వై.ఎస్.ఎస్. యువజన సేవల విభాగం ఫిబ్రవరి 2026లో బెంగళూరు మరియు చండీగఢ్‌లో యువ సాధకుల శిబిరాలను నిర్వహించింది
“కల్లోలాల మధ్య కూడా ఆనందమయ జీవితాన్ని ఎలా గడపవచ్చో తెలుసుకోవాలనుకునే వారికి, ఈ శిబిరం సరిగ్గా అదే అందించింది.”
— డి.ఎం., బెంగళూరు
ఈ మాటలలో, ఒక యువ భక్తురాలు ఫిబ్రవరి 2026లో చురుకైన టెక్-హబ్ అయిన బెంగళూరులో వై.ఎస్.ఎస్. యువజన సేవల విభాగం నిర్వహించిన మూడు రోజుల యువ సాధకుల శిబిరంలో తన అనుభవాన్ని సంగ్రహంగా తెలియజేసింది. ఒక వారం తర్వాత చండీగఢ్‌లో ఇలాంటి శిబిరమే నిర్వహించబడింది, అక్కడ వై.ఎస్.ఎస్. మార్గంలో ఉన్న తమ తోటివారి సాంగత్యంలో ఆధ్యాత్మిక పునరుత్తేజం మరియు పునరుద్ధరణతో కూడిన వారాంతాన్ని అనుభవించడానికి యువ సాధకులు ఒకచోట చేరారు.
ఈ ప్రాంతీయ యువ సాధకుల శిబిరాలు, 18 నుండి 35 సంవత్సరాల వయస్సు గల వై.ఎస్.ఎస్. భక్తులకు గురుదేవులు పరమహంస యోగానంద గారి ‘జీవించడం ఎలా’ అనే బోధనలను అందించడానికి రూపొందించిన ఒక కొత్త కార్యక్రమం. ఈ ఆధునిక జీవితంలో నిరంతరం సాగే కఠినమైన పరిస్థితుల నుండి వైదొలగి, ఒక ప్రశాంతమైన ఏకాంత ప్రదేశంలో తమను తాము మళ్లీ కనుగొనడానికి ఈ శిబిరాలు వారికి సహాయపడతాయి.
ఉద్యోగస్తులు, విద్యార్థులు, యువ తల్లిదండ్రులు మరియు ఇతరులతో సహా 180 మందికి పైగా భక్తులు ఈ వారాంతపు శిబిరాలలో పాల్గొన్నారు. వీరిలో చాలామందికి, సమయం మరియు దూర పరిమితుల కారణంగా, సాధారణంగా తమ ఒత్తిడితో కూడిన జీవితాల నుండి విరామం తీసుకుని సుదీర్ఘ ఏకాంత వాసాలకు వెళ్లడం కష్టంగా ఉంటుంది.
"దైవ సాన్నిధ్యంలో జీవించడం”
యువ సాధకులే స్వయంగా ఎంచుకున్న ఈ శిబిరం యొక్క ఇతివృత్తం ఒక స్పష్టమైన ఉద్దేశాన్ని ప్రతిబింబించింది: ఆధునిక ప్రపంచంలోని సవాళ్లను ఎదుర్కొంటూ దేవునితో అనుసంధానమై స్థిరంగా నిలిచి ఉండటానికి ఒక ఆచరణాత్మక మార్గనిర్దేశం – “దైవ సాన్నిధ్యంలో జీవించడం.”
బెంగళూరులో (ఫిబ్రవరి 19–22) మరియు చండీగఢ్‌లో (ఫిబ్రవరి 26–మార్చి 1) శిబిరాలు కొనసాగుతున్న కొద్దీ, వచ్చి పాల్గొనేవారి అలసిన ముఖాలు త్వరగానే ప్రకాశవంతంగా మారాయి. ఒత్తిడి మరియు అసంతులనంతో నిండిన బయటి ప్రపంచం మరుగునపడి, శిబిరంలో ఆనందం ఆవరించింది. శిబిరం యొక్క దినచర్య సరళంగా ఉన్నప్పటికీ, ఒక లక్ష్యంతో కూడి ఉంది: ధ్యానం, సేవ, ఆధ్యాత్మిక అధ్యయనం, ఆత్మపరిశీలన మరియు వ్యాయామం అనే అయిదు విధాలైన దినచర్యను కలిగి ఉన్నది. గురుదేవులు బోధించిన సమతుల్య జీవన విధానాన్ని అనుసరించి రూపొందించబడిన ఈ కార్యక్రమనిర్మాణం, శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక స్వీయ పునరుజ్జీవనాన్ని లక్ష్యంగా చేసుకుంది.
