య సవాళ్లను మరియు వేగవంతమైన జీవిత గమనాన్ని సాగించడానికి అవసరమైన జ్ఞానాన్ని సాధించుకోవాలి.
రాజయోగ ధ్యాన ప్రక్రియలలో, అటువంటివే బోధించబడిన యోగదా సత్సంగ పాఠాల లో, నిజంగా విజయవంతమైన జీవితాన్ని గడిపే పద్ధతి, నిత్య నూతనమైన శాంతి, ఆనందం మరియు మన అత్యున్నత సామర్థ్యాలను సాధించడమనే అత్యంత అధునాతన సాంకేతికత మానవాళికి అందుబాటులో ఉంది.
మీ ప్రశాంతత యొక్క ద్వారాన్ని తెరిచి, మీ సమస్త కార్యకలాపాల మందిరంలోకి నిశ్శబ్దం యొక్క అడుగుజాడలు సున్నితంగా ప్రవేశించనివ్వండి. మీ విధులన్నిటినీ స్థిమితముగా, శాంతితో నింపి నిర్వర్తించండి. మీ హృదయ స్పందన వెనుక, దేవుని శాంతి యొక్క ప్రతిస్పందనను మీరు అనుభవిస్తారు. ధ్యానం యొక్క శాంతితో మీ హృదయాన్ని నింపండి.
— పరమహంస యోగానంద

భక్తితో కూడిన క్రియాయోగం

“భక్తితో కూడిన క్రియాయోగం — ఇది గణితశాస్త్రంలా పనిచేస్తుంది; అది విఫలం కాదు” అని పరమహంస యోగానందగారు ప్రకటించారు.
యోగా అభ్యాసం మరియు దాని ప్రక్రియల అభ్యాసం ప్రారంభించేవారెవరైనా, అటువంటివి బోధించబడే క్రియాయోగ మార్గంలో, తమ హృదయాలలో గాఢంగా ఆకట్టుకున్న దైవాంశతో గాఢమైన మరియు శాశ్వతమైన సంబంధాన్ని పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకతను వై.ఎస్.ఎస్. సూచిస్తోంది. ఏదిఏమైనా, పరమహంసగారు స్పష్టం చేసినట్లుగా: “భగవంతుని అన్వేషణలో సంపూర్ణ యోగశాస్త్రంపై ప్రావీణ్యం సంపాదించడం కంటే ముఖ్యమైనది, ఒక వ్యక్తిగత మూలసూత్రం ఇమిడి ఉండడం.” అనంతమైన దివ్యద్వారం చేరుకోవడానికి మనం యోగ శాస్త్రాన్ని అనుసరించాలి, కాని ఆ ద్వారం గుండా భగవంతుడు మనల్ని తీసుకువెళ్ళడానికి మన ప్రేమ, మన గాఢమైన వ్యక్తిగత కోరిక అవసరమవుతాయి.
దేవుణ్ణి పరమేశ్వరుడిగా లేదా జగన్మాతగా లేదా స్నేహితునిగా లేదా ప్రియతమునిగా భావించడానికి మీరు ఇష్టపడవచ్చు. దేవుణ్ణి, సద్గురువు లేదా క్రీస్తు లేదా కృష్ణుడి వంటి దివ్య అవతారంలో ప్రత్యక్షంగా దర్శించడానికి కొందరు ఆకర్షితులవుతారు లేదా వారు అనంతమైన ప్రేమ, పరమానందం లేదా జ్ఞానం వంటి నిరాకార అంశం పట్ల ఆకర్షితులవుతారు. దైవత్వం యొక్క ఏ రూపం మీ హృదయాన్ని ఎక్కువగా కదిలించినప్పటికీ, దాన్ని హృదయపూర్వకంగా అన్వేషించండి, భక్తి పారవశ్యంతో మరియు అంతిమంగా దైవంతో ఏకత్వం ద్వారా మరేదీ నెరవేర్చలేని మధురమైన అనుభూతిని మీరు పొందుతారు.
పరమహంసగారు ఈవిధంగా చెప్పారు “దేవుడు మీ హృదయ భాషని ఆలకిస్తాడు — మీ అస్తిత్వపు గాఢమైన లోతుల నుండి వచ్చే భాష.” ధ్యాన ప్రక్రియలను అభ్యసించిన తరువాత అనుసరించే నిశ్చలతలో మునిగిపోవడానికి సమయాన్ని వెచ్చించడం ద్వారా, దైవంతో లాంఛనంగా కాకుండా కపటత్వం లేకుండా — కేవలం హృదయపూర్వకమైన ప్రేమతో — మాట్లాడాలని ఆయన సూచించారు. మీరు జగన్మాతను ఆమె సంతానంగా “దర్శనమియ్యి, నీ దర్శనమియ్యి” అని పిలవవచ్చు. లేదా హృదయపూర్వకంగా మీ జీవితంలోని అత్యంత ముఖ్యమైన సమస్యల గురించి మార్గదర్శకత్వం కోరుతూ దివ్యప్రజ్ఞను మీరు ప్రశ్నలు అడగవచ్చు.
రాజయోగ బోధనలకు పునాది అయిన యోగా ధ్యాన శాస్త్రం, దైవంతో మనకు ప్రత్యక్ష సంబంధాన్ని కలిగిస్తుంది. నిజమైన గ్రహణశీలతగల ఆ స్థితిలో, మన మనస్సు లోతుల నుండి ఆకస్మికంగా భావాలను పంచుకోవడానికి మనల్ని మనం అనుమతిస్తాం — మన హృదయాలు, మనస్సులు మరియు ఆత్మలకు పూర్తిగా వ్యక్తిగత మార్గంలో స్వరాన్ని ఇస్తాం. సహజంగానే, కాలక్రమంలో, ఆ సంభాషణ ఇరువైపులా ప్రేమ యొక్క అత్యంత ఉత్కృష్టమైన వ్యక్తీకరణగా మారుతుంది. “నిజమైన భక్తి, భగవంతుని చైతన్య సాగర లోతులలోనికి సీసపు గుండులా నిట్టనిలువునా దిగిపోతుంది,” అని పరమహంసగారు అన్నారు.
పరమహంసగారి నుండి ఈ క్రింది మాటలలో, ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించే యాత్రికుడు భగవంతుని యొక్క ఏ అంశం తనను ప్రభావితం చేస్తున్నా, ప్రతిధ్వనిస్తూ సాంత్వన చేకూర్చే వాగ్ధానాన్ని వినవచ్చు: “అందరి హృదయాల ప్రేమను మీరు ఆయనలో కనుగొంటారు. మీరు పరిపూర్ణతను కనుగొంటారు. ప్రపంచం మీకు ఇవ్వడం, తరువాత తీసుకోవడం అనేది మిమ్మల్ని బాధకు లేదా భ్రమకు గురిచేస్తుంది, కాని అన్నిటినీ భగవంతునిలో మీరు ఉత్కృష్టంగా కనుగొంటారు, ఆ తరువాత దుఃఖించవలసిన అవసరమే ఉండదు.”