పరమహంస యోగానందగారు జన్మించిన గోరఖ్‌పూర్‌లో వారి జన్మోత్సవాన్ని నిర్వహించిన వై.ఎస్.ఎస్.

24 జనవరి, 2026

5 జనవరి, 2026న, శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి 133వ ఆవిర్భావ దినోత్సవం (జయంతి వార్షికోత్సవం) భారతదేశంలోని ఉత్తరప్రదేశ్‌లో గల గోరఖ్‌పూర్ నగరంలోని వారి జన్మస్థలంలో నిర్వహించబడింది. ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ (ఎస్.ఆర్.ఎఫ్.) మరియు యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.) నుండి సన్యాసులు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వై.ఎస్.ఎస్. భక్తులు మరియు స్నేహితులు పాల్గొన్నారు.

పల్లకిపై అందంగా అలంకరించబడిన గురుదేవులు శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి చిత్రపటం.
అలంకరించిన పల్లకీని 120 మందికి పైగా భక్తులతో కలిసి ఎస్.ఆర్.ఎఫ్. సన్యాసినులు మోసుకు వెళ్లారు.

పరమహంసగారి జన్మస్థలానికి చేరుకునే వీధి వెంబడి ప్రభాత్ ఫేరి (ఊరేగింపు)తో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. పుష్పాలతో అందంగా అలంకరించబడిన పల్లకీలో, పూజ్య గురుదేవులు పరమహంస యోగానందగారి రంగుల చిత్రపటాన్ని ఎస్.ఆర్.ఎఫ్. సన్యాసినులు మోసుకెళ్లారు. గురుదేవుల పవిత్ర జన్మస్థలానికి చేరుకునేటప్పుడు నిరంతరం ఆనందకరమైన “జై గురు” గీతాలాపనతో దాదాపు 125 మంది భక్తులు మరియు స్నేహితులతో కూడిన ఊరేగింపు ఆ వీధి పొడవునా విస్తరించింది.

ఊరేగింపులో భక్తులతో కలిసి పాల్గొంటున్న స్వామి విశ్వానంద.
భక్తి గీతాలాపనలో పాల్గొంటున్న ఎస్.ఆర్.ఎఫ్. సన్యాసినులు మరియు బ్రహ్మచారిణులు.

గురుదేవులు పరమహంస యోగానందగారి జన్మస్థలంలో ఆయన జన్మోత్సవాన్ని తొలిసారిగా నిర్వహించడం అనేది, రాష్ట్ర ప్రభుత్వం ఆ ఆస్తిని స్వాధీనం చేసుకుని, ఆ మహా గురువుల జీవితం మరియు కార్యాచరణను గౌరవించేందుకు ఆ స్థలంలో ఒక మందిరాన్ని నిర్మిస్తున్నట్లు గత సంవత్సరం బహిరంగంగా ప్రకటించిన అనంతరం సాధ్యమయ్యింది. ఈ మందిరాన్ని యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది. పూర్తయిన తర్వాత, ఇది పరమహంస యోగానందగారి భక్తులు మరియు స్నేహితులకు ఒక అందమైన తీర్థయాత్రా స్థలంగా మారుతుంది. ఈ స్థలంలో ఉన్న అసలు జన్మగృహం నుండి సేకరించిన ఇటుకలతో నిర్మించిన ప్రత్యేక పూజా మందిరం; ఒక మ్యూజియం; ఒక ఆడియో/వీడియో ప్రదర్శన గది; మరియు ఒక పెద్ద ధ్యాన మందిరం ఉంటాయి.

ప్రభాత్ ఫేరి అనంతరం, గంటసేపు జరిగిన కార్యక్రమంలో 150 మంది భక్తులు, 75 మంది అతిథులు, సందర్శకులు సహా దాదాపు 225 మంది హాజరయ్యారు. కొంతమంది సీనియర్ ప్రభుత్వ అధికారులు కూడా హాజరయ్యారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని జరుపుకోవడానికి ఒక అలంకరించబడిన పందిరి ఏర్పాటు చేయబడింది.

హారతి ఇచ్చి సభను ఉద్దేశించి ప్రసంగించిన స్వామి విశ్వానంద.

మన ప్రియతమ గురుదేవులకు స్వామి విశ్వానంద గిరి గారు హారతి ఇవ్వడంతో ఈ కార్యక్రమం ప్రారంభమయ్యింది. అ తరువాత ఎస్.ఆర్.ఎఫ్. బ్రహ్మచారిణులు భక్తిగీతాలను ఆలపించారు. అప్పుడు, ఈ పవిత్ర ప్రదేశంలో పరమహంసగారి 133వ జన్మోత్సవ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ స్వామి విశ్వానంద సభను ఉద్దేశించి ప్రసంగించారు. వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక అధిపతి అయిన స్వామి చిదానంద గిరి గారి తరపున, వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. సన్యాసులు మరియు మహా గురువుల ప్రపంచవ్యాప్త ఆధ్యాత్మిక కుటుంబం తరపున గోరఖ్‌పూర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్త కృతజ్ఞతలు తెలిపారు. యోగానందగారి జన్మస్థలంలో స్మారక మందిరాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకొన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు భాగస్వాములైన వారందరికీ కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గురుదేవులు జన్మించిన అసలైన గృహం మరియు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మందిరం యొక్క పెద్ద, రంగుల పోస్టర్ ఆకృతులను ఆయన ప్రదర్శించారు. దీనిని ప్రశంసలతో మరియు చప్పట్లతో ప్రేక్షకులు స్వీకరించారు.

