స్వామి చిదానంద గిరి గారి వద్ద నుండి భారతదేశంలోని గురుదేవుల భక్తులకు ప్రోత్సాహము, హామీ నిండిన ప్రార్థనలతో కూడిన సందేశము

24 ఏప్రిల్, 2021

ప్రియమైన భక్తులారా,

మన ప్రియతమ భారతదేశంలో ఉన్న మీలో ఎంతోమందిని కోవిడ్ మహమ్మారి ఎలా ప్రభావితం చేస్తోందో చూసి నేను మీకు ఒక విషయం తెలియజేయాలని అనుకుంటున్నాను. అదేమిటంటే మిమ్మల్ని రక్షిస్తూ, మన వసుధైక కుటుంబాన్ని పీడిస్తున్న ఈ దాడిని అంతం చేయడాన్ని వేగవంతం చేస్తూ, భగవంతుడి దీవెనలు, ఆయన దివ్యప్రకాశం మీ చుట్టూ ఆవరించి రక్షిస్తూ ఉన్నట్టుగా ఊహించుకుంటూ, నేను మిమ్మల్ని నా ప్రగాఢ ప్రార్థనలలో నిలిపి ఉంచుతున్నాను.

మీ జీవితాల్లోకి, మీ సమాజంలోకి అనేక ఘోరమైన సవాళ్ళను ఈ మహమ్మారి విసురుతోందని తెలుసుకుని నా హృదయం ద్రవించింది. ప్రపంచానికి అటువంటి పరీక్షలను భగవంతుడు పెట్టడం లేదు, కాని మానవాళి స్వయంగా సృష్టించుకున్న పేరుకుపోయిన సామూహిక కర్మ అదృశ్య ప్రభావం వల్ల ఇవి జరుగుతున్నాయి. అయినప్పటికీ మనం భగవంతుడితో అనుసంధానంలో ఉంటే, ఎటువంటి కష్టాలను ఎదుర్కొన్నా ఫరవాలేదు; మనం భగవంతుడి ప్రియ సంతానమైనందువల్ల, ఆయన అదృశ్య హస్తం, ప్రేమపూర్వక సాన్నిధ్యం మనతో ఎప్పుడూ ఉందని మనం కనుగొనగలం. ఆంతరిక ప్రశాంతతను నిలుపుకుంటూ, ఈ సత్యానికి నిలకడగా అంటిపెట్టుకుని, భగవంతుడి ప్రేమ, శక్తి మనల్ని ఈ కష్టకాలాన్ని దాటించగలవనే విశ్వాసంతో ఉండమని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఎందుకంటే ఆయనే మన భద్రతకు గల అత్యుత్తమ ఆశ్రయ స్థానం; ఆయనే మనల్ని ఉపద్రవాల నుంచి అంతిమ రక్షణ, స్వస్థతలకు నడిపించే శాశ్వతమైన మార్గదర్శకుడు.

బాహ్య ప్రపంచంలో మీ స్థిరత్వానికి, శ్రేయస్సుకు భంగం కలిగించే ఏ పరిస్థితినైనా ఎదుర్కొన్నప్పుడు, అత్యంత శక్తిమంతుడైన మన తండ్రి/తల్లి ఇక్కడే, ఇప్పుడే మీతో ఉన్నాడనే అవగాహనతో ఏవిధమైన భయాన్నైనా, అభద్రతా భావాన్నైనా ఆ అవగాహనలోకి ఎరుకతో తీసుకురావడం ద్వారా ఎదుర్కొనమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. అదే సమయంలో గురుదేవులు పరమహంసగారి ఈ పలుకులను బలంగా మననం చేయండి: “నేను భగవంతుడి సన్నిధి అనే కోటలో ఉన్నాను. ఏ అపాయమూ నా దరి చేరలేదు, ఎందుకంటే జీవితంలోని ప్రతి పరిస్థితిలో — భౌతికము, మానసికము, ఆర్థికము, ఆధ్యాత్మికము — దైవసన్నిధి అనే కోటలో నేను సురక్షితుడను.”