ఆధ్యాత్మిక దినచర్య, వై.ఎస్.ఎస్. సన్యాసుల ఆధ్వర్యంలో రోజుకు రెండుసార్లు శక్తిపూరణ వ్యాయామాలు మరియు సామూహిక ధ్యానాలను కూడి ఉండేది. ఈ శిబిరాలలో శ్రవణ (లోతైన అధ్యయనం) సమావేశాలు, జపం చేస్తూ నడకలు మరియు ప్రకృతి మధ్య విహార యాత్రలు ప్రధాన ఆకర్షణలుగా ఉండేవి.
ఈ అశాంతిమయ ప్రపంచంలో సమతుల్యతను తిరిగి తీసుకురావడం
ఈ కొద్ది రోజుల్లోనే, ఈ శిబిరాలు యువ సాధకులకు శారీరక పునరుద్ధరణను అందించి, మానసిక అధ్యయనానికి సమయాన్ని కల్పించి, గాఢమైన ధ్యానంలో లీనమయ్యే అవకాశాలను కల్పించడం ద్వారా అంతర్గత సమతుల్యతను అనుభవించడానికి సహాయపడ్డాయి. యోగానందగారి మాటలలోని గంభీరమైన సత్యం ఆ ప్రాంగణాల్లో ప్రతిధ్వనించింది:
అనేక వేలమంది నా ప్రసంగాలను విన్నారు, కానీ కొద్దిమంది మాత్రమే తాము వినినదానిని నిజంగా ఆచరణలో పెట్టారు. అలా చేసినవారు, సర్వత్రా వ్యాపించి ఉన్న మహోన్నత సత్యం — అనగా దివ్యప్రేమ మరియు మహిమ — వారి చైతన్యం ద్వారా నిరంతరం వ్యక్తమవడాన్ని కనుగొంటారు.
— శ్రీ శ్రీ పరమహంస యోగానంద
నిజజీవిత ఉపమానాలు, కవిత్వం, మరియు పంచుకున్న కథలతో నిండిన పరస్పర చర్చల వర్క్-షాప్ ల ద్వారా, స్వామీజీలు నిర్మలానంద, శంకరానంద, మరియు బ్రహ్మచారి సౌమ్యానందలు జీవించడం ఎలా తరగతులలో సీనియర్ మరియు జూనియర్ సాధకుల వేర్వేరు సమూహాలకు మార్గదర్శనం చేశారు. తమ ఆధ్యాత్మిక ప్రయాణం ఏకాంతమైనది మరియు ఒంటరిది కానవసరం లేదని గ్రహించి, యువత తమ ప్రయాసల గురించి సమూహంతో సులభంగా మాట్లాడగలమని భావించారు.
“ఒకే స్థాయి ఉత్సాహంతో, జీవితంలో ఒకే రకమైన సవాళ్లను ఎదుర్కొంటూ, ఒకయువ బృందం ఒకచోట కూడడం అనే ఆలోచనే మంత్రముగ్ధంగా ఉంది.”
— కె.ఎస్., చండీగఢ్
ఈ శిబిరాల వల్ల యువభక్తులు, ముఖ్యంగా యోగదా సత్సంగ పాఠాల కొరకు ఇటీవలే నమోదు చేసుకున్నవారు, పొందిన అనేక ప్రయోజనాలలో ఒకటి ఏమిటంటే వై.ఎస్.ఎస్. ధ్యానప్రక్రియలపై సన్యాసులు నిర్వహించిన సమీక్ష. భక్తులు తమ ప్రక్రియల అభ్యాసంపై సన్యాసుల సమీక్ష, సలహాలను (ఫీడ్ బ్యాక్) కూడా పొందగలిగారు.
