ఈ బ్లాగ్ పోస్ట్ 2025 సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ ప్రపంచ స్నాతకోత్సవంలో, వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు స్వామి చిదానంద గిరి గారి సత్సంగం నుండి సంగ్రహించబడినది. పూర్తి ఉపన్యాసాన్ని, “How-to-Live Skills to Survive, Thrive, and Be Victorious in the Material World,” ఎస్.ఆర్.ఎఫ్. యూట్యూబ్ ఛానెల్ లో వీక్షించవచ్చు.

స్థితిస్థాపకత (తట్టుకోగల సామర్ధ్యం), ఉత్సాహం మరియు శిష్యరికం యొక్క నిజమైన అర్థంపై దృష్టి పెట్టడానికి, పరమహంస యోగానందగారు చెప్పిన ఒక వృత్తాంతాన్ని నేను పంచుకోవాలనుకుంటున్నాను. పరమహంసగారు 1941 లో “మానవుడి నిత్యాన్వేషణ” అనే తన ప్రసంగంలో ఈ వృత్తాంతం చెప్పారు.
ఆయన ఇలా చెప్పారు: “గత వేసవిలో, నేను ఒక మఠము వద్ద ఆగాను, అక్కడ ఉన్న మతాచార్యులలో ఒకరిని నేను కలిశాను. ఆయన ఒక అద్భుతమైన ఆత్మ. ఆధ్యాత్మిక మార్గంలో ఎంతకాలం నుండి సన్యాసిగా ఉన్నారని నేను ఆయన్ని అడిగాను.
‘దాదాపు ఇరవై ఐదేళ్లు’ అని ఆయన బదులిచ్చాడు.
అప్పుడు నేను, ‘మీరు క్రీస్తును చూశారా?’ అని అడిగాను.
‘నాకు అర్హత లేదు’ అని ఆయన సమాధానమిచ్చాడు. ‘బహుశా మరణానంతరం ఆయన నన్ను కలుస్తాడేమో.’
‘కాదు, మీరు నిశ్చయించుకొంటే ఈ రాత్రి నుండే ఆయన్ని మీరు దర్శించవచ్చు’ అని ఆయనకు భరోసా ఇచ్చాను.’”
మరియు పరమహంసగారు ఇలా అన్నారు. “ఆయన కళ్లలో నీళ్లు తిరిగాయి, ఆయన మౌనంగా ఉండిపోయాడు.”
“మీ మనస్సును సమాయత్త పరచుకొంటే ఈ రాత్రి నుండే మీరు ఆయనను దర్శించవచ్చు.” సంకల్పశక్తి యొక్క అత్యున్నత ప్రయత్నం లేదా కష్టపడి ప్రయత్నించడం అన్న కోణంలో మాత్రమే “మీ మనస్సును సమాయత్త పరచుకోండి” అని ఆయన చెప్పడం లేదు. వాస్తవానికి, మరింత తీవ్రమైన ప్రయత్నం చేయడం అందులో భాగమే; కానీ అన్నిటికంటే ముఖ్యమైనది, మనలో చాలా మంది చేయవలసిందేమిటంటే, మనం యోగ్యులమని, ఆ ఆశీర్వాదాన్ని పొందగలమని, మనం ఆ ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగి ఉండగలమని మన మనస్సులను సమాయత్త పరచుకోవడం.
ధ్యానంలో మరియు మన ఆధ్యాత్మిక జీవితంలోని ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందలేకపోవడానికి కారణమేమిటంటే మనకు అర్హత లేదని మనం భావించడం వల్లనే. మీకు అర్హత ఉంది. “ఈ రాత్రి నుండే మీ మనస్సును సమాయత్త పరచుకోండి,” అని మన గురుదేవులు చెప్పారు.
కేవలం ఊహించుకోండి: ఒక గదిలో ఎవరైనా మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో, ఎంతగా మరియు ఎంత గొప్పగా మీ గురించి ఆలోచిస్తున్నారో, మిమ్మల్ని వారు ఎంతగా గౌరవిస్తున్నారో మరియు మిమ్మల్ని ఎంతగా ఆరాధిస్తున్నారో మెల్లగా గుసగుసలాడుతున్నారనుకోండి. కానీ మీరు అదే సమయంలో అని అంటున్నారు, “లేదు, లేదు, నేను మంచివాడిని కాదు; లేదు, లేదు, నేను మంచివాడను కాదు.” మరియు మీరు ఆ ఇతర స్వరాన్ని పూర్తిగా అణచి వేస్తున్నారు. మీరు దానితో జోడించుకోగలరా? భగవంతుడు మరియు గురుదేవులతో మన సంబంధంలో మనం చాలా తరచుగా చేసే పొరపాటు అదే.