ఆ మహా గురువు జన్మించిన ఇంటి చిత్రం మరియు ఇప్పుడు నిర్మించబడుతున్న నూతన స్మారక స్థలం యొక్క పోస్టర్లను ప్రదర్శిస్తున్న స్వామి విశ్వానంద.

అనంతరం భారత దేశానికి ఆధ్యాత్మిక యాత్ర చేస్తున్న ఇరువురు ఎస్.ఆర్.ఎఫ్. సన్యాసినులు రంజనా మాయి మరియు యోగమయీ మాయి క్లుప్తంగా ప్రసంగించారు. వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. ప్రచురణలయిన ఒక యోగి ఆత్మకథ మరియు మెజ్దా నుండి గోరఖ్‌పూర్‌లో పరమహంస యోగానందగారి బాల్యానికి సంబంధించిన, మొదటి ఎనిమిది సంవత్సరాలలోని స్ఫూర్తిదాయక వృత్తాంతాలను వారు చదివి వినిపించారు. మొత్తం మానవాళి యొక్క ఆధ్యాత్మిక అభ్యున్నతికి తమ జీవితాలను అంకితం చేసిన లెక్కలేనన్ని గొప్ప ఆత్మలకు భారతదేశం చాలా కాలం నుండి మాతృభూమిగా ఉందని స్వామి విశ్వానంద నొక్కి చెప్పారు. గోరఖ్‌పూర్‌లో జన్మించిన పరమహంస యోగానందగారు వారిలో ఒకరయ్యారు. మహా గురువుల ప్రత్యక్ష శిష్యురాలు మరియు 50 సంవత్సరాలకు పైగా వారి ప్రపంచవ్యాప్త సంస్థ వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. కు పూర్వ అధ్యక్షులు మరియు సంఘమాత అయిన శ్రీ శ్రీ దయామాతగారి ఈ మాటలను స్వామి విశ్వానంద పంచుకున్నారు:

“మన ప్రియ గురుదేవులు ఎంతో వినయంగా ఉండేవారు, తన ఆత్మకథలో ఆయన తనకంటే చాలా మంది ఋషులను ప్రస్తుతించారు. కాని, దేవుడు నియమించిన తమ లక్ష్యంలో, ఆయన ఈ యుగానికి అవతారం; ఆయన ఆధ్యాత్మిక స్థాయికి చెందినవారు కొద్దిమంది మాత్రమే ఈ మర్త్య తీరాలపై నడిచారు. అనంతంతో ఐక్యమయిన ఆయన, పరమాత్మ అనే మహాసాగరంలోనే జీవించారు, కదిలారు, తన ఉనికిని కలిగి ఉన్నారు. ఆయన బేషరతైన ప్రేమను ప్రసరించేవారు; ఆయన జ్ఞానం ఎంత అతీంద్రియమైనది మరియు ఉత్కృష్టమైనదంటే, మనం ఆయన మనస్సు అనే ప్రవాహమూలం నుండి బృహత్తరమైన వేదాల సారాన్ని గ్రోలుతున్నామని భయభక్తులతో నిండిన ఆయన శిష్యులమయిన మేము గ్రహించాం. ఆయన తన అద్భుత శక్తులతో లక్షలాది మందిని మంత్రముగ్ధులను చేయగలిగి ఉన్నప్పటికీ, భగవంతుడనే మైకంతో నిండిన తమ స్వంత ప్రేమ యొక్క గొప్ప శక్తి ద్వారా నిజమైన భక్తుల హృదయాల్లో దేవుని పట్ల ప్రేమను రేకెత్తించడానికి మాత్రమే ప్రయత్నించారు.”

400 మందికి పైగా హాజరయిన వారికి ప్రసాదాన్ని అందజేసిన వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. సన్యాసులు, సన్యాసినులు, బ్రహ్మచారులు మరియు బ్రహ్మచారిణులు.

ప్రసాద వితరణ మరియు పుష్పాంజలి (పుష్పాల సమర్పణ).

ఆ మధ్యాహ్నం అదే స్థలంలో, ఎస్.ఆర్.ఎఫ్. సన్యాసినులు మరియు బ్రహ్మచారిణులు ఒక గంట పాటు సామూహిక ధ్యానం నిర్వహించారు; ఇందులో 50 మందికి పైగా భక్తులు హాజరయ్యారు. గురుదేవుల ఉనికిని అందరూ అనుభవించిన ఈ శుభ దినాన అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ దేవునికి మరియు గురువులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇతరులతో పంచుకోండి