ధ్యానం మన అత్యున్నత రక్షణ, ఈ విపత్కర పరిస్థితులలో మనం అపజయం పాలవకుండా, బాధించబడకుండా, ఈ విపత్కర పరిస్థితులను దాటడానికి మనకు గల అత్యుత్తమ అభయ ప్రదాత. మనం మన హృదయాలను భగవంతుడి కోసం తెరచి ఉంచినప్పుడు — క్షణికంగానైనా, ఎంత తరచుగా వీలైతే అంత తరచుగా — స్వస్థత చేకూర్చే ఆయన ప్రేమ, మనల్ని నిలకడగా నిలబెట్టే ఆయన జ్ఞానం మనకి ఊరటనిస్తూ పోషిస్తాయి; మన ఆంతరిక శక్తిని పునరుద్ధరిస్తూ అన్నిరకాల సందేహాలకు, అనిశ్చితికి అతీతంగా మన చైతన్యాన్ని పైకి లేవనెత్తుతాయి. ఈ విధంగా మనం ఎదుర్కొంటున్న పరిస్థితులలో ఏ విధమైన చర్యలు చేపట్టడం సరైనదో దానికి దారితీసే దిశలో నడవడానికి కావలసిన ధైర్యంతో, అతీంద్రియ జ్ఞానం ద్వారా లభించే దిశానిర్దేశాలతో మనం నిండి ఉన్నామని మనం కనుగొంటాం.

గురూజీ ఏ విధమైన విపత్తునైనా ఎదుర్కోడానికి కావలసిన సరైన దృక్పథాన్ని మనకి అందిస్తున్నారు:
“ప్రతికూల పరిస్థితుల నడుమ సానుకూలమైన, నిర్మాణాత్మకమైన విధానంలో ఆలోచించడము, పని చెయ్యడం ద్వారా ‘వ్యతిరేకతను’ అభ్యసించండి. తితీక్షను అభ్యసించండి, దానర్థం ఏమిటంటే, “చేదు అనుభవాలకు లొంగిపోకుండా మానసికంగా విచలితులవ్వకుండా వాటిని ప్రతిఘటించాలి. అనారోగ్యం కలిగినప్పుడు మీ మనస్సును చికాకు పడనివ్వకుండా ఆరోగ్యసూత్రాలను పాటించండి. మీరు చేసే ప్రతి పనిలో కలత చెందకుండా ఉండండి.”

ప్రియతములారా, భారతదేశంలో ఉన్న మీలో ప్రతి ఒక్కరికీ, ప్రపంచానికీ స్వస్థత చేకూర్చే కాంతిని, ప్రోత్సాహాన్ని అందించే ఆలోచనలను మన గురుదేవుల వై.యస్.యస్./ఎస్.ఆర్.ఎఫ్. ఆశ్రమాలన్నిటిలోని సన్యాసులు, సన్యాసినులు అందరూ గాఢమైన ప్రార్థనలతో నాతో కలసి పంపుతూ ఉన్నారనే నమ్మకంతో ఉండండి. భగవంతుడి దయ, ఆశీస్సులు అవసరమైన వారందరికీ స్వస్థత చేకూర్చే స్పందనలను పంపడంలో మాతోపాటు మీరు కూడా మీ ప్రార్థనలను జోడించడాన్ని కొనసాగించండి. ఒకరికొకరు సహాయం చేసుకోడం ద్వారా, ప్రశాంతత నిండిన మన ఉదాహరణ ద్వారా బలానికి, ధైర్యానికి జన్మస్థానమైన ఆ అనంతమైన దివ్య మూలస్థానం నుంచి మనలో శక్తిని నింపుకోడం ద్వారా, మన చుట్టూ ఉన్నవారిలో ఉత్సాహాన్ని నింపుతూ, మనందరం కలిసి ఈ కష్ట సమయాల్లో జయప్రదంగా మన మార్గాన్ని కనుగొంటాము.

భగవంతుడు, గురువులు మిమ్మల్ని ఆశీర్వదించెదరు గాక, మార్గనిర్దేశం చేయుదురు గాక, మిమ్మల్ని మీ కుటుంబాలను సంరక్షించెదరు గాక!

స్వామి చిదానంద గిరి

ఇతరులతో షేర్ చేయండి