“నేను విషయాలను సరైన పద్ధతిలో ఆచరిస్తున్నానో లేదో అనే నమ్మకం నాకు లేదు. ఈ శిబిరంలో నా ప్రశ్నలు సన్యాసులను అడగడానికి, వారినుండి నేర్చుకోవడానికి అవకాశం కల్పించింది, ఇక అక్కడి సామూహిక భావన దానికి మరింత వన్నె తెచ్చింది.”
— ఎం.ఎస్., కర్ణాటక
శ్రవణం మరియు సత్సంగం: అధ్యయనం మరియు ఆధ్యాత్మిక సహవాసం
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు ప్రతి ఉదయం సమూహాలుగా కూర్చొని వైఎస్ఎస్ 15వ పాఠం: సంతులిత ఆధ్యాత్మిక-జీవన కళ నుండి ఎంపిక చేయబడిన భాగాలను నిశ్శబ్దంగా అధ్యయనం చేయడం ద్వారా, శ్రవణాన్ని—గురుదేవుల బోధనలను అధ్యయనం చేయడం ద్వారా ఆయనతో అనుసంధానం పొందడాన్ని – అభ్యాసం చేసేవారు.
ఆ సత్యాలను అదే రోజు ఎలా ఆచరణలో పెట్టాలనుకుంటున్నారో పంచుకోవడానికి ముందు, గాఢమైన నిశ్శబ్దంలో ఆ జ్ఞానాన్ని ఆకళింపు చేసుకోవడానికి సాధకులు ప్రయత్నించేవారు.
“మా సాధన యొక్క లోతైన మరియు గాఢమైన అర్థాన్ని గ్రహించడానికి శ్రవణం మాకు సహాయపడింది.”
— పి.ఎం., బెంగళూరు
యువ సాధకులను తరచుగా వేధించే ఒంటరితనం, సత్సంగం లేదా సహవాసం యొక్క ఆత్మీయతలో కరిగిపోయింది. క్రమబద్ధమైన శిబిర సమావేశాల మధ్య, కలిసి చేసే కారు ప్రయాణాలు, ప్రశాంతమైన సాయంత్రపు వీధుల్లో చేసే చిన్న నడకలు లేదా నిదానమైన బస్సు ప్రయాణాల ద్వారా జీవితకాలపు బంధాలు యాదృచ్ఛికంగా ఏర్పడ్డాయి.
ఒక భక్తుడు ఆ భావనను ఈ మాటలలో సంగ్రహించాడు:
“[ఈ శిబిరం] మీరు ఇంటికి వచ్చిన అనుభూతిని కలిగిస్తుంది.”
— కె.ఎ., చండీగఢ్
పరమాత్మ మరియు ప్రకృతి: ఆధ్యాత్మిక ఏకాంత వాసానికి ఒక ఆదర్శవంతమైన నేపథ్యం
‘విహారయాత్ర రోజు’ న, వారాంతపు శిబిరాల కార్యకలాపాలు ఆరుబయట జరిగాయి — తద్వారా ఆధ్యాత్మిక సాధన, ధ్యాన మందిరాల పరిధిని దాటి విస్తరించింది.
బెంగళూరులో: యువ సాధకులు రమణీయమైన బహిరంగ ఉద్యానవనాలలో సమావేశమయ్యారు. చెట్ల నీడలో వారు ధ్యానం చేస్తూ కీర్తనలు ఆలపించారు. పచ్చికపై కూర్చొని, వారు వై.ఎస్.ఎస్. సన్యాసులతో ఒక స్నేహపూర్వకమైన, స్పష్టమైన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో పాల్గొన్నారు.
చండీగఢ్‌లో: సాధకులు అబ్బుర పరిచే 100 ఎకరాల ధిల్లన్ ఫార్మ్స్‌కు ప్రయాణం చేశారు. చక్కగా తీర్చిదిద్దిన తోటల మధ్య వారు నడిచారు, వాలీబాల్ ఆడారు, హాస్యోక్తులతో నవ్వుకున్నారు; స్వచ్ఛమైన ఆనందమయ క్షణాలను దివ్యత్వంతో మేళవించారు.