పరమహంసగారి “ఆధ్యాత్మిక గీతాల” పై నేను ఎంతగా ఆధార పడతానో, వాటి వల్ల ఎంత ప్రయోజనం పొందుతానో నేను ముందే చెప్పాను. మీరందరూ అలాగే చేస్తారని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. నేను ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించడం ప్రారంభించినప్పటి నుండి, నాతో చాలా శక్తివంతంగా మాట్లాడేది — ఎందుకంటే నాకు ఇది చాలా అవసరం మరియు అప్పటి వరకు నా స్వభావంలోని ఒక గొప్ప లోటును నిజంగా ఎంతగానో పూరించింది — ఆ అందమైన గీతం “నా హృదయ ద్వారం”:
“నా హృదయ ద్వారం, తెరిచే ఉంచా నీ కోసం.
వస్తావా, వస్తావా? ఒక్కసారి నా కోసం?
నా రోజులన్నీ ప్రభూ, గడిచేనా నిను చూడకనే?
రేయీ పగలు, రేయీ పగలు, ఎదురు చూస్తా నీ కోసం.”
ఆ ఆధ్యాత్మిక గీతం నా తొలి ప్రయాణంలో ఎన్నో సంవత్సరాల పాటు నన్ను నడిపించింది.
అయితే ఈ అర్హత అనే ఆలోచనకు సంబంధించి నేను మీకు సూచించ దలచినది ఇది. ఒకానొక సమయంలో నేను, “మీకు తెలుసా, నేను ఆ శ్లోకం యొక్క అర్థంలో సగం మాత్రమే అర్ధం చేసుకొన్నాను,” అని గ్రహించాను. ఎందుకంటే మన భక్తిని, మన గాఢమైన కోరికను, మన ఆర్తిని, మన పట్టుదలను పెంచుకోవడానికి ఆ కీర్తనను ఉపయోగించడం ఎంతో శక్తివంతమైనది — “వస్తావా, వస్తావా? ఒక్కసారి నా కోసం?” — నిజానికి ఆ జగన్మాత కూడా ఆ పాటను మన కోసం పాడుతోందని మనం గ్రహించినప్పుడు మిగిలిన సగం అర్ధం చేసుకొంటాం.
మీరు దీన్ని ఆచరణలో పెట్టవచ్చు. దాన్ని మళ్లించండి, మీరు ఆమెను పిలవడానికి బదులుగా, ఆమె మిమ్మల్ని పిలుస్తోందని భావించండి. అలా ఆలోచించండి! మనలో ప్రతి ఒకరితో ఆమె ఇలా చెబుతోంది, “నా ప్రియమైన బిడ్డలారా, నా హృదయ ద్వారం మీ కోసం నేను తెరిచి ఉంచాను. వస్తావా, వస్తావా? ఒక్కసారి, నా కోసం?” ఎందుకంటే మనం ఒక్కసారి ఆమె వద్దకు వస్తే, మనం ఎప్పటికీ విడిచిపెట్టలేమని ఆమెకు తెలుసు.
ఆ తరువాత, మన ఆత్మ తిరిగి ఇలా సమాధానం చెబుతోంది, “నా రోజులన్నీ తల్లీ, గడిచేనా నిను చూడకనే?” ఆమె నేరుగా సమాధానం ఇవ్వదు, కానీ ఆమె దీన్ని పునరావృతం చేస్తుంది, “రేయి పగలు, రేయి పగలు ఎదురు చూస్తా నీకోసం.”
మీ ధ్యాన సాధనలో దాన్ని ఆచరణలో పెట్టి, మీరు అనర్హులు అనే భ్రమను అది ఏం చేస్తుందో చూడండి.

Light the Lamp of Thy Love అన్న రికార్డింగ్ లో ఎస్.ఆర్.ఎఫ్. సన్యాసినుల కీర్తన బృందం గానం చేసిన “Door of My Heart” (నా హృదయ ద్వారం), గీతాన్ని మీరు క్రింద వినవచ్చు (వై.ఎస్.ఎస్. మరియు ఎస్.ఆర్.ఎఫ్. నుండి అనేక ఇతర గీతాల రికార్డింగ్‌లతో పాటు వై.ఎస్.ఎస్. బుక్ స్టోర్ లో అందుబాటులో ఉంది).