సాయంకాలం సమీపిస్తుండగా, సాధకులు సన్యాసులతో కలిసి చురుకుగా జపయాత్రలు చేశారు. శారీరక వ్యాయామాన్ని, దీర్ఘ శ్వాసను, దైవనామాన్ని నిశ్శబ్దంగా, లయబద్ధంగా జపించడంతో మేళవించి, వారు రాబోయే రాత్రి కోసం తమ మనస్సులను, శరీరాలను సిద్ధం చేసుకునేవారు.
“విహార యాత్ర ప్రదేశం అద్భుతంగా ఉంది. ఆ సహజమైన వాతావరణంలో కలిసి జపించడం, ప్రశ్నలకు సన్యాసులు సమాధానాలు చెప్పడం వినడం ఒక సాంప్రదాయ గురు-శిష్య అనుభవంలా అనిపించింది.”
— ఎస్.బి., ముంబై
వెల్లువలా ప్రవహించిన ప్రేమ
ధ్యానం మరియు కీర్తనలతో కూడిన ముగింపు కార్యక్రమంలో, హార్మోనియం జీవం పోసుకుని, తాళాలు తమ లయబద్ధమైన శబ్దాన్ని ప్రారంభించగానే, ఆ వాతావరణం తిరుగులేని, ఏకీకృత భక్తి ప్రకంపనలతో నిండిపోయింది. సన్యాసులు, తమతో పాటు భక్తులను జపాన్ని అభ్యసించేలా నడిపించారు.
“సన్యాసులు ఎంతో చక్కగా మాట్లాడతారు, చక్కగా బోధిస్తారు, కాని, భగవంతుని పట్ల వారి ప్రేమ, ఆరాధనాభావం భక్తిగీతాలాపన సందర్భంగా నిజంగా వ్యక్తమవుతాయి. ధ్యానం ద్వారా వారు కష్టపడి సంపాదించుకున్న బహుమతులను స్వేచ్ఛగా పంచుకునే సమయం అదే.”
— ఎస్.డి., చండీగఢ్
చివరకు సంగీతం నిశ్శబ్దంలో కలిసిపోయినప్పుడు, ఆ నిశ్చలత గాఢంగా, మధురంగా అనిపించింది. తాము కనుగొన్న ఆ గాఢమైన శాంతిని భంగపరచుకోవడానికి ఇష్టం లేక, చాలా సేపటి వరకు చాలామంది తమ ధ్యాన పీఠాలకు అతుక్కుపోయి ఉండిపోయారు.
శిబిరాలు ముగిశాయి, బ్యాగులు సర్దుకున్నారు, యువ సాధకులు తమ కార్యాలయాలకు, తరగతి గదులకు, ఇళ్లకు తిరిగి వెళ్లారు. కానీ వారు రూపాంతరం చెంది తిరిగి వచ్చారు. వారు సమతుల్య జీవనానికి ఒక నమూనాతో, ఆత్మీయ మిత్రుల బృందంతో, మరియు శాంతి అనేది అంతుచిక్కని కల కాదనీ, అది సాధన ద్వారా అంతర్గతంగా వికసిస్తుందనే లోతైన, ప్రత్యక్ష భరోసాతో తిరిగివెళ్ళారు.
యువ సాధకుల సంఘంలో చేరడానికి ఆహ్వానం
మీరు 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల వై.ఎస్.ఎస్. భక్తులై, భారతదేశమంతటా ఉన్న తోటి యువసాధకులతో సంబంధం కలిగి ఉండాలనే కోరిక మీకు ఉన్నట్లయితే, క్రింద ఇవ్వబడిన యువ సాధకుల భాగస్వామ్య ఫారాన్ని పూరించి, ఈ సంఘం కోసం రాబోయే ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి సమాచారం తెలుసుకోవడానికి మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఒక వాలంటీర్ మిమ్మల్ని సంప్రదించి, తదుపరి దశల కోసం మీకు మార్గనిర్దేశం చేస్తారు